తూర్పుగోదావరి

భయం గుప్పెట్లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 29: గాయం ఒక చోట.. మందు మరో చోట అన్నట్టుగావుంది ప్రభుత్వ వైఖరి.. తూర్పు ఏజెన్సీలోని కొన్ని గ్రామాల్లో భయపెడుతున్న కాళ్లవాపు వ్యాధి కాదని, వ్యాధి లక్షణమని చెబుతున్న ప్రభుత్వం ఎందుకొచ్చిందో గుర్తించింది..కానీ నివారణ చర్యలు మాత్రం చేపట్టలేకపోయింది..అవగాహన కార్యక్రమాలతో హడావిడి చేస్తోంది.. నివారణకు అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఏజెన్సీలో ఖమ్మం నుండి విలీనమైన వి ఆర్ పురం మండలంలో కాళ్లవాపు వ్యాధి గిరిజనులను కబళిస్తోంది. ఈ మండలంలో మొత్తం 7748 కుటుంబాలున్నాయి. గ్రామమంతా కోయ తెగకు చెందిన ఆదివాసీలే. కాళ్లవాపు, జ్వరంతో ఇప్పటివరకు మండలంలో ఆరుగురు మృతిచెందారు. మరణ మృదంగం మొదలైన తర్వాత మండలంలోని అన్ని కుటుంబాలను సర్వే చేశారు. ఇందులో 90 మందికి కాళ్లవాపు ఉన్నట్టు గుర్తించారు. ముందుగా ఈ వ్యాధి వి ఆర్ పురం మండలం రేఖపల్లి గ్రామ పంచాయతీలోని అన్నవరం గ్రామంలో వెలుగుచూసింది. ఈ లక్షణాలతో గ్రామానికి చెందిన ముగ్గురు చనిపోయారు. ఇదే మండలంలోని లక్ష్మీనగరం, తమ్మయ్యపేట, చినమట్టపల్లి గ్రామాలకు చెందిన ఒక్కొక్కరు మృతి చెందారు. కాళ్ల వాపు, జ్వరం తీవ్రంగా రావడంతో గుర్తించిన రెండు మూడు రోజులకే మృత్యు ఒడిలోకి చేరుకుంటున్నారు. అన్నవరం గ్రామంలో మొత్తం 174 కుటుంబాలు నివసిస్తున్నాయి. 541 మంది జనాభా. ఈ వ్యాధికి ప్రధాన కారణం రక్షిత మంచినీరు లేకపోవడమేనని ఉన్నతస్థాయి వైద్య బృందం గుర్తించింది. చిత్రమేమిటంటే నేటికీ ఈ గ్రామస్థులకు వాగు నీరే ఆధారం. ఈ గ్రామమే కాదు వ్యాధి లక్షణాలు బయటపడిన అన్ని గ్రామాలకూ వాగు నీరే ఆధారం. గ్రామంలో 70 మంది పందుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇక ప్రభుత్వం గుర్తించిన ప్రధాన కారణాల్లో మరొకటి అపరిశుభ్ర వాతావరణం. రక్త పరీక్షల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం, గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలకు ఈ కాళ్ల వాపు సంకేతమని, ఇదేదో అంతుచిక్కని వ్యాధి మాత్రం కాదని గుర్తించారు.
ఇన్ని లోపాలు, కారణాలు గుర్తించిన యంత్రాంగం వాటిని సరిదిద్దేందుకు, నివారణకు ఎటువంటి చర్యలు చేపట్టకుండా కేవలం అవగాహనా చర్యలతో నెట్టుకొస్తోంది. ఇప్పటికీ ప్రభుత్వం ఈ గ్రామాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేయలేకపోతోంది. వ్యాధి ప్రభావిత గ్రామాలన్నిటిలోనూ రక్షిత మంచినీటి సరఫరా ప్లాంట్లు పనిచేయక మూలనపడ్డాయి. ఈ గ్రామాలు విలీనమైన తర్వాత ఐటిడిఎ పాలకవర్గ సమావేశాల్లో అనేకసార్లు స్థానిక శాసన సభ్యుడు సున్నం రాజయ్య రక్షిత పథకాలను పునరుద్ధరించాలని కోరుతూనేవున్నారు. అయినా ఫలితంలేదు.
ఇక రక్తహీనత వుందని, పౌష్టికాహార లోపం కారణంగానే ఇది ఎదురైందని అధికారులు గుర్తించారు. కానీ వ్యాధి లక్షణం కన్పించిన గ్రామంలో కూడా కనీస స్థాయిలో పౌష్టికాహారాన్ని పంపిణీ చేయలేదు. కేవలం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పిస్తోంది. తక్షణం మంచినీటిని సరఫరా చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. బెల్లం, కందిపప్పు, రాగిపిండి, నూనె అదనంగా పంపిణీ చేస్తామని అధికారులు చెప్పారు. ఇప్పటివరకు కూడా సరఫరా చేయలేదు. జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ తరపున జాయింట్ కలెక్టర్ బుధవారం పౌష్టికాహారం పంపిణీకి చర్యలుచేపట్టినట్టుగా సమాచారం.
ఈ గ్రామాలన్నీ చింతూరు ఐటిడిఎ పరిధిలోకి వస్తాయి. ఇక్కడి ఐటిడిఎకు పూర్తిస్థాయి పిఓను కూడా ఇప్పటివరకు నియమించలేదు. సీతంపేట ఐటిడిఎ పిఓ వెంకటరావు ఇన్‌ఛార్జిగా ఉన్నారు. ఇది అంటువ్యాధి కాదని, గతంలో సీతంపేట ఐటిడిఎ పరిధిలో ఒకసారి వెలుగులోకి వస్తే నివారించామని, నివారణ సాధ్యమేనని, సరైన వైద్యం అందిస్తే పునరావృతం కాకుండా ఉంటుందని అంటున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం కాళ్ళ వాపు అదుపులోనే వున్నప్పటికీ గ్రామస్థులు మాత్రం భయం గుప్పెట బిక్కు బిక్కుమంటున్నారు.
కాళ్ళ వాపుతో మృతి చెందినవారి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, రక్షిత మంచినీటిని సరఫరా చేయాలని, పౌష్టికాహారాన్ని సరఫరా అందించాలని, మొత్తం ఏజెన్సీ అంతా వైద్య సర్వే నిర్వహించాలని, చింతూరు ఐటిడిఎ కు శాశ్వత పి ఓను నియమించాల్సిన అవసరం ఎంతైనా వుందని రాష్ట్ర గిరిజన సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపి మిడియం బాబూరావు డిమాండ్ చేస్తున్నారు.