డైలీ సీరియల్

నందికేశ్వరుడూ ఈశ్వరుడే (శివ పురాణం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11
నందీశ్వర ధ్యానం
‘‘నందీశ్వర నమస్త్భ్యుం సాంద్రానంద ప్రదాయక
మహాదేవస్య సేవార్థ మనుజ్ఞాం దాతుమర్హసి’’
నందీశ్వరుడి అకుంఠిత ప్రభు భక్తి (కోటి రుద్ర సంహిత)
‘‘శౌనకాదులారా!
పూర్వం ‘ఋషిక’ అనే బ్రాహ్మణ యువతి దురదష్టృవశాత్తూ చిన్నతనానే పతిని కోల్పోయి వైధవ్యం పొందింది. బ్రతుకెంత బుద్బుదప్రాయమో గ్రహించిన ఆమెని వైరాగ్యం ఆవరించి, ఆమెలో అంతర్గతంగా అణగి ఉన్న శివభక్తిని వెలికి తెచ్చింది.
ఆమె నర్మదానదీ తీర ప్రాంతంలో, తీరానికి కొంత దూరాన నివసిస్తూ ప్రతిరోజూ మట్టితో ఒక లింగాన్ని ప్రతిష్టించి పూజించసాగింది. ఆ పార్థివ లింగ పూజను ఆమె ఒక తపః చర్యలా కొనసాగిస్తూ తన జీవితాన్ని ఈశ్వరా ధనకు అంకితం చేసింది.
ఇలా సాగుతూండగా, కొంత కాలానికి ‘మూఢుడు’ అనే రాక్షసుడు ఆమెను కబళించటానికి వచ్చాడు. శివపూజా దురంధరురాలై, మహా తేజోవంతమై ఉన్న ఆమెని ఏమీ చేయలేక చివరికి తన రాక్షస మాయతో ఎన్నోఉత్పాతాలను కల్పించాడు. ఆ మాయా ధ్వనులకి భీతి చెందిన ఋషిక గట్టిగా కళ్ళు మూసుకుని, ‘‘శంకరా! శివశంభో! ఆర్త జన రక్షకా! పాహి!పాహి!’’ అని ఎలుగెత్తి అరచింది.
ఆ అరుపులు కైలాస శిఖరానికి చేరగానే పరమేశ్వర భక్తులకేదో ఆపద కలిగిందని గ్రహించిన ఆయన వాహనమైన నందీశ్వరుడు, అప్రమత్తమై వేగంగా స్పందించాడు. పరుగు పరుగున ఆమె ఉన్న చోటికి వచ్చి ఆ రాక్షసుడిని ఢీకొని, గాయపరచి అప్పుడే అక్కడికి వచ్చిన తన స్వామి అయిన శంకరుడి పాదాల చెంత పడవేసాడు. ఈశ్వరుడా రాక్షసుడిని విధించి, నందీశ్వరుడిని తన భక్తురాలైన ఋషికను రక్షించి నందుకు ఎంతో అభినందించాడు.
ఋషిక అమిత సంతోషంతో తాను నిత్యం ఆరాధించే పరమేశ్వరుడినీ, ఆయన వెంట మానవ రూపాన వచ్చిన గంగాభవానినీ, నందీశ్వరుడినీ తనివి తీరా వినుతించింది.
అప్పుడు గంగాభవాని ప్రసన్న వదనంతో, ‘‘ఋషికా! నీకు ఏదైనా వరం అనుగ్రహించ దలిచాను, కోరుకో!’’ అన్నది.
ఋషిక సంతోషించి, చెంతనున్న ఒక మడుగును చూపి, ‘‘తల్లీ! నేను నది దాకా పోలేక రోజూ ఈ మడుగులో స్నానం చేసి శివుడిని పూజిస్తాను. కనుక నీవు నాకు దర్శనమిచ్చిన ఈనాటి తిథి అయిన వైశాఖ శుద్ధ సప్తమి నాడు, ప్రతి సంవత్సరమూ, ఈ మడుగులోకి ఇతర పుణ్య నదులన్నిటితోనూ కలిసి వచ్చి ప్రవేశించు. ఆ దినాన మా గ్రామంలోనే మేమంతా గంగా స్నానం చేయగల భాగ్యాన్ని మాకు ప్రసాదించు.’’ అని కోరుకున్నది.
గంగమ్మ అప్పటికప్పుడే మిగిలిన పుణ్యనదులతో పాటూ ఆ మడుగులోకి ప్రవేశించి ఋషిక కోరిక తీర్చింది.
‘‘ఋషికా! ప్రతి సంవత్సరమూ నీ కోరిక మేరకు ఇలాగే మేమందరమూ ఈ మడుగులో వైశాఖ శుద్ధ సప్తమీ దినాన వసిస్తాము.’’ అని మాట ఇచ్చింది.
అంతేకాదు, ‘‘ఈ తిథి నాడు ఈ మడుగులో స్నానం చేసిన వారికి కాశీ గంగా స్నాన ఫలం కలుగజేస్తాను.’’ అని కూడా వరం ఇచ్చింది.
పరమేశ్వరుడు నందీశ్వరుణ్ణి అక్కున చేర్చుకుని, ‘‘నందీశ్వరా! ఋషికను రక్షించటానికి నాకన్నా ముందుగానే ఇక్కడకు వచ్చి ఈ పవిత్ర తీర్థము ఇక్కడ వెలియటానికి కారకుడవయావు కనుక, ఇకపై ఈ తీర్థము నీ పేరూ, నా పేరూ కలిసిన ‘నంది కేశ్వర’ తీర్థమని పేరు పొందు తుంది.’’ అని నందిని ఆశీర్వ దించాడు. అప్పటి నుండీ అనంత కోటి శివ నామాల్లో ‘నందికేశ్వర’ నామం ఒక్కటై ఈశ్వరుడు ‘నందికేశ్వరుడి’గా ప్రసిద్ధి చెందాడు.
కొన్ని ప్రాంతాలలో ఈశ్వరాంశ సంభూతుడు కనుక నందీశ్వరుడిని కూడా నందికేశ్వరుడు అని సంభోదించటం వాడుకలో ఉన్నది. నందీశ్వరునికి మరుత్తు పుత్రిక అయిన ‘సుయశ’ అనే కన్యతో వివాహం జరిపించారు పార్వతీ పరమేశ్వరులు.
నందీకేశ్వర తీర్థ మహత్యం
‘‘మునులారా! నందికేశ్వర తీర్థంలో స్నానమాచరిస్తే కలిగే ఫలాన్ని వివరించే గాథొకటి చెప్తాను. వినండి.’’ అని ప్రారంభించారు సూతులవారు.
పూర్వం ‘కర్మసిద్ధుడు’ అనే బ్రాహ్మణుడు చనిపోయిన తన తల్లికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపి, ఆమె చివరి కోరిక మేరకు ఆమె అస్తికలను కాశీగంగలో కలపటానికి బయల్దేరి వెళుతూ, మార్గమధ్యాన పూర్వం ఋషిక అనే భక్తురాలు నివసించిన గ్రామం చేరుకుని, అక్కడ ‘గృహమేధి’ అనే బ్రాహ్మణుని ఇంటిలో బస చేసాడు.
ఆ ఇంటి యజమాని అయిన గృహమేధి భార్య ఆ రోజు ఇంటి పనులతో సతమతమవుతున్నది. పైగా ఇంట్లో అతిథి కూడా ఉండటం వలన ఆమె బాగా ప్రొద్దు గుంకినా పాలు పితకలేకపోయింది. ఇల్లాలి అవస్థ చూసిన గృహమేథి పశువుల కొట్టం వద్దకు తానే పాలు పితకటానికి వెళ్ళాడు.
ఆవుకి చేపులు రావటానికి ముందుగా దూడ పాలు త్రాగాలి కనుక కొయ్య తలుగుకి బంధించబడి ఉన్న దూడను కట్లు విడిపించాడు. ప్రొద్దు పోయినందువలన బాగా ఆకలిగా ఉన్న ఆ పసి దూడ ఆనందంగా తల్లి వద్దకు పరిగెడుతూ, ఆ సంరంభంలోనూ, మసక చీకటిగా ఉన్నందువల్లనూ, సరిగా గమనించక పొరపాటున యజ మాని అయిన గృహమేథి కాలిని త్రొక్కింది.
గృహమేథికి అంతులేని కోపమూ, విసుగూ కలిగాయి.
- ఇంకావుంది...

శ్రీమతి గౌరీ గార్లదిన్నె