డైలీ సీరియల్

యాజ్ఞసేని-59

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సౌబలా! పూర్వం నేను యుధిష్ఠిరుని నాశనం కొరకు ప్రయత్నించాను. అదంతా దాటుకొని అతడు నీటిలో తామరలా వృద్ధి చెందాడు. కనుకనే దైవం గొప్పదనీ, పౌరుషం నిరర్ధకమనీ అనుకుంటున్నాను. ధార్తరాష్ట్రులు హాని పొందుచున్నారు. పాండవులు నిత్యమూ వృద్ధి పొందుచున్నారు. ఆ సంపదనూ, అటువంటి సభనూ, రక్షకుల యొక్క ఆ పరిహాసాన్ని చూసి అగ్ని చేత దహింపబడుచున్నట్లుగా పరితపిస్తున్నాను.
మామా! అసహనంతో మిక్కిలి దుఃఖితుడనైన నాకు మరణించటానికి అనుజ్ఞనిమ్ము. నా ఈ అవస్థను ధృతరాష్ట్రునికి నివేదించుము.’’ అని అన్నాడు. ఆ మాటలకు
‘‘దుర్యోధనా! ధర్మరాజు పట్ల నీకు కోపం వద్దు. పాండవులను అదృష్టం వరించింది. ఇంతకు ముందు వారిని వశపరచుకొనటానికి నీవు ఎన్నో ఉపాయాలను, కుతంత్రాలను అవలంభించావు. కానీ ఆ పురుష శార్ధూలాలు తమ అదృష్టంతో ఆ ఆపదల నుండి బ్రతికి బయటపడ్డారు. పైగా వారు ద్రౌపదిని భార్యగా పొందారు. కొడుకులతో సహా ద్రుపదమహారాజు సహాయాన్ని పొందాడు. పాండవులకు రాజ్యలాభంలో శ్రీకృష్ణుడు సహాయకుడు. ఆ వాసుదేవుడు కూడా దేవాసురులకు, మనుష్యులకు కూడా ఎవరికినీ జయింప శక్యంగానివాడు. అతతి తేజస్సుచేతనే ధర్మరాజు వృద్ధి పొందాడు, పొందుచున్నాడు. అందుకు శోకించనేల. దుర్యోధనా! వారు తమతండ్రి రాజ్యంలో భాగాన్ని పొందారు.
పాండవులు, ద్రుపదుడు వీరందరూ యుద్ధంలో దేవతలకు కూడా జయింప శక్యంకానివారు. అందరూ కూడా మహారథులే. మహాధనుర్థరులు. అస్తవ్రిద్యావిశారదులు. అందువల్ల ధర్మరాజు ఎలా పరాజితుడు కాగలడో, ఆ ఉపాయం నాకు తెలుసు’’ అని అన్నాడు. అందుకు సుయోధనుడు
‘‘మామా! స్నేహితులకు, మహాత్ములయిన ఇతరులకు ఏ ప్రమాదం జరగకుండా జయించడానికి నీకు చేతనైనే ఆ ఉపాయం నాకు చెప్పుము’’ అని అన్నాడు.
‘‘కుంతీపుత్రుడయిన ధర్మరాజు ద్యూతప్రియుడు. కానీ జూదమాడటం ఎరుగనివాడు. ఆ రాజును ఆహ్వానిస్తే వెనుదిరగడానికి అశక్తుడు. జూదమాడటంలో నేను నేర్పరిని. భూలోకంలోనే కాదు, ముల్లోకాలలోగూడా నాతో సాటిరాగల నేర్పరి లేడు కావున కురునందనా! నీవు యుధిష్ఠిరుని జూదానికి ఆహ్వానించుము. అక్షకుశలుడినైన నేను అతని యొక్క రాజ్యాన్ని, సర్వసంపదలనూ నీకు దక్కేలా చేయగలను. నీ తండ్రికి చెప్పుము. నీ తండ్రి అనుమతిస్తే వారిని నేను జయిస్తాను. సందేహంలేదు’’ అని అన్నాడు శకుని.
తదుపరి శకుని దుర్యోధనుని వెంటనిడుకొని ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లాడు. దుర్యోధనుని శరీరం కృశించడాన్ని, కళావిహీనం కావటానికిగల కారణాలను ధృతరాష్ట్రునికి విన్నవించాడు శకుని. అది విన్న ధృతరాష్ట్రుడు అదిరిపడ్డాడు. కుమారుని శరీరాన్ని తడివి చూసి అమితంగా దుఃఖించాడు.
‘‘నాయనా దుర్యోధనా! నాయనా మిక్కిలి దుఃఖంలో ఉన్నావని విన్నాను. కారణమేమిటి? అది వినదగినది అయితే చెప్పుము. నీవు కాంతిహీనుడవనీ, పాలిపోయావనీ, చిక్కిపోయావనీ, ఎల్లప్పుడూ చింతాక్రాంతుడవై ఉన్నావనీ నీ శకునిమామ చెప్పాడు’’ అన్నాడు ధృతరాష్ట్రుడు.
..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము