డైలీ సీరియల్

విధిని తప్పించ ఎవరి తరం?( రుక్మిణి -7)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పటికే బలరాముడు శ్రీకృష్ణుని వెనుకగా తన అపారసేనావాహినితో నిలబడి ఉన్నారు. రథం ఉన్నట్టుండి ద్వారకాపురం వైపు పరుగులెత్తింది. కృష్ణుని వెన్నంటి యాదవ సైన్యం ఎక్కడ విదర్భ సైన్యం తమవైపు అడుగు వేస్తుందా ఎప్పుడెప్పుడు వారిని చీల్చి చెండాడుదామా అన్నట్టు విల్లంబులు సంధించి మరీ చూస్తూ ద్వారక వైపు రథాలను తిప్పారు. ***
‘‘చూశారా.. నేను చెబుతూనే ఉన్నాను. ఆ కృష్ణుడు వచ్చాడంటే పిల్లను ఎత్తుకుని పోవడం ఖాయం అని ఇక ఏముంది? అసలే మాయలవాడు విదర్భాన్ని దాటివెళ్తాడు. పదండి. ఇక ఇపుడు యాదవుని ఎదిరించలేకపోతే ఇక మన బలమెందుకు? అందరూ మనలను చూసి నవ్వుతారు. పదండి
ముందుకు పదండి. యాదవ సైన్యాన్ని నిలువరించండి అంటూ రుక్మి స్నేహితులంతా గబగబా గుర్రాలను అదిలించి ముందుకు వెళ్లడానికి ఉద్యుక్తులయ్యారు.
కానీ వారి రథాలకు కట్టి ఉన్న గుర్రాలు తమ తమ మనోనేత్రాలతో రుక్మిణీ కృష్ణులు ఆనందంగా ఉండండం చూసి మనసులోనే వారికి దీవనలిస్తున్నాయి. వారిపై ఆనందాల వర్షపు జల్లులను కురిపిస్తున్నాయి. ఆ లక్ష్మీనారాయణుల వివాహమహోత్సవం జరగబోతోందని అవి అన్నీ కన్నులను అప్పగించి ఆ రుక్మిణి మనస్సులోని ఆనందం ఆమె ముఖంలో ప్రతిఫలించడం చూస్తున్నాయి. ఇంతమంది ఉన్నా ఈ అందచందాల మృదు స్వభావి తన అర్థాంగి అయిందన్న సంతోషం కృష్ణుని ముఖారవిందంలో మరింత కాంతిని ఉద్దీప్తం చేస్తుంటే రుక్మిణీ కృష్ణులు ఈలోకానికి కామేశ్వరీ కామేశ్వరులవలె కనిపించడంతో గుర్రాలన్నీ సకలిస్తూ వారికి శుభాభినందనలు పలుకుతున్నాయి.
ఎంతకీ కదలని గుర్రాలను పగ్గాలు లాగి మరీ కదిలిస్తున్నారు జరాసంధుని మిత్రులంతా. ఎట్టకేలకు ఆ గుర్రాలు కదిలాయి. శరాలను కురిపించండి. అదిగో ఆ పారిపోతున్న యాదవుణ్ణి పట్టుకోండి పట్టుకోండి. మన పిల్లను తీసుకెళ్తున్నాడు పట్టుకోండి అని అందరూ అరుస్తున్నారు.
భీష్మకమహారాజు అమ్మవారి గుడిలో ఏం జరిగిందో ఆ జగన్నివాసుడు మన అమ్మాయిని కాపాడుతాడో లేదో వీరంతా ఏమి చేస్తున్నారు. గందర గోళ శబ్దాలేమిటి? ఏం జరుగుతోంది అని వారు కూడా గుడి దగ్గరకు బయలుదేరారు. రుక్మి మహారోషంతో తన రథాన్నిఅమిత వేగంతో యాదవవీరులను వెంబడించాడు.
పరుగెత్తుకు వస్తున్న వారిని చూసి యాదవులు ఉన్నట్టుండి బాణ వర్షం కురిపించారు. జరాసంధుడు, సాల్వుడు ,శిశుపాలుడు మొదలైన వీరులు, రుక్మి, ఆయన సైన్యం అందరూ బలరామకృష్ణులు నిరోధించాలని బాణాలను సంధిస్తున్నారు.
అప్పటివరకు ఆ నగరమంతా వివాహమహోత్సవం ఏర్పాటుతో పూలతో, పండ్లతో దీపాలతో మిరుమిట్లు కొలుపుతూ అమరావతిగా భాసించిన ఆ కుండిన నగరం యుద్ధరంగంగా మారింది. అందరూ రథ , గజ, తురగ, పదాతి దళాలు అరుస్తూ శంఖాలు పూరిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆగండి ఆగండి అని అరుస్తున్నారు. కకావికలంగా అందరూ అటు ఇటు నడుస్తున్నారు. సామన్య జనం ఏమి జరుగుతోందో తెలుసుకోలేక, తెలుసుకున్నది నిజమా కాదా అన్న సంశయంతో వింత చూపులు చూస్తున్నారు.
ఇరువర్గాల మధ్య భీకరపోరు మొదలైంది.
చంద్రబింబం వంటి రుక్మిణి వదనం చిన్నబోయింది. యుద్ధ వాతావరణం చూసి ఆమె కనుల్లో కన్నీరు ఒలికింది. కృష్ణుని వైపు దీనంగా చూస్తుంటే కృష్ణుడు ఆమె చెక్కిళ్లపై జారిపడుతున్న కన్నీటిని తుడిచి ఏం జరుగదు. అంతా శుభమే జరుగుతుంది. నీ కోసమే కదా నేనింత చేయాల్సి వస్తోంది. నీ సోదరులకు ఏం కాదులే తల్లీదండ్రులు సంతోషంగానే ఉంటారు అని ఓదార్చాడు..
యాదవ వీరులు మొక్కవోని కడిమితో రుక్మి సైన్యం అతని స్నేహితుల సైన్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఇరుపక్షాల వారు భీకరంగా పోరు సాగిస్తున్నారు. నారాచాలు, భల్లములు మొదలైన శరాలను వర్షంలాగా కురిపిస్తున్నారు. కొద్దిసేపటికే విదర్భ సైన్యం వెనక్కు తగ్గింది. వారి కాల్బలం తగిపోయింది. ఏనుగులన్నీ కూలబడిపోతున్నాయి. గజాశ్వరథారోహకుల తలలు తెగి పడిపోయాయి. చేతులు విరిగి కొందరు, కాళ్లు చచ్చుబడి కొందరు తలోదిక్కు పడిపోయి ఆ వాతావరణం అంతాభీతావహంగా ఉంది. జరాసంధాదులు భుజకీర్తులు ఊడిపోయాయి. కిరీటాలు నేలకు జారుతున్నాయి. చెవిపోగులు ఊడి వేలాడుతున్నాయి. వారు ధరించిన ముత్యాల దండలన్నీ తెగిపోయి ఆ నగరం అంతా ముత్యాల కల్లాపు జల్లారా అన్నట్టు పడిపోయి ఉన్నాయి. దెబ్బతగిలిన ఏనుగుల ఘీంకారావాలు, గుర్రాల సంకిలింపులు అల్లెత్రాళ్ల టంకారాలు భటుల అరుపులు, రథచక్రాల పటపటాత్కారాలు ఇవన్నీ కలసి భీభత్స వాతావరణాన్ని ఏర్పరిచాయి. విదర్భ సైన్యం అణగారిపోయింది. ఎక్కడ నుంచి వర్తమానం అందుకున్నట్టు నక్కలు, కాకులు, గద్దలు, రాబందులు గుంపులు గుంపులుగా వచ్చాయి.
ఆ వాతవరణాన్ని చూసి జరాసంధుడు, సాల్వుడు, రుక్మి, ఆయన సోదరులు మొదలైన వారు వెనుతిరగగా ఎదురుగా ఓ మూలన రథంలోనే కూర్చుని కన్నీరు పెడుతున్న శిశుపాలుడు కనిపించాడు.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804