డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-39

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కుల స్ర్తీలు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని రహస్యంగా ఉంచుతారు. వారు భర్తృవియోగాన్ని పొందినా కోపం తెచ్చుకోరు. తమ సత్ప్రవర్తనను కవచంగా ధరిస్తారు. ఆ భర్త కష్టాలలో ఉండి ఆమెను విడిచి ఉండవచ్చును. అతనిపై కోపించడం తగదు. చివరకు కట్టుకున్న వస్త్రాన్ని కూడా పక్షులు అపహరిస్తే అతను ఎంత మనోవ్యధ పడతాడో గ్రహించాలి. అలాంటి భర్తపైన భార్య కోపం తెచ్చుకోకూడదు. భర్త దరిద్రుడైనా, రాజ్యభ్రష్టుడైనా తనని గౌరవించినా, లేకపోయినా, వ్యసనపరుడైనా భార్య అతనిపై కోపించరాదు’’. బాహుకుని ఈ మాటలు అతనే నలుడు అనడానికి ప్రమాణం. ఈ విషయం మహారాజుకు చెప్పండి’’.
పర్ణాదుని మాటలు విన్న దమయంతి అతన్ని సత్కరించి పంపి తల్లితో ఏకాంతంలో మాట్లాడింది. ‘‘అమ్మా! నేను బ్రతికి ఉండాలంటే సుదేవుని నలుని తీసుకురావడానికి పంపాలి. ఈ విషయం తండ్రి గారికి తెలియకూడదు’’.
తల్లి ఒప్పుకొని సుదేవుని పిలిపించగా దమయంతి అతనితో ఋతుపర్ణుని వద్దకు పోయి వార్త ఇలా చెప్పమంది. ‘‘దమయంతికి భర్త జీవించి ఉన్నాడో లేదో తెలియదు. కనుక ఆమెకు తిరిగి స్వయంవరం జరుగుతున్నది. రేపే శుభముహూర్తం. మీరు వెళ్లానుకుంటే శీఘ్రంగా వెళ్లండి. రేపు సూర్యోదయ సమయంలో ఆమె మరల రెండవ భర్తను వరిస్తుంది’’.
సుదేవుడు అయోధ్యకు పోయి ఆమె చెప్పిన మాటలు ఋతుపర్ణునికి నివేదించాడు.
సుదేవుని సందేశం విన్న ఋతుపర్ణుడు బాహుకునితో ఇలా అన్నాడు. ‘‘దమయంతి స్వయంవరానికి ఒక్కరోజే సమయముంది. నన్ను విదర్భకు ఈ కొలది సమయంలో రథంలో తీసుకొని వెళ్లగలవా? నీకు అశ్వాల గురించి తెలుసుకదా!’’
రాజు మాటల ద్వారా దమయంతి స్వయంవరం గురించి విన్న నలుని హృదయం క్షోభించింది. అతను ఇలా తలచాడు. ‘‘ఇదేమిటి దమయంతి ఇలా చేస్తున్నది? ఆమె అజ్ఞానంతో చేస్తున్నదా? లేక నా జాడ తెల్సుకొని నన్ను రప్పించడానికి చేస్తున్నదా? ఆమె పతినైన నేను భార్యను ఒంటరిగా వదలిపెట్టిన పాపాత్ముడిని. తప్పు ఆమెది కాదు నాది. దీర్ఘకాల వియోగం చేత ఆమెకు నాపై ప్రేమ నశించి ఉంటుంది. కాని సంతానవతియైన ఆమె ఇలా చేయదు. ఈ విషయంలో సత్యాసత్యాలు తెలుసుకోవాలంటే నేను విదర్భకు వెళ్లాలి’’.
ఇలా నిశ్చయించుకొని బాహుకుడు ఒక్కరోజులో విదర్భకు చేరుస్తానని మాట ఇచ్చాడు.
తర్వాత బాహకుడు అశ్వశాలకు వెళ్ళి దుర్బలంగా కన్పిస్తున్నా శీఘ్రంగా వెళ్లే గుర్రాలను ఎంచుకున్నాడు. తేజస్సు కలిగి ఉత్తమజాతివి సింధుదేశంలో పుట్టిన అశ్వాలను రాజుకు చూపాడు. వాటిని చూసి కోపంతో రాజు ‘‘ఇలాంటి అశ్వాలను ఎంచుకున్నావు? ఇవి ఇంత బలహీనంగా ఉన్నాయి. అంతదూరం ఎలా వెళ్తాయి?’’ అన్నాడు.
బాహుకుడు రాజు వేరే అశ్వాలను ఎంపిక చేస్తే వాటినే రథానికి కడ్తానని పలుకగా రాజు బాహుకునికి అశ్వహృదయం తెలుసు కనక అతనినే ఎంపిక చేసినవి రథానికి కట్టుమన్నాడు.
బాహుకుడు నాలుగు మంచి గుర్రాలని రథానికి కట్టగా ఋతుపర్ణుడు అందులోకి ఎక్కి కూర్చున్నాడు. వెంటనే బాహుకుడు ఆ గుర్రాలని అదిలించగా అవి ఆకాశంపై పరుగులు తీస్తూ ఉంటే రాజు ఆశ్చర్యపోయాడు. రాజు ఇలా తలచాడు. ఈ బాహుకుడు ఇంద్రుని రథసారథి మాతలి కాదు కదా! లేక అశ్వశాస్తన్రిపుణుడైన శాలిహోత్రుడా? లేక శత్రుంజ యుడైన ఆ నలమహారాజా? వారితో ఉన్న వార్ష్ణేయుడు ఇలా తలచాడు. ‘‘ఈ ప్రపంచంలో అశ్వశాస్త్రం తెలిసినవాడు నలమహారాజు. ఇప్పుడు ఈ బాహుకునికి కూడా తెలుసు. ఇద్దరిలో చాలా పోలిక లున్నాయి. ఇద్దరు ఒకే వయస్సువారు. కాని మహాపరాక్రముడైన నలుడెక్కడ? వికృతరూపం గల ఈ బాహుకుడెక్కడ? కాకపోతే కొందరు మహాత్ములు శాపం వలన ఇలా మారవచ్చు. ఈ రూపం గురించి సందేహం లేనట్లయితే బాహుకుడే నలుడు కావచ్చు’’.
ఋతుపర్ణుడు మాత్రం రథం నడపడంలో బాహుకుని సామర్థ్యం చూసి ఆనందించాడు. బాహుకుడు నడుపుతున్న రథం ఆఘమేఘాల మీద ప్రయాణం చేస్తూ నదులు పర్వతాలూ దాటుతూ పోతూ ఉంటే రాజుగారి ఉత్తరీయం జారిపడగా రాజు దాన్ని తీసుకోవడానికి రథాన్ని ఆపమనగా బాహుకుడు చాలా దూరం వచ్చామని పలికాడు. ఇంతలో ఒక తాండ్రచెట్టు ఉంటే ఋతుపర్ణుడు దానిమీద పళ్లు, ఆకులు, కొమ్మలు ఎన్ని ఉన్నవో చెప్పి తన సంఖ్యాశాస్త్ర నైపుణ్యం ప్రదర్శించాడు. బాహుకుడు కూడా వాటిని లెక్కపెట్టి రాజు చెప్పినట్లే ఆ సంఖ్య ఉండడం చేత ఆశ్చర్యపోయాడు. తనకు ఆ అక్షవిద్యను నేర్పమని తాను రాజుకు అశ్వవిద్య నేర్పెదనని అన్నాడు. ఋతుపర్ణుడు అంగీకరించి తనకు అక్షవిద్య ద్వారా తెలిసిన సంఖ్యాశాస్త్రాన్ని బాహుకునికి నేర్పి అతని ద్వారా అశ్వవిద్య నేర్చుకున్నాడు.
అక్ష విద్యను గ్రహించిన నలుని శరీరం నుంచి మాటిమాటికీ విషం కక్కుతున్న కర్కోటకుడు బయట పడ్డాడు. దానితో విషరూపమైన కలి కోపాగ్ని కూడా బయటపడింది. ఆ విషం నుంచి విముక్తుడైన కలి స్వస్వరూపాన్ని తిరిగి పొందాడు. ఇదంతా గ్రహించిన నలమహారాజు కలిని శపించబోగా అతను భయపడుతూ నలునితో ఇలా అన్నాడు ‘‘మహారాజా! ఆగ్రహించకు. నీవు విడిచిపెట్టిన దమయంతి నిన్ను శపించలేదు. కాని ఆమె శాపం చేత నీ శరీరంలో నేను చాలా బాధపడ్డాను. చాలా దుఃఖాన్ని పొందాను. కర్కోటకుని విషం నన్ను నిరంతరం దహించింది. నన్ను రక్షించు’’.
ఆ మాటలు విని నలుడు తన కోపాన్ని నిగ్రహించుకున్నాడు. కలి భయం చెంది తాండ్ర చెట్టులోకి ప్రవేశించి అదృశ్యమయ్యాడు. ఆ చెట్టు ఆకులు, ఫలాలు లెక్కించిన నలుడు కలి దోషం పోగొట్టుకొని తేజస్వి అయినాడు. తిరిగి రదం విదర్భవైపు నడుపుతూ సూర్యాస్తమయ సమయానికి విదర్భ ప్రవేశించాడు. ఋతుపర్ణుని రాకను ప్రజలు రాజుకు తెలిపారు. గోపరదఘోషతో ఋతుపర్ణుడు నగరంలోకి ప్రవేశించాడు. ఆ ఘోషను నగరంలోనే ఉన్న నలుని గుర్రాలు విని తమ యజమానిని గుర్తించాయి. భవనం పైనుంచి దమయంతి కూడా ఆ ఘోష నలుని సారథ్యంలో వలె ఉన్నట్లు భావించింది. ఆ ఘోష మేఘగర్జనవలె ఉంది. ఆ శబ్దం విని నెమళ్ళు మేఘగర్జనగా తలచి క్రేంకారాలు చేశాయి. ఏనుగులు ఘ్రీంకారాలు చేశాయి.
దమయంతి ఆ రథసారథి తప్పక నలుడేనని అనుకుంది. ఇలా తలచింది ‘‘ఈ రదధ్వని నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది. ఇప్పుడు ఆ మహారాజును చూడకపోతే అగ్ని ప్రవేశం చేస్తాను. అతను గొప్ప వీరుడు. ఎన్నడూ పరస్ర్తిల పట్ల అనుచితంగా ప్రవర్తించడదు. రహస్యంగా కూడా నీచంగా ప్రవర్తించడు’’. ఈ విధంగా దుఃఖిస్తూ దమయంతి మేడపై నుంచి ఋతుపర్ణునితో రథంలో వస్తున్న బాహుకుని చూచి ఆశ్చర్యపడింది.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి