డైలీ సీరియల్

యాజ్ఞసేని-95

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పైకి లేవటానికి ప్రయత్నిస్తున్న జయప్రథుడిని భీముడు బంధించి ఎత్తి రథంపై పడవేశాడు. అర్జునుడు అనుసరిస్తుండగా ఆశ్రమానికి చేరుకొని అక్కడ కూర్చున్న ధర్మరాజు కాళ్ల వద్ద సైంధవుడిని పడవేశాడు. అంత ధర్మరాజు సైంధవుడిని చూచి పెద్దగా నవ్వి భీమసేనునితో ‘వీడిని విడిచిపెట్టు. నామీద గౌరవముంటే ఈ నీచవర్ముని విడిచిపెట్టు’’ అని అన్నాడు. ద్రౌపది ధర్మరాజుకేసి చూచి భీమసేనుతో ‘నీవు పంచశిఖలు పెట్టిన ఇతడు రాజుగారికి దాసుడు కనుక వదిలివెయ్యి’ అని అన్నది. జయద్రథ్రుడు బంధవిముక్తుడై ధర్మరాజును సమీపించి అభివాదం చేశాడు. అక్కడ వున్న మునులందరికీ వందనం చేశాడు. సిగ్గుతో ముఖం దించుకొని వెళ్లిపోయాడు.
46
విరాట నగర ప్రవేశం
పతివ్రతా మహాభాగా సతతం బ్రహ్మవాదినీ
ద్రౌపదీ చ కథం బ్రహ్మన్నజ్ఞాతా దుఃఖితావసత్!!
ఓ బ్రాహ్మణోత్తమా! బ్రహ్మజ్ఞానీ! పతివ్రత, ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని జపించునది, పుణ్యాత్మురాలు అగు ద్రౌపది అచట దుఃఖముతో ఎట్లు గుట్టుగా నివసించెను?
(జనమేజయ మహారాజు వైశంపాయన మహర్షిని పైవిధంగా ప్రశ్నించాడు)
పాండవుల పండ్రెండేళ్ల అరణ్యవాసం ముగిసింది. ఇక ఒక సంవత్సరకాలం అజ్ఞాతవాసాన్ని చేయవలసి వున్నది. అప్పుడు మహామనస్వి అయిన యుధిష్ఠిరుడి తన తమ్ములందరినీ ఒక చోట చేర్చాడు. ఇలా అన్నాడు-
‘‘ఈ పండ్రెండు సంవత్సరాలు మనం రాజ్యం నుండి దూరమైనాము. ఇపుడు పదమూడవ సంవత్సరము వచ్చింది. ఇది కష్టాతి కష్టమైనది. అర్జునా! శత్రువులకు తెలియకుండా ఈ సంవత్సరము మనము ఎక్కడ నివసించాలో ఆలోచించుము’’ అని అన్నాడు.
అందుకు అర్జునుడు ‘‘రాజా! ఆ యమధర్మరాజు ఇచ్చిన వరప్రభావం చేతనే మనం నరులకు తెలియకుండా సంచరించగలము. మన నివాసానికి కొన్ని జనపదాలు కలవు. కురురాజ్యానికి చుట్టూ సస్య సంపన్నము, సుభిక్షమయిన పాంచాల, ఛేది, మత్స్య, శూరసేన, పటచ్చార, దశార్ణ, నవరాష్టమ్రల్ల, శాల్వ, యుగంధర, విశాల, కుంతి, సౌరాష్ట్ర, అవంతి అనే జనపదాలున్నాయి. వీటిలో మనం ఎక్కడ నివసించాలో నీ యిష్టం’’ అని అన్నాడు.
‘‘శుభంకరమూ, సుఖప్రదమూ అయిన ప్రదేశం కావాలి. అచట నిర్భయులమై నివసించాలి. మత్స్యదేశపు రాజు ‘విరాటుడు’ చాలా బలవంతుడు. మనమీద అనురాగం కలవాడు. ధార్మికుడు. వితరణశీలి. పెద్దవాడు. ఎల్లప్పుడూ ప్రియమొనరించువాడు. మనం ఈ సంవత్సరం విరాట నగరంలో నివసిస్తూ అతనికి సేవలు చేసి పెడుతూ ఉందాం. ఆ విరాటుని దగ్గర చేరి ఏ ఏ పనులు చేస్తామని చెప్పుదామో చెప్పండి’’ అని ధర్మరాజు అన్నాడు. అందుకు అర్జునుడు-
‘‘పుణ్యాత్మా! రాజా! ఆ విరాటుని రాజ్యంలో నీవు ఎట్లా సేవ చేస్తావు?’’ అని అడిగాడు.
‘‘నేను పాచికలాట ఎరుగుదురు. ‘కంకుడు’ (కంకుభట్టు) అనే ద్విజుడనై (బ్రాహ్మణుడనై) ఆ మహాత్ముని రాజసభలో ఒక గౌరవ సభ్యుడనౌతాను. ఆ రాజు ఒకవేళ నీవు పూర్వం ఎక్కడ ఉండేవాడివని అడిగితే, నేను పూర్వం ధర్మరాజుకు ప్రాణస్నేహితుడిగా ఉన్నాను. అతని వద్ద పాచికలాడేవాడని అని చెపుతాను’’ అని అన్నాడు ధర్మరాజు. (్ధర్మరాజు ‘బృహదశ్వుడు’ అనే వాని వద్ద పాచికల తత్త్వాన్ని తెలిసికొన్నాడట) తదుపరి అందరూ వారు చేయదలచిన పనుల గురించి ధర్మరాజుకు వివరించారు.
భీమసేనుడన్నాడు- ‘‘నేను వంటవాడిననీ, నా పేరు ‘వల్లవుడు’ (వలలుడు) అనీ చెప్పి విరటుని కొలువులో ప్రవేశిస్తాను. కొలువుకూటములందు ఎవరైనా మల్లులు యుద్ధము చేయుదురేని ఆ రాజుకు ప్రీతి కలుగునట్లుగా నేను వారితో పోరుదును. ఇంతకుముందు నీవు ఎక్కడ ఉన్నావని అడిగితే నేను ధర్మరాజు కడ మదపుటేనుగులను అదుపులో పెట్టువాడుగా, ఎద్దులను అదుపు చేసి వశము చేసికొనువాడునుగా, సూపకర్తనుగా (పప్పు మొదలగువానిని వండువాడు) మల్లుడనుగా ఉంటినని చెప్పుదురు’’ అని. అనంతరం అర్జునుడు అన్నాడు-
‘‘ఓ రాజా! నేను నపుంసకుడనని చెప్పుకొందును. అగ్నివలె వెలుగొందు కుండలములను చెవులకు పెట్టుకొని, చేతులకు శంఖములను ధరింపజేసి మూడవ తీరు జనుడనై (నపుంసకుడు) జడలు ధరించి ‘బృహన్నల’ యను పేర విరాటరాజు కొలువులో ప్రవేశింతును. ఆడతనములో మాటిమాటికి పూర్వరాజుల కథలను చెప్పుచూ రాజును, అంతఃపురమందలి ఇతర జనులకు వేడుకపరతును. విరాటుని అంతఃపుర కాంతలకు ఆట, పాట, విచిత్రములైన వివిధములైన వాద్యముల నేర్పుదును. రాజు నన్నడిగినచో పూర్వం దర్మరాజు గృహమున ద్రౌపదికి పరిచారికనై యుంటినని చెప్పుదును’’ అని. (అర్జునుడు ఇంద్రలోకంలో దేవేంద్రుని వద్ద ఉన్నపుడు, ‘ఊర్వశి’ అర్జునుని మోహించి పొందు కోరుతుంది. అర్జునుడు తిరస్కరిస్తాడు. కోపించిన ఊర్వశి నపుంసకుడవై ఆడువారి వద్ద ఉండమని శపిస్తుంది. ఆ శాప ప్రభావాన్ని ఇక్కడ ఉపయోగించాడు)
నకులుడు అన్నాడు- ‘‘నేను విరాటుని కొలువున గుర్రములకు పాలకుడనగుదును. వానిని కాపాడుటలో నేర్పుగలవాడను. వాటి స్వభావము తెలిసినవాడను. నేను ‘గంధకుడు’ అనే (దామగ్రంథి) పేరుతో విరటుని కొలువులో చేరుతాను. నన్నడిగినచో నేను పూర్వము ధర్మరాజు వద్ద గుఱ్ఱములపై అధికారిగా ఉంటినని చెప్పెదను’’ అని.
..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము