ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

రాజకీయ పార్టీలకు నీతిసూత్రాలు వద్దా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ పార్టీలకు అందే విరాళాలను అదుపు చేసేందుకు మోదీ ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలు ఎంత మాత్రం సరిపోవు. సగటు మనిషి తన ఆదాయ వివరాలను విధిగా వెల్లడించాలి. కానీ, దేశాన్ని నడిపించే రాజకీయ పార్టీలు వాటి ఆదాయ వివరాలను బహిర్గతం చేయకూడదా? రాజకీయ పార్టీలకు ఎవరెంత విరాళం ఇస్తున్నారు? అనేది ప్రజలు తెలుసుకోకూడదా? పాలితులు అన్ని వివరాలు వెల్లడించాలి. కానీ, పాలకులు ఆ వివరాలను గోప్యంగా ఉంచడం ప్రజాస్వామ్యమేనా? ఇదెక్కడి న్యా యం? రాజకీయ పార్టీలకు నగదు రూపంలో ఇచ్చే విరాళాల పరిమితిని ఇరవై వేల రూపాయల నుండి రెండు వేల రూపాయలకు కుదించి పెద్ద మొత్తంలో విరాళాలను చెక్కు, డిజిటల్ రూపంలో ఇచ్చేలా కట్టడి చేయటం, మరీ పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వాలనుకునే వారు బాండ్ల రూపంలో ఇచ్చే వీలు కల్పించటం తొలి అడుగు మాత్రమే అవుతుంది. పాలకులు స్వచ్ఛంగా ఉంటేనే ప్రజలు కూడా పరిశుభ్రతను పాటిస్తారు. యథారాజా తథా ప్రజా. రాజకీయ పార్టీలు, నాయకుల అవినీతి మూలంగానే దేశంలోని అన్ని రంగాలు, వ్యవస్థలు అవినీతిమయమవుతున్నాయి.
రాజకీయ పార్టీలు, నాయకులు అవినీతికి పాల్పడుతున్నారు కాబట్టే ప్రజలు కూడా గాడి తప్పుతున్నారు. ఈ పరిస్థితి మారాలంటే మొదట రాజకీయ పార్టీలు, నాయకుల వైఖరిలో మార్పు రావాలి. రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలు పారదర్శకంగా ఉన్నపుడే ఎన్నికల ప్రక్రియలో, పాలనలో నిజాయితీ చోటు చేసుకుంటుంది. ఎన్నికల్లో గెలుపు కోసమే రాజకీయ పార్టీలు ఓటర్లను పలురకాలుగా ప్రలోభపెడుతున్నాయి. అవినీతిని అంతమొందించాలంటే మొదటిగా రాజకీయ పార్టీల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి. ఈ లక్ష్య సాధన కోసం మోదీ ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించిన చర్యలు రాజకీయ పార్టీలకు అక్రమ ధనం, నల్లధనం చేరకుండా చూడటంతోపాటు ఎన్నికల్లో ధనబలం ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ఏ మాత్రం సరిపోవు. డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసుకుని అధికారంలోకి వచ్చిన తరువాత, పదవులను దుర్వినియోగ చేస్తూ కోట్లకు పడగెత్తటం రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది.
అర్థబలమే మన ఎన్నికలను శాసిస్తోందనేది అందరికీ తెలిసిన నిజం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1952 నుండి 1962 వరకు మూడు సాధారణ ఎన్నికలు ఎలాంటి ధనబలం, అంగబలం లేకుండా స్వేచ్చగా జరిగాయి. 1967లో లోక్‌సభకు జరిగిన నాలుగో సార్వత్రిక ఎన్నికలతో విలువల పతనం ప్రారంభమైంది. రాజకీయాల్లో అవినీతి పెరిగిపోయి డబ్బున్న వాడిదే రాజ్యంగా మారింది. సగటు మనిషి ఎన్నికల బరిలోకి దిగి గెలిచే పరిస్థితి లేకుండాపోయింది. కొంతకాలం వరకూ రాజకీయాలు నిజాయితీగా నడిచినా ఆ తరువాత పూర్తిగా భ్రష్టుపట్టడం ప్రారంభమైంది. డబ్బుతో అధికారాన్ని కొనుగోలు చేసుకోవటం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది. ఈ ప్రక్రియలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఓటర్లను అవినీతిపరులుగా మార్చివేశాయి.
పోలింగ్‌కు కొన్ని రోజుల ముందు నుండే ఓటర్లను కొనుగోలు చేయడం జగమెరగిన సత్యం. ప్రాంతీయ పార్టీలు సైతం ఓటర్లను నగదు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, వాషింగ్ మెషీన్లు, సైకిళ్లు, ఇతర తాయిలాలతో మభ్యపెట్టినవే. పోలింగ్‌కు ముందు రోజున ఓటర్లకు నగదు పంపిణీ చేయడం పరిపాటిగా మారింది. అనేక ఉచిత పథకాలు అమలు చేస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలివ్వడం ఆనవాయితీగా మారింది. కేంద్రంలో, రాష్ట్రాల్లో ఇలాంటి ‘ఉచిత’ హామీలిచ్చి రాజకీయ పార్టీలు అధికారాన్ని కైవసం చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితి పోవాలంటే రాజకీయ పార్టీలకు రహస్యంగా అందుతున్న విరాళాలపై ఉక్కుపాదం మోపవలసిందే. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేయటం ఆగిపోనంత వరకూ సత్ఫలితాలను ఆశించడం వృథా ప్రయాసే.
లోక్‌సభకు ఎన్నికయ్యేందుకు 70 కోట్లు వెచ్చించిన నేతలూ ఉన్నారు. పార్టీ అధినేతలకు ఇరవై నుండి యాభై కోట్ల వరకు ముడుపులు చెల్లించుకుని రాజ్యసభకు ఎన్నికైన వారూ ఉన్నారు. ఇదంతా అదుపు కావాలంటే ఎన్నికల సంస్కరణలను అత్యంత కఠినంగా అమలు చేయగలగాలి. నగదు విరాళాలను రెండు వేల రూపాయలకు కుదించటం వల్ల పెద్దగా ఫలితం ఉండదు. దేశంలో అవినీతిని నిర్మూలించాలంటే మొదట రాజకీయ పార్టీల్లో అవినీతిని అరికట్టవలసి ఉంటుంది. రాజకీయ పార్టీల విరాళాల వ్యవహారం పూర్తిగా పారదర్శకంగా ఉండాలి. రాజకీయ పార్టీల లెక్కలు ఎప్పటికప్పుడు ఆడిట్ కావటంతోపాటు, అన్ని పార్టీలను ఆర్.టి.ఐ చట్టం పరిధిలోకి తీసుకువచ్చి ఆదాయపు పన్ను వసూలు చేయాలి. బడా పారిశ్రామికవేత్తలు వందలు, వేల కోట్ల రూపాయలను రాజకీయ పార్టీలకు విరాళంగా ఇచ్చి, అవి అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన దానికంటే అధిక ప్రయోజనం పొందుతున్నారు. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు ఒక రకమైన పెట్టుబడులే. తమ నుంచి పెద్ద మొత్తంలో విరాళం అందుకున్న పార్టీ అధికారంలోకి వస్తే సదరు పారిశ్రామికవేత్తలకు పండగే. ప్రధాని మోదీ ఇప్పుడు తీసుకున్న కొద్దిపాటి చర్యలతో రాజకీయ పార్టీల్లో అవినీతి తొలగిపోతుందనుకోవటం అత్యాశే అవుతుంది.
ఉద్యోగులు, దుకాణాలు, పరిశ్రమలు, ఇతర సంస్థల మాదిరిగానే రాజకీయ పార్టీలు కూడా ప్రతి సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసేలా చట్ట సవరణలు చేయాలి. దేశానికి మార్గదర్శనం కావాల్సిన రాజకీయ పార్టీలు తమ లెక్కలు చూపించకపోతే ఎలా? రాజకీయ పార్టీలు ఇంతకాలం తమ ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్కలు చూపించకపోవమే నేరం. ఈ విషయంలో రాజకీయ పార్టీలకు ఎందుకు మినహాయింపు ఇవ్వాలి. అన్ని పార్టీలనూ ఆర్‌టిఐ చట్టం పరిధిలోకి తీసుకురావాలి. తద్వారా రాజకీయ పార్టీల పనితీరు, విరాళాలు, ఇతర నిర్ణయాల గురించి తెలుసుకునే అవకాశం, అధికారం ప్రజలకు కల్పించాలి. ఆర్‌టిఐ పరిధిలోకి తెస్తే రాజకీయ పార్టీల పనికి విఘాతం కలుగుతుందనే వాదన పస లేనిది. ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు ఆర్‌టిఐ చట్టాన్ని రాజకీయ పార్టీలు దుర్వినియోగం చేస్తాయనటం సరికాదు. రాజకీయ పార్టీలను ఆర్‌టిఐ పరిధిలోకి తీసుకురావటం ద్వారా కార్పొరేట్ ఫండింగ్‌ను అదుపు చేసేందుకు వీలుంటుంది.
ఏ బడా పారిశ్రామికవేత్త ఏ రాజకీయ పార్టీకి ఎంత విరాళం ఇచ్చారనే విషయం తెలుసుకునే అధికారం, అవకాశం ప్రజలకు కల్పించాలి. రాజకీయ పార్టీల నిధులు, విరాళాలు ఎలా ఖర్చు అయ్యాయనేది పారదర్శకంగా ఉన్నప్పుడే అవినీతి కొంతైనా తగ్గుతుంది. దీంతో ఎన్నికల్లో ధనబలం ప్రభావం కూడా తగ్గుముఖం పడుతుంది. ఎన్నికల్లో ధనబలం ప్రభావం తగ్గాలంటే రాజకీయ పార్టీలకు నగదు రూపంలో విరాళం ఇవ్వటం, తీసుకోవటం నిషేధించాలి. రాజకీయ పార్టీలకు విరాళాలు కేవలం చెక్కు లేదా ఖాతా బదిలీ ద్వారానే జరగాలనే నిబంధన విధించినప్పుడే ఎన్నికల్లో ధనబలం ప్రభావం తగ్గుతుంది. అభ్యర్థుల ఎన్నికల ఖర్చు కూడా అదుపులోకి వస్తుంది. రాజకీయం ప్రజాసేవకు కాకుండా వ్యాపార ప్రక్రియగా మారటం ఆగుతుంది.
*

కె. కైలాష్