డైలీ సీరియల్

వ్యూహం-57

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మరాజు యొక్క ఆజ్ఞతో పరిచారికలు దుర్యోధనునికి పొడి వస్త్రాలను ఇచ్చారు.
అసహనశీలుడైన దుర్యోధనుడు వారి పరిహాసాన్ని సహించలేకపోయాడు. సిగ్గుతో వారివైపు ముఖాన్ని త్రిప్పకుండా నడుస్తాడు.
అయినా మరలా మణిమయ ప్రదేశాన్ని చూచి నీటిమడుగుగా భ్రమించి కట్టుకున్న బట్టలను పైకెత్తి పట్టుకొని ఈదేవానిలా నడువసాగాడు.
మూయబడిన స్పటికమణిమైన ద్వారాన్నిజూచి అది ద్వారమే అనుకొని దుర్యోధనుడు అందు ప్రవేశింపబోగా అతడి తలకు గట్టి దెబ్బ తగులుతుంది. తలతిరిగి నిలబడతాడు. అటువంటిదే స్పటిమణిమయమైన పెద్ద కవాటకం (తలుపు) గల ద్వారాన్ని చూసి తన రెండు చేతులతో చరుస్తాడు. ముందుకు దాటిక్రిందపడిపోతాడు. మరలా ఒక వెడల్పయిన ద్వారం వద్దకు వచ్చి అది మూసివున్నదని తలచి తిరిగి వెళ్ళిపోతాడు.
సభాభవనంలో తనకు కలిగిన పరిస్థితికి వ్యాకుల పడతాడు. తిరిగి హస్తినకు వెళ్లాలని సన్నద్ధుడౌతాడు. ధర్మరాజు వద్దకు వస్తాడు. పాండవుల వద్ద అనుమతిని తీసికొని అప్రసన్నమైన మనస్సుతో హస్తినకు పయనవౌతాడు. హస్తినాపురానికి చేరుతాడు. అందరి మనస్సులకు, కళ్లకు ఆనందాన్ని చేకూర్చిన ఆ మయసభాభవనం దుర్యోధనుని మనస్సుకు, కళ్ళకు నిప్పుమంట అయింది. అమితంగా దహించింది.
***
(మయసభా భవనాన్ని తిలకించిన దుర్యోధనుడు నవ్వులపాలయ్యాడు. నీళ్లులేని చోట నీళ్లున్నట్లుగా భావించడం, నీళ్లున్నచోట నీళ్లు లేవని తలంచి గుడ్డలను తడుపు కొనడము, తలను ద్వారానికి కొట్టుకొనడం చూసిన భీమార్జున నకులసహదేవులు నవ్వుతారు అని వ్యాసభారతంలో కలదు. ఇది దుర్యోధనుడు సభాభవానాన్ని చూచినప్పుజరిగిన విషయం.

కానీ ద్రౌపది నవ్వలేదు. ఆమె అక్కడ లేదు.
గోరక్‌పూరు గీతా ప్రెస్‌వారి సంక్షిప్త మహాభారతంలో కూడా దుర్యోధనుడు సభాభవనాన్ని చూసినప్పుడు ‘‘ద్రౌపది’’ నవ్వినట్లుగా లేదు. ఈ ప్రచురణలు వ్యాసభారతాన్ననుసరించి వ్రాయబడినవే. మరికొంతమంది వ్రాసిన మహాభారత గ్రంథాలలో కూడా ద్రౌపది దుర్యోధనుని పరిహాసం చేసిందని లేదు.
కానీ దుర్యోధనుడు తండ్రి ధృతరాష్ట్రునకు సభాభవనాన్ని చూచినప్పుడు జరిగిన విషయాలతను వివరించి చెప్పినప్పుడు మాత్రం భీమార్జుననకులసహదేవులేగాక శ్రీకృష్ణుడు, ద్రౌపది కూడా నవ్విందని వక్రించి నమ్మేటట్లుగా చెపుతాడు.
అయితే ‘‘కవిత్రయ భారతంలో’’ మాత్రము దుర్యోధనుని దరవస్థను చూసి భీమార్జున నకులసహదేవులతోపాటు ‘‘ద్రౌపది’’ కూడా నవ్విందని తృతీయాస్వాసములో వ్రాయడమైనది.
కొన్ని ఇతరభాషలలో వ్రాసిన ‘జయభారతం’లో దుర్యోధనుడు సభాభవనాన్ని చూచినప్పుడు ‘‘ద్రౌపది’’ అంధ దంపతులకు పుట్టిన అంధుడు (ఎ బ్లైండ్ సన్ బోరండ్ టు బ్లైండ్ పేరెంట్స్) అని అన్నట్లుగా ఉన్నది.
కవిత్రయ భారతాన్ని ఆధారం చేసికొనే ‘‘శతావధానులైన తిరుపతి వేంకటకవులు’’ రచించిన ‘కురుక్షేత్ర నాటకం’లో కూడా ద్రౌపది నవ్విందనే నుడివినారు. దుర్యోధనుని ఏకపాత్రాభినయ (స్వగతం) ఘట్టంలో ‘‘ఆ పాంచాలి పంచభర్తృక నన్ను చూచి నవ్వనేల’’ అని తనకు కలిగిన అవమానాన్ని గురించి వ్యధపడతాడు.
ఆంధ్ర, ఒరియా మహాభారత గ్రంథాలలో మాత్రమే ద్రౌపది నవ్వినట్లుగా కనబడుచున్నది. వీరు ఏ అసలు ప్రతులను ఆధారంగా చేసికొని ఈ విధంగా వ్రాసినారో తెలియదు.
ఏది యేమైనా మూల భారతంలో ద్రౌపది నవ్వినట్లుగా కనబడదు. అనేక మహాభారత గ్రంథాలలో ఇలాంటివి మరికొన్ని విషయాలు కనబడుచున్నవి)
(34)
మయసభా భవనంలో భంగపడిన దుర్యోధనుడు ధర్మజుని వైభవమును జూసి దుఃఖిస్తాడు. అప్రసన్నమైన మనస్సుతో హస్తినకు తిరిగి వెళతాడు.

..........................ఇంకా వుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము