డైలీ సీరియల్

యాజ్ఞసేని -- 101

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సైరంధ్రీ! నీకు స్వాగతం! ఈ రాత్రి చక్కగా గడచిన నాకు సుప్రభాతమైనట్లుగా ఉన్నది. నాకు రాణివై ప్రీతిగల్గించుము. వివిధ ఆభరణములను నీకోసం తెప్పిస్తాను. దివ్యమైన శయ్యనుగూడా యేర్పాటుచేయించి ఉంచాను. రమ్ము! నాతో కలిసి తీయని మధ్వీరసాన్ని త్రాగుదువుగాని’’ అని అనగా ద్రౌపది
‘‘దుర్మదా! నిషాదుడు బ్రాహ్మణ స్ర్తిని అంటజాలనట్లుగా నీవు నన్ను తాకలేవు. నన్ను అవమానించి దుర్గతిని పొందకుము! దుర్దశను పొందకు.
రాజపుత్రి సుదేష్ణ నన్ను మదిర తెమ్మని నీవద్దకు పంపింది. ‘‘నాకు బాగా దాహం వేస్తుంది. వెంటనే త్రాగటానికి తగిన పానీయాన్ని తీసుకురా అని చెప్పింది’’ అని అన్నది
‘‘కళ్యాణీ! రాజపుత్రి సుదేష్ణ అడిగిన దానిని వేరే దాసీలు తీసుకువెళతారు.’’ అని కీచకుడు ద్రౌపది చేతిని పట్టుకూన్నాడు. కోపించిన ద్రౌపది వెంటనే
‘‘ఓరీ పాపీ నేను యింతవరకు ఎప్పుడూ గూడా మనసులోనైనా కోపంతో నాపతులకు విరుద్ధంగా ప్రవర్తించియుండని దాననైతే ఆ సత్యప్రభావానికే నీవు చిక్కి నశించిపోవడం చూస్తాను’’ అని కీచకుడిని విదిలించింది.
కీచకుడు ద్రౌపదిని పట్టుకోబోయాడు. కానీ ఆమె వెంటనే అతడిని త్రోసివేసి వెనక్కి జరిగింది. అప్పుడు కీచకుడు ద్రౌపది పైట కొంగును పట్టుకొన్నాడు. వేగంగా ఆమెను వశం చేసుకొనాలని ప్రయత్నించాడు. ద్రౌపది ప్రయత్నపూర్వకంగా ఒక్కసారి కీచకుడిని వేగంగా త్రోసివేసింది. దానితో ఆ నీచుడు, పాపాత్ముడు మొదలు నరికిన చెట్టులా నేలమీద కూలబడ్డాడు. ద్రౌపది పరుగెత్తుతూ యుధిష్ఠిరుడున్న జనసభను శరణుజొచ్చింది. అప్పుడు కీచకుడు కోపంతో ద్రౌపది జుట్టు పట్టుకొని, విరాటరాజు చూస్తుండగానే ఆమెను కిందపడవైచి తన్నాడు.
సూర్యభగవానుడు ద్రౌపది రక్షణకోసం నియమించిన రాక్షసుడు కీచకుని పట్టుకొని అమితమైన వేగంతో దూరంగా విసిరివేశాడు. రాక్షసుడు బలవంతంగా త్రోసివేయడంవలవన కీచకుడి శరీరమంతా గిర్రున తిరిగిపోయి మొదలు నరికిన వృక్షంలా నిశే్చష్ఠుడై భూమిమీద పడ్డాడు. ఇదంతా సభలోని రాజు, వృద్ధ బ్రాహ్మణులు, క్షత్రియులు చూచారు. కీచకుడు తన్నడంవలన దెబ్బతగిలిన ద్రౌపది ముఖం నుండి రక్తం కారింది. అపుడు సభాసదులందరూ ‘‘సూతపుత్రా! కీచకా! నీవు చేసినపని మంచిదిగాదు. ఈమె బంధువులు లేని నిస్సహాయురాలైన అబల. ఈమెనెందుకు బాధిస్తున్నావు’’ అని అన్నారు.
ఈ సంఘటన జరిగిన సమయంలో యుధిష్ఠిరుడు, భీమసేనుడు కూడా సభలో ఉన్నారు. ద్రౌపదికి జరిగిన అవమానాన్ని కళ్ళారా చూచారు. దానిని సహించలేకపోయారు. భీమసేనుడు కోపోద్రేకుడై పళ్ళు పటపట కొరుకుతూ లేవబోయాడు. అప్పుడు రహస్యం ఎక్కడ వెల్లడౌతుందోనని భయంతో ధర్మరాజు తన బొటనల్రవేలితో భీముని బొటనవ్రేలిని నొక్కిపట్టి అతడి కోపాన్ని ఆపగలిగాడు. కానీ భీమసేనుడు కోపంతో ఒక చెట్టువైపు చూడటం గమనించిన ధర్మరాజు అతడిని వారిస్తూ
‘‘వల్లవుడా! ఏమి నీవు వంట కట్టెలకోసం చెట్టువైపు చూస్తున్నావా? వంట కోసం ఎండుకట్టెలు కావాలనుకొంటే బయటికి వెళ్ళి తెచ్చుకో.’’ అని అనగా భీముడు ఊరకుండినాడు.
వారి శాంతి పూర్వక చేష్టలను చూస్తున్న ద్రౌపదికి అంతులేని కోపం వచ్చింది. ఏడవసాగింది. ఏమీ చేయలేని స్థితిలోనున్న భర్తలవైపు చూస్తూ విరాటరాజుతో అన్నది.
‘‘నా భర్తలతో వైరాన్ని పూనినవాడు ఎక్కడవున్నా భయంతో నిద్రపోడు. అటువంటి వారికి భార్యనైన, మానవతినైన, అసహాయరాలినైన నన్ను అబలనని యెంచక ఈ సూతపుత్రుడు కాలితో తన్నాడు. తేజ సంపన్నులు, జితేంద్రియులు, బలవంతులు, అత్యంత మానధనులు యైనవారి భార్యను, మానవతినైన నన్ను ఒక సూతపుత్రుడు కాలితో తన్నాడు. నా భర్తలు యిప్పుడు యెక్కడ సంచరిస్తున్నారు. ఒక సూతపుత్రుడు తన్నుతూ వుంటే ఆ అవమానాన్ని పిరికివారివలె, నపుంసకుల వలె యెలా సహించగల్గుతున్నారు.
అబలనైన నన్ను తన యెదుటనే ఒక సూతపుత్రుడు తన్నుతూ వుంటే యూరకున్న విరాట మహారాజు కూడా ధర్మ దూషకుడే. రాజై వుండి కూడా కీచకుని పట్ల రాజోచితమైన కొద్దిపాటి న్యాయం కూడా చేయలేకపోయాడు. మత్స్యరాజా! ఈ బందిపోటు ధర్మము ఈ రాజసభకు యెటువంటి శోభనిస్తుంది. నీ సమక్షంలోనే ఈ కీచకుడు నన్ను హింసించటం తగునా? సభాసదులు, రాజా, అందరూ అధర్మపరులే. ధర్మాన్ని యెరుగరు’’అని.
ఆ మాటలను విన్న విరాటరాజు ద్రౌపదిని చూస్తూ ‘‘సైరంధ్రీ! మా పరోక్షంలో మీ యిరువురి మధ్య యెటువంటి తగవు వుందో అది నేనెరుగను. వాస్తవమేమిటో కూడా నాకు తెలియదు. ఏమియు తెలియకుండా నేనేమి న్యాయం చేయగలను? నేనేం నేర్పు చూపగలను? అనన్నాడు.
సభాసదులందరూ ద్రౌపదిని ప్రశంసిస్తూ కీచకుని నిందించారు.
..........................ఇంకావుంది

-- త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము