డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-72

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోపంతో, తేజస్సుతో వెలుగుతున్న అతని ముఖం చూస్తూ శాంతంగా ఆ గృహిణి ఇలా అంది. ‘‘బ్రాహ్మణోత్తమా! నన్ను క్షమించు. నా భర్త ఆకలితో అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఇప్పటి దాకా నేను ఆయన పనిలో ఉండటం వలన ఆలస్యమైంది’’.
ఈ మాటలు విన్న బ్రహ్మచారి కోపంతో ఊగిపోతూ ఇలా అడిగాడు - ‘‘ఏమిటీ! నీ భర్త నీకు ముఖ్యమా? ఈ బ్రాహ్మణుడు కాదా? బ్రాహ్మణుడు అగ్నితో సమానమనీ, కోపిస్తే సర్వం దహించి వేస్తాడని నీకు తెలియదా? గృహస్థ్ధర్మంలో ఉన్న నీవు బ్రాహ్మణుని ఎలా అవమానించావు? ఇంద్రుడు కూడా బ్రాహ్మణుని ముందు తలవంచుతాడు. మరి నువ్వెంత? ఇంత అహంకారమా? బ్రాహ్మణుల గొప్పతనం గురించి నీకు తెలియకపోతే కనీసం నీ పెద్దలు నీకు చెప్పలేదా?’’
అప్పుడు ఆ స్త్ర ఇలా అంది. ‘‘ఓ తపోధనా! అంతగా కోపించకు. నీకు కోపం వస్తే నీ చూపుకు మాడిపోవడానికి నేను చెట్టుమీద కొంగను కాను. నీ కోపం తగ్గించుకో. పండితులు, తపస్సంపన్నులు అయిన బ్రాహ్మణులను నేను ఎప్పుడూ అవమానించను. వారి గొప్పతనం తపశ్శక్తి తేజస్సు గురించి నాకు తెలుసు. నా పెద్దలు నాకు నేర్పించారు. బ్రాహ్మణులను అవమానించడం వల్లనే వాతాపి అనే రాక్షసుడు అగస్త్యుని కడుపులో జీర్ణం అయిపోయాడు. ఓ ద్విజవరా! నా తప్పును క్షమించు. నాకు పతి సేవయే ఉత్తమధర్మం. దేవతలకంటే కూడా నాకు పతియే ఎక్కువ. ఈ పతి సేవ వలన నాకు ఎంతటి శక్తి ఉన్నదో చూడు. ఎక్కడో అరణ్యంలో నీవు కొంగను మాడ్చితే ఇక్కడ ఉన్న నాకు ఆ విషయం తెలిసింది. మానవులకు శరీరంలో ఉండే శత్రువు క్రోధము. కోపాన్ని, మోహాన్ని జయించిన వానిని దేవతలు బ్రాహ్మణునిగా భావిస్తారు. ఈ లోకంలో సత్యం పలికేవాడిని, గురువును సంతోషపెట్టేవాడిని, ఇతరులను హింసించనివాడిని దేవతలు బ్రాహ్మణునిగా గుర్తిస్తారు.
ఇంద్రియ నిగ్రహం కలవాడు, వేదాధ్యయనం చేసినవాడు పవిత్రుడు, కామక్రోధాలను వశం చేసుకొన్నవాడు బ్రాహ్మణుడని దేవతలు తలుస్తారు. సకల ధర్మాలయందు సమానమైన ఆసక్తి గలవాడు, ఈ జగత్తును ఆత్మ సమానంగా చూసేవాడు వేదాన్ని అభ్యసించినవాడిని దేవతలు బ్రాహ్మణునిగా భావిస్తారు. ఓ ద్విజోత్తమా! మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహం సత్యం పలకడం, ధర్మాన్ని ఆచరించడం వేదాధ్యయనం, స్వాధ్యాయం ఇవన్నీ బ్రాహ్మణునికి సనాతన ధర్మాలు. సత్యమూ, ఋజుస్వభావం, సర్వోత్తమ ధర్మాలుగా పరిగణిస్తారు. వేదప్రమాణంగా ఉన్నదే ధర్మము. సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ ధర్మము అనేక రీతులుగా ఉంటుంది. ధర్మ విషయంలో నీకు సరియైన జ్ఞానం తెలియకపోతే మిథిలలో ఉండే ధర్మవ్యాధుని దగ్గరకు వెళ్ళు. అతను తల్లిదండ్రులను సేవిస్తాడు. ఒకవేళ నేను ఎక్కువ మాట్లాడి ఉంటే నన్ను క్షమించు. ధర్మజ్ఞులైనవారి దృష్టిలో స్తల్రు దండించదగని వారు కదా!’’
కౌశికుని ఆగ్రహం చల్లారింది. అతను ఇలా అన్నాడు. ‘‘కల్యాణీ! నీవు ఆడిన మాటల్లో అనౌచిత్యం ఏమీ లేదు. అంతా సత్యమే. నీ పలుకులు నాకు చాలా మేలు చేశాయి. నేను మిథిలకు వెళ్లి ధర్మవ్యాధుని కలుస్తాను’’. ఇలా పలికి అతను ఆ సాధ్వి దగ్గర శలవు తీసుకొని తన ఆశ్రమానికి వెళ్లి ఆలోచించసాగాడు. ‘‘ఆ పతివ్రత మాటల్లో ఎంతో సత్యముంది. మిథిలలో పుణ్యాత్ముడు ధర్మజ్ఞుడు అయిన వ్యాధుని దగ్గరకు వెళ్ళి ధర్మసూక్ష్మాలను తెలుసుకుంటాను’’. ఇలా అనుకొని అతను అరణ్యాలు, పర్వతాలు, గ్రామాలు, నదులు దాటి మిథిలకు చేరుకున్నాడు. ఆ పురం రాజర్షి అయిన జనకుని చేత సురక్షితంగా పాలింపబడుతున్నది. ఆ నగరం చక్కని వీధులతో, సౌధాలతో శోభాయమానంగా ఉన్నది. కౌశికుడు ధర్మవ్యాధుని వెతుక్కుంటూ ఊరి చివరకు వెళ్లాడు. అక్కడ మాంసం దుకాణంలో లేళ్ళ మాంసం, గొడ్డు మాంసం అమ్ముతున్న ధర్మవ్యాధుడు కన్పించాడు. అక్కడ చాలా రద్దీగా ఉండడం చేత, ఇటువంటి వాతావరణం అలాటు లేనందువల్ల బ్రాహ్మణుడు దూరంగా వెళ్లి నిలిచాడు.
బ్రాహ్మణుని రాక గ్రహించిన ధర్మవ్యాధుడు అతని దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. ‘‘స్వాగతం మహాత్మా! నేను వ్యాధుడను. ఆ పతివ్రత నా గురించే మీకు చెప్పినది కదా! నేను ఏమి చేయాలో ఆజ్ఞాపించండి. మీరు ఎందుకు వచ్చిందీ అంతా నాకు తెలుసు’’.
వ్యాధుని మాటలు విన్న కౌశికుడు రెండవసారి ఆశ్చర్యపోయాడు. ఎక్కడో తన గ్రామంలో ఆ గృహిణి అన్న మాటలు మిథిలలో ఉన్న వ్యాధునికి ఎలా తెలిసాయి?
వ్యాధుడు మరల ఇలా అన్నాడు ‘‘మహాత్మా! ఈ ప్రదేశం మీకు తగినది కాదు. మీకు అభ్యంతరం లేకపోతే మా యింటికి వెళ్దాము’’. ఆ మాటలకు బ్రాహ్మణుడు సంతోషించి వ్యాధునితో కలిసి అతని ఇంటికి వెళ్లాడు. ఆ ఇల్లు పరిశుభ్రంగా ఉంది. అక్కడ వ్యాధుడు బ్రాహ్మణుని మంచి ఆసనం మీద కూర్చోబెట్టి కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి తినడానికి ఫలాలు ఇచ్చాడు. అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అడిగాడు - ‘‘తండ్రీ! నీ గురించి నేను విన్నదేమిటి? నీవు చేస్తున్న ఈ ఘోరకర్మ ఏమిటి? నేను ఈ పని చూసి చాలా బాధపడ్తున్నాను’’.
అప్పుడు వ్యాధుడు ఇలా జవాబు చెప్పాడు. ‘‘ఓ బ్రాహ్మణోత్తమా! నేను చేస్తున్న ఈ మాంసం వ్యాపారం నా కులవృత్తి. ఇది నాకు తాతముత్తాతల నుంచి సంక్రమించిన వృత్తి. ఇది బ్రహ్మదేవుడు నాకు విధిలిఖితంగా ఇచ్చినది. కాని నేను నా ముసలి తల్లిదండ్రులకు సేవ చేస్తాను. సత్యమే పలుకుతాను. ఎవరికీ హాని తలపెట్టను. చేతనైన సహాయం చేస్తాను. శక్త్యానుసారం దానం చేస్తాను. ముందుగా అతిథులకు, కుటుంబంలోని సేవకులకు భోజనం పెట్టి తర్వాత నేను భోజనం చేస్తాను. నేను ఎవరినీ నిందించను. మనం పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితే ఈ జన్మలో మనం అనుభవించేది. శూద్రునికి సేవ, వైశయునికి వ్యాపారం, క్షత్రియునికి యద్ధం కర్తవ్యాలు.
ఈ మిథిలా నగరపు రాజు పాలనలో అందరూ తమ కులానికి అనుగుణంగా ధర్మప్రకారం ప్రవర్తిస్తారు. రాజు తన స్వధర్మాన్ని తప్పక పాలించాలి. అప్పుడే అతను అన్ని వర్గాల వారికి రక్షకుడు అవుతాడు.
నేను స్వయంగా ఏ మృగాన్ని చంపను. ఇతరులు చంపి తెచ్చిన వరాహాలను, మహిషాలను కొని, వాటి మాంసాన్ని అమ్ముతాను. నేను మాంసం తినను. నిర్ణీత సమయంలోనే భార్యతో సంగమిస్తాను. రోజంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేస్తాను. నన్ను మెచ్చుకొనేవారిని, నిందించే వారిని అందరినీ ఒకేలాగ చూస్తాను. మనం పొరపాటున ఒక తప్పు చేస్తే మరల దానిని చేయకూడదు. ఉత్తముడు అందరిచేతా గౌరవింపబడతాడు. మూర్ఖుడు ఆత్మస్తుతితో కాలం గడుపును. అలాంటి వారు ఎక్కడా గౌరవం పొందరు.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి