డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--94

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్టోవియన్ యుద్ధ నౌకలు రణభేరి వాయించి, ముందుకు సాగినవి. అతి ప్రశాంతంగా ఏంటనీ ఓడల్ని అన్ని వైపులనుంచీ ముట్టడి చేసేందుకు ప్రయత్నిస్తూన్నవి. ఏంటనీ నౌకాదళాలు కూడా రణభేరి మోగించినవి. అవి ముందుకు సాగడంలేదు. శత్రునౌకల్ని ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేస్తూన్నవి. అదెలాగో తెలియక తికమకపడుతూన్నవి.
ఎదురొచ్చే శత్రు సేనల మీద ఏంటనీ అగ్నివర్షం కురిపించాడు. కాని శత్రు సేనలకు నౌకాయుద్ధమంటే బాగా తెలుసు. ఒక ఓడకు నిప్పంటుకునే ప్రమాదం వాటల్లితే, మరొక నౌక దాని స్థానాన్ని ఆకమించి ముందుకు సాగుతూన్నది. జయం తమదేనని నిశ్చయంగా తెలుసుకున్న ఆక్టోవియన్ నౌకా సైన్యం అత్యంతోత్సాహంతో ముందుకు ఉరుకుతూన్నది. ఏంటనీ నౌకాదళం క్షణక్షణానికి కుంగిపోతూన్నది.
శత్రువు కూడా ఏంటనీ నౌకాదళం మీద అగ్నివర్షాన్ని ప్రయోగిస్తున్నాడు. నిప్పంటుకున్న ఓడల్ని దూరానికి లాక్కువెళ్ళేందుకు కూడా వీల్లేకుండా శత్రువు ముట్టడించాడు. ఓడను రక్షించేందుకే సైనికులు నానా అవస్థలూ పడుతున్నారు. ఈ అగ్ని మిగతా ఓడలకు పాకకుండా జాగ్రత్తపడుతున్నారు. ఈ హడావిడిలో యుద్ధం చేసేందుకు పాలుపోక తమ ఓడల్ని తద్వారా ప్రాణ రక్షణనూ చేసుకోవటంలో నిమగ్నులయ్యారు. అసలే నిరుత్సాహంలో వున్న సైనికులు, ఈ కొత్త ప్రమాదాలు ఎదురయ్యేప్పటికి పూర్తిగా దిగజారిపొయ్యారు.
క్లియోపాత్రా దూరం నుంచి ఇదంతా గమనిస్తూనే వున్నది. ఏంటనీ ఆధిపత్యం వహించిన ఓడ తగలబడుతుండటం, అతను మరొక ఓడలోకి వెళ్లటం, అదీ నిప్పంటుకోవటం, ఏమీ తోచక అతను దిక్కులు చూడటం ఆమె కళ్ళబడింది.
ఇంతలో శత్రువుల ఓడలొచ్చి ఏంటనీ ఓడల్ని ఢీకొన్నవి. బాహాబాహిగా యుద్ధం జరుగుతూన్నది. ఏంటనీ తాలూకు ఓడలు రెండు పూర్తిగా భస్మమవటం, మరో రెండు నీట మునగటం జరిగింది. సైనికులు సురక్షిత స్థలాలకు చేరేందుకు నానా అవస్థలూ పడుతున్నారు. కొంతమంది బరువైన తమ దుస్తుల్ని సముద్రంలోకి పారేసి, వొడ్డుకు ఈదుకొస్తున్నారు. మరికొందరు పక్కనున్న ఓడలమీదికి జేరేందుకు ప్రయత్నిస్తున్నారు. వెన్ను చూపిన శత్రు సైనికుల్ని ఆక్టోవియన్ సైనికులు బాణాలతో చంపివేస్తున్నారు. ఈ బీభత్సమంతా శత్రువుకు విజయాన్నీ, ఏంటనీకి అపజయాన్నీ అన్ని దిక్కులనుంచీ ప్రకటిస్తూ వున్నది.
అప్పుడే ఏంటనీ పక్షంవారి రెండు ఓడల్ని ఆక్టోవియన్ వశపరచుకొని, వాటిమీద తన పతాకాల్ని ఎగరేశాడు. సముద్రమంతా కల్లోలమై, మానవ రుధిరంతో కలుషితమైపోతూన్నది. ఏంటనీ నిరుత్సాహంతో కేకలు వేస్తున్నాడు. యుద్ధం చేసేందుకు బదులు, రంగస్థలంమీద నాట్యం చేస్తున్నాడు.
తాను బయలుదేరవలసిన సమయం సమీపించిందని క్లియోపాత్రా గ్రహించింది. తెరచాపలనెత్తి ఓడల్ని బయలుదేరనీయమని ఆజ్ఞలిచ్చింది. దారిలో ఆక్టోవియన్ తాలూకు నౌకాదళం తన ఓడల్ని ఎదుర్కొన్నట్లయితే, అవి తనను వెన్నాడకుండా పోరాడేందుకు కొన్ని యుద్ధ నౌకల్ని రక్షణకు నియోగించింది. ఇక్కడ ఎవరెవరు కొట్టుకొని చచ్చినా, తాను మాత్రం తన ధనరాసులతో క్షేమంగా ఈజిప్టుకు చేరేందుకు ఎలాంటి ఆటంకామూ లేకుండా కట్టుదిట్టం చేసింది. బహుశా ఈజిప్టు పతాకాలున్న తమ ఓడల్ని ఆక్టోవియన్ ఎదుర్కొనడనే నమ్మకం ఆమెకు వున్నది.
ఈజిప్టు ఓడలు మెల్లిగా అతి జాగ్రత్తగా రణరంగానికి అల్లంత దూరంలో కదలసాగినవి. ఏంటనీ దృష్టంతా అటే వున్నది: ఎటూ ఈ యుద్ధంలో ఓడిపొయ్యాడు. క్లియోపాత్రా కనుక తనను గమనించకుండా పారిపోతే, తాను ఏకాకిగా, దేశద్రోహిగా, బందీగానన్నా రోమ్ వెళ్లాలి. లేదా ఇక్కడే దిక్కులేని చావు చావాలి.
క్లియోపాత్రా వేసిన పథకం యథాతథంగా అమలు జరిగింది. ఏంటనీ చిన్న నావలో క్లియోపాత్రా వున్న ఓడమీదికి చేరాడు. ఆక్టోవియన్ ముందుగానే ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం అతని యుద్ధనౌకలు ఈజిప్టు నౌకల్ని ఎదుర్కోలేదు. కాని తాము మరీ పిరికిపందలని శత్రువులు అనుకోకుండా ఉండేందుకు రెండు రోమన్ నౌకలు కొంచెం దూరం వరకూ పేరుకు మాత్రం తరిమినట్లు తిరిమి, వెనుదిరిగి వచ్చినవి.
ఏంటనీ పలాయనాన్ని చిత్తగించటం గమనించి సేనానులు ఆశ్చర్యపోయారు. నాయకుడే పారిపొయ్యాక, ఇక తమ బాధ్యతలేమిటి? అదీగాక రోమన్‌ల రోమన్‌ల మీదనే పోరాడవలసిన దుస్థితినుంచి విముక్తి అయే సదవకాశం దొరకనే దొరికింది. ఏంటనీ మీద వారికుండే ద్వేషమంతా, ఈ సమయంలో ఆక్టోవియన్‌మీద అభిమానంగా మారింది. తాము లొంగిపోదలచినట్లు ఓడలమీద శే్వత పతాకాలు ఎగురవేయబడినవి. హఠాత్తుగా యుద్ధమంతా ఆగిపోయి, సముద్రం ప్రశాంతమైంది.
ఏంటనీ ఆధీనంలో వున్న సేనలన్నీ ఆక్టోవియన్ వశమైనవి. ఎక్కువ జననష్టం లేకుండానే ఈ యుద్ధం తేలిపోవటంతో ఇరుపక్షాలవారూ సంతోషించారు. నిన్నటివరకూ ఊరు పేరు లేకుండా, ఏదో రోమన్ సామ్రాజ్యానికి సర్వాధికారిగా తెరమరుగవుతున్న ఆక్టోవియన్ ఈ విజయంతో కాంతిలోకి వచ్చిపడ్డాడు. తాను కూడా మహావీరుడయ్యానని అనుకుంటున్నాడు. స్వయంగా సైన్యాలను నడిపించడం చేతకానివాడు గొప్ప సేనాపతనే పేరు తెచ్చుకున్నాడు. కీర్తికాంత కోరకుండానే, ప్రయత్నం లేకుండానూ కూడా వరిస్తూ ఉంటుంది కాబోలు!
ఇక గ్రీస్‌ను ఆక్రమించిన సైన్యాలున్నవి. అవి లొంగమంటే మరికొంత వ్యవధి పడుతుంది. ముందు ఏంటనీ, క్లియోపాత్రాలు పారిపొయ్యారనే సంగతి ఆ సైనికుల్లో ప్రచారం కావాలి. నిజం ఎటూ దాగదు కనుక, త్వరలోనే ఇది తేలిపోతుంది. మొత్తంమీద జనక్షయం జరుగదు. దాదాపు యుద్ధంలో పాల్గొనకుండానే ఆక్టోవియన్ విజయలక్ష్మిని చేపట్టాడు.
పోతే ఏంటనీ, క్లియోపాత్రాలు ఇంకా బతికే ఉన్నారు. వారి వల్ల తనకు ప్రమాదమంటూ లేకపోలేదు. పెద్ద సైన్యాలతో రోమ్ మీద దండెత్తటమనేది ఇంత త్వరలో జరగదని ఆక్టోవియన్‌కు తెలుసు.
ఐతే, అంతలో పోనీరాదు. ఏంటనీ ఎటూ దేశద్రోహిగా ముద్ర వేయించుకున్నాడు. క్లియోపాత్రాలాటి విషనాగు, తన పక్కలో బల్లెంగానే వుంటుంది. మఖ్యంగా ఆమె కొడుకు సీజర్ టాలమీ బతికి ఉన్నంతకాలమూ, తన పెంపుడు తండ్రి సీజర్ ఆస్తిపాస్తులమీద హక్కుదారుగా తనను బెదిరిస్తూనే వుంటాడు. కనుక, తానే ప్రాచ్య దేశాల మీద పడి, ఈజిప్టు ఆధీనంలోనూ, పరిపాలనలోనూ వున్న ప్రదేశాలన్నిటినీ తన పరిపాలన కిందికి తెచ్చుకోవాలని ఆక్టోవియన్ నిశ్చయించుకున్నాడు.
పెద్ద సైన్యమైతే ఇవాళ కాకపోయినా, రేపైనా తన పతాకం కిందికి వస్తుంది. కాని వీటిని పోషించటమెలా? రోమ్‌లో ధనమెక్కడున్నది?
- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు