మా నైతిక యుద్ధాలకు జెండా (గోరాశాస్ర్తీయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏమి రాశేది నిన్ను గురించి
నిద్ర అంటే, రాత్రి శయ్యలో చేశే
సాహస యాత్రగా మారిన నేను
ఏమి రాయగలను- ఝంఝామారుతం
అరణ్యంతో మొరపెట్టుకున్నట్లు..
నా పాటలు రక్తం కక్కుకుంటున్నాయి
క్రూర జీవన రాస్తాల్లో
ఈ దూర ప్రయాణాలు చెయ్యలేక
అరే- ఈ మనుషుల బురదలో కూరుకుపోయి
పక్షి గొంతు
వినడమే మరచిపోయాను
ఇవాళ నీలి ప్రభాతం పోశే ఎండ,
చెట్ల శరీరాల్లోకి జారిపోతోంది
వస్తువులన్నీ హిరణ్యస్నానం చేస్తున్నాయి-
నీవు నా నిశ్చల భావ సమాధిలో కనిపిస్తున్నావు...
నీ రక్తమాంస స్వరూపం
కనిపించడం లేదు- హోరున గర్జిస్తూ
ఒక విరాట్ కల్లోలాన్ని కడుపులో
దొర్లించుకుంటున్న భౌతిక రేఖారహితమూర్తి
ఒకటి కనిపిస్తోంది!
నీ గదిలో కొవ్వొత్తే ఉంటే రాత్రులు
నీ అక్షరాల్లో పోశే వేదన చూచి అది
తెల్లటి బాష్ప బిందువులు రాలుస్తూ కరిగిపోతుంది
అవును, మనీషి పోగుచేసుకున్న
నిద్రాశూన్య రాత్రులే
మానవ నాగరికత-
నాకు తెలుసు నీ హృదయాన్ని
నీ దేశపు మృత్తికలో చల్లావు
లోకపు బాధంతా ఒక నల్ల ద్రాక్షపండుచేసి
నీ అరచేతిలో పెట్టుకున్నావు
నీ దేశపు నదులన్నీ నీ రక్తనాళాల్లో ప్రవహిస్తున్నాయి
కాగితాల తీరాలు తడుపుతూ- కానీ
ఈ దేశం నీకిచ్చిన కానుక... ఒక గాయం!!!
నీ మస్తిష్క కమలం కోసి
ఈ దేశపు పాదాలమీద పడేసినా
నిన్ను కనె్నత్తికూడా చూడదు ఈ దేశం
అరే ఇక్కడ ఈ మట్టికోసం
బలి అయిపోయిన ఆత్మల
సమాధుల మీద గడ్డికూడా మొలవదు ఒక్క
కన్నీటి బిందువు కూడా రాలదు- నన్ను ఈ ప్రజలకు
ఎందుకిచ్చావు దేవుడా అని రోదిస్తున్నాయి గాలిలో
ఆ ఆత్మల గొంతులు
ఎవడు తన కవో తన జర్నలిస్టో తెలుసుకోడు
కులమతాల కుష్టురోగి- ఈ దేశం;
నాయకుడు ఇరుసుగా తిరిగే
పత్రికా ప్రపంచ భూగోళం మీద
కడుపులో పాకుతున్న చీమల్లాంటి
కవులకు జర్నలిస్టులకు
మాత్రమే గంజి పోస్తుంది
కనకనే నీవు కవుల్ని చూస్తావు
తుఫాను గడ్డిపరకల్ని చూసినట్లు...
నాకు మాత్రం వినబడుతోంది
నీ గుండె గుహలో సింహంలా గర్జిస్తున్నమాట
నీ ఛాతీ ఒక ఫిరంగుల కార్ఖానా
నీవు మా నైతిక యుద్ధాలకు జెండా.

శరీరం పోతుంది గానీ గొంతు నిల్చిపోతుంది
శరీరం పోయినా నిలిచే గొంతు నీది
నిశ్చింత అవునుగాక నీ భావి జీవితం
నీ గుండెతో ముంచుకుని
నీమీద ఎంతకాలం పోసుకున్నావో
అదే నీ జీవితం
భవిష్యత్తులో మనిషి ద్రాక్ష గుత్తిలా వేలాడుతాడు
మెదడులో నిద్రిస్తున్న నదులు మేలుకుంటాయి
ఆకాశం అరుస్తోంది పోనీ కీర్తి గురించి
నా స్వరాల్లోంచి దేవతలు
గుంపులు గుంపులుగా దూకుతున్నారు.
నీమీద ఆశీర్వచనాలు కురిపించడానికి-

- గుంటూరు శేషేంద్రశర్మ