ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

పార్లమెంటు పరువు పోయింది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దేవుడి కోసమైనా మీ బాధ్యతలను నిర్వహించండి’ అంటూ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన తరువాత కూడా మన పార్లమెంటు సభ్యుల వ్యవహారశైలిలో ఎలాంటి మార్పు రాలేదు. ‘ప్రజలు మిమ్మల్ని పని చేసేందుకు ఎన్నుకున్నారే తప్ప పార్లమెంటును స్తంభింపజేసేందుకు కాదం’టూ ఆయన చెప్పిన హితవు ప్రతిపక్ష పార్టీల నాయకుల కళ్లు తెరిపించలేకపోయింది. మన ప్రజాప్రతినిధులు దేశపు ప్రథమ పౌరుడి సూచనలను బేఖాతరు చేస్తూ శీతాకాల సమావేశాలను పూర్తిగా విఫలం చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి ప్రతిపక్షంతోపాటు అధికార పక్షం సభ్యులు కూడా ఉభయ సభల్లో పిచ్చికూతలు, కేకలు, పెడబొబ్బలు పెడుతూ సభా కార్యక్రమాలకు సంస్కారహీనంగా అడ్డుతగలటంతో అత్యున్నత చట్టసభ పరువు మంటకలిసింది. ప్రణబ్ హితవు చెప్పిన తరువాత కూడా ఎంపీలు ఉభయ సభలను స్తంభింపజేయటం సిగ్గు చేటు.
చట్టసభల్లో ప్రజల సమస్యలపై లోతుగా చర్చించి తగు పరిష్కార మార్గాలు కనుగొనాలే తప్ప ఇలా అల్లరిమూకల మాదిరిగా వ్యవహరించటం ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ తెచ్చారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు బాధ్యతారహితంగా వ్యవహరించటం పట్ల రాష్టప్రతితోపాటు బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ ఉపప్రధాన మంత్రి ఎల్‌కె అద్వానీ కూడా ఎంతో బాధ పడ్డారు. ‘లోక్‌సభను అధికార పక్షం కానీ, స్పీకర్ సుమిత్రా మహాజన్ గానీ సవ్యంగా నడిపించటం లేదు, ఇది ఎవ్వరి అదుపులో లేకుండా పోయింది, ఎందుకిలా జరుగుతోంది?’ అంటూ అద్వానీ సభలోనే తన అసంతృప్తిని, ఆవేదనను వ్యక్తం చేశారు. పార్లమెంటు ఉభయ సభలు సజావుగా పని చేయకపోవటం పట్ల ప్రణబ్, అద్వానీలతో పాటు దేశ ప్రజలందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. అధికార, ప్రతిపక్షానికి చెందిన కొందరు ఎంపీలు సభలు సజావుగా నడవకపోవటం పట్ల బాధ పడుతున్నా వారు తమ ఆందోళనను బహిరంగంగా వ్యక్తం చేయలేని పరిస్థితి నెలకొంది. పెద్దనోట్ల రద్దుపై లోక్‌సభలో సమగ్ర చర్చ జరగాలని ఇరుపక్షాలకు చెందిన పలువురు ఎంపీలు కోరుకుంటున్నారు. ప్రతిరోజు పోడియం వద్దకు వెళ్లి ఉభయ సభలను స్తంభింపజేస్తున్న కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు సైతం బాధ పడటం గమనార్హం. అయితే, ఈ పార్టీల అధినాయకుల మొండిపట్టు మూలంగా పార్లమెంటు పని చేయటం లేదు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ‘పెద్దనోట్ల రద్దు నిర్ణయం’ విజయవంతం కాకూడదని కోరుకుంటున్న కొందరు విపక్ష నేతల ఆదేశాల మేరకు సంబంధిత పార్టీల సభ్యులు సభలను స్తంభింపజేస్తున్నారనేది నిజం. పెద్దనోట్ల రద్దు నిర్ణయం విజయవంతమైతే మోదీ ప్రతిష్ఠ మరింత పెరగుతుందనేది వారి భయం. మోదీ నిర్ణయం వెనుక ‘అతిపెద్ద కుంభకోణం ఉందం’టూ సంచలన ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అందుకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని ప్రజల ముందు ఎందుకు పెట్టటం లేదు? ‘నేను పార్లమెంటులో నోరు తెరిస్తే భూకంపం వస్తుందం’టూ రాహుల్ ప్రగల్భాలు పలుకుతున్నారు. పెద్దనోట్ల రద్దుకు సంబంధించిన తెర వెనక విషయాలు రాహుల్‌కు నిజంగా తెలిస్తే వాటిని కనీసం సుప్రీం కోర్టు ముందైనా పెట్టి దేశ ప్రజలను ఆదుకోవచ్చు కదా? ఆయనకు ఈ మాత్రం ఆలోచన రాదా? కుంభకోణానికి సంబంధించి కీలక సమాచారాన్ని దాస్తూ ఆయన దేశంలోని కోట్లాది మంది బీదప్రజలకు ద్రోహం చేస్తున్నారని భావించాలి. ఇలాంటిదేమీ లేకుండానే తప్పుడు ఆరోపణలు చేస్తే ఆయన మాటలకు విలువే ఉండదు. దేశ ప్రయోజనాల కోసమైనా రాహుల్ నోరు విప్పాల్సి ఉంటుంది కదా! ప్రజలను, దేశాన్ని కాపాడాలనే ఆలోచన ఆయనకు లేదా? నిజం చెప్పాలంటే మన నాయకులు రాజకీయ కోణంలో నోటికి వచ్చింది మాట్లాడుతారు. రాహుల్ కూడా ఈ కోవలోకి వస్తారు కాబట్టే ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు.
పెద్దనోట్ల రద్దు మూలంగా ప్రజలు పడుతున్న బాధలను నివారించేందుకు పార్లమెంటు ఉభయ సభల్లో ఇంతవరకు ఎందుకు చర్చ జరపలేదు? రాహుల్ ఆదేశం మేరకు కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆజ్ఞానుసారం తృణమూల్ కాంగ్రెస్, తమ అధినాయకుల సూచనల మేరకు వామపక్షాల ఎంపీలు గత నెల పదిహేడో తేదీ నుండి పార్లమెంటు ఉభయ సభల్లో పెద్దనోట్ల రద్దుపై చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తనకు పార్లమెంటులో మాట్లాడే అవకాశం రావటం లేదని రాహుల్ చెప్పటం హాస్యాస్పదం కాదా? పెద్దనోట్లపై తాను పార్లమెంటులో మాట్లాడితే భూకంపం వస్తుంది, ప్రధానమంత్రి మోదీ తన సీట్లో కూర్చోలేడంటూ కాంగ్రెస్ యువనేత హెచ్చరించటం ఆయన ఆలోచనారాహిత్యానికి నిదర్శనం. నవంబర్ 17 నుండి డిసెంబర్ 8 వరకు ఉభయ సభల్లో పెద్దనోట్ల రద్దుపై చర్చ జరపకపోవటానికి ప్రతిపక్షాలు కారణమైతే, డిసెంబర్ 9న చర్చ జరగకపోవటానికి అధికార పక్షం కారణం. ఇంతకాలం ఓటింగ్‌తో కూడిన చర్చ కావాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ లోక్‌సభలో రాహుల్ ప్రసంగాన్ని రికార్డు చేసేందుకు ఆఖరి రోజుల్లో అకస్మాత్తుగా వ్యూహాన్ని మార్చుకుని వెంటనే చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ వ్యూహాన్ని పసిగట్టిన అధికార పక్షం దానిని దెబ్బ తీసింది. ఇంతవరకు సభను స్తంభింపజేసినందుకు కాంగ్రెస్ క్షమాపణలు చెబితేనే చర్చ ప్రారంభించాలని అధికార పక్షం డిమాండ్ చేయటంతో కాంగ్రెస్ తెల్లమొహం వేసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల పదహారో తేదీతో ముగుస్తున్నందున పెద్దనోట్ల రద్దుపై చర్చ జరిపేందుకు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ మూడు రోజుల్లోనైనా దేశాన్ని అతలాకుతలం చేస్తున్న నోట్లరద్దు విషయమై చర్చించేందుకు ప్రతిపక్షం బేషరతుగా ముందుకు వస్తే ప్రజలు ఏకొంతైనా హర్షిస్తారు.
*

కె. కైలాష్