ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

‘జమిలి ఎన్నికలు’ ఇప్పట్లో కుదరవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలు విధాలుగా దేశానికి మేలు జరగాలంటే లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి పోలింగ్ (జమిలి ఎన్నికలు) జరపాలన్న డిమాండ్ నానాటికీ ఊపందుకుంటోంది. ఈ విషయంలో విభేదాలకు అతీతంగా రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి రావాలని మేధావులు సూచిస్తున్నారు. ఒకేసారి ఎన్నికలు జరిపితే ప్రజలకు, రాజకీయ నాయకులకు ఎంతో వెసులుబాటుగా ఉంటుంది. ఎన్నికల ఖర్చును కూడా భారీగా తగ్గించుకునే వీలుంటుంది. లోక్‌సభ, అసెంబ్లీలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించుకోగలిగితే దేశానికి ఎంతోమేలు జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఎన్నికల తంతు ఒకేసారి ముగిసిపోతే అయిదేళ్లపాటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం అభివృద్ది కార్యక్రమాలపై దృష్టి నిలుపగలుగుతుంది. అన్ని చట్టసభలకు, స్థానిక సంస్థలకు అయిదేళ్లకోసారి ఒకేరోజున ఎన్నికలు నిర్వహించుకోగలిగిన రోజు ప్రజాస్వామ్యానికి సుదినం అవుతుంది. ఇందుకు భిన్నంగా ఎన్నికలను విడివిడిగా జరపడం వల్ల ప్రభుత్వానికి ఎంతో ఖర్చవుతోంది. ఉద్యోగులకు ఎన్నో పనిదినాలు వృథా అవుతున్నాయి. ఆర్థికపరంగా ప్రభుత్వ ఖజానాపై ఎంతో భారం పడుతోంది. దేశంలో ఏదోఒక చోట సంవత్సరం పొడుగునా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. ఇలా జరగటంతో ప్రభుత్వ యం త్రాంగం అభివృద్ధి పనులను పక్కన పెట్టి ఎన్నికల నిర్వహణపైనే దృష్టి కేంద్రీకరించవలసి వస్తోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎలక్షన్ కోడ్) నెలల తరబడి అమలులో ఉంటున్నందున అభివృద్ధి కార్యక్రమాలకు అంతరాయం అనివార్యమవుతోంది. పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది తమ రోజువారీ విధులను పక్కన పెట్టి ఎన్నికల నిర్వహణకు పాటుపడవలసి వస్తోంది. సంక్షేమ పథకాలు ఆగిపోవటంతో అభివృద్ధి లక్ష్యాల సాధన కష్టతరమవుతోంది. రాజకీయ పార్టీలు, నాయకులు, అధికార యంత్రాంగం ఎన్నికల కారణంగా మూడు,నాలుగు నెలల పాటు అభివృద్ధి పనుల జోలికి పోవటం లేదు.
మనదేశంలో ఇటు ప్రభుత్వానికి, అటు రాజకీయ పార్టీలకు ఎన్నికల ఖర్చు అనూహ్యంగా పెరుగుతోంది. జాతీయ,ప్రాంతీయ పార్టీలు ఎన్నికల ప్రచారం కోసం వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాయి. అన్ని చట్టసభలకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరగనందున ప్రచార ఖర్చు విపరీతంగా పెరిగిపోతోంది. రాజకీయ పార్టీలు ఎన్నికల ఖర్చు కోసం విరాళాలు సేకరిస్తూ పలురూపాల్లో అవినీతికి పాల్పడుతున్నాయి. పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థల నుంచి కొన్ని రాజకీయ పార్టీలు విరాళాలను సేకరిస్తున్నాయి. ఒకేసారి ఎన్నికలు జరిగితే విరాళాల సేకరణకు కొంతవరకైనా అడ్డుకట్ట పడుతుంది. ఫలితంగా అవినీతి కూడా తగ్గుముఖం పడుతుంది.
లోక్‌సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. ఈ విషయమై ఎన్నికల సంఘం గత మే నెలలో కేంద్ర న్యాయశాఖకు లేఖ రాసింది. సంబంధిత పార్లమెంటరీ కమిటీ కూడా జమిలి ఎన్నికలకు మొగ్గు చూపింది. ఒకేసారి ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కోసం దాదాపు పదివేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ఎన్నికల సంఘం తెలిపింది. అయితే- ఒకేసారి ఎన్నికలు జరిపితే ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు అదనపు పోలీసు బలగాల అవసరం ఉంటుందని ఇసి సూచించింది. మిగతా ఖర్చులన్నీ గణనీయంగా తగ్గుతాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటి మూడు ఎన్నికలు జమిలి ఎన్నికలే. 1951-52లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో లోక్‌సభతోపాటు శాసనసభల ఎన్నికలు కూడా జరిగాయి. 1957, 1962, 1967లో కూడా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. 1968-69లో కొన్ని శాసనసభలను గడువుకు ముందే రద్దు చేయడంతో జమిలి ఎన్నికలకు విఘాతం కలిగింది. 1970లో లోక్‌సభ గడువుకు ముందే రద్దు కావడంతో 1971లో సాధారణ ఎన్నికలు జరిగాయి. అప్పుడు జమిలి ఎన్నికలకు బ్రేకు పడింది. అప్పటి నుంచి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను విడివిడిగా నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమైతేనే జమిలి ఎన్నికలకు వీలు కలుగుతుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం జమిలి ఎన్నికల నిర్వహణను సమర్థిస్తున్నారు. ఈ విధానం దేశానికి ఎంతో మంచిదని, దేశవ్యాప్తంగా చర్చించి దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన అంటున్నారు. ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో ముచ్చటిస్తూ జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. కాగా, ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే కొన్ని శాసనసభల కాల పరిమితిని తగ్గించటం లేదా పొడిగించవలసి ఉంటుంది. రాజ్యాంగాన్ని సవరించటం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవధికి ముందే తమ అసెంబ్లీని రద్దు చేసుకునేందుకు అంగీకరించదు. గనుక కొన్ని శాసనసభల కాలపరిమితిని పెంచటం ద్వారా అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు జరిపే వీలుంటుంది. ఇందుకు వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు అంగీకరించవలసి ఉంటుంది.
జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీల్లో ఇప్పట్లో ఏకాభిప్రాయం కుదరటం సాధ్యం కాదు గనుక 2019లో లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరపటం వీలుకాకపోవచ్చన్న వాదన వినపడుతోంది. 2024లో లోక్‌సభతోపాటు అన్ని శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు ఇప్పటి నుండే చర్చల ప్రక్రియ ప్రారంభించటం మంచిది. అధికార,ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పట్టుపట్టకుండా దేశప్రజల ప్రయోజనాల దృష్టితో జమిలి ఎన్నికల కోసం కృషి చేయాల్సి ఉంది. *

కె. కైలాష్