తూర్పుగోదావరి

మళ్లీ అదే అస్త్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 24: పోలీసులు గృహ నిర్బంధాల అస్త్రం మళ్లీ ప్రయోగించారు... కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన సత్యాగ్రహ పాదయాత్ర సన్నాహాలను ఒకరోజు ముందుగానే అడ్డుకున్నారు. ముద్రగడ సహా కాపు ఉద్యమ నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధంలో ఉంచారు. కొద్ది నెలల క్రితం పాదయాత్రకు ఉపక్రమించిన ముద్రగడ తదితరులను ఇదే తరహాలో పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఈసారి కూడా అదే పునరావృతమయ్యంది. శాంతిభద్రతలకు భంగం వాటిల్లే అవకాశాలుండటంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు పాదయాత్రకు అనుమతించేది లేదంటూ పోలీసు అధికారులు ముద్రగడకు స్పష్టం చేశారు. ఇదే సమయంలో బుధవారం ముద్రగడ పాదయాత్ర నిర్వహించాల్సి వున్న రావులపాలెంలో పోలీసులు భారీ కవాతు నిర్వహించారు. మరోవైపు ముద్రగడ పాదయాత్రను ప్రారంభించకుండానే ఒకరోజు ముందుగా ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు. ఇందుకు 144 సెక్షన్, 30పోలీస్ యాక్ట్‌లు అమల్లో ఉన్నాయని, చట్ట ప్రకారం ఆందోళన, రాస్తారోకో, ధర్నా, నిరసన కార్యక్రమాలను నిర్వహించేందుకు అనుమతుల్లేవంటూ పోలీసు అధికారులు చెప్పారు. దీంతో కిర్లంపూడిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మంగళవారం సాయంత్రం తన వాహనంలో అవసరమైన సరంజామాతో రావులపాలెం బయలుదేరేందుకు ముద్రగడ సిద్ధమయ్యారు. ఆయనతో పాటు కాపు నేతలు పలువురున్నారు. ఇంటి ఆవరణలోని ప్రధాన ద్వారం దాటేందుకు వచ్చిన ముద్రగడ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బయటకు వెళ్ళనివ్వరాదంటూ ప్రభుత్వం నుండి తమకాదేశాలున్నాయని, జిల్లాలో 144 సెక్షన్, 30పోలీస్ ఏక్ట్‌లు అమల్లో ఉన్నాయని, తమకు సహకరించాలంటూ పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో వందల సంఖ్యలో ముద్రగడ అభిమానులు తమ నేతకు మద్దతుగా నినాదాలు చేశారు. సుమారు నాలుగు వేల మంది పోలీసులు గ్రామాన్ని నిర్బంధించడం, బయటకు అడుగుపెట్టేందుకు అవకాశం లేకపోవడంతో ముద్రగడ తిరిగి ఇంట్లోకి వెళ్లిపోయారు. ఓ విధంగా మిమ్మల్ని నిర్బంధించలేదని చెబుతూనే ఇంట్లో నుండి బయటకు వెళ్ళకుండా కట్టడి చేయడాన్ని ఏమనాలంటూ ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు జెఎసి నేతలు దీనిపై మాట్లాడుతూ శాంతియుతంగా పాదయాత్ర సాగించేందుకు సిద్ధమైన తమ నేతను గృహ నిర్బంధం చేశారంటూ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ముద్రగడ విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో అందరూ ఆందోళనలు చేయవచ్చు కాని, కాపులు మాత్రం చేయకూడదా? అని ప్రశ్నించారు. తన జాతికి బిసి రిజర్వేషన్లు ఇవ్వడం కోసం నన్ను, నా కుటుంబాన్ని చంపివేసినా ఇబ్బంది లేదని, అంతిమంగా రిజర్వేషన్ల సాధనే తన లక్ష్యమన్నారు. గతేడాది 14రోజుల పాటు రాజమహేంద్రవరం ఆసుపత్రి అనే జైలులో తనను నిర్బంధించారని, ఇప్పుడు మళ్ళీ అదే విధంగా గృహ నిర్బంధం చేసి అణచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయండి అని సవాల్ ముద్రగడ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ గ్రామానికి చేరుకునే అన్ని గ్రామాల సరిహద్దుల్లో నిఘా ఏర్పాటుచేశారు. బుధవారం ఎట్టిపరిస్థితుల్లో ముద్రగడ పాదయాత్రకు వెళ్ళకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆయన అనుసరించే వ్యూహంపైనా అప్రమత్తంగా ఉన్నారు. అయితే గతేడాది మాదిరిగా మళ్ళీ రోజుల తరబడి పోలీసు బందోబస్తు కొనసాగించే అవకాశం ఉందని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్టు పోలీసు అధికారులు పేర్కొన్నారు. అంటే రోజుల తరబడి బందోబస్తు నిర్వహించాల్సివస్తే మరోసారి తమ శాఖకు శిరోభారం తప్పదని వ్యాఖ్యానిస్తున్నారు. తాను ఆందోళన విరమించినట్టు ముద్రగడ చెబితే తప్ప పోలీసు బలగాలు వెనక్కి వెళ్ళే అవకాశం లేదని ఓ అధికారి ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు.

నేడు కిర్లంపూడి బంద్
ప్రత్తిపాడు:గాంధేయ మార్గంలో కాపు సత్యాగ్రహ యాత్ర నిర్వహించేందుకు వెళుతున్న తమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను గృహ నిర్బంధం చేయడాన్ని నిరసిస్తూ బుధవారం కిర్లంపూడి, జగపతినగరం, చిల్లంగి గ్రామాల్లో బంద్ నిర్వహిస్తున్నట్టు వ్యాపారుల సంఘం నాయకులు కరణం పెదకాపు, మండపాక శ్రీను, పేర్ల యతిరాజు తెలిపారు. కాగా కిర్లంపూడిలో భారీ సంఖ్యలో ఉన్న పోలీసులకు బసచేయడానికి కమ్యూనిటీ హాలునుకాని, దేవాలయ ఆవరణను కాని వారు కోరినప్పటికీ గ్రామస్థులు నిరాకరిస్తున్నారు. ఇప్పటికే గ్రామంలోని అన్ని కమ్యూనిటీ హాళ్లు, దేవాలయాలు, పాఠశాలలకు తాళాలు వేశారు. పోలీసులు సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న పొలాల్లో టెంట్లు వేసుకుని గడుపుతున్నారు.
విలీన గ్రామాల్లో అవినీతిపై పోరు
-విజిలెన్స్ ఎస్పీకి వైసిపి ఫిర్యాదు

రాజమహేంద్రవరం, జనవరి 24: రాజమహేంద్రవరం విలీన గ్రామాల్లో అవినీతి, అక్రమాలపై వైసిపి పోరాట పంథాకు దిగింది. కాతేరు, ధవళేశ్వరం, రాజవోలు గ్రామాల్లో నిధుల గల్లంతుపై విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. వైసిపి నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల లక్ష్మీదుర్గేష్ మంగళవారం రాజమహేంద్రవరం తిలక్‌రోడ్డులోని విజిలెన్స్ కార్యాలయంలో ఎస్పీ రాంప్రసాద్‌ను కలిపి ఫిర్యాదు చేశారు. నిధుల దుర్వినియోగంపై ఆరాతీసి దీని వెనుక ఉన్న పెద్దలను బయటకు లాగాలని డిమాండ్ చేశారు. ప్రజలు టాక్సుల రూపంలో చెల్లించిన నిధులను, ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా విడుదల చేసిన నిధులను కొంతమంది అధికారులు, అధికార నాయకులు బొక్కేస్తున్నారని, ఈ అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విజిలెన్స్ ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. ప్రజలు, పత్రికలు గగ్గోలు పెడుతున్నా సంబంధిత అధికాలు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. కాతేరు గ్రామంలో దాదాపు రూ.1.30 కోట్లు అవినీతి జరిగిందని, అదే విధంగా పూర్తిస్థాయిలో అవినీతి జరిగిందనే విషయాన్ని ప్రజలు, పత్రికలు ఘోషిస్తున్నా పట్టించుకోవడంలేదన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కాతేరు వంటి చిన్న గ్రామంలో కేవలం ప్రజలు తమ సౌకర్యం కోసం టాక్సుల రూపంలో ఇచ్చిన నిధులను, 13, 14 ఆర్థిక సంఘం నిధులను కూడా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో కనీస వౌలిక సదుపాయాలు కూడా కరువయ్యాయన్నారు. అధికార పార్టీ రాజకీయ నాయకులు, అధికారులు 90శాతం నిధులను తినేశారని, పదిశాతం నిధులను కూడా తమ ఖాతాల్లోకి వేసేసుకున్నారని, చిన్న చిన్న అధికారులను బలిచేసి పెద్దలు తప్పించుకుంటున్నారని ఆరోపించారు. ప్రధాన రాజకీయ సూత్రదారులను బయటకు లాగాలని, నిష్పక్షపాతమైన విచారణ జరిపించి, దోషులైనవారి నుంచి రికవరీ చేయాలని వైసిపి డిమాండ్ చేస్తుందన్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పీని కలిసిన వారిలో జక్కంపూడి విజయలక్ష్మి, ఆకుల వీర్రాజు, జక్కంపూడి రాజా, నక్కా రాజబాబు, షర్మిలారెడ్డి తదితరులున్నారు.
కలవరపెడుతున్న కల్వర్టు నిర్మాణాలు

రాజమహేంద్రవరం, జనవరి 24: రాజమహేంద్రవరం నగరంలో భారీ కల్వర్టుల నిర్మాణం జరుగుతోంది. కొత్త మాస్టర్ ప్లాన్‌లో భాగంగా వీటి నిర్మాణం చేపట్టినట్టు చెబుతున్నారు. అయితే ఈ భారీ కల్వర్టులకు అనుసంధానమైన ప్రమాణాలతో డ్రెయిన్లు మాత్రం లేవని తెలుస్తోంది. ఇప్పటికే గ్రావిటీ లేక నగరంలోని డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇపుడు తాజాగా భారీస్థాయిలో కల్వర్టులు నిర్మిస్తున్నారు. వీటి ఉపయోగం ఉండాలంటే ప్రణాళికాబద్ధమైన ప్రమాణాలతో డ్రెయిన్లను కూడా సిద్ధం చేయాల్సి ఉంది. అయితే మరో వైపు ఇవే పనులను పుష్కరాల సమయంలో చేసి ఉంటే నిధులు ఆదా అయ్యే పరిస్థితి ఉండేదని తెలుస్తోంది. పుష్కరాలకు చేసిన పనులను కాదని ఇపుడు తిరిగి చేస్తున్నట్టుగా ఉంది. ప్రస్తుతం పనులు చేపట్టిన ఈ భారీ కల్వర్టుల నిర్మాణంలో గత పుష్కరాలకు వేసిన భారీ తూరలు బయటపడుతున్నాయి. ఇప్పుడు వాటిని ధ్వంసం చేసి వాటి స్థానంలో భారీ కల్వర్టులు నిర్మిస్తున్నారు. మొత్తం నాలుగు చోట్ల కారల్ మార్క్స్ రోడ్డులోని షెల్టాన్ జంక్షన్, తాడితోట మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ జంక్షన్, ఆటో కన్సల్టెన్సీ జంక్షన్, రైల్వే అండర్ టనె్నల్ జంక్షన్ వద్ద భారీ కల్వర్టులు నిర్మిస్తున్నారు. ఇంత పెద్ద కల్వర్టులు నిర్మించే దశలో దానికి అనుసంధానంగా మాత్రం డ్రెయినేజీలు లేవని, చిన్నగా ఉండటం వల్ల గ్రావిటీ ద్వారా మురుగునీరు పారే పరిస్థితి ఉండదని అంటున్నారు. ఇప్పటికే గ్రావిటీ లేకపోవడం వల్ల పెద్ద డ్రెయిన్లు ఉన్నప్పటికీ నీరు ఎక్కడికక్కడ స్తంభించిపోయి చెత్తాచెదారం పేరుకుపోయి ఉన్నాయి. ఈ స్థితిలో ఉన్న డ్రెయిన్ల వల్ల వర్షాకాలంలో చిన్నపాటి వర్షానికే డ్రెయిన్లు పొంగి మురుగునీరంతా రోడ్లపైకి వచ్చి దుర్గంధభరితంగా మారిన దుస్థితి ఎదురవుతోంది.
ఇదిలావుండగా ఇప్పుడు నగరంలో నిర్మించే భారీ డ్రెయిన్లు మూడు నెలల్లో పూర్తిచేస్తామని చెబుతున్నారు. కానీ దాదాపు ఆరు నెలల వరకు పట్టవచ్చని తెలుస్తోంది. ట్రాఫిక్‌కు ఎంతో కీలకమైన ఈ రోడ్డులో జరుగుతున్న పనులు నిర్దేశిత కాలంలో పూర్తిచేయాలంటే శాఖల మధ్య సమన్వయం చాలా అవసరం. ఇటు టెలికాం, అటు నగరపాలక సంస్థ, ట్రాన్స్‌కో, ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రధానంగా సమన్వయం చేసుకోవాల్సి ఉంది. ఎక్కడా అటువంటి సమన్వయం కన్పించడం లేదు.
ఏదేమైనప్పటికీ నెలల తరబడి వీటి నిర్మాణంతో స్థానిక ట్రాఫిక్‌కు ఇబ్బందులు తప్పేట్టు లేదు. ఈ కల్వర్టుల నిర్మాణం అనంతరం కొత్తగా రోడ్లు వేయాల్సి ఉంది. ఏడాదిన్నర తిరగకుండానే పనులపై పనులన్నట్టుగా తయారైంది.
ఎక్కడివారక్కడే గృహ నిర్బంధం

అమలాపురం, జనవరి 24: కాపు రిజర్వేషన్ సాధనలో భాగంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బుధవారం రావులపాలెం నుండి జరప తలపెట్టిన సత్యాగ్రహ పాదయాత్ర నేపథ్యంలో ఎదురయ్యే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పోలీసులు సమాయాత్తమయ్యారు. సోమవారం అర్ధరాత్రి నుండే కాపు ఉద్యమ నేతల ఇళ్ల వద్ద భారీగా పోలీసులను మోహరింపజేశారు. ఇప్పటికే సెక్షన్ 30, 144 సెక్షన్‌లను విధించి మైకుల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏలూరు రేంజి డిఐజి పివిఎస్ రామకృష్ణ ఇక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కోనసీమలో చీమ చిటుక్కుమంటే చాలు అక్కడకు వందల సంఖ్యలో పోలీసులు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేలా పక్కా ఏర్పాట్లు చేశారు. ఉద్యమకారుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మఫ్టీ పోలీసులతో నిరంతర నిఘా కొనసాగుతోంది. డిఐజి రామకృష్ణ ఆధ్వర్యంలో నలుగురు అడిషనల్ ఎస్పీలు, 25 మంది డిఎస్పీలు, 30 మంది సిఐలు, 150 మంది ఎస్సైలతోపాటు సుమారు 3వేల మందికి పైగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, సిఆర్‌పిఎఫ్, వాటర్ కేన్స్ వాహనాలు, అత్యాధునిక ఆయుధాలు ఉన్న వాహనాలతో కోనసీమలోని ప్రధాన మండలాల్లో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. కాపు ఉద్యమ నాయకులైన నల్లా విష్ణుమూర్తి, నల్లా పవన్, కల్వకొలను తాతాజీలను గృహ నిర్బంధాల్లో ఉంచి వారి ఇళ్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. అలాగే ముమ్మిడివరం, కాట్రేనికోన, డి గన్నవరం, రావులపాలెం, కొత్తపేట, అయినవిల్లి, మలికిపురం, రాజోలు మండలాల్లోని కాపు ఉద్యమ నాయకుల ఇళ్ల వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు.
పోలీసులతో పవన్ వాగ్వాదం
కాపు రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బుధవారం రావులపాలెం నుండి నిర్వహించనున్న పాదయాత్రలో పాల్గొనేందుకు మంగళవారం ఇంటి నుండి బయలు దేరుతున్న రాష్ట్ర కాపు జెఎసి కో-కన్వీనర్ నల్లా పవన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పవన్‌కు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై రాష్ట్ర కాపు రిజర్వేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తామేమీ ఉగ్రవాదులం, నక్సలైట్లము కాదని, శాంతియుతంగా ఉద్యమం చేసుకునే హక్కు లేదా అని ప్రశ్నించారు. దీంతో విషయం తెలుసుకున్న స్థానికులు వందలాదిగా నల్లా ఇంటికి చేరుకోవడంతో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అంతకుముందు నల్లా విష్ణుమూర్తి భార్య గంగాభవాని అస్వస్థతకు గురవ్వడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కూడా పోలీసులు అంగీకరించలేదని విష్ణుమూర్తి ఆరోపించారు. దీంతో మరో మహిళను సాయంగా ఇచ్చి ఆసుపత్రికి పంపించామని విష్ణుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. కాపుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు బ్రిటీషు ప్రభుత్వాన్ని తలపిస్తోందని నల్లా విమర్శించారు. అదేవిధంగా కాపు జెఎసి కోనసీమ కన్వీనర్ కల్వకొలను తాతాజీ ఇంటి వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోపాలపురంలో ఆకుల గృహ నిర్బంధం
రావులపాలెం: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బుధవారం ఉదయం నుండి రావులపాలెంలో కాపు సత్యాగ్రహ పాదయాత్ర చేస్తారనే ప్రకటనల నేపథ్యంలో పోలీసులు గతంలో మాదిరిగానే ముందస్తుగా కాపు జెఎసి నేతలను గృహ నిర్బంధం చేశారు. ముద్రగడ చేపట్టిన ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న కాపు జెఎసి నేత ఆకుల రామకృష్ణను మంగళవారం రావులపాలెం మండలం గోపాలపురంలోని ఆయన స్వగృహంలో గృహ నిర్బంధం చేశారు. ఉదయమే ఆయన ఇంటికి చేరుకున్న డిఎస్పీ టిఎస్ వెంకటరమణ ఆకులను ఇంటి నుండి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉద్యమాన్ని అణగదొక్కే యత్నం
సుప్రీం కోర్టు కోడిపందాలు జరగనివ్వకూడదని చేసిన ఉత్తర్వుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన రాష్ట్ర ప్రభుత్వం ముద్రగడ చేస్తున్న కాపు ఉద్యమంలో మాత్రం ఉన్న హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆకుల రామకృష్ణ ఆరోపించారు. గృహ నిర్బంధంలో ఉన్న ఆకుల విలేకర్లతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని ఉద్యమం చేస్తుంటే మొదట నుండి అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కోడిపందాలను ప్రభుత్వంలోని మంత్రులు, ప్రజా ప్రతినిధులే దగ్గరుండి ఆడించి కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టారని, అయితే హక్కుల కోసం పోరాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్న విషయాన్ని మరచి కాపు ఉద్యమంపై పోలీసులతో ప్రభుత్వం దాడి చేస్తోందన్నారు. ఇదే ధోరణి కొనసాగిస్తే ప్రభుత్వానికి నూకలు చెల్లడం ఖాయమని హెచ్చరించారు.
గన్నవరం మండలంలో...
డి గన్నవరం: కాపు సత్యాగ్రహ యాత్ర నేపథ్యంలో పి గన్నవరం మండలంలోని కాపు జెఎసి నేతలను ముందస్తుగా పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పి గన్నవరం ఎస్సై పూడి వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం..పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల కాపు జెఎసి నేతలు కొమ్మూరి మల్లిబాబు, ఉలిశెట్టి బాబిలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పోలీసు యాక్టు నిషేదాజ్ఞలు అమల్లో ఉన్నందున మండలంలో ఎటువంటి సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడానికి వీల్లేదనే పోలీసు హెచ్చరికలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సై వీరబాబు హెచ్చరించారు.
కొత్తపేట మండలంలో...
కొత్తపేట: కాపులను బిసిల్లో చేర్చాలంటూ ముద్రగడ పద్మనాభం బుధవారం నుంచి చేపట్టే కాపు సత్యాగ్రహ యాత్ర నేపథ్యంలో మంగళవారం మండలంలోని కాపు ముఖ్యనేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మండలానికి చెందిన మొత్తం అయిదుగురిని పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టులు చేశారు. వీరిలో వాడపాలెంకు చెందిన బండారు శ్రీనివాసరావు, పెదపూడి బాపిరాజు, కొత్తపేటకు చెందిన ముత్యాల వీరభద్రరావు, సలాది చిన్ని, వానపల్లికి చెందిన బండారు సత్తిరాజులు ఉన్నారు. ఉదయానే్న వారి ఇళ్లకు చేరుకున్న పోలీసులు వారిని ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా అరెస్టు చేశారు. ఇదిలావుండగా మండలంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్య కూడళ్ల వద్ద పోలీసు పికెట్‌ను ఏర్పాటుచేశారు. సాయంత్రం ప్రధాన రహదారి గుండా ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ఎస్సై డి విజయ్‌కుమార్ బందోబస్తును పర్యవేక్షించారు.
కాకినాడ రూరల్ : తూర్పులో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రావులపాలెం నుంచి చేపట్టబోయే పాదయాత్ర అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు కాపు నాయకులను ఎక్కడికక్కడ ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. కాకినాడలో కాపు జెఎసి నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, డిసిసి జిల్లా అధ్యక్షుడు పంతం నానాజీలను దాసు స్వగృహంలోనే గృహ నిర్భంధం చేశారు. సిఐలు చైతన్య కృష్ణ, ఎండి ఉమర్‌లు పోలీసులు పాదయాత్రకు వెళ్ళకుండా దాసు ఇంటి వద్ద కాపలా ఉన్నారు. ఈ సందర్భంగా దాసు నానాజీలు మాట్లాడతూ స్వేచ్ఛ లేకుండా ఇలా నిర్భందించడం సరికాదని, చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఎన్ని అడ్డంకులు ఏర్పరచినా తమ ఉద్యమం ఆగదని, రిజర్వేషన్‌ను సాధించి తీరుతామని అన్నారు.
అనుమతి లేనందునే అడ్డుకున్నాం
జగ్గంపేట, జనవరి 24: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బుధవారం నుంచి నిర్వహించాల్సిన కాపు సత్యాగ్రహ పాదయాత్రకు సంబంధించి అనుమతి కోరుతూ దరఖాస్తు చేయడంగానీ, అనుమతి పొందడంగానీ లేనందున అడ్డుకున్నట్టు జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ తెలిపారు. ముద్రగడను అడ్డుకుని అండర్ 151 సెక్షన్ కింద 24 గంటల గృహ నిర్బంధం చేసినట్టు చెప్పారు. కాపు జెఎసి అనే కాకుండా..ఎవరైనాసరే బిసి సంఘాల వారైనా మరెవరైనా పాదయాత్ర చెయ్యాలంటే ఒక దరఖాస్తు చేసుకుని కచ్చితంగా పోలీసుల అనుమతి పొందాలన్నారు. లేకపోతే వారిని అడ్డుకుని లా అండ్ ఆర్డర్‌ను అమలు చేస్తామన్నారు. ప్రస్తుతం జిల్లా, కోనసీమ వంటి ఏరియాలలో శాంతి భద్రతలు అదుపులో లేకుండా కొంత అల్లర్లు చెలరేగే పరిస్థితులు ఉండడంతో కాపునేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతులు లేకపోవడంతో అడ్డుకున్నట్టు చెప్పారు. అలాగే పాదయాత్రకు సిద్ధమవుతున్న కాపు జెఎసి నాయకులు సుమారు 15 మందిని సెక్షన్ 151 కింద అడ్డుకుని హౌస్ అరెస్టు చేసినట్టు చెప్పారు. ప్రధానంగా జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తులెవరూ రాకూడదన్నారు. ఎక్కడైనా అయిదుగురు కలిసి ఉంటే వారిని అదుపులోకి తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ రవిప్రకాష్ విజ్ఞప్తి చేశారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనన్నారు. ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించడమే పోలీసు బాధ్యత అన్నారు. ఎస్పీ వెంట ఓఎస్డీ, రంపచోడవరం అడిషనల్ ఎస్పీ నయిం అస్మిన్, డిఎస్పీలు ఎం వెంకటేశ్వరరావు, ఎస్ రాజశేఖర్, పల్లంరాజు, జగ్గంపేట సిఐ పి కాశీవిశ్వనాధం, కిర్లంపూడి ఎస్సై ఎ బాలాజీ ఉన్నారు.
చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తల సంక్షేమానికి కృషి
కాకినాడ, జనవరి 24: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తలు ఉత్పత్తి చేసిన వస్తువులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకరరావు తెలిపారు. మంగళవారం స్ధానిక పద్మనాభ ఫంక్షన్ హాలులో ఎంఎస్‌ఎంఇ ఆధ్వర్యంలో ఎక్స్‌పో రెండు రోజుల పాటు ప్రదర్శనలను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించగా ముఖ్యఅతిధిగా జూపూడి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూపూడి మాట్లాడుతూ రాష్ట్రంలోని పరిశ్రమల్లో ఉత్పత్తి చేసిన వస్తువులకు ప్రోత్సాహకరంగా మార్కెట్ సదుపాయం కల్పించి వారికి వౌళిక సదుపాయాలు కల్పించటానికి చర్యలు చేపట్టిందన్నారు. పరిశ్రమలు ఏర్పాటు ద్వారా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కల్పన చేస్తున్నామన్నారు. ఎస్సీలకు పరిశ్రమల స్థాపించేందుకు సౌకర్యాలతో కూడిన ఫ్లాట్‌లను ఇవ్వటానికి 20 శాతం ఇవ్వడానికి చర్యలు చేపట్టామన్నారు. జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ పారిశ్రామిక వేత్తలను ముందుకు తీసుకెళ్ళటానికి ప్రభుత్వం కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఇ విధానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో 19 పార్కులకు ల్యాండ్ పూలింగ్ ప్రారంభించి అందులో ఈ పారిశ్రామిక వేత్తలకు పరిశ్రమల ఏర్పాటుకు స్ధలాలను ఇవ్వనున్నామన్నారు. కడియం, జేగురుపాడులలో 50 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఇ ఏర్పాటుకు, ప్లాట్లను ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సహాకాలతో ప్రణాళిక, నాణ్యమైన వస్తువులు తయారు చేస్తే అమ్మకం దారులకు నాణ్యమైన వస్తువులు ఇస్తే ముందుకువస్తారన్నారు. తక్కువ వడ్డీకే బ్యాంకులు రుణాలిస్తున్నారని వాటితో మంచి పారిశ్రామిక వేత్తలుగా ఉండాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఒఎన్‌జిసి ఇడి అలోక్‌నందన్, ఆయిల్ ఇండియా ఇడి దీపక్ బర్మాంతి, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ ఎవి పటేల్, ఎస్‌బిఐ ఆర్‌ఎం సాయిబాబా, ఎపి ఛాంబర్ కామర్స్ అధ్యక్షుడు జి సాంబశివరావు, కోకనాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దంటు సూర్యారావు, ఎస్‌ఎంఎస్‌ఇ డైరెక్టర్ కెఆర్‌కె ప్రసాద్, ఎడి ఎవి నాయుడు, డి భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.