డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -121

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మదత్తుడు ఇలా అన్నాడు ‘‘ప్రాణహాని చేసే ప్రాణులకయినా సహవాసం వలన స్నేహం కలుగుతుంది. పరస్పర విశ్వాసం కలుగుతుంది. తామరాకు మీద నీటిబొట్టులాగ శతృత్వం నిలవదు’’.
పూజనికి చాలా ఆగ్రహం కలిగి ఇలా అంది ‘‘వైరం ఐదు కారణాల వల్ల కలుగుతుందని జ్ఞానులు చెబుతారు. ఆ కారణాలు ఇవి 1. స్ర్తి 2. ఇల్లు/్భమి 3. మాట, 4. జాతిగత వైరం, 5. ఏదయినా అపరాధం. వీటిలో ఏదయినా కారణమున్నా కూడా పరోపకారిని చంపకూడదు. విశేషించి క్షత్రియుడు ఈ పని చేయకూడదు. వైరము ఏర్పడిన తర్వాత మిత్రుడు అయినా సరే నమ్మకూడదు. ఎందుకంటే కట్టెలో కన్పించకుండా నిప్పు దాగినట్లు, వైరము బయటికి కన్పించకపోయినా లోపల దాగి ఉంటుంది రాజా!
ధనం వల్లకాని, బెదిరింపుల వల్ల కాని, అనునయింపులవల్ల గాని, శాస్తబ్రోధల వల్ల కాని కోపాగ్ని తగ్గదు. సముద్రంలోని బడబాగ్ని లాగా మండుతూనే ఉంటుంది. వైరాగ్ని కాని అపరాధం వలన చేసిన కర్మ కాని ఏదో వైపు పూర్తిగా నాశనం అయేదాకా చల్లబడదు. కనుక శత్రువుపై విశ్వాసం ఉంచరాదు. ఇప్పటిదాకా నీవు నాకు ఏ హాని చేయలేదు. అలాగే నేను కూడా నీకు అపకారం చేయలేదు. కనుక నీ ఇంట్లో ఉన్నాను. ఇక ఇప్పుడు నేను నిన్ను నమ్మను’’.
పక్షి అంత గట్టిగా ఉండనని చెప్తూ ఉంటే బ్రహ్మదత్తుడు ఇలా అన్నాడు. ‘‘కల్యాణీ! కాలప్రభావం వల్లే ఇలాంటి పనులు జరుగుతూ ఉంటాయి. కాలం కారణ ంగా జన్మిస్తారు. మళ్లీ మరణిస్తారు. కొన్ని ఒక్కొక్కటిగా మరణిస్తే కొన్ని సామూహికంగా మరణిస్తాయి. కొన్ని చిరకాలం జీవిస్తాయి. కాని నూనె అంటి ఉన్న నిప్పులా కాలం అన్నిం టినీ దహిస్తుంది. పరస్పరం జరిగే అపరాధాలకు నీవు కారణం కాదు నేను కాదు. ప్రాణులకు సుఖదుఃఖాలను కలిగించేది కాలమే. కనుక స్నేహంతో ఏ బాధ లేకుండా స్వేచ్ఛగా ఇక్కడే ఉండు. నీవు చేసిన తప్పును నేను క్షమించాను, నా తప్పుని నీవు కూడా క్షమించు’’.
అందుకు పూజని ఇలా అంది ‘‘కాలమే అన్నింటికీ కారణమైతే, ఎవరికీ ఎవరితోనూ శత్రుత్వమే లేకపోతే ఎవరినైనా చంపినప్పుడు వారి బంధువులు ఎందుకు ప్రతీకారం తీర్చుకుంటారు? కాలం వలననే మృత్యువు, సుఖదుఃఖాలు పెరగటం, తరగటం జరిగేటట్లయితే గతంలో దేవతలూ, రాక్షసులూ ఎందుకు ఒకరి నొకరు చంపుకునేవారు. కాలమే అన్నింటికీ కారణమైతే వైద్యులు రోగులకు ఎందుకు చికిత్స చేసి నయం చేయాలనుకుంటారు? కాలమే అందరినీ చంపితే, శోకంతో అయినవారు ఎందుకు అంతగా శోకిస్తారు?
కాలమే ప్రమాణమైతే మరి కర్మపరులకు ధర్మాచరణమెందుకు? రాజా! నీ కుమారుడు నా బిడ్డను చంపాడు. నేను నీ పుత్రుని చంపాను. ఇక నీవు నన్ను చంపటమే తదుపరి విధి. నేను పుత్రశోకంతో నీ పుత్రుని యెడ పాపం చేశాను. అలాంటి శోకంతోనే నీవు నన్ను చంపుతావు. ఇంకొక మాట! మానవులు ఆహారం కోసం, ఆటకోసం, పక్షులను కోరుతారు. వారి మధ్య వధ సంబంధాలు తప్ప ఇంకే సంబంధం ఉండదు. ఈ వధ బంధనాల భయం వల్లనే ముముక్షువులు మోక్షతంత్రాన్ని ఆశ్రయిస్తున్నారు. జనన మరణాల వల్ల కలిగే దుఃఖం భరింపరానిదని వేదవేత్తలు అంటారు. ప్రాణం అందరికీ ప్రియమైనదే. సంతానం కూడా అందరికీ ఇష్టమైనదే. బ్రహ్మదత్తా! ముసలితనం, దుఃఖం, అర్థనాశనం దుఃఖం, ఇష్టం లేనివారితో కలిసి బ్రతకటం దుఃఖం, ఇష్టజన వియోగం దుఃఖం, వధ బంధనాల వల్ల దుఃఖం, స్త్ర కారణంగా దుఃఖం, సంతానం వల్ల ఎప్పుడూ దుఃఖమే.
రాజా! నేను నీ పట్ల చేసిన పని నీవు నా పట్ల చేసినది కొన్ని వందల సంవత్సరాలైనా మారదు. నీ కొడుకును తల్చుకొన్నకొద్దీ నీలో నా పట్ల వైరం పెరుగుతుందే కాని తరుగదు. శతృత్వం అంత ఉన్నవాడు మరల స్నేహం చేయలేడు. శత్రువుల సత్యాలపై కాని అసత్యాలపై కాని విశ్వాసం ఉంచినవాడు నాశనవౌతాడు. ఎందు కంటే శత్రువులు లోపల వైరం ఉంచుకొని పైకి ప్రియంగా మాట్లాడు తారు. సమయం చూసి నమ్మినవారిని నాశనం చేస్తారు.’’
పూజని మాటలు విన్న రాజు ఇలా అన్నాడు ‘‘అవిశ్వాసంతో జీవితంలో దేనినీ పొందలేము. ఏ పనీ చేయలేము’’.
పూజని రాజుతో మరల ఇలా అంది. ‘‘పాదాలకు గాయాలు అయినా ఇంకా పరుగులు పెడితే పాదాలకు గాయలు పెద్దవే అవుతాయి. కళ్లకు రోగం ఉంటే ఆ కళ్లతో గాలికెదురుగా నిలుచుంటే ఆ గాలి వలన కళ్ళు మరీ పాడౌతాయి. తన శక్తి ఎరుగక చెడుదారిలో నడిస్తే జీవితం అక్కడే అంతమైపోతుంది. వాన ర్ఢాఁడ తెలియకుండా పొలాన్ని దున్నితే ఆ కర్షకుని పని వ్యర్థమవుతుంది. కనుక చేదయినా, వగరయినా, మధురమైనా, రుచికరమైనా తనకు హితమైన ఆహారానే్న స్వీకరించేవాడు అమృతత్వాన్ని పొందుతాడు. అలా కాక మోహంతో పద్యమైన పదార్థాన్ని వదలి అపద్య పదార్థాన్ని తింటే వాని జీవితం అక్కడకు అంతమైనట్లే దైవమూ, పురుష ప్రయత్నమూ ఒక దాని నొకటి ఆశ్రయించి ఉంటాయి. మంచి ఆలోచన కలవారు సత్కర్మను ఆశ్రయిస్తారు. నపుంసకులు దేవునిమీద భారం వేస్తారు. తనకు మంచి చేసే పనిని చేయాలి. అది ఎంత కఠోరమైనదైనా సరే! కాబట్టి దైవం, స్వభావం వీటన్నింటినీ అతిక్రమించి మనిషి ఉద్యమించాలి. దేనినైనా సరే వదలిపెట్టి తనకు హితమైన పనినే మనిషి చేయాలి.
విద్య, శౌర్యం, సామర్థ్యం, బలం, ధైర్యం ఈ ఐదు మనిషికి నైసర్గిక మిత్రులు. వాటి ద్వారానే విద్వాంసులు జీవయాత్ర సాగిస్తారు. ఇల్లు, లోహాలు, పొలం, భార్య, మంచి మిత్రులు వీరంతా ఉపమిత్రులు. వీటిని ఎక్కడైనా పొందవచ్చు. ప్రాజ్ఞుడు ఎక్కడైనా ఆనందంగా ఉండగలడు. ఎక్కడయినా రాణించగలడు. ఎవ్వరికీ భయపడడు. అతని దగ్గర ధనం స్వల్పమయినా అది వృద్ధి చెందుతుంది. బుద్ధిలేనవాళ్ళు నా ఇల్లు, నా పొలం, నా మిత్రులు ఇలా చింతిస్తూ ఉంటారు. తన ఊర్లో రోగాలు ఉంటే ఊరిని వదిలేయాలి. అంతేకాని అక్కడే ఉండి బాధపడకూడదు.
కనుక రాజా! నేను ఇంకొక చోటికి వెళ్లిపోతాను. నాకు ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు. చెడ్డ భార్యను, చెడ్డ కొడుకును, చెడ్డమిత్రుని, చెడ్డ రాజుని, చెడ్డ బంధువులను, చెడిన ప్రదేశాన్ని వెంటనే విడిచిపెట్టాలి. చెడ్డ కొడుకుపై విశ్వాస ముండదు. చెడ్డ భార్యతో సుఖముండదు. చెడ్డరాజ్యంలో శాంతి ఉండదు.ప్రశాంతతను చేకూర్చేవాడే కొడుకు. నమ్మదగినవాడే మిత్రుడు. బ్రతకగలిగిన ప్రదేశమే ఊరు. ప్రజలను బలవంతపెట్టకుండా భయాన్ని కలిగించక పాలించేవాడే రాజు.
రాజుకు ధర్మము తెలియకపోతే అతని ప్రజలు రాజు దుర్మార్గం కారణాన నశిస్తారు. రాజుకు ఏడు లక్షణాలు ఉండాలి. తల్లి, తండ్రి, గురువు, రక్షకుడు, అగ్ని, కుబేరుడు, యముడుగా రాజు ప్రజలను పాలించాలి. ప్రజలకు అర్థం దానం చేసి వారి కోర్కెలను తీరుస్తాడు కనుక కుబేరుని వంటివాడు. అప్రియులను అగ్నిలాగ దహిస్తాడు కనుక అగ్ని. దుర్మార్గులను నియంత్రిస్తాడు కనుక యముని వంటివాడు.
ప్రజలకు ధర్మోపదేశం చేస్తాడు కనుక గురువు. అందరినీ రక్షిస్తాడు కనుక రక్షకుడు. అదే రాజు ప్రజలను పన్నులభారంతో పీడిస్తే అతను పరాభవం పొందుతాడు. బలవంతులతో నిగ్రహిం చిన రాజుకు రాజ్యం నిలవదు’’. ఈ విధంగా పూజని బ్రహ్మదత్తునితో రాజ్యపాలన గురించి, ధర్మం గురించి వివరించి అక్కడ ఉండకుండా తనకిష్టమైన దిశగా ఎగిరిపోయింది.
-ఇంకావుంది

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి