తూర్పుగోదావరి

స్వచ్ఛ పట్టణంగా పెద్దాపురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దాపురం, అక్టోబర్ 1: పెద్దాపురం పట్టణాన్ని సంపూర్ణ పారిశుధ్య పట్టణం (స్వచ్ఛ మున్సిపాలిటీ)గా ప్రభుత్వం గుర్తించిదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రకటించారు. శనివారం మంత్రి జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రభుత్వ జీవోను విడుదల చేశారు. జిల్లాలో కొన్ని పట్టణాలను ఓడిఎస్ పట్టణాలు (బహిరంగ మల, మూత్ర విసర్జనలు లేని పట్టణాలు)గా గుర్తించి, వాటికి పారిశుద్ధ్య నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తుందన్నారు. పట్టణంలో 750 వరకు వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించి, బహిరంగ మల విసర్జనలు నిర్మూలించినందుకు పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. జిల్లాలో ప్రప్రథమంగా పెద్దాపురం పట్టణం ఎంపిక కావడానికి సహకరించిన మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, కౌన్సిల్ సభ్యులు, అధికార యంత్రాంగాన్ని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. కార్యక్రమంలో ఛైర్మన్ సూరిబాబు రాజు, కమిషనర్ వెంకట్రావు, జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, మున్సిపల్ సిబ్బంది, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఘనంగా శరన్నవరాత్రులు ప్రారంభం
రాజమహేంద్రవరం, అక్టోబర్ 1: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం రాజమహేంద్రవరం నగరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి భక్తులు శనివారం నుంచి భవానీమాలలు ధరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దేవీచౌక్‌లో శుక్రవారం అర్థరాత్రి అమ్మవారిని ప్రతిష్టించారు. తొలిరోజు అమ్మవారు భక్తులకు దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. శనివారం ఉదయం అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. దేవీచౌక్‌లోని అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మధ్యాహ్నం బళ్ల మల్లేశ్వరరావు పురాణపఠనం చేశారు. సాయంత్రం ఆర్‌బికె శ్రీనివాస్ ఘంటసాల భక్తిగీతాలు ఆలపించారు. సాయంత్రం సీతానగరంనకు చెందిన వి కృష్ణ బృందం గరగలు ప్రదర్శించారు. రాత్రి కనకదుర్గ మహత్యం నాటకాన్ని ప్రదర్శించారు. దసరా సందర్భంగా దేవీచౌక్‌లోని అమ్మవారి గుడిని, పరిసర ప్రాంతాలను రంగురంగుల విద్యుత్‌దీపాలు, వినూత్న రూపాలతో అలంకరించారు. అలాగే నగరంలోని పలుచోట్ల శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

రెండోసారి ‘సత్యదేవా’ను వరించిన అధ్యక్ష పదవి
కడియం, అక్టోబర్ 1: కడియం సర్ ఆర్దర్ కాటన్ నర్సరీమెన్ అసోసియేషన్ అధ్యక్ష పదవి రెండోసారి సత్యదేవా నర్సరీ యాజమాన్యాన్ని వరించింది. కెఎన్‌ఎ ఏర్పడిన తరువాత 2013లో తొలి అధ్యక్షునిగా సత్యదేవా నర్సరీ యజమాని పుల్లా ఆంజనేయులు మొదటి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన హయాంలో అసోసియేషన్ పెద్ద ఎత్తున విస్తరించారు. కొద్దిపాటి సభ్యత్వాలున్న ఈ అసోసియేషన్‌లో 1300కు పైగా సభ్యత్వాలను చేర్పించారు. అలాగే సుమారు కోటి రూపాయల వ్యయంతో అసోసియేషన్ భవన నిర్మాణానికి స్థల సేకరణ చేశారు. అసోసియేషన్ ఆర్థిక పరపతిని పెంచడంలో ఆంజనేయులు విశేష కృషి చేశారు. అయితే ఆయనే తిరిగి ఏకగ్రీవంగా ఎన్నిక కావాల్సి ఉండగా గతంలో నర్సరీ పెద్దలు ఒకసారి అధ్యక్షునిగా పనిచేసిన వ్యక్తి వరుసగా పోటీ చేయడానికి వీల్లేదని బైలాలో షరతు విధించారు. దీంతో ఆంజనేయులు అధ్యక్ష పదవికి దూరమయ్యారు. ఆయన స్థానంలో ఆయన సోదరుడు పుల్లా చంటియ్య పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఇది నర్సరీ రైతుల విజయమని చంటియ్య పేర్కొన్నారు. తన సోదరుడు ఆంజనేయులు చేసిన కృషే తనను గెలిపించిందని, అంతకు దీటుగా అసోసియేషన్ అభివృద్ధికి పాటుపడతానని చంటియ్య తెలిపారు.
నేడు పాలకవర్గ విస్తరణ
ఇదిలావుండగా కడియం ఆర్దర్ కాటన్ నర్సరీమెన్ అసోసియేషన్‌కు పూర్తిస్థాయి పాలకవర్గాన్ని ఆదివారం ఎన్నుకునే అవకాశం ఉంది. ఫలితాల లెక్కింపు తరువాతే గెలిచిన పాలకవర్గం భేటీ అయినప్పటికీ వారిలో ఏకాభిప్రాయం లేక ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి వంటి పూర్తిస్థాయి పదవుల నియామకం వాయిదా పడింది. సభ్యుల ఏకాభిప్రాయంతోనే పాలకవర్గ విస్తరణ ఉంటుందని అధ్యక్షులు చంటియ్య తెలిపారు. ఉపాధ్యక్షునిగా మాత్రం బుర్రిలంకకు చెందిన డైరెక్టర్ కొత్తపల్లి శివాజీని నియమించేందుకు అంగీకారం కుదిరింది.
పుల్లాకు భారీ మెజారిటీ
కడియం సర్ ఆర్దర్ కాటన్ నర్సరీమెన్ అసోసియేషన్ అధ్యక్షునిగా కడియపులంక సత్యదేవా నర్సరీ అధినేత పుల్లా చంటియ్య భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో 1346 ఓట్లకు గాను 1315 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కడియపులంక జడ్పీ హైస్కూలులో శనివారం జరిగిన ఎన్నికల్లో చంటియ్యకు 878 ఓట్లు రాగా, ప్రత్యర్థి మల్లు పోలరాజుకు 430 ఓట్లు లభించగా ఏడు ఓట్లు చెల్లలేదు. దీంతో అధ్యక్షునిగా చంటియ్యను ఎన్నికల కమిటీ ప్రకటించింది. అలాగే 11 మంది డైరెక్టర్ల పదవులకు పుల్లా రామకృష్ణ, ఆకుల గోపాలకృష్ణ, కొత్తపల్లి శివాజీ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మిగిలిన ఎనిమిది పదవులకు ఓటింగ్ జరిగింది. ఈ ఫలితాల్లో డైరెక్టర్లుగా పాటంశెట్టి శేషు, ధర్మాసనం శివరామకృష్ణ, చెక్కపల్లి పోలరాజు, బొరుసు సుబ్బారాయుడు, పంతం బ్రహ్మాజీ, సింగంశెట్టి శ్రీను, పాటంశెట్టి శ్రీనివాసు, సుంకర గోవిందు విజయం సాధించారు. ఐఎన్‌ఎ అధ్యక్షులు పల్ల సుబ్రహ్మణ్యం, నర్సరీమెన్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు తాడాల పెదకాపు, పుల్లా ఆంజనేయులు అధ్యక్ష నియామక పత్రాన్ని చంటియ్యకు అందచేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కడియం సిఐ సురేష్ బందోబస్తు నిర్వహించారు.
బైపాస్ రోడ్డు నిర్మాణం వేగవంతం
* జెసి -2 రాధాకృష్ణమూర్తి
శంఖవరం, అక్టోబర్ 1: కత్తిపూడి నుండి రాజోలు వరకు చేపట్టిన రోడ్డు విస్తరణలో భూసేకరణ సమస్యలను అధిగమించి రోడ్డు నిర్మాణం వేగవంతం చేస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ 2 రాధాకృష్ణమూర్తి అన్నారు. మొదటి విడత బైపాస్ రోడ్డు నిర్మాణానికి కత్తిపూడిలో 147 మంది రైతులకు 17 కోట్ల రూపాయలు మంజూరు కాగా, వారిలో 15 మంది రైతులకు పలు సాంకేతిక సమస్యలతో భూసేకరణ జాప్యం జరిగింది. దీంతో జెసి 2 రాధాకృష్ణమూర్తి జాప్యం జరిగిన భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి కొన్ని సమస్యలను ఆయన పరిశీలించి పరిష్కరించారు. అలాగే మరికొన్నింటిని తహసీల్దార్ వెంకట్రావుకు బదిలీ చేసి ధ్రువపత్రాలను పరిశీలించి వారసత్వంను గుర్తించి సమస్య పరిష్కరించాలన్నారు. అనంతరం జెసి 2 రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ భూసేకరణకు సహకరించకుండా జాప్యం చేసే వారికి సంబంధించిన సొమ్మును కోర్టులో జమచేసి పనులు వేగవంతం చేస్తామన్నారు. ఇప్పటికే 2, 3వ విడతలకు సంబంధించిన వారికి నష్టపరిహారం అందిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో హైవే ఇంజినీర్ వెంకటరమణ, ఆర్‌ఐ ప్రసాద్, సర్వేయర్లు రాజు, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
సైనికులకు మద్దతుగా ర్యాలీ
రాజమహేంద్రవరం, అక్టోబర్ 1: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి, ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారతసైనికుల ధైర్యసాహసాలను జై కొడుతూ శనివారం మాతృశ్రీ జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈర్యాలీని సిసిసి ఎండి పంతం కొండలరావు ప్రారంభించారు. కళాశాల చైర్మన్ ఎ బాబూనాగేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప జన్మదిన వేడుకలు
పెద్దాపురం, అక్టోబర్ 1: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం, విపత్తుల నివారణ శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప 62వ జన్మదిన వేడుకలు పట్టణంలోని శతాబ్ది చిల్డ్రన్ పార్కులో శనివారం ఘనంగా జరిగాయి. గత రెండేళ్లుగా మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలు ఈ ఏడాది పాండవుల మెట్టపై నూతనంగా నిర్మించిన మున్సిపల్ శతాబ్ది చిల్డ్రన్ పార్కులో ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాకు చెందిన అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్కుకు క్యూ కట్టారు. ఈ విధంగా పార్కును ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మంత్రి జన్మదిన వేడుకలు చక్కగా ఉపయోగపడ్డాయి. జిల్లా నలుమూలల నుండి తరలి వచ్చి పార్టీ అభిమానులు, కార్యకర్తలు, పనిలో పనిగా పార్కును సందర్శించినట్టయ్యింది. శనివారం మధ్యాహ్నం మంత్రి చినరాజప్ప పార్కుకు చేరుకుని అభిమానుల కోలాహలం మధ్య భారీ కేక్‌ను కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు అధ్యక్షతన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన పుట్టిన రోజున పట్టణంలో పర్యావరణ పరిక్షణలో భాగంగా వెయ్యి వరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. పార్కు ఆవరణలో మొక్కను నాటి, దాని రక్షణకు ట్రీ గార్డును మంత్రే స్వయంగా ఏర్పాటు చేశారు. నియోజకవర్గాన్ని ఏడాదిలో సమూలంగా మార్పులు చేసి అభివృద్ధి పథంలో నడిపించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో రూ. 300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టానన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ రవిప్రకాష్, డిపిఆర్‌వో ఫ్రాన్సిస్, డిఆర్‌డిఎ పిడి మల్లిబాబు, డ్వామా పిడి నాగేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్, బిసి కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ ఇడిలు, ఆర్డీవో విశే్వశ్వర్రావు, కాకినాడ ఆర్డీవో అంబేద్కర్, జిల్లా పరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వీర్రెడ్డి, మాజీ చైర్మన్ అప్పలరాజు, ఎమ్మెల్యేలు వర్మ, నల్లమిల్లి రామకృష్టారెడ్డి, వెంకటేష్, జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, వివి చౌదరి, ఏలేరు చైర్మన్ చంటిబాబు, దవిళేశ్వరం నీటి సంఘం చైర్మన్ వర్మ, డిఎస్పీ రాజశేఖర్‌రావు, ఆర్ అండ్ బి డిఇ సూర్యప్రకాష్, పిఆర్ డిఇ హరినాధరావు, తహసీల్దార్ వరహాలయ్య, ఎంపిడిఒ వసంత మాధవి, మున్సిపల్ వైస్ చైర్మన్ త్సలికి సత్యభాస్కర్, సామర్లకోట మున్సిపల్ చైర్మన్ మన్యం పద్మావతి, చంద్రరావు, ఎంపీపీలు గుడాల రమేష్, గొడత మార్త, వైస్ ఎంపీపీ మిరియాల పద్మరాజు, ఎఎంసి చైర్మన్లు ముత్యాల రాజబ్బాయి, అడబాల కుమారస్వామి, శ్రీనివాస్, శ్రీనివాసాచార్యులు, రవిచంద్ర, జడ్పీటీసీలు గుమ్మల విజయలక్ష్మి, శివనాగరాజు, రూరల్ నేతలు కందుల విశే్వశ్వరరావు, ఎలిశెట్టి నాని, అరవింద్, బొడ్డు వెంకన్న, కోటి, సిఐ వీరయ్యగౌడ్, ఎస్సై సతీష్ తదితరులు మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
వెంకటేశ్వరస్వామి ఆలయంలో చినరాజప్ప పూజలు
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, అక్టోబర్ 1: అమలాపుంర శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజప్ప పుట్టినరోజు సందర్భంగా ఉదయానే్న సతీసమేతంగా ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కర్రి దత్తుడు, ఇఓ వివివిఎస్‌ఎన్ మూర్తి, ఆలయ అర్చకులు రాజప్ప దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ ఫ్రాంగణంలో రాజప్ప దంపతులు మొక్కలను నాటారు.
బస్సుల మధ్య నలిగి విద్యార్థి మృతి
గండేపల్లి, అక్టోబర్ 1: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన రెండు బస్సుల మధ్య శనివారం ఒక విద్యార్థి నలిగి మృతి చెందాడు. గండేపల్లి ఎస్సై రజనీకుమార్ తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలో అయ్యప్పరాజుపేటకు చెందిన కొనగళ్ల నాగ సత్య శ్రావణ్‌కుమార్ (21) కళాశాలో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం కళాశాల ఆవరణలో ఆగి ఉన్న బస్సు వెనుకవైపు నిల్చుని ఉండగా వెనుక నుండి మరో బస్సు వచ్చి ఢీకొట్టడంతో అతని తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే అతనిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు.