డైలీ సీరియల్

రుద్రాక్షా శివస్వరూపమే!( శివ పురాణం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ పద ప్రాప్తికి శుభ సమయంలో పవిత్ర తీర్థాలలో కానీ నదీ తీరాన కానీ దేవాలయాలలో కానీ శివలింగాన్ని స్థాపించటం సద్యోఫలాన్నిస్తుంది. శివలింగ ప్రతిష్ఠకు ప్రణవ మంత్రాన్ని జపించటం, శివ విగ్రహ ప్రతిష్ఠా సమయాన పంచాక్షరీ మంత్ర జపమూ వేదాలలో చెప్పబడ్డాయి. లింగానికి అభిషేకము, నైవేద్యము, నమస్కారమూ శక్తి కొలదీ ప్రతి నిత్యమూ చేయాలి. భూలోకంలో ఐదు రకాల శివలింగాలు ఉన్నాయి. శివుడు స్వయంభువుగా ఉద్భవించినది స్వయంభూ లింగము కాగా, లింగములో బిందువు అనగా శక్తి కూడా చేరగా ఆవిర్భవించినది బిందు లింగము. మానవులచే లేక ఒకప్పుడు దేవతలచే ప్రతిష్ఠింప బడినవి ప్రతిష్ఠిత లింగాలు కాగా, సంచారంలో ఉన్నప్పుడు ఉపయోగించేవి చర లింగాలు, శివుడిని గురువుగా భావించి పూజింపబడేవి గురు లింగాలు.
శివ స్థానాలైన కాశీ మొదలైన క్షేత్రాలలో నివసిస్తూ స్నాన, దాన, పూజా, జపాదులు చేయటం మోక్షప్రదము. ‘పూర్జాయతే అనేన ఇతి పూజా!’ అనగా పూః అంటే ఫలము లేక భాగ్యము. పుణ్య కర్మ చేతనే ఆర్జింపబడుతుంది అని అర్థము. దేవ యజ్ఞాది కర్మలు చేయటానికి గృహానికన్నా గోశాల పదిరెట్ల అధిక ఫలాన్నీ, గోశాల కన్నా జలాశయ తీరము పది రెట్ల అధిక ఫలాన్నీ, బిల్వ, తులసీ మొదలైన పవిత్ర వనాలు నదీ తీరానికన్నా పదిరెట్ల ఫలితము, అంతకంటే పదిరెట్ల అధిక ఫలం దేవాలయాలలోనూ, తీర్థ నదీ తీరాన పుణ్యకర్మలు పదిరెట్ల అధిక ఫలాలనిస్తాయి. దీనికి పదిరెట్ల ఫలం సప్త గంగా తీరాన లభిస్తుంది. గంగ, గోదావరి, కావేరి, తామ్రపర్ణి, సింధు, సరయూ, నర్మద ఈ ఏడు నదులూ సప్త గంగలుగా ప్రఖ్యాతి గాంచాయి. ఇక వీటి కంటే పది రెట్ల ఫలం సముద్ర తీరాలలో చేసే కర్మలకూ, సముద్ర తీరం ఫలం కంటే పర్వత శిఖర ప్రదేశంలో చేసిన యజ్ఞ, దానాది కర్మలు పది గుణములు మిన్నగానూ వేదాలు వివరించాయి. ఏ కర్మయినా పరిపూర్ణ పరిశుద్ధ మనసుతో చేస్తేనే తగిన ఫలం లభిస్తుంది.
భాద్రపద మాసములో గోదావరీ నది స్నానమూ, మార్గశీర్ష మాసంలో నర్మదా స్నానమూ, మాఘ మాసంలో గంగా జలాలలో స్నానమూ, పరమపదాన్నీ, కైవల్యాన్నీ ప్రసాదించగలవు. అలాగే కృష్ణా నదీ స్నానమూ, కావేరీ స్నానాలు కూడా! ప్రయాగ స్నాన పుణ్య ఫలం చెప్పనలవి కానిది. మోక్ష ప్రదమైనది కూడా! ఫలాపేక్ష లేక ఈశ్వరార్పణ బుద్ధితో చేసే యజ్ఞ స్నాన జపదానాలు మోక్షాన్నిస్తాయి. బిల్వమూలము దగ్గర జలము చేత తన మస్తకాన్ని అనగా శిరస్సును తడుపుకొనేవాడు సకల తీర్థాలలోనూ స్నానం చేసిన పుణ్య ఫలాన్ని పొందుతాడు. బిల్వ మూలం వద్ద దీపాగ్ని వెలిగించేవాడు జ్ఞాన సంపన్నుడయి శివపదం పొందుతాడు.
శివనామము, విభూతి, రుద్రాక్షలు - యా మూడూ త్రివేణీ సంగమంత పుణ్యమయమని భావింపబడుతోంది. శివనామము గంగ, విభూతీ యమున, రుద్రాక్ష సరస్వతీ నదులుగా -విభూతీ, రుద్రాక్షలూ ధరించి నిత్యమూ శివనామము ఉచ్ఛరించే మానవుడు ప్రయాగ స్నాన ఫలాన్ని పొందగలరని సూత మహర్షి శౌనకాదులకు తెలిపారు. ప్రణవ మంత్రాన్నీ, పంచాక్షరీ మంత్రాన్నీ, గాయత్రీ మంత్రాన్నీ జనులు నిత్యం నియమ బద్ధంగా జపించటం వలన శివపదము లభిస్తుందని వ్యాసులవారు తనకు తెలిపిన విద్యేశ్వర సంహితలోని విషయాలు సూతుల వారు మహర్షులకు తెలిపారు.
కోటిరుద్ర సంహితలో అమూల్య మైన శివ సహస్ర నామ స్తోత్రం వ్యాసుల వారిచే పొందుపరచ బడింది. పూర్వం దైత్యులను జయించటానికి శక్తివంతమైన ఆయు ధాన్ని కోరి శ్రీహరి ఈశ్వరుడిని ఆరాధించగా, ఈశ్వ రుడు ప్రసన్నుడై ఆయనకు తేజస్సంపన్నమైన సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు. శ్రీహరి సునాయా సంగా రాక్షసులను ఆ చక్రంతో వధించి, ఆనందంతో ఈశ్వరుడిని శివ సహస్ర నామాలతో స్తుతించాడు. శ్రీహరి ఈశ్వరుని పూజించిన లింగం ‘హరీశ్వర’ లింగంగా ప్రసిద్ధిగాంచింది.
మహిమాన్వితమైన ఆ సహస్ర నామాలను శివభక్తుడయిన ఉపమన్యుడు శ్రీహరి శ్రీకృష్ణునిగా అవతరించినప్పుడు మళ్ళీ అయనకు ఉపదేశించాడు. అలాగే పంచాక్షరీ మంత్రాన్ని కూడా ఉపదేశించి శివపూజ ఆదిగా గల ఎన్నో విషయాలు శ్రీకృష్ణునికి వివరించాడు. సనత్కుమారుడు బోధించగా వ్యాస మహర్షీ, ఉపమన్యుడూ తెలుసుకున్న ఎన్నో వివరాలు వ్యాసుల వారు సూతునికీ, ఉపమన్యుడు శ్రీకృష్ణునికీ బోధించారు. సూతుల వారు ఈ విషయాలు తరువాత శివపురాణ ప్రవచన సమయాన శౌనకాదులకి వివరించారు..శివ మహా పురాణ వాయవీయ సంహితలోని ఉత్తర ఖండములో ఉపమన్యుడు శ్రీకృష్ణునికి ఉపదేశించిన పాశుపత జ్ఞానాన్నీ, శివుని యొక్క సకల విభూతులనూ, శివాశివుల అభేదమునూ, ప్రణవ స్వరూపమునూ, శివావతారములనూ, పంచాక్షర మంత్ర మహిమనూ, గురువు శిష్యునికిచ్చే శక్తి పాత (ప్రసరణము)నూ, శివ పూజా విధానమునూ మరెన్నో విషయాలను వ్యాసుల వారు ఉపమన్యు శ్రీకృష్ణ సంవాదంగానూ, వాయుదేవ నైమిశారణ్య మునుల సంవాదంగానూ, వాటి మధ్య శివపార్వతీ సంవాదంగానూ పొందుపరచారు.
శివపూజా విధానాన్ని సనత్కుమారుడు వివరించిన విధంగా, బ్రహ్మ నారదునికి విశదీకరించిన విధంగా మునులకి తెలిపారు సూతమహర్షి.
- ఇంకావుంది...

శ్రీమతి గౌరీ గార్లదిన్నె