గ్లామర్ ఒక్కటే కాదు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా సినిమాల్లో హీరోయిన్ అంటే ఖచ్చితంగా గ్లామర్‌గా వుండాలి, అందంగా ఆకర్షించాలి. అందుకే ఆమెను అందమైన చందమామలా చూపిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు దర్శక నిర్మాతలు. సినిమాల్లో హీరోదే పైచేయి అయినా కూడా హీరోయిన్ లేకపోతే ఆ సినిమా లెక్కలోకి రాదు. హీరోయిన్ అంటేనే ఆ సినిమాకు అందం చందం. ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు కేవలం గ్లామర్‌నే నమ్ముకుని క్రేజ్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా అందాల షోలకే పరిమితమవుతూ కొంతకాలానికే తెరమరుగు అవుతున్నారు. కానీ మరికొందరు మాత్రం నటిగా నిరూపించుకునేందుకు ఎలాంటి పాత్రలైనా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఓవైపు గ్లామర్ హీరోయిన్లుగా పేరుతెచ్చుకుంటూనే మరోవైపు నటిగా సత్తా చాటుతున్నారు. అప్పట్లో నటించిన హీరోయిన్లలో ఎక్కువ శాతం నటీమణులుగా గుర్తింపు తెచ్చుకున్నవారున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కేవలం అందాల ఆరబోతతో అవకాశాలు కొట్టేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్లలో కేవలం పది శాతం మాత్రమే నటీమణులుగా గుర్తింపు తెచ్చుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. నటిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే భిన్నమైన పాత్రలు చేయాలి. ముఖ్యంగా గ్లామర్‌కు దూరంగా ఉంటూ పాత్రలో లీనమై ఆకట్టుకోవడం మామూలు విషయం కాదు. అయినా సరే ఈ తరహా పాత్రల కోసం నేటి హీరోయిన్లు సిద్ధమవుతున్నారు. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది అనుష్క. సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె మొదటి సినిమాలో గ్లామర్ భామగా ఆకట్టుకుంది. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలతో దూసుకుపోతూ టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల కేరాఫ్ అడ్రస్సుగా మారింది. అరుంధతి సినిమాలో ఆమె నటన ఇప్పటికీ ఆకట్టుకుంటుంది. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద స్టార్ హీరోల సినిమాలకు దీటుగా వసూళ్లు కురిపించి అనుష్క స్టామినాను రుజువు చేసింది. ఆ తరువాత వరుసగా ఆమెకు అలాంటి అవకాశాలే క్యూ కట్టాయి. కానీ అన్ని పాత్రలూ చేయడానికి ఒప్పుకోకుండా సెలెక్టివ్‌గా పాత్రలను ఎంచుకుంటూ మరోవైపు గ్లామర్ హీరోయిన్‌గా కూడా నటించి మెప్పించింది. అనుష్క కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రం బాహుబలి. బాహుబలి మొదటి భాగంగా దేవసేన పాత్రలో డీగ్లామరైజ్డ్‌గా కనిపించి షాకిచ్చింది. ముతక చీర, మాసిన జుట్టు, ముసలి రూపంతో అనుష్క నటన అసమాన్యంగా ఆకట్టుకుంది. దేవసేనగా ఇప్పటికీ ఆమె పాత్ర ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. ఇక బాహుబలి 2లో అందాల దేవసేనగా కనిపించి ఆకట్టుకుంది. ఇదే కోవలో మరో హీరోయిన్ సమంత కూడా కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. ఏంమాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ప్రేక్షకుల్ని తన మాయలో పడేసిన సమంత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతున్న ఈమె తాజాగా రంగస్థలం చిత్రంలో డీగ్లామరైజ్డ్ పాత్రలో నటిస్తూంది. ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించిన ఫొటోలు టీజరు ఆకట్టుకుంటున్నాయి. అచ్చమైన పల్లెటూరి పడుచు రామలక్ష్మిగా సమంత కొత్తగా కనిపిస్తుందని చెబుతుంది యూనిట్. ఇంత వరకు గ్లామర్ హీరోయిన్‌గా చూసిన సమంతను ఇలాంటి పల్లెటూరి యువతిగా చూస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. సౌత్‌లో అందాల భామగా పేరు తెచ్చుకున్న మిల్కీ భామ తమన్నా కూడా గ్లామర్ పాత్రలు పక్కన పెట్టి నటిగా నిరూపించుకునేందుకు సిద్ధమైంది. ఇదివరకే ఆమె నటించిన అభినేత్రి చిత్రంలో పల్లెటూరి పడుచుగా కనిపించి ఆకట్టుకుంది. దాంతోపాటు బాహుబలి చిత్రంలో కూడా డీగ్లామరైజ్డ్ రోల్‌లో నటించి మెప్పించింది. ప్రభాష్ హీరోగా నటించిన బుజ్జిగాడు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన సంజన పలు చిత్రాల్ల హీరోయిన్‌గా నటించినప్పటికీ ఆమెకు సరైన స్టార్‌డమ్ దక్కలేదు. సపోర్టింగ్ పాత్రల్లో నటించే సంజన మొదటిసారి డీగ్లామరైజ్డ్ పాత్రలో నటించి షాకిచ్చింది. దండుపాల్యం 2 చిత్రంలో రోడ్డుపై కాగితాలు ఏరుకునే అమ్మాయిగా నటించిన తీరుకు ప్రశంసలు అందుకుంది. ఇక కన్నడ స్టార్ హీరోయిన్ పూజాగాంధీ దండుపాల్యం చిత్రంలో డీగ్లామరైజ్డ్ పాత్రలో నటించి మెప్పించింది. దొంగతనాలు, హత్యలు చేసే డేంజరస్ గ్యాంగ్‌లో ఉండే పూజాగాంధీ నటన సినిమాకే హెలెట్‌గా నిలిచింది. అంతకు ముందు ఆమె పలు చిత్రాల్లో గ్లామర్ హీరోయిన్‌గా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ లిస్టులో చెప్పకుంటే రితికాసింగ్ గురు చిత్రంలో చేపలమ్ముకునే అమ్మాయిగా స్లమ్‌లో ఉండే యువతిగా నటించి ఆకట్టుకుంది. అలాగే రక్త చరిత్ర చిత్రంలో నటించిన రాధిగా ఆప్టే కూడా ఈ తరహా పాత్రల్లో నటించి మెప్పించింది. మొత్తానికి కొందరు హీరోయిన్లు తెలుగు తెరపై తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తుండడం మంచి పరిణామమే.

- శ్రీ