తూర్పుగోదావరి

అందని ద్రాక్షలా ఏజెన్సీ వైద్యసేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారేడుమిల్లి, డిసెంబర్ 8: జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు వైద్యసేవలు అందని ద్రాక్షలా తయారయ్యాయని, పిహెచ్‌సిలో వైద్యులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. మారేడుమిల్లి గ్రామంలో వనవిహారి అతిథిగృహంలో బుధవారం రాత్రి ఆయన బసచేశారు. గురువారం ఉదయం ప్రజలతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో ఆయన మాట్లాడారు. అనంతరం ఆయన స్థానిక పిహెచ్‌సిని పరిశీలించారు. ఈ సందర్భంగా జగన్ అక్కడ ఉన్న రోగులతో మాట్లాడారు. డాక్టరు లేక గత మూడురోజుల నుంచి ఆసుపత్రికి వచ్చి వెళుతున్నా వైద్యం అందడంలేదని, తీరా వైద్యం అందినా మందులను బయట కొనుగోలు చేసుకోమంటున్నారని రోగులు తన దృష్టికి తీసుకువచ్చారని జగన్ చెప్పారు. పిహెచ్‌సి సిబ్బంది, ఫార్మాసిస్టుతో జగన్ మాట్లాడుతుండగా వైద్యాధికారిణి మోనీషా అక్కడకు వచ్చారు. పిహెచ్‌సికి సంబంధించిన సిబ్బంది కొరత, రోగులకు అందిస్తున్న సేవలపై జగన్ వైద్యాధికారిణిని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ఉండేందుకు వసతి సౌకర్యాలు లేవని, పిహెచ్‌సిలో ముగ్గురు వైద్యులుండాల్సి ఉండగా, ఒక్కరు మాత్రమే ఉన్నారని వైద్యాధికారిణి జగన్‌కు వివరించారు. తాను గత మూడురోజులుగా ట్రైనింగ్‌కు వెళ్లానని ఆమె చెప్పారు. అనంతరం జగన్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో పది 108 వాహనాలకు మూడు మాత్రమే పనిచేస్తున్నాయని, ఆరోగ్య కేంద్రంలో రోగులకు మంచాలు లేక కింద పడుకోబెట్టి వైద్యసేవలందిస్తున్నారని, భవనం శిథిలావస్థకు చేరుకున్నదని, కొత్త భవనం నిర్మిస్తుండగా అది అసంపూర్తిగా నిలిచిపోయిందన్నారు. ఇటీవల పిహెచ్‌సికి కొత్తగా నిర్మిస్తున్న భవనాన్ని ఆరోగ్య శాఖామంత్రి వచ్చి చూసినా అది అసంపూర్తిగానే ఉందని, దాన్ని పూర్తిచేయలేదని జగన్ అన్నారు. కార్యక్రమంలో రంపచోడవరం, అరకు, కొత్తపేట ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, డి ఈశ్వరి, చిర్ల జగ్గిరెడ్డి, జడ్పీటీసీ సత్తి సత్యనారాయణరెడ్డి, సర్పంచ్ కొలిపే తేజస్వీకళ, ఎంపిపి కె సీతామహాలక్ష్మి, వైసిపి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, జిల్లా యూత్ అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కొత్తరకం ఉద్యానవన పంటలు పండించే రైతులకు
50 శాతం సబ్సిడీ: కలెక్టర్
గండేపల్లి, డిసెంబర్ 8: కొత్తరకం ఉద్యానవన పంటలు పండించే రైతులకు 50 శాతం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించనున్నట్టు జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ తెలిపారు. గురువారం గండేపల్లి మండలం సూరంపాలెం శివారు రామేశ్వరంపేట ఎడిబి రోడ్డు పక్కన ఉన్న 8 ఎకరాల విస్తీర్ణంలో సాగుచేస్తున్న బొప్పాయి పంటను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మూడు ఉద్యానవన శాఖల ప్రాంతీయ పరిధిలోని ఏజన్సీ ప్రాంతంలోను, ప్రధానంగా కొత్త రకాల ఉద్యానవన పంటలపై రైతులు దృష్టిసారించాలన్నారు. ఏజన్సీ ప్రాంతంలో జీడి మామిడి, మామిడి, కొత్త రకాలు సుమారు 3వేల ఎకరాలు సాగుచేస్తున్నారన్నారు. అదే విధంగా అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం ఎడిఎల పరిధిలో అరటి, రుషావళి, బొప్పాయి, పాళీహౌస్‌లలో అధిక దిగుబడినిచ్చే పుష్పాలు, హైబ్రీడ్ రకం సుమారు వంద హెక్టార్లలో పండిస్తున్నట్టు తెలిపారు. మామిడి తాండ్ర తయారుచేసే పరిశ్రమలను పాళీ హౌస్‌లో సోలార్ సిస్టం ద్వారా తయారుచేసే వారికి ప్రోత్సాహం ఇవ్వనున్నట్టు తెలిపారు. తొలుత ఎడిబి రోడ్డు పక్కన 8 ఎకరాల విస్తీర్ణంలో సాగుచేస్తున్న బొప్పాయి పంటను పరిశీలించారు. రైతు లక్ష్మణ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏడు నెలల క్రితం విత్తనాలు కొనుగోలుచేసి పంటలు వేసినట్టు చెప్పాడు. మరో నెల రోజుల్లో కోతకు వస్తుందని, రెండు సంవత్సరాల పాటు దిగుబడి వస్తుందని చెప్పాడు. 50 శాతం సబ్సిడీ రావాల్సి ఉండగా నేటి వరకూ ఒక్క రూపాయి కూడా రాలేదని కలెక్టర్ వద్ద ఆవేదన వ్యక్తం చేయగా, తక్షణమే మంజూరు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అదే విధంగా పామాయిల్ చాప్ కట్టర్ మిషన్‌ను కలెక్టర్ పరిశీలించారు. నాయకంపల్లిలో పోకల రామచంద్రరావు తక్కువ పెట్టుబడితో అయిదంచెల విధానంతో పండిస్తున్న ఉద్యానవన పంటలు మామిడి, నిమ్మ, బొప్పాయి, అరటి, మునగ, అపరాల సాగును కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. రైతులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ ఎఒ శ్రీనివాస్, రుషీ సోయా ఏరియా మేనేజర్ ఎస్ ప్రకాష్, పలువురు రైతులు పాల్గొన్నారు.