డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--93

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెల్లవారు జాముకల్లా మరికొంతమంది సేనానులూ, సైనికులూ అర్థరాత్రే చాటుగా ఆక్టోవియన్ సేనలతో కలిసిపొయ్యారనే వార్తల్ని ఆమె విన్నది. ఐతే, ఇలా జరిగినందుక్కూడా ఆమె ఏమీ అనుకోలేదు. ఇదొక స్వల్ప విషయంగానే తోచిందామెకు. ఆమెకల్లా అలెగ్జాండ్రియా మాత్రమే కావాలి. శరీరం గ్రీస్‌లో వున్నా, మనస్సు టాలమీల రాజ ప్రాసాదంలోకి విహరిస్తూ, చిన్నారి పిల్లల్ని పలకరిస్తూ, వారితో ఆడుకొని ఆనందపడుతున్నది.
సేనానులు చేసిన ద్రోహాన్ని తెలుసుకొని ఏంటనీ మండిపడ్డాడు. కాని, రుూసారి తొందరపడి మరికొంతమంది సేనానుల్ని నరికించలేదు. ఎంతో ప్రయత్నంమీద నిలదొక్కుకున్నాడు. ఇంత ద్రోహం జరిగాక తనకు అపజయం రాసిపెట్టే ఉన్నదని అతని అంతరాత్మ ఘోషిస్తూనే వున్నది.
ఐతేం ఇక్కడ ఏమైనా, తాను కూడా క్లియోపాత్రాతోపాటు అలెగ్జాండ్రియాకు వెళ్లిపోతాను కదాననే ఆనందం అతను మనసులో రహస్యంగా ఉరకలు వేస్తూన్నది. చిత్రం- సరిగ్గ క్లియోపాత్రా హృదయంలో ఎలాంటి భావాలు చెలరేగుతూన్నవో, ఏంటనీ హృదయంలోనూ అలాంటి భావాలే ప్రతిఫలిస్తూన్నవి. అక్కడ అలెగ్జాండ్రియాలో ఆమె సంతానం క్లియోపాత్రా వాంఛించిన ప్రపంచమే ఐతే, క్లియోపాత్రాయే తన ప్రపంచం! తాను సృష్టించుకున్న ఈ లోకం నిజంగా స్వర్గమే! స్వర్గం తనకు తప్పదని తెలుసుకున్నవాడు, మృత్యుదేవతకు భయపడడు సరికదా, నవ్వుతూ దాన్ని ఆహ్వానిస్తాడు. ఏంటనీ స్థితి కూడా అలాగే వున్నదిప్పుడు.
క్లియోపాత్రా చెప్పిన ప్రతిమాటా అతనికి జ్ఞాపమున్నది. ఓటమి సంగతి ఎలా వున్నా పట్టుదలతో యుద్ధారంభం జరుగవలసిందే. ఆ తరువాత ఎటుపోయినా తాను నిమిత్తమాత్రుడుగానే ఉంటాడు.
సూర్యోదయ సమయానికల్లా తన సేనానులందర్నీ ఓడల మీదికెక్కించాడు. ఏంటనీ, వారితోపాటు దళాధిపతుల్నీ, కొంతమంది సైనికుల్ని కూడా తీసుకున్నాడు. ఎప్పుడైతే నౌకా యుద్ధానికిగాను, భూమిమీద పోరాడేవారిని తీసుకున్నాడో, అపుడే సైనికులూ, సేనానులూ ఏంటనీ తమను నమ్మకం లేదని తెలుసుకున్నారు. పూర్వంవలె తాము విశ్వాసపాత్రులుగా ఉండటంవల్ల లాభం లేదని తేలిపోయింది. ఏంటనీ మీద వారికుండే గౌరవమంతా, అసహ్యంగా మారిపోయింది.
భూమి మీదైతే యుద్ధంలో గెలవటమో, లేక ప్రాణాలను అర్పించటమో వారు చేయగలిగేవారు. సముద్రం మీద తాము ఏం చెయ్యాలో వారికి అర్థం కాలేదు. వృథాగా తమ ప్రాణాల్ని పోగొట్టుకునేందుకు ఎవరు ఇష్టపడతారు? కాని, ఏంటనీ అర్థం లేకుండా తమను సముద్రానికి బలిపెట్టాలని రుూ దుష్కార్యాన్ని తలపెట్టాడనే అసంతృప్తి సైనికులందర్లోనూ ప్రజ్వరిల్లింది.
నిజానికి ఏంటనీకి మాత్రం నౌకాయుద్ధంలో ప్రావీణ్యత ఏమున్నది? పేరుకు నాయకుడుగా ఉండిపోయినా బాగుండేది. కాని, తనకు అంతా తెలుసునన్నట్లుగా ఏనుగుల చేత గాడిదలు చేయవలసిన పని చేయించేందుకు సిద్ధపడ్డాడు. కొన్నివేలమంది సైనికులను ఓడలమీదికి ఎక్కిస్తే, శత్రువుకైతే అనేక తలకాయలు కనిపిస్తూన్నవి కాని, ఓడ విపరీతమైన బరువుతో ఊగిసలాడిపోతూన్న సంగతి ఏంటనీ గ్రహించలేదు.
ఈజిప్టు రాణి గతరాత్రి తనతో తెచ్చిన ఐశ్వర్యాన్ని రహస్యంగా ఈజిప్షియన్ ఓడల్లోకి ఎక్కించిందనే పుకారొకటి అల్లుకున్నది. ఏ ధనం కోసమైతే వీరందరూ రొమ్మిచ్చి పోరాడేందుకు సిద్ధపడ్డారో, అది లేనట్లయితే, తమకీ పోరాటం చాలా అనవసరం. మరొకవైపు రాణి ఈజిప్టుకు తరలివెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నదనీ, ఇదివరకటివలె ఏంటనీకి, ఆమెకూ అనురాగం లేదనీ, ఏదో కొత్త ఘర్షణ జరిగిందని కూడా వదంతులు చెలరేగినవి.
ఇదంతా రుజూ అయేందుకే అన్నట్లు, దూరాన ఈజిప్షియన్ నౌకలు ప్రశాంతంగా బారులుతీరి ఉన్నవి. అవి కూడా యుద్ధనౌకలే ఐనప్పటికీ, రోమన్ యుద్ధ నౌకలతో ఏంటనీకి అండగా ఎందుకు చేయి కలపడంలేదు? లేక రెండోవైపునుంచి శత్రువును ఎదుర్కొనేందుకు ఈజిప్షియన్ నౌకలు ఉద్దేశించబడినవి అనుకునేందుకు వీల్లేదు. ఎందుకంటే, యుద్ధ సన్నాహాలనేవి అక్కడ పేరుక్కూడా జరగటంలేదు.
ఈ విధంగా ఏంటనీ పక్షంవారికి తామీ యుద్ధంలో నెగ్గుతామనేందుకు ఒక్క కారణం కూడా లేకుండాపోయింది. యుద్ధారంభానికి పూర్వమే ఇది తమ ఓటమేనని ప్రతి ఒక్కరూ గ్రహించారు. ఇక ఉత్సాహం ఎక్కడుంటుంది? ప్రతివారూ పోరాడటానికి సిద్ధపడటంకన్నా తమ ప్రాణాల్ని కాపాడుకునేందుకు ఎటునుంచి దూసుకొనిపోవచ్చనే ఆలోచనల్లో వున్నారు. రణరంగంలోని సైనికునికి ప్రాణాలమీది మమత పెచ్చుపెరుగుతే, సాధారణ మానవుని కన్న ఎక్కువగా భయపడిపోతాడు. పారిపోటంలో కూడా అతని వేగాన్నీ, కౌశలాన్నీ ప్రదర్శిస్తాడు.. ఈ నౌకాయుద్ధమంతా ఆ విధంగానే తయారయ్యేందుకు సిద్ధంగా ఉన్నది.
క్లియోపాత్రా ఈజిప్షియన్ ఓడలమీదికి జేరింది. అక్కణ్నుంచి ఆమె రణరంగాన్ని చూడగలదు. అయితే ఆమె ముఖంలో కూడా ఉత్సాహం లేదు. ఓటమి ముందుగానే తెలిసిపోతోంది కనుక, దాన్ని కంటితో చూసి ఓడలకు తెరచాపలెత్తేందుకు ఆజ్ఞలివ్వటమొక్కటే ఆమెకు మిగిలింది.
కొద్దిదూరంలో వున్న శత్రువు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. నౌకాయుద్ధాన్ని భూమీద జరిగే యుద్ధంవలె తయారుచేసిన ఏంటనీ ప్రజ్ఞను గ్రహించాడు. ఇది తనకు జయాన్ని కూర్చేదేనని శత్రువుకు నిశ్చయంగా తేలిపోయింది. చారుల ద్వారా ఏం జరుగబోతున్నదో కూడా శత్రువుకు తెలిసిపోయింది.
యుద్ధారంభంలోనే ఆక్టోవియన్ తన సేనలకు ఇలా చెప్పాడు.
‘‘క్లియోపాత్రా పారిపొయ్యేందుకు సకల సన్నాహాలూ చేసిందనే వార్తలు రూఢి అవుతూన్నవి. మనను ఎదుర్కొనేందుకు రోమన్ నౌకలు మాత్రమే సైనికులతో సిద్ధంగా ఉన్నవి. దూరాన వున్న ఈజిప్షియన్ నౌకలు ప్రయానికి సిద్ధంగా ఉన్న సూచనల్ని చేస్తూన్నవి. ఒకవేళ క్లియోపాత్రా పారిపోయినట్లయితే, ఆమె నౌకల్ని ఎవ్వరూ అడ్డగించవద్దు. వాటిని పోనివ్వండి. గమనించనట్లు ఊరుకోండి.’’
‘‘ఆమెను ఎందుకు తప్పించుకొని పోనివ్వాలి?’’ అని సేనానులు అడిగారు.
‘‘పేరుకు ఈ యుద్ధం క్లియోపాత్రా మీద ప్రకటించబడినా, దేశద్రోహం ఏంటనీయే మనం ముందుగా హతమార్చవలసిన శత్రువు. ఇక క్లియోపాత్రా పారిపోవటమంటే, ఆమె తన ఓటమిని ఒప్పుకోవటమే కదా! ఆమె పారిపోవటాన్ని అందరూ చూస్తారు. ఇక శత్రుపక్షంవారిలో ఎలాంటి ఉత్సాహమూ ఉండదు. వారు తమ ఓటమిని ఒప్పుకొని, మనకు తేలిగ్గా లొంగిపోతారు. విశేష జన నష్టం లేకుండా మనం గెలుస్తాం.. ఆ తరువాత క్లియోపాత్రా సంగతి ఆలోచించవచ్చు’’ అన్నాడు ఆక్టోవియన్.
ఈ పథకాన్ని అందరూ మెచ్చుకున్నారు. యుద్ధం జరుగకుండానే విజయం వొళ్ళో వాలుతూంటే చేదా?
- ఇంకాఉంది