కొంత మోదం.. మరికొంత ఖేదం ( రౌండప్ 2017)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రౌండ్‌లో క్రికెట్ ఆడే బ్యాట్స్‌మెన్ ప్రతి బాల్‌ను సిక్స్ కొట్టాలనే అనుకుంటాడు.. అలాంటి ప్రయత్నాలు చేస్తాడు.. కానీ అన్ని బాల్స్ సిక్స్ కాలేవు సరికదా.. సింగిల్స్ రావడమూ కష్టమే.. అచ్చంగా ప్రతి సినిమా విషయంలో అందరూ అలానే అనుకుంటారు. కానీ విడుదలైన ప్రతి సినిమా సక్సెస్ కాలేదు. కొన్ని బౌండరీలు దాటితే మరికొన్ని సింగిల్స్ రావొచ్చు లేదా అవుట్ అవొచ్చు. చూస్తుండగానే మరో ఏడాది గడిచిపోయింది. తెలుగు సినిమా గమనంలో ఈ ఏడాది ఖచ్చితంగా గుర్తుంచుకునే సంవత్సరం అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఏడాది 5 నుండి పది శాతం సక్సెస్ రేట్ వుండే టాలీవుడ్‌లో ఈ ఏడాది ఆ పర్సంటేజ్ 20 శాతం వరకు పెరగడం ఒక కారణం అయితే.. బాహుబలి లాంటి సంచలన సినిమా రావడం.. ఓ తెలుగు సినిమా ఏకంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమారం రేపడమే కాదు.. ఏకంగా 1600 కోట్లు వసూలు చేసిన మొదటి సినిమాగా నిలవడం. ఇలాంటివి మరపురాని జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి. మొత్తానికి 2017 తెలుగు సినిమాకు కాస్త కొత్త ఉత్సాహాన్ని అందించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాది భిన్నమైన సినిమాలతో పాటు ప్రయోగాత్మక సినిమాలు సత్తా చాటుకుని ప్రేక్షకుల అభిరుచిని తెలియజేశాయి. మరి 2017 ఎలా సాగింది.. ఈ ఏడాది ఎవరికి విజయాలు అందాయి.. విజయాలు దోబూచులాడిందో తెలుసుకుందామా..
ఈ ఏడాది జనవరి మొదటి రోజు ఏ సినిమా విడుదల కాలేదు. జనవరి 6న ‘ఎవరో తానెవరో’ అనే హారర్ సినిమాతో సినిమాల ప్రయాణం మొదలైంది. నూతన హీరో నవీన్, సరయు జంటగా వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఓపెనింగ్ ఫ్లాప్ సినిమాతోనే మొదలైంది. దాంతోపాటు ‘ఇంకేంటి నువ్వే చెప్పు’, ‘పడమటి సంధ్యారాగం’, ‘ఏరోజైతే చూశానో నిన్ను’ సినిమాలు విడుదలయ్యాయి. కానీ విడుదలైన ఈ సినిమాల పరిస్థితి కూడా అలాగే వుంది. ఇక సంక్రాంతి బరిలో ఈసారి ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలు పోటీపడ్డారు. ఎనిమిదేళ్ల గ్యాప్ తరువాత మెగాస్టార్ రీఎంట్రీ ఇస్తూ రూపొందించిన ‘ఖైదీ నెం 150’, నందమూరి బాలయ్య ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ పోటీమీద విడుదలైన రెండు భిన్నమైన సినిమాలు కావడంతో ప్రేక్షకులు రెండు సినిమాలకు ఓటేశారు. ఎనిమిదేళ్లు గ్యాప్ వచ్చినా కూడా మెగాస్టార్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నాడు. వారికి పోటీగా విప్లవ చిత్రాల కథానాయకుడు ఆర్.నారాయణమూర్తి ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’గా వచ్చాడు. నారాయణమూర్తి సినిమాలకు భిన్నంగా వచ్చిన ఈ సినిమా భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. ఇక యువహీరో శర్వానంద్ హీరోగా దిల్ రాజు నిర్మించిన ‘శతమానంభవతి’ చిన్న సినిమాగా విడుదలై ఆ రెండు భారీ సినిమాలను తట్టుకుని సంచలన విజయాన్ని అందుకోవడంతోపాటు జాతీయ చిత్రంగా అవార్డు అందుకుంది. నేటి కుటుంబ పరిస్థితులకు అద్దంపడుతూ తెరకెక్కించిన ఈ సినిమాకు వేగేశ్న సతీష్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి సీజన్ తరువాత మంచు విష్ణు తన లక్కును పరీక్షంచుకునేందుకు ‘లక్కున్నోడు’గా చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. జనవరి నెల సంక్రాంతి సీజన్‌లో ఇద్దరు పెద్ద హీరోలతో పాటు యువ హీరో శర్వానంద్ అందుకున్న విజయాలతో సరిపెట్టుకుంది.
ఇక ఫిబ్రవరిలో ‘నేను లోకల్’ అంటూ నాచురల్ స్టార్ నాని నటించిన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. ఇక ఫిబ్రవరిలో నాగార్జున మరోసారి భక్తుడిగా నటించిన చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’తో మెప్పించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు- నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన సినిమా అయినా ప్రేక్షకులు మాత్రం పాస్‌మార్కులు వేయలేకపోయారు. ఇక కొత్త దర్శకుడు హీరో రానాతో చేసిన గొప్ప ప్రయోగం ‘ఘాజి’. సబ్‌మెరైన్ నేపథ్యంలో 1970 నాటి కాలంలో జరిగిన యధార్థ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా సంచలనం క్రియేట్ చేసింది. ఆ సినిమాతో దర్శకుడు సంకల్ప్‌రెడ్డి టాలీవుడ్‌లో హాట్ దర్శకుడిగా మారాడు. ఇక ఇదే నెలలో ‘ఇక సెలవ్’, ‘కేరాఫ్ గోదారి’, ‘వజ్రాలు కావాలా నాయనా’ వంటి చిన్న సినిమాలు ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఇక మెగా మేనల్లుడు సాయిధరమ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘విన్నర్’ సినిమా టైటిల్‌కి న్యాయం చేయలేకపోయింది. మొత్తానికి ఫిబ్రవరిలో కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు.
మార్చి నెలలో విడుదలైన సినిమాలగురించి చూస్తే.. గత ఏడాది పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ‘ద్వారక’. నూతన దర్శకుడు శ్రీనివాస్ రవీంద్ర తెరకెక్కించిన ఈ సినిమా పరాజయాన్ని మూటకట్టుకుంది. ఇక మంచు మనోజ్‌కు కూడా పెద్ద నిరాశే మిగిలింది. తాజాగా ఎస్.కె.సత్య దర్శకత్వంలో ‘గుంటూరోడు’గా అదరగొట్టాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ సినిమాకు మెగాస్టార్ వాయిస్‌ఓవర్ తీసకున్నా వర్కవుట్ కాలేకపోయింది. ఈ నెలలోనే వచ్చిన ‘ఆకతాయి’, ‘హ్యాపీ బర్త్‌డే’, ‘మా అబ్బాయి’, సాయిరామ్ శంకర్ ‘నేనోరకం’, నటుడు ఉత్తేజ్ కూతురుని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ రూపొందించిన ‘పిచ్చిగా నచ్చావ్’, కన్నయ్య, నువ్వు ఎవరో.. నేను ఎవరో, సినీ మహల్ లాంటి సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయినవే. ఇక యువ హీరో రాజ్‌తరుణ్ ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ అంటూ వచ్చినా అతని ప్లాన్ వర్కవుట్ కాలేదు. ఇక అందాల భామ అంజలి ఇంతకముందు ‘గీతాంజలి’తో భయప్టెంది. ఆ సినిమా మంచి విజయం అందుకోవడంతో మరోసారి ‘చిత్రాంగద’గా భయపెట్టాలని చేసిన ప్రయత్నమూ వృధా అయింది. ఈ సినిమా భారీ పరాజయాన్ని మూటకట్టుకుంది. ఇక మంచు లక్ష్మి హీరోయిన్‌గా లక్ష్మీబాంబు పేల్చాలని చేసిన ప్రయత్నంతో చేతులు కాల్చుకుంది. ఇక వరుస పరాజయాలతో టెన్షన్‌లో వున్న జగన్నాథ్ ఈసారి కొత్త హీరోని పరిచయం చేస్తూ తెరకెక్కించిన ‘రోగ్’కూడా ఆయనకు విజయాన్ని అందివ్వలేకపోయాడు. ఇక పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన ‘కాటమరాయుడు’ సినిమా భారీ అంచనాలమధ్య ఈనెలలోనే విడుదలైంది. తమిళ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన కాటమరాయుడు కమర్షియల్‌గా మాత్రం మంచి విజయాన్ని అందుకోలేదని చెప్పాలి. ఇక సీనియర్ హీరో వెంకటేష్.. ఈసారి భిన్నంగా చేసిన ప్రయత్నం గురు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాతో వెంకటేష్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. సినిమా కూడా కమర్షియల్‌గా బాగానే వర్కవుట్ అయ్యింది.
తెలుగు సినిమా.. ఈ ఏడాది.. అందులోనూ ఏప్రిల్ నెలను మరచిపోకుండా వుంటుంది. ఎందుకంటే సంచలన సినిమా విడుదలైంది ఇదే నెలలో కాబట్టి. ప్రభాస్, రానాలతో దర్శక ధీరుడు రాజవౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-2’ సినిమా ఈనెల 28న విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. బాహుబలి మొదటి భాగానికంటే రెండో భాగమే భారీ వసూళ్ళు రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్‌పై కొత్త చరిత్ర లిఖించింది. ఇక ఈ నెలలో అరణ్యంలో, చిన్ని చిన్ని ఆశలు, కత్రికా కరీనా మధ్యలో కమల్‌హాసన్, లక్ష్మీదేవి సమర్పించు, నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్, శరణం గచ్ఛామి, దడపుట్టిస్తా, ఇద్దరిమధ్య 18, నటి రాశి ప్రధాన పాత్రలో నటించిన ‘లంక’, లవర్‌బాయ్ లాంటి సినిమాలు ఏ మాత్రం తమ ఉనికిని చాటుకోలేకపోయాయి. కొన్ని సినిమాలు వచ్చింది లేనిది కూడా ప్రేక్షకులకు తెలియకుండానే వెళ్లిపోయాయి. ఇక ఈ నెలలోనే మెగాహీరో వరుణ్‌తేజ్ - శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వచ్చిన ‘మిస్టర్’ సినిమా భారీ అంచనాలమధ్య విడుదలై అంతకుమించిన పరాజయాన్ని అందుకుంది. ఇక మే నెల విడుదలైన సినిమాలను చూస్తే... ఈ నెలలో వచ్చిన సినిమాల్లో ఏది కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి. శ్రీనివాస్ అవసరాల హీరోగా ‘బాబు బాగా బిజీ’, శర్వానంద్ ‘రాధా’, ‘రక్షకభటుడు’, ‘వెంకటాపురం’, నిఖిల్ ‘కేశవ’, శే్వతాబసు ప్రసాద్ ‘మిక్చర్ పొట్లాం’, ‘టిక్ టాక్’, ‘గోప్యం’, ‘నీలిమలై’, ‘ఓ పిల్ల నీవల్ల’, ‘శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట’ సినిమాల్లో కొన్ని అట్టర్‌ఫ్లాప్ సినిమాలుగా మిగిలితే మరికొన్ని సినిమాలు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశాయి. ఇక అక్కినేని నాగచైతన్య హీరోగా కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ మంచి విజయాన్ని అందుకుంది. జూన్ నెలలో వచ్చిన సినిమాల గురించి చూస్తే.. ఈ నెలలో హీరో రాజ్‌తరుణ్ ‘అంధగాడు అంటూ అంధుడి పాత్రలో నటించి మెప్పించే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. రచయిత వెలిగొండ శ్రీనివాస్‌ని దర్శకుడిగా మారుస్తూ తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ఇక ‘‘నీలంపాటి అమ్మోరు’, సీనియర్ వంశీ దర్శకత్వంలో అప్పట్లో సంచలన విజయాన్ని అందుకున్న ‘లేడీస్ టైలర్’ సినమాకు సీక్వెల్ చేశాడు. అది పెద్దగా వర్కవుట్ కాలేదు. అలాగే మోహన్‌కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ‘అమీ తుమీ’ ఓ మోస్తరుగా ఆడింది. ఆ తరువాత వచ్చిన ‘కాదలి’, ‘పెళ్లికి ముందు ప్రేమకథ’, ‘రాజా మీరు కేక’, ‘ఖయ్యూమ్ భాయ్’, మంత్రి గంటా శ్రీనివాస్‌రావు తనయుడు గంటా రవిని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ‘జయదేవ్’ ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. ఇక ఇదే నెలలో అల్లు అర్జున్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య వచ్చాడు ‘దువ్వాడ జగన్నాథం’. భారీ ఓపెనింగ్ రాబట్టిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకోలేకపోయింది. కేవలం ఓ హిట్ సినిమాగా నిలబడ్డాడు దువ్వాడ. మొత్తానికి ఆరు నెలలు గడిచిపోయాయి. ఈ ఆరు నెలల్లో చిన్న సినిమాలు ఏ మాత్రం ఆకట్టుకునే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఇక మరో అర్థ్భాగం గురించి ఆరాతీస్తే..
జూలై నెలలో చాలా సినిమాలు విడుదలయ్యాయి. ‘నిన్నుకోరి’ అంటూ ప్యూర్ లవ్‌స్టోరీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు నాని. నూతన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుని నానికి డబుల్ హ్యాట్రిక్ విజయాన్ని అందించింది. ఇక నలుగురు యువ హీరోలతో యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చేసిన మల్టీస్టారర్ ప్రయత్నం ‘శమంతకమణి’ బాగా వర్కవుట్ అయింది. ఈ సినిమా చిన్న సినమాగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. వరుస పరాజయాల తరువాత క్రేజీ దర్శకుడు శేఖర్ కమ్ముల చేసిన ప్రయత్నం బాగా ఫలించింది. వరుణ్‌తేజ్, సాయిపల్లవి జంటగా దిల్‌రాజు నిర్మించిన ‘్ఫదా’ సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల్లో సంచలన విజయం అందుకుని ఈ ఏడాదిలోనే అత్యంత పాపులర్ సినిమాగా నిలవడం విశేషం. ముఖ్యంగా తెలంగాణ అమ్మాయిగా సాయిపల్లవి నటనకు ఎక్కువ మార్కులు పడ్డాయి. ఇదే నెలలో మాస్ యాక్షన్ హీరో గోపీచంద్ ‘గౌతమ్‌నంద’ అంటూ ఆకట్టుకునే ప్రయత్నం ఏ మాత్రం ఫలించలేదు. ఇప్పటికే వరుస పరాజయాలతో ఉన్న గోపీచంద్‌కు ఈ సినిమా మరో ఫ్లాప్‌ని అంటగట్టింది. ఇక లేడీ దర్శకురాలిగా బి.జయ నూతన హీరో హీరోయిన్స్‌తో తెరకెక్కించిన ‘వైశాఖం’ యావరేజ్ సినిమాగా మిగిలింది. ఇక ఈనెలలో వచ్చిన రాక్షసి, రెండు రెళ్ళు ఆరు, డాక్టర్ చక్రవర్తి, జగపతిబాబు ‘పటేల్ సర్’, ‘కలవరమాయే’, ‘మాయామహల్’, ‘నాకు నేనే తోపు’.. వంటి సినిమాలు వచ్చిన సంగతి ప్రేక్షకులకు తెలియకుండా వెళ్లిపోయాయి. ఇక ఆగస్టు నెలలో వచ్చిన సినిమాల గురించి చూస్తే.. క్రేజీ దర్శకుడిగా టాలీవుడ్‌లో మంచి ఇమేజ్ తెచ్చుకున్న సుకుమార్ నిర్మాతగా మారి చేసిన మొదటి ప్రయత్నం ‘కుమారి 21 ఎఫ్’ సంచలన విజయం సాధించడంతో రెండో ప్రయత్నంగా కొత్త హీరోని పరిచయం చేస్తూ తీసిన ‘దర్శకుడు’ ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. ఇక క్రియేటివ్ జీనియస్‌గా ఇమేజ్ తెచ్చుకున్న కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్‌కిషన్, సాయిధరమ్‌లతో చేసిన ‘నక్షత్రం’ ఎక్కడా మెరవలేకపోయింది. ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. ఇక ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో తీసిన ‘జయ జానకి నాయక’ కూడా ఆశించిన ఫలితం దక్కలేదు. సొట్టబుగ్గల తాప్సి మొదటిసారి చేసిన హారర్ ప్రయత్నం బాగా వర్కవుట్ అయింది. ‘ఆనందోబ్రహ్మ’ పేరుతో మహి వి రాఘవ్ తెరకెక్కించిన ఈ సినమా మంచి విజయాన్ని అందుకుని చిన్న సినిమాలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇక ఇదే నెలలో పెళ్లిచూపులు హీరో విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఇలాంటి సంచలన చిత్రం రాలేదనే చెప్పాలి. అర్జున్ రెడ్డిగా విజయ్ ఓ ఊపు ఊపేశాడు. అర్జున్‌రెడ్డి దెబ్బకు టాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అయ్యింది. ఈ సినిమాకు ప్రస్తు తం తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఇక హీరో రానా, తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నేనే రాజు మేనే మంత్రి’ ప్రేక్షకులు పట్టం కట్టారు. ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. యువ హీరో నితిన్ ‘లై’ అంటూ ఆడిన అబద్ధం ప్రేక్షకులకు నచ్చలేదు. అందుకే భారీ అంచనాలతో హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం భారీ పరాజయాన్ని అం దుకుంది. ఆ తరువాత వరుసగా గ్రీన్‌కార్డ్, ఇదేం దెయ్యం, వశం, ప్రతిక్షణం, ప్రేమించే పనిలో, నీ ప్రేమ నా ప్రాణం వంటి సినిమాలు సడి సప్పుడు లేకుండా వచ్చి వెళ్లిపోయాయి.

-శ్రీనివాస్ ఆర్.రావ్