డైలీ సీరియల్

జగదంబపతే జగత్పతి( శివ పురాణం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2
శివ పురాణాన్ని సూత శౌనక సంవాదంగా గ్రంథస్థం చేసిన వ్యాస మహర్షి అందులోని ప్రతి సంహితనూ తన పరమేశ్వర స్తుతితో ఆరంభించారు.
మొదటిదైన ‘విద్యేశ్వర’ సంహితను ప్రారంభిస్తూ ఆయన శంకరుడిని ఇలా వినుతించారు.
‘‘ఆద్యంత మంగళ మజాత
సమాన భావ
మార్యంత మీశమజరామర మాత్మదేవమ్
పంచాననమ్ ప్రబల
పంచ వినోద శీలమ్
సమ్భావయే మనసి శంకరమంబికేశమ్’’
‘‘పంచ ముఖాలతోనూ పంచకృత్యాలు నిర్వహించే అజరామరుడూ, పరమేశ్వరుడూ, జగదంబకు పతి, తనకు తానే సాటి అయిన వాడూ, ఆద్యంత మధ్యమాలన్నింటిలోనూ తానే ఆత్మ స్వరూపంగా ప్రకాశించేవాడూ, నిత్యమంగళుడూ అయిన ఆ శంకరుడిని మనసులో నిలుపుకుంటున్నాను.’’ అన్న అర్థాన్ని కలిగిన పై శ్లోకంతో విద్యేశ్వర సంహితను ప్రారంభించారు వ్యాసుల వారు.
ప్రయాగ క్షేత్రానికి సూతుల వారి రాకతో శివపురాణం ఆరంభవౌతుంది.
ప్రయాగలో కలకలం
సాధారణంగా అన్ని సత్ర, దీర్ఘ సత్ర యాగాలూ శౌనకాది మహర్షులు నైమిశారణ్యంలో కావించటం పరిపాటి. కానీ ఈసారందుకు భిన్నంగా, యజ్ఞానికి పవిత్ర ప్రయాగ క్షేత్రం యజ్ఞ స్థలి కావటం విశేషమై అది మహర్షులందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. యజ్ఞం జరుగుతూ ఉండగా దాన్ని వీక్షించటానికి మహాత్ముడూ, వ్యాస శిష్యుడూ అయిన సూత మహర్షి అక్కడికి వేంచేయటం ఆ ఆనందాన్ని ఇనుమడింపచేసింది.
ప్రయాగ బహు పుణ్య క్షేత్రము. గంగా యమునా సరస్వతీ నదుల సంగమ తీర్థము. బ్రహ్మలోకానికి మార్గము. అటువంటి శోభాన్మయ ప్రదేశంలో సత్యవ్రత పరాయణులూ, మహాతేజో సంపన్నులూ, శుద్ధాత్ములూ అయిన శౌనకాది మహర్షులు దీర్ఘ సత్రయాగ మారంభించి, ఆనాటి యజ్ఞ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని కాసింత విశ్రాంతి తీసుకుంటున్నారు.
అక్కడ తాము నిర్మించుకున్న ఋష్యాశ్రమాల వద్ద విహరిస్తున్న సాధు జంతువులనూ, క్రేంకార ధ్వనులు చేస్తూ పురులు విప్పుతున్న నెమళ్ళనూ, మందగమనాల రాజహంసలనూ, చెట్లపై ‘కుహూకుహూ’ కూజితాలు చేస్తున్న కోకిలలనూ కన్నుల పండువగా తిలకించి వారు తమ కుటీరాల వైపు వెళ్ళబోతూ ఉండగా, సరిగ్గా ఆ సమయానికి అనంత తపో తేజంతో, అసమాన ప్రకాశంతో విరాజిల్లుతున్న వ్యాసుల వారి ప్రియ శిష్యుడూ, ఉత్తమోత్తమ పౌరాణికుడూ, మహావక్తా, నిగర్వి, ప్రశాంత చిత్తుడూ అయిన సూత మహర్షి అక్కడికి వేంచేసారు.
శౌనక మహర్షి
ఆశ్చర్యానందాలతో తల మునకలవుతూ ఎదురెళ్ళి ప్రణామము లర్పించి,
‘‘పుణ్య చరితా! బహుకాలానికి విచ్చేసిన మీకివే మా మహర్షులందరి తరఫునా సుస్వాగత అభివందనాలు. మీరీ యజ్ఞ సమయాన అరుదెంచటం మా పుణ్యఫలంగా భావిస్తున్నాము.’’ అంటూ ఆయనని స్వాగతించారు.
ఆయన కంఠధ్వని విని శిష్యగణమంతా కూడా బిలబిలమంటూ కుటీరాలనుండి వచ్చి ఆయనకు ఆర్ఘ్య పాద్యాది జల సత్కారాలు గావించుకున్నారు.
అందరి వందనాలూ స్వీకరించి ఉచితాశీనుడైన సూత మహర్షి చిరు దరహాసం చేస్తూ వారిని కుశల మడిగారు. వారు క్షేమమని తెలిపాక, ‘‘ముని శ్రేష్టులారా! దినదినానికీ ప్రవృద్ధమానమవుతున్న అరాచక అనావృష్టుల నుండి సామాన్య ప్రజలకు విముక్తి కలిగించేటందుకై మీరు సంకల్పించిన ఈ యాగం నిర్విఘ్నంగా సాగి జనులకు సర్వ శుభాలూ కలిగించుగాక!’’ అని దీవించారు. మహర్షులు ఆనంద భరితులయారు.
‘‘గురువర్యా! మీరు యజ్ఞానికి విచ్చేయటం మా మహద్భాగ్యము. పూర్వం ఎన్నోసార్లు యజ్ఞ విరామ సమయాల్లో మీరు మాకు వివిధ పురాణాలు వినిపించారు. వ్యాస మహర్షి మీకనుగ్రహించిన పురాణ విద్య అద్వితీయమైనది. మీరన్నట్లు అరాచకాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కలియుగం కలుషాలకు నిలయమై మానవులు స్వార్థంతో దుష్ప్రవర్తన యందు ఆసక్తులై ఇతరులను హింసించి ఆనందిస్తారని మేము విని ఉన్నాము.
బ్రహ్మ జ్ఞాన శూన్యులూ, అధర్మవర్తనులూ అయ్యే ఆ మానవులను ఉద్ధరించగలదీ, సకల పాపాలనూ నశింప చేయునదీ అయిన ఉపాయం ఏదైనా ఉంటే సెలవీయండి’’ అని వేడుకున్నారు మునులు.
సూతుల వారు పరమానందంతో తల మునకలయ్యారు. ‘‘నాయనలారా! లోకాలకి మేలు చేసే కాంక్షతో మీరు చేసిన అభ్యర్థన ఎంతో ముదావహం. నా గురువర్యులైన వ్యాసుల వారికి ప్రణామములర్పించారు.
ఇంకా ఉంది

శ్రీమతి గౌరీ గార్లదిన్నె