తూర్పుగోదావరి

వీడని ముసురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 22: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలకు ఇంట్లోంచి కాలు బయటపెట్టలేని స్థితి నెలకొంది. ఏరోజు కారోజు జీవనాధారం కలిగిన చిరు వ్యాపారులు వాన ముసురు వల్ల వ్యాపారాలు లేక ఉపాధి కోల్పోయారు. రాజమహేంద్రవరం పరిసర గ్రామాల నుంచి నిత్యం వేలాది మంది నగరంలో చిరు వ్యాపారాలు చేసుకునే నిమిత్తం వస్తుంటారు. ఇటువంటి వారి వ్యాపారాలన్నీ లేకుండా పోయాయి. ముసురుతో వ్యాపారాలు స్తంభించాయి. ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో జన జీవనం స్తంభించింది. రాజమహేంద్రవరం నగరంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే వుంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పేపర్‌మిల్లు రోడ్డు, సీతంపేట రోడ్డు, కంబాలచెరువు రోడ్డు, ఆర్యాపురం రోడ్డు, టి.నగర్, కారల్ మార్క్సురోడ్డు, లలితానగర్ రోడ్డు జలమయంగా మారాయి. దీంతో పలు రోడ్లలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి.
సీతానగరం, కోరుకొండ, గోకవరం, మన్యంలోని దేవీపట్నం, వై.రామవరం, అడ్డతీగల, రంపచోడవరం, గంగవరం, రాజవొమ్మంగి మండలాల్లో విస్తారంగా వర్షాలు కురిసాయి. మైదాన, మెట్ట ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల గ్రామాల మధ్య రహదారులు జలదిగ్బంధమయ్యాయి. కోరుకొండ, సీతానగరం, మిర్తిపాడు, తొర్రేడు, వడిశలేరు, రాఘవపట్నం, మునికూడలి తదితర ప్రాంతాల్లోని రోడ్లన్నీ మునిగిపోయాయి. గ్రామాలు వాన ముసురుతో చిత్తడిగా మారాయి.
ఏజెన్సీలో వాగులు, సెలయేర్లు పొంగిపొర్లుతున్నాయి. ఏలేరు, సూరంపాలెం, మద్దిగడ్డ, సుబ్బారెడ్డి సాగర్‌లు వరద నీటితో నిండు కుండల్లా మారాయి. కాల్వలు నిండుగా ప్రవహిస్తున్నాయి. మెట్ట ప్రాంతంలోని చెరువులు గట్ల వరకు వరద నీటితో కట్టలు తెంచుకునే విధంగా మారాయి. ఎటు చూసినా వర్షం నీరు కనిపిస్తోంది. మరో రెండు రోజుల వరకు వర్షాలు కురుస్తూనే వుంటాయని అంచనా వేస్తున్నారు.
వణికిస్తోన్న పురాతన భవనాలు
గత నలభై ఎనిమిది గంటలుగా కురుస్తోన్న భారీ వర్షాలకు రాజమహేంద్రవరం నగరం తడిసి ముద్దయింది. ఎటు చూసినా వర్షపు నీటితో చిత్తడిగా మారింది. కురుస్తోన్న భారీ వర్షాలకు నగరంలోని పలు రోడ్లు జలమయం కావడమే కాకుండా రోజుల తరబడి నీటిలో నానడం వల్ల పురాతన భవనాల్లో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అనే భయం నెలకొంది. కాలం చెల్లిన ఈ భవనాల్లో నివాసం ఉండకూడదని, ప్రమాదభరితంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ నగరంలోని పలు పురాతన భవనాలకు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆయా ఇళ్ళ వద్ద, భవనాల వద్ద హెచ్చరికల బోర్డులు కూడా పెట్టారు. ఈ మేరకు నగరంలో సుమారు 121 పురాతన భవనాలు, పెంకుటిళ్లు కూలిపోయే దశలో వున్నాయని టౌన్ ప్లానింగ్ విభాగం హెచ్చరించింది. కోర్టు ఉత్తర్వులు అడ్డుపెట్టుకుని ఇందులో నివాసాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే నగరపాలక సంస్థ ఇప్పటికే కొన్నింటిని కూల్చి వేసింది. ఇంకా చాలా వరకు కూల్చి వేయకపోవడం వల్ల ఆయా భవనాల్లో నివాసాలు కొనసాగుతున్నాయి. ఈ తరహా పురాతన పెంకుటిళ్లు, భవనాలు గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు నానిపోవడంతో ఎపుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని వణికిస్తున్నాయి. అవసరమైన అప్రమత్త చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నగరపాలక సంస్థ వీటిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు చేయాలని కోరుతున్నారు. ఇదిలా వుండగా నగరంలో వరద నీటితో మునిగిపోయిన ప్రాంతాల్లో ఎప్పటికపుడు నీటిని తోడేందుకు నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. ప్రధానంగా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ రోడ్డులో మోటార్లు పెట్టి నీటిని తోడుతున్నారు. అదే విధంగా ప్రతీ వర్షానికి యధావిధిగా మునిగిపోయే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో నగరపాలక సంస్థ అప్రమత్త చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.