డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-47

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భృగు మహర్షి పుత్రుడు చ్యవనుడు. అతను తపస్సు చేయాలని ఒక ప్రదేశంలో వీరాసనం వేసి కొయ్యలా ఉండిపోయాడు. అలా చాలాకాలం ఆ ఆసనంలోనే ఉన్నాడు. అతని మీద చీమలు పుట్టలు పెట్టాయ. అతని ఒళ్ళంతా లతలు అల్లుకున్నాయ. అయనా అతడు తన తపస్సు ఆపలేదు.
ఒక మారు శర్యాతి అనే రాజు తన రాణులతో అక్కడికి వచ్చాడు. అతనికి నాలుగువేల రాణులు ఉన్నప్పటికీ సంతానం మాత్రం ఒక్కతే కుమార్తె. ఆమె పేరు సుకన్య. ఆమె ఆ వనంలో తిరుగుతూ చ్యవనుడు తపస్సు చేసే పుట్ట దగ్గరికి వచ్చింది. అక్కడ ఆమె సఖులతో తిరుగుతూ పువ్వులు ఫలాలుకోస్తూ విహరించింది. యవ్వనంలో సౌందర్యంలో మెరుపు తీగలాగ మెరిసిపోతున్న సుకన్యను చ్యవనుడు చూశాడు. చూడగానే అతను ప్రసన్నుడై ఆమెను పుట్టలోంచే పిలిచాడు. కాని అతని కంఠం సన్నగా ఉండుటవలన ఆ శబ్దం ఆమెకు వినబడలేదు. పుట్టలో మెరుస్తున్న అతని కళ్ళను చూసి, మోహం ఆవరించగా కుతూహలంతో ఆమె తన దగ్గర ఉన్న పుల్లను తీసుకొని అతని కళ్లను పొడిచింది. వెంటనే అతను కోపంతో లేచి శర్యాతి సైన్యానికి మలమూత్ర బంధనం కలిగించాడు. సైన్యం అంతా కష్టంతో విలవిల్లాడారు. అప్పుడు శర్యాతి తన పరివారాన్ని పిలిచి ‘‘తపశ్శాలి, వృద్ధుడు, కోపిష్టి, మహాత్ముడు అయన చ్యవనునికి ఎవరు హాని కలిగించారు?’’ అని వారిని ప్రశ్నించాడు. సైన్యం మహర్షిపట్ల ఎవరు అపరాధం చేశారో తమకు తెలియదని పలికారు. మలమూత్ర అవరోధం వలన బాధపడ్తున్న సైన్యాన్ని, కారణమేమిటో తెలియక చింతిస్తున్న తండ్రిని చూచి సుకన్య తండ్రి దగ్గరకు వెళ్లి ఇలా అన్నది. ‘‘వనంలో విహరిస్తున్న నేను మెరుస్తున్న ప్రాణి కండ్లను చూసి మిణుగురు పురుగులుగా భావించి దగ్గరకు వెళ్ళి ముల్లుతో పొడిచాను’’.
శర్యాతి వెంటనే ఆ పుట్టదగ్గరకు వెళ్ళి వృద్ధుడు తపసంపన్నుడు అయన చ్యవనుని తన సైన్యం ప్రాణ రక్షణ కోసం ప్రార్థించాడు. ‘‘నా కుమార్తె అజ్ఞానంతో ఈ అపరాధం చేసింది. ఆమెను క్షమించండి’’ అన్నాడు.
దానికి చ్యవనుడు ఆగ్రహంతో ఇలా అన్నాడు. ‘‘అహంకారంతో నీ కుమార్తె నన్ను అవమానించాలని ఈ విధంగా చేసింది. నా కన్నులు పొడిచి నన్ను అంధుని చేసింది. రూప, ఔదార్యం కలిగి ఉన్న, లోభ మోహాలకు లొంగిన ఆమెను ఇచ్చి నాకు వివాహం చేస్తే మిమ్మల్ని క్షమిస్తాను’’.
ఋషి మాటలు విన్న శర్యాతి మహారాజు ఏమీ బదులు చెప్పక కుమార్తెను చ్యవనునికిచ్చి వివాహం చేశాడు. ఆ కన్యను భార్యగా గ్రహించి ఋషి శర్యాతిని, అతని సైన్యాన్ని అనుగ్రహించాడు. శర్యాతి సైన్యంతో తన నగరానికి వెళ్లిపోయాడు. సుకన్య తాపసి అయిన భర్తను తన తపస్సుతో నియమ నిష్టలతో సేవ చేసి అతన్ని మెప్పించింది. ఒకరోజు అశ్వినీ దేవతలు స్నానం చేసి వస్తున్న సుకన్యను చూశారు. ఆమె దగ్గరకు వెళ్ళి ఇలా అడిగారు - ‘‘నీ వెవ్వరి పుత్రికవు? ఈ వనంలో ఏం చేస్తున్నావు’’.
అప్పుడు సుకన్య సిగ్గుతో ఇలా జవాబు చెప్పింది - ‘‘నేను శర్యాతి మహారాజు కుమార్తెను, చ్యవన మహర్షి భార్యను. నాపేరు సుకన్య. నాకు పతియే దైవం’’.
ఆమె మాటలకు వారు నవ్వి ఇలా అన్నారు - ‘‘ఆ ముసలి మునితో నీకు ఎలా వివాహం చేశాడు? ఈ వనంలో నీవు మెరుపుతీగ లాగ ప్రకాశిస్తున్నావు. దేవతలో కూడా నీవంటి సౌందర్యవతి లేదు. అలాంటి నువ్వు కనీసం నిన్ను సరిగా పోషించలేని అసమర్థుడు అయన భర్తను భరిస్తున్నావు. ఆమునిని వదిలి మాలో ఒకరిని వివాహం చేసుకొని నీవు సుఖపడు’’. వారి మాటలు విన్న సుకన్య ఇలా అంది - ‘‘నేను చ్యవనునే మనస్సులో ఆరాధిస్తూ ఉన్నాను. కనుక మీరు నాపట్ల అనుచితంగా ఆలోచించి ప్రవర్తించకండి’’.
అప్పుడు వారు ఆమెతో ఇలా అన్నారు. ‘‘మేము దేవ వైద్యులం. నీ భర్తను, రూపం, యవ్వనం కలిగిన వానిగా చేస్తాము. మా ముగ్గురిలో ఒకనిని భర్తగా వరించు. ఈ నియమంతో నీ భర్తను ఇక్కడకు పిలువు’’.
సుకన్య వారి మాటలను భర్తకు చెప్పింది. అది విన్న చ్యవనుడు అలా చేయడానికి ఒప్పుకున్నాడు. అప్పుడు ఆమె భర్తతో కలిసి అశ్వినీదేవతల దగ్గరకు వచ్చి వారు చెప్పిన విధంగా చేయటానికి ఒప్పుకుంది. దేవతలు ఆమె భర్తను నీటిలో మునిగి రమ్మన్నారు. అతడు వారు చెప్పిన విధంగా నీటిలో మునిగి పైకి వచ్చాడు. దేవతలు కూడా అతనితో పాటు మునిగివచ్చారు. అప్పుడు వారు దివ్య రూపాలలోను అందులో ముగ్గురూ ఒకే రూపుతోను ఉన్నారు. వారు ముగ్గురూ ఒకేసారి అన్నారు. ‘‘మాలో ఒకరిని నీ భర్తగా వరించు’’.
ఒకే రూపంలో వారిని చూసి మనస్సులో నిశ్చయంచుకొని ఆమె చ్యవనునే తన పతిగా కోరింది. చ్యవనుడు ఈ విధంగా రూపం యవ్వనంతోపాటు అనుకూలవతి భార్యను పొంది ఆనందించాడు. అతను దేవతలకు ప్రత్యుపకారము చేయదలచి ఇలా అన్నాడు ‘‘ఇంద్రుని సమక్షంలోనే మీరు సోమరసం త్రాగే అవకాశం మీకు కలిగిస్తాను’’ అలా చెప్పి వారిని స్వర్గానికి పంపి, భార్యతో సుఖించసాగాడు.
తర్వాత శర్యాతికి ఈ విషయం తెలిసి ఆనందంగా వారిని చూడడానికి వచ్చి దేవతవలె ప్రకాశిస్తున్న వారిని చూసి ఆనందించాడు. కొంతకాలం ఆశ్రమంలోనే ఉన్నాడు. చ్యవనుడు శర్యాతి శుభం కోసం యజ్ఞం చేయస్తానని అన్నాడు. ఇది విని శర్యాతి ఇంకా ఆనందాన్ని పొందాడు. ఆ యజ్ఞ సమయంలో చ్యవనుడు అశ్వినీ దేవతలకు సమర్పించుటకు సోమరసాన్ని తన చేతిలోకి తీసుకొన్నాడు.
అప్పుడు ఇంద్రుడు అక్కడకు వచ్చి ఇలా అన్నాడు. ‘‘ఈ అశ్వనీదేవతలు దేవ వైద్యులు. వీరికి సోమరసం త్రాగే అర్హతలేదు’’. అప్పుడు చ్యవనుడు ఆగ్రహంతో ఇలా అన్నాడు. ‘‘వీరిద్దరూ బుద్ధిమంతులు. వీరు నన్ను దేవతలతో సమానంగా రూపవంతుని, యవ్వన వంతుని చేశారు. అలాటి వారికి సోమరసం త్రాగే అధికారం లేదా? వీరు కూడా దేవతలే.’’
అప్పుడు ఇంద్రుడు ఇలా అన్నాడు ‘‘వీరు రోగ నివారణ చేసేవారు మాత్రమే, కామ రూపాన్ని మాత్రమే పొందగలరు. వీరికి సోమరసం త్రాగే అధికారం ఎక్కడిది?’’
చ్యవనుడు ఇంద్రుని మాట లెక్కచేయక అశ్వినీదేవతలకు సోమరసం ఇవ్వడానికి సిద్ధమైనాడు. అప్పుడు ఇంద్రుడు ఇలా అన్నాడు ‘‘నా మాట లక్ష్యపెట్టక వారికి సోమరసం ఇవ్వాలని తలిస్తే నీపై వజ్రాయుధాన్ని వదులుతాను’’. చ్యవనుడు ఆ మాటలు లక్ష్యపెట్టక సోమరస భాగాన్ని చేతిలోకి తీసుకున్నాడు.
అప్పుడు ఇంద్రుడు ఘోర రూపంతో ఉన్న వజ్రాయుధాన్ని అతని పైకి పంపబోయాడు. ఆ సమయంలో చ్యవనుడు అతని చేతిని స్తంభింప చేశాడు. తర్వాత మంత్రాలు పఠిస్తూ ముని ఆహుతులను అగ్నిలో వేశాడు. చ్యవనుని తపశ్శక్తితో ఇంద్రుని హింసించే కృత్య ఆవిర్బవించింది.కృత్య రూపంలో భయంకరాకారుడు పుట్టాడు. ఆ కృత్య రాక్షసుడు ఇంద్రుని తినడానికి అతని వైపు పరుగుతీశాడు.
ఆ కృత్యను చూసి ఇంద్రుడు భయంతో వణికిపోయాడు. అతడు చ్యవనునితో భయంతో ఇలా అన్నాడు. ‘‘ఈ అశ్వినీదేవతలు ఇప్పటి నుంచీ సోమరసం త్రాగడానికి అర్హత కలిగి ఉంటారు. ఇది సత్యం. నాపై ప్రసన్నత చూపండి. వారికి మేలు చేసినట్లు నాకు కూడా మేలు కలిగించండి. నాపై దయ చూపండి’’ అని అనేక విధాలుగా చ్యవనుని ప్రార్థించాడు.
అప్పటికి చ్యవనుని కోపం తగ్గింది. అతడు కృత్యను నివారించాడు. అశ్వినీ దేవతలకు ఇంద్రునితో సహా సోమరసం ఇచ్చి వారిని సంతోషపెట్టాడు. శర్యాతి కోరిక తీర్చి యజ్ఞ పరిసమాప్తం చేసి భార్య అ్ఠన సుకన్యతో కలిసి చ్యవనుడు సుఖంగా జీవించాడు.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి