’పుణ్యభూమి నాదేశం.. నమోనమామి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటీష్‌వారి నుంచి విముక్తి పొందాలని స్వాతంత్య్రోద్యమంతో దేశం ఉడుకుతున్న రోజుల్లో సినిమా కూడా తోడ్పాటును అందించింది. 1939 నుంచి దేశభక్తిని పెంపొందించడానికి తెలుగు సినిమా తనవంతు కృషిచేసింది.
‘ భారతీయ జనని! పాహీమధుర వాణీ!’అనే దేశభక్తి పాటకు బాణీ కూర్చారు సంగీత దర్శకులు ఎస్.రాజేశ్వరరావు. 1939లో విడుదలైన ‘జయప్రద’ చిత్రంలోది ఈ పాట. సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, బళ్ళారి లలిత హీరో, హీరోయిన్లు.
వాహినీ ప్రొడక్షన్స్ ‘వందేమాతరం’ 1939లోనే వచ్చింది. బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నాగయ్య, కాంచనమాల హీరో, హీరోయిన్లు. జమీందార్లు జస్టిస్ పార్టీ ద్వారా బ్రిటీష్ వారికి అండగా వుండడాన్ని నిరసిస్తూ, జమీందారీ వ్యవస్థమీద తిరుగుబాటుగా సారధివారు ‘రైతుబిడ్డ’ను నిర్మించారు. గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బళ్ళారి రాఘవ హీరోగా, టంగుటూరి సూర్యకుమారి హీరోయిన్‌గా నటించారు.
1941లో ఎ.కె.చెట్టియార్ ‘మహాత్మాగాంధీ’అనే చిత్రాన్ని నిర్మించారు. కన్నాంబ, టంగుటూరి సూర్యకుమారి, డి.కె.పట్టమ్మాళ్, చిత్తూరి నాగయ్య వంటి ప్రముఖులతో దేశభక్తి పాటలు పాడించి జనంలో దేశభక్తి పెంపొందించే ప్రయత్నం చేశారు.
స్వాతంత్య్రోద్యమం చివరి దశకు వచ్చిందనీ, బ్రిటీష్‌వారు దేశానికి స్వతంత్రం ప్రకటిస్తారనీ తెలిసిపోయింది. అప్పుడొక దేశభక్తి చిత్రం తీసి దేశానికి కానుకగా 1947లో చిత్రం విడుదల చెయ్యాలనీ ప్రముఖ నిర్మాత మీర్జాపురం రాజావారు సంకల్పించారు. బెంగాలీ నవల ‘విప్రదాసు’ అందుకు ఎన్నికచేశారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, దేశంకోసం సర్వస్వం అర్పించి దేశభక్తుడి కథ విప్రదాసు.
ఐతే అప్పుడు జానపద చిత్రం కీలుగుర్రం నిర్మాణ దశలో వుంది. స్టూడియోలో సాంకేతిక నిపుణులంతా బిజీగా వున్నారు. దాంతో విప్రదాసు ఆలస్యమైంది. 1948లో కీలుగుర్రం ఘన విజయం సాధించిన తర్వాతే దేశభక్తి చిత్రం మొదలుపెట్టారు. అదే మన దేశం. 1949లో విడుదలైంది. సి.హెచ్.నారాయణరావు, కృష్ణవేణి హీరో, హీరోయిన్లు. ఇందులో ఒక ముఖ్యపాత్రను నాగయ్య పోషించారు. ఎస్.వి.రంగారావు చిన్న పాత్రలో నటించారు. ఎన్.టి.రామారావుకి ఇదే తొలి చిత్రం. పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో రాణించారు.
దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్థాన్, చైనా దేశాలతో జరిగిన యుద్ధాల సమయంలో కూడా సినిమా పరిశ్రమ స్పందించి దేశభక్తి చిత్రాలు నిర్మించింది.
ఎం.ఎస్.గోపీనాథ్, 1973లో నేను-నాదేశం, రామకృష్ణ, గీతాంజలి, హీరో, హీరోయిన్లుగాను, 1975లో ‘రాముని మించిన రాముడు’, ఎన్.టి.రామారావు, వాణిశ్రీలు హీరో, హీరోయిన్లుగా దేశభక్తి రగిలించే చిత్రాలు నిర్మించారు.
సురేష్ మూవీస్ రామానాయుడు 1969 సిపాయి చిన్నయ్య నాగేశ్వరరావు, హీరోగా దేశభక్తి సినిమా తీశారు. దీనికి జి.వి.ఆర్.శేషగిరిరావు దర్శకులు. 1970లో అన్నపూర్ణా సంస్థ జైజవాన్ నాగేశ్వరరావు, భారతి, హీరోహీరోయిన్లుగా యోగానంద్ దర్శకత్వంలో వచ్చింది. ‘సి.ఎస్.రావు దర్శకత్వంలో శోభన్‌బాబు హీరోగా 1970 వచ్చింది. దేశమంటే మనుషులోయి, గాంధీ పుట్టిన దేశం, ప్రభాకరరెడ్డి, లక్ష్మీదీపక్ దర్శకత్వంలో 1973లో నిర్మించారు.
1974లో బ్రిటిష్‌వారిని గడగడలాడించిన విప్లవ వీరుడు, అల్లూరి సీతారామరాజుగా హీరో కృష్ణ నటించి చరిత్ర సృష్టించారు. ఈ చిత్రానికి పి.రామచంద్రరావు దర్శకుడు. ఇందులో శ్రీశ్రీ రచించిన ‘తెలుగువీర లేవరా, దీక్షబూని సాగరా’ పాటకు నేషనల్ అవార్డు వచ్చింది.
బ్రిటీష్‌వారిని ఎదిరించి పోరాడిన యోధుడు ‘వీరపాండ్య కట్టబ్రహ్మన’ డబ్బింగ్ చిత్రం తెలుగులో సూపర్ హిట్ అయింది. ఇందులో శివాజీగణేషన్ అద్భుతంగా నటించి తెలుగువారి హృదయాలను గెలుచుకున్నాడు.
1980లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్.టి.రామారావు ‘సర్దార్ పాపారాయుడు’లో నటించారు. ఈ చిత్రం క్రాంతికుమార్ నిర్మించారు. ఇందులో నాయిక శ్రీదేవి. 1982లో వడ్డే రమేష్, దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్.టి.రామారావు హీరోగా ‘బొబ్బిలిపులి’ నిర్మించారు. ఇందులోకూడా శ్రీదేవే హీరోయిన్.
1993లో మోహన్‌బాబు, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మించిన గొప్ప దేశభక్తి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’. ఇందులో ఎన్.టి.రామారావు, అల్లూరి సీతారామరాజు, వీరపాండ్య కట్ట బ్రహ్మన, శివాజీ వంటి దేశభక్తుల పాత్రలు పోషించి నట విశ్వరూపం చూపించారు. ‘పుణ్యభూమి నా దేశం నమో నమామి’అనే పాట ప్రజలలో దేశభక్తి పెంపొందించడానికి దోహదపడింది.
ప్రాంతీయ భాషా చిత్రాలలోనేగాక హిందీలోగూడా అనేక దేశభక్తి చిత్రాలు వచ్చాయి. 1956లోనే షొరాబ్‌మోడి టెక్ని కలర్‌లో ‘ఝాన్సీరాణి’ చిత్రం నిర్మించాడు. దేశభక్తి చిత్రాలు ఎన్నో తీసి అందులో దేశభక్తుడి పాత్ర పోషించిన మనోజ్‌కుమార్ మిష్టర్ భరత్‌గా ఖ్యాతిగాంచాడు. మనోజ్‌కుమార్ షహీద్ చిత్రంలో భగత్‌సింగ్‌గా నటించాడు. ఉపకార్‌లో మనోజ్‌కుమార్ పోషించిన భరత్ పాత్ర చిరస్మరణీయమైనది. అమీర్‌ఖాన్ నటించిన ‘లగాన్’కూడా దేశభక్తి చిత్రమే. మంగళ్‌పాండేగా అమీర్‌ఖాన్ అద్భుతంగా నటించాడు. ఝాన్సీరాణి జీవిత చరిత్ర ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో కంగనారనౌత్ నటిస్తున్న మణికర్ణిక త్వరలో రాబోతున్నది. బ్రిటిష్‌వారిని ఎదిరించి పోరాడిన వీరుడు చెన్నపరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా తెలుగు, తమిళ, హిందీ భాషలలో రాబోతున్నది.
స్టార్ హీరోలు నటించిన దేశభక్తి చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి. ప్రజలలో వారికున్న ఇమేజ్ దానికి కారణం. ఇంగ్లీషులో నిర్మించిన గాంధీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలు పొందింది. కాని అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్‌పటేల్, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు వంటి గొప్ప దేశభక్తుల చిత్రాలు నిర్మాతలకు పెట్టుబడి తెచ్చిపెట్టలేదు.
అప్పట్లో గాంధీ చిత్రానికి మన కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. అలాగే నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తరఫున ప్రభుత్వం దేశభక్తి పెంపొందించే చిత్రాలకు ఆర్థిక సహాయం అందించడం సముచితం. అలాగే ఇటువంటి చిత్రాలకు అన్నిరకాల టాక్సులనుంచి మినహాయింపు ఇవ్వాలి. థియేటర్ల యజమానులు కూడా టికెట్ రేట్లు తగ్గించి ప్రదర్శించాలి. వందల కోట్లు వెచ్చించి దేశభక్తులైన నాయకుల విగ్రహాలు నిర్మిస్తున్నారు. కాని వారి గురించి ప్రజలు తెలుసుకోవడం కూడా అవసరమే. సినిమాలు అందుకు దోహదపడతాయి.
ఇప్పుడు ‘ భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు’ అని ప్రతిజ్ఞచేయించే మహోన్నత సంస్కృతికి స్వార్ధపరులైన నాయకుల వలన కుల, మత, ప్రాంతీయ భేదాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. కుల పోరాటాలు, మత వైషమ్యాలు రూపుమాపి ప్రజలకు పరమత సహనం, సోదరభావం రేకెత్తించడానికి సినిమాలు తమవంతు కృషిచేస్తున్నాయి. ప్రభుత్వం అటువంటి చిత్రాలను ప్రోత్సహించడం ఎంతైనా అవసరం.

- వాణిశ్రీ