తూర్పుగోదావరి

26న సత్యాగ్రహ దీక్ష చేపట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, ఫిబ్రవరి 13: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బలిజ, వంటరి, తెలగ, కాపు జాతికి బిసి రిజర్వేషన్ ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇంత వరకూ అమలు చేయనందుకు నిరసనగా జాతి సోదర సోదరీమణులంతా రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ ఈ నెల 26వ తేదీ ఉదయం 10నుండి సాయంత్రం 5 గంటల వరకూ ఒక రోజు సత్యాగ్రహ దీక్ష చేయాలని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఆయన కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో విలేకర్లకు ప్రకటన కాపీలు అందజేశారు. కర్నూలు జిల్లా కేంద్రంలో జరిగే సత్యాగ్రహ దీక్షలో తాను పాల్గొంటానని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సత్యాగ్రహ దీక్ష నిరసన కార్యక్రమానికి ఇతర కుల సోదరుల నుండి మద్దతు తీసుకోవాలని ఆయన బలిజ, వంటరి, తెలగ, కాపు జాతి ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు.

ఆదివాసీలకు రక్తహీనత

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 13: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటిడిఎ) ఏర్పడి దాదాపు నాలుగు దశాబ్దాలైనా.. ఇప్పటికీ ఆదివాసీల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక మృగ్యంగానే వుంది.. ఆదివాసీలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు.. రక్తహీనత ప్రాణగండంగా మారింది.. మూడు నెలలకొకసారి కచ్చితంగా జరగాల్సిన ఐటిడిఎ పాలకవర్గ సమావేశాలు దాదాపు ఏడాదికో సంబరం అన్నట్టుగా సాగుతున్నాయి. దాదాపు ఏడాది తర్వాత ఎట్టకేలకు సుమారు ఏడాదికి నేడు ఐటిడిఎ పాలకవర్గ సమావేశం నేడు జరగనుంది. సమస్యల పరిష్కారంలో గానీ, ఆదివాసీల అభివృద్ధిపై గానీ అధికారులు, పాలకుల్లో చిత్తశుద్ధి కన్పించడం లేదు. రక్తహీనతతో శిశుమరణాలు పెరిగిపోతున్నాయి.
ఏటికేడాది పెరుగుతోన్న ఆదివాసీ జనాభాకు అనుగుణంగా ప్రణాళికాబద్ధ అభివృద్ధి కన్పించడంలేదు. 2001 జనాభా లెక్కల ప్రకారం రంపచోడవరం ఐటిడిఎ పరిధిలోని ఏడు మండలాల్లో 1,91,360 మంది గిరిజనం కాస్తా 2011 జనాభా లెక్కల ప్రకారం 2,18,380 మంది వున్నారు. 11.28 శాతం ఆదివాసీ జనాభా పెరిగింది. మన్యంలో ఇప్పటికి 60 శాతం కూడా అక్షరాస్యత శాతం పెరగలేదు. ఆరేళ్ళలోపు పిల్లలు 13589 మంది వుంటే వారిలో వారిలో దాదాపు 12 వేల మంది బడి బయటే వున్నారు. ఐటిడిఎ ఆవిర్భవించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది. ఇప్పటికే ఆదివాసీ ప్రాంతాలకు సమగ్ర మంచినీటి సరఫరా వంటి వౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో దరిచేరలేదంటే పాలకులకు ఎంత నిర్లక్ష్యమో అర్ధం చేసుకోవచ్చు. నేటికీ మంచినీటిని వేసవిలో చలమల నీటిపైనే ఆధారపడాల్సిన దుస్థితి దాపురించింది. రంపచోడవరం ఐటిడిఎ పరిధిలో 18 పిహెచ్‌సిలు, 96 సబ్ సెంటర్లు, రెండు సిహెచ్‌సిలు, రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో కలిపి మొత్తం 477 మంది వైద్యులు, సిబ్బందికి గాను ప్రస్తుతం 337 మంది మాత్రమే వున్నారు. మన్యంలో అత్యవసర వైద్యం అందక అనేక మంది మృత్యువాత పడుతున్నారు. కనీసం ప్రతి మూడు నెలలకొకసారి కచ్చితంగా పాలకవర్గ సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరించేందుకు కాస్తయినా కృషిచేయాల్సి వుందని కోరుతున్నారు. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమాలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపి మిడియం బాబూరావు ఆరోపించారు. ఇన్‌చార్జి మంత్రి రాకపోయినప్పటికీ సమావేశాలు నిర్వహించాలని, జిల్లా కలెక్టర్ ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.
అనారోగ్యంతో బాలింత మృతి
-మన్యంలో కొనసాగుతున్న మాతా శిశుమరణాలు
రాజవొమ్మంగి, ఫిబ్రవరి 13: నిన్న శిశువు, నేడు మాత మరణాల పరంపర మన్యంలో కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు మారుమూల గ్రామాలకు పరిమితమైన మరణాలు మండల కేంద్రానికి ఎగబాకాయి. రాజవొమ్మంగికి చెందిన దేశెట్టి లోవలక్ష్మి (24) అనే బాలింత అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మరణించింది. లోవలక్ష్మి నాలుగు నెలల క్రితం రెండవ కాన్పులో మగబిడ్డకు జన్మనిచ్చింది. రక్తహీనత, తీవ్ర జ్వరంతో బాధ పడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు ఆదివారం స్థానిక పిహెచ్‌సికి తీసుకురాగా వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. పరిస్థితి విషమంగా మారడంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. లోవలక్ష్మి రక్తహీనతతో బాటు గర్భకోశ వ్యాధితో బాధ పడుతోందని వైద్యులు రవిచంద్ర తెలిపారు. దీనితో ఆమెకు జన్మించిన ఇరువురు పిల్లలు తల్లిలేని పిల్లలుగా మిగిలిపోయారు. పిన్న వయస్సులోనే లోవలక్ష్మి మరణించడంతో గ్రామంలో విషాధ ఛాయలు అలముకొన్నాయి.

విలీన గ్రామాల
ప్రత్యేకాధికారిగా సబ్- కలెక్టర్
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 13: రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో విలీన గ్రామాలకు ప్రత్యేక అధికారిగా రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ విజయకృష్ణన్‌ను నియమిస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. తాత్కాలిక నియామకంగా ఈ ఉత్తర్వులు జారీకావడంతో ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టారు. సబ్ ట్రెజరీ తదితర కార్యాలయాలకు ప్రత్యేక అధికారి మార్పునకు సంబంధించిన కలెక్టర్ ఉత్తర్వులు అందాయి. ఇప్పటి వరకు విలీన గ్రామాలకు ప్రత్యేక అధికారిగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ విజయరామరాజు బాధ్యతలు నిర్వహించిన సంగతి విదితమే.

స్వచ్ఛ జిల్లా దిశగా...

కాకినాడ, ఫిబ్రవరి 13: స్వచ్ఛ్భారత్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ నినాదాలకు అనుగుణంగా స్వచ్ఛ తూర్పుగోదావరి జిల్లా సాధన దిశగా ప్రభుత్వ యంత్రాంగం పటిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. జిల్లాలోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో బహిరంగ మల విసర్జనను శాశ్వతంగా నిర్మూలించేందుకు, గ్రామాలలో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి ప్రణాళికాయుతంగా చర్యలు చేపట్టే పనిలో ఆయా శాఖల అధికారులున్నారు. చాలా గ్రామాల్లో ప్రజలకు అసలు డంపింగ్ యార్డు అనేదెలా ఉంటుందో తెలియని దుస్థితి జిల్లాలో నెలకొంది. ఇకపై ఆ పరిస్థితికి ఆస్కారం లేకుండా అన్ని గ్రామాల్లోను డంపింగ్ యార్డులను ఏర్పాటుచేయాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో 1069 గ్రామ పంచాయతీలున్నాయి. మేజర్ పంచాయతీలు, కొన్ని ముఖ్యమైన పంచాయతీలు మినహా చాలా పంచాయతీల్లో డంపింగ్ యార్డులంటూ ప్రత్యేకించి లేకపోవడంతో గ్రామ రహదారులకు ఇరువైపులా ఖాళీ స్థలాల్లో చెత్తను డంప్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విధంగా చేయడంతో ప్రజలు నిత్యం అంటురోగాల బారిన పడుతుండటం పరిపాటిగా మారింది. ఇకపై అన్ని గ్రామాల్లో నిర్దేశించిన ప్రదేశంలో యార్డులు ఏర్పాటుచేసి, చెత్తను తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటికే పలు గ్రామాల్లో డంపింగ్ యార్డులు ఏర్పాటు కాగా, వివిధ గ్రామాల్లో పనులు జరుగుతున్నాయి. జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఘన, వ్యర్థ పదార్ధాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా వర్మీ కంపోస్ట్‌ను ఉత్పత్తి చేయనున్నారు. జిల్లాలో 139 గ్రామ పంచాయతీలను బహిరంగ మలవిసర్జన గ్రామాలుగా 2016 అక్టోబర్ 2న ప్రకటించారు. ఆ స్ఫూర్తితో మరో 465 గ్రామాలను 2017 మార్చి 31వ తేదీన బహిరంగ మల విసర్జన లేని గ్రామాలుగా ప్రకటించే లక్ష్యంతో పనిచేస్తున్నారు. మిగిలిన అన్ని గ్రామాలను 2018 మార్చి 31వ తేదీన బహిరంగ మల విసర్జన లేని గ్రామాలుగా ప్రకటించి, నూరు శాతం ప్రగతి సాధనకు కృషిచేస్తున్నారు. ఇంటింటికి మరుగుదొడ్డిని నిర్మించడం ద్వారా ఇది సాధ్యమవుతుందని, అందరికీ వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించడమే స్వచ్ఛ్భారత్ లక్ష్యమని అధికారులు పేర్కొంటున్నారు.
కాగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. 40 మంది విద్యార్థులకు ఒక మరుగుదొడ్డి చొప్పున సుమారు 10 వేల మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు. స్వచ్ఛ్భారత్‌లో భాగంగా దోమల నివారణకు కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దోమల నిర్మూలనకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు, ప్రజల్లో అవగాహన కలిగించేందుకు 15,356 దోమలపై దండయాత్ర బృందాలను ఏర్పాటుచేశారు. ఇటీవలి కాలంలో జిల్లాలోని గిరిజన గ్రామాల్లో దోమలు స్వైరవిహారం చేస్తుండటంతో ఏజన్సీకి సంబంధించి 1,03,558 దోమ తెరలను పంపిణీచేశారు.

జన్మభూమి కమిటీలను రద్దు చేయాలి

అమలాపురం, ఫిబ్రవరి 13: ప్రభుత్వాలకు చెడ్డపేరు తీసుకువస్తున్న జన్మభూమి కమిటీలను తక్షణమే రద్దుచేయాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు వై మాలకొండయ్య డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక కాటన్ అతిథి గృహంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో టిడిపి ప్రభుత్వం నియమించిన జన్మభూమి కమిటీల అక్రమాలపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలు కేవలం అధికార టిడిపి కార్యకర్తలకు, అనుచరులకు లబ్ధిచేకూరేలా నిర్ణయాలు తీసుకుని, వాటిని అధికారులతో బలవంతంగా అమోద ముద్రవేయిస్తున్నారని ఆరోపించారు. జన్మభూమి కమిటీల కారణంగా స్థానికంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు, అధికారులు నిస్సహాయులుగా మారిపోయి చేష్టలుడిగి చూస్తున్నారని, ఇటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. జన్మభూమి కమిటీలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని వాటి అమలుకు అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నా ఉన్నత స్థాయిలో ఉన్న ప్రజా ప్రతినిధులు మాట్లాడకపోవడం ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీస్తోందన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో భర్తలున్న భార్యలకు వితంతు పింఛన్లు మంజూరుకు సిఫార్సు చేశారంటే ఇంతకన్నా అక్రమాలకు నిదర్శనం ఏం కావాలని మాలకొండయ్య ప్రశ్నించారు. ఇటువంటి అక్రమాలు ఒక్క పిఠాపురంలోనే జరగడంలేదని, జిల్లా అంతా జరుగుతున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలను తమ సొంత పథకాలుగా టిడిపి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి పసల్ బీమా యోజనా, బాలికా సంక్షేమం కోసం బేటీ బచావో బేటీ పడావో వంటి పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకాల్లో వారిని చేర్చితే ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆ పథకాల గురించి గ్రామ సభల్లో కనీసం ప్రస్తావించకపోవడం టిడిపి ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. బిజెపికి మిత్ర పక్షంగా కొనసాగుతున్న తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల గురించి కూడా ప్రచారం నిర్వహించవలసిన బాధ్యత ఉందన్నారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన మహిళా పార్లమెంటేరియన్ సదస్సు వేదికపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రపటాన్ని పెట్టకపోవడం విచారకరమని, ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు మాలకొండయ్య వెల్లడించారు. జిల్లాలలోని 73 మండలాల్లో బిజెపి బలోపేతానికి బూత్ కమిటీలను ఏర్పాటుచేసి పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకుంటున్నట్టు మాలకొండయ్య తెలిపారు. బిజెపి శిక్షణా తరగతుల రాష్ట్ర కన్వీనర్ వేటుకూరి సూర్యనారాయణరాజు మాట్లాడుతూ కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైను నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.630 కోట్లు కేటాయించిందని, అయితే దానికి రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.178 కోట్లు తక్షణమే విడుదల చేయాలన్నారు. ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని వేటుకూరి తెలిపారు. సమావేశంలో బిజెపి రాష్ట్ర శిక్షణా తరగతుల కన్వీనర్ వేటుకూరి సూర్యనారాయణరాజు, రాష్ట్ర కార్యదర్శి బత్తుల లక్ష్మీకుమారి, నల్లా పవన్, బసవా శివరామప్రసాద్, గాడి సత్తిబాబు, బసవా సింహాద్రి, గోకరకొండ గంగన్నస్వామి, నల్లా కరుణాకర్, కాకా బాలయ్య, అరిగెల నాని, చుండూరు నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సును ఢీకొన్న ట్యాంకరు
శంఖవరం, ఫిబ్రవరి 13: అన్నవరం సమీపంలో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సును ట్యాంకరు ఢీ కొట్టిన ప్రమాదంలో 18మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. అన్నవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తుని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తుని నుండి రాజమహేంద్రవరం వెడుతుండగా అన్నవరం సమీపంలోని ఆర్చి వద్ద గల జంక్షన్ మలుపు తిరిగి అన్నవరంలోకి ప్రవేశించే సమయంలో రాజమహేంద్రవరం నుండి విశాఖకు రసాయనాలు తరలిస్తున్న ట్యాంకరు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు అదుపుతప్పి పక్కనే గల విద్యుత్ స్తంభాన్ని ఢీకొని నిలిచిపోయింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 18మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ట్యాంకరు బస్సును ఢీకొట్టి రోడ్డుపై తిరగబడింది దీనితో అందులో గల రసాయనమంతా నేలపాలై ఆప్రాంతమంతా విస్తరించడంతో ఆ వాసన భరించలేనిదిగా మారింది. సమాచారమందుకున్న ప్రత్తిపాడు సిఐ శ్రీనివాసరావు సిబ్బందితో చేరుకోగా, తుని ఆర్టీసి డిపోకు చెందిన అధికారులు ఘటన ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్స్, ఆర్టీసీ బస్సుల ద్వారా తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. తుని అగ్నిమాపక కేంద్రం సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని రోడ్డుపై పడిన కెమికల్‌ను శుభ్రం చేసినప్పటికీ దుర్గంధం వెదజల్లుతూనే ఉంది. ఇది సుమారు ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర వ్యాపించి ప్రజలకు ఇబ్బంది కలుగజేసింది. అన్నవరం ఎఎస్సై పివిఎస్‌ఎన్ మూర్తి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
తుని ఆసుపత్రిలో...
తుని: అన్నవరం సమీపంలో జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ను ట్యాంకరు ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన 18 మందికి తుని ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించారు. వీరిలో ఇద్దరు ప్రయాణీకులకు మెరుగైన వైద్యం కోసం కాకినాడ జిజిహెచ్‌కు తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి వెయ్యి రూపాయలు, స్వల్ప గాయాలైన వారికి రూ.500 చెల్లించినట్లు డిపో మేనేజర్ సీతారామకృష్ణ తెలిపారు. కాకినాడ డిపో మేనేజర్ సుధాకర్, చీఫ్ ఇన్‌స్పెక్టర్ చెల్లరావు తదితరులు బాధితులను పరామర్శించారు. ఆర్టీసీ బస్సు డ్రైవరు అప్రమత్తంగా వ్యవహరించడం వలన ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు

విద్యతోనే అభివృద్ధి సాధ్యం
-రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల
-యనమల ఫౌండేషన్ ఉపకార వేతనాలు పంపిణీ
తొండంగి, ఫిబ్రవరి 13: విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, పేదరిక నిర్మూలనకు విద్య అవసరమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సోమవారం మండల పరిధిలోని ఎవి నగరం గ్రామంలో యనమల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి యనమల మాట్లాడుతూ విద్య ద్వారా పేదరిక నిర్మూలన జరగాలనే ఆశయంతో యనమల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. తుని నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో గతంలో వౌలిక సదుపాయాలు అందేవి కావని, అయితే టిడిపి అధికారం చేపట్టిన నాటి నుండి విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తోందన్నారు. ఎవి నగరం ఎలిమెంటరీ స్కూలుకు తొమ్మిదో తరగతి మంజూరైందని, వచ్చే సంవత్సరం పదో తరగతి కూడ ప్రారంభిస్తామన్నారు. తుని నియోజకవర్గంలో 101 మంది ప్రతిభ కల పేద విద్యార్థులకు టెన్త్‌లో ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలు అందిస్తున్నామన్నారు. ఈ విద్యార్థులకు కళాశాలలో హాజరు ఆధారంగా ఆరు నెలల తరువాత ఉపకార వేతనాలు పొడిగిస్తామన్నారు. యనమల ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు, క్రీడా పోటీలు ఇతర సేవా కార్యక్రమాలు అమలుచేస్తున్నట్టు యనమల తెలిపారు. అనంతరం ఎవి నగరం సరస్వతీ దేవాలయం వద్ద సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం బ్రాంచి కెనాల్ నీటి యాజమాన్య సంఘం అధ్యక్షుడు యనమల నాగేశ్వరరావు, యనమల ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు యనమల శివరామకృష్ణుడు, తాండవ సుగర్స్ చైర్మన్ ఎస్ లోవరాజు, ఇన్‌చార్జి డిఇఒ అబ్రహాం తదితరులు పాల్గొన్నారు.
ఖనిజ సంపదను దోచుకుంటున్న అధికార పార్టీ నాయకులు
చింతూరు, ఫిబ్రవరి 13: గిరిజన చట్టాలను అధికార పార్టీ తుంగలో తొక్కి ఏజన్సీలోని విలువైన ఖనిజ సంపదను దోచుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కె సుధాకరబాబు విమర్శించారు. సోమవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖనిజ సంపదను దోచుకునేందుకు ప్రభుత్వం జారీ చేసిన 97 జిఒను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజన పక్షపాతినని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గిరిజనుల సంపదను కొల్లగొట్టడమేమిటని ప్రశ్నించారు. చట్టాలను పక్కన పెట్టి బినామీలకు మైనింగ్ కట్టబెట్టి అధికార పార్టీ నాయకులు కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కృష్ణ చైతన్యరెడ్డి మాట్లాడుతూ రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పిసిసి కార్యదర్శి లూథర్ మార్టిన్, మండల అధ్యక్షుడు ఎండి హబీబ్, సర్పంచులు శ్రీనివాస్, దారయ్య తదితరులు పాల్గొన్నారు.
మార్చి నెలాఖరులోగా బిపిఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలి
మండపేట, ఫిబ్రవరి 13: బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం ద్వారా అనధికార భవనాల క్రమబద్ధీకరణకు మార్చి నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలని రాజమహేంద్రవరం రీజియన్ టౌన్ ప్లానింగ్ రీజినల్ డైరెక్టర్ పి సాయిబాబా సూచించారు. సోమవారం మండపేటలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో బిపిఎస్ కోసం 6690 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీటిలో 4541 మందికి క్రమబద్ధీకరణ చేశామన్నారు. మిగిలిన వారు మార్చి 31లోగా క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు. ఇంటి నిర్మాణం ప్లాన్ కోసం లైసెన్స్ సర్వేయరు ద్వారా ఆన్‌లైను చేసుకుంటే అనుమతి లభిస్తుందన్నారు. ప్లానులో సూచించిన ప్రకారం కాకుండా నిబంధనలు అతిక్రమించే నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో తొలిసారిగా ఆన్‌లైను విధానం అమలు చేస్తున్నట్టు ఆర్డీ సాయిబాబా చెప్పారు. కార్యక్రమంలో టిపిఒ వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

దళారులపై విచారణ చేపట్టాలి
కొత్తపేట, ఫిబ్రవరి 13: రైతులు, ప్రజలను దోపిడీ చేస్తున్న మిల్లర్లు దళారులపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ కమిటీ ద్వారా విచారణ చేసి చర్యలు చేపట్టాలని బిజెపి జాతీయ నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తపేటలో సోమవారం రాష్ట్ర బిజెపి కిసాన్ మోర్చా నాయకుడు పాలూరి సత్యానందం స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిల్లర్లపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడం వల్ల రాష్ట్రంలో వారి ఇష్టారాజ్యం సాగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు దాన్యాన్ని కొనుగోలు చేస్తే మామూలు రకం ధాన్యం కేజీ రూ.25లకే విక్రయించవచ్చునని, కానీ రూ.35లకు అమ్ముతున్నారని అన్నారు. అలాగే సన్న రకం ధాన్యం మార్కెట్లో రూ.35లకు విక్రయించాల్సి ఉండగా, దానిని రూ.55లకు అమ్ముతున్నారని పేర్కొన్నారు. దీనివల్ల ఇటు రైతులకు, అటు ప్రజలకు నష్టమేనని.. అలాగే ప్రభుత్వానికి కూడా మిల్లర్ల నుంచి లాభం రావడం లేదన్నారు. అలాగే కంది పప్పును రైతుల వద్దనుంచి రూ.5,500లకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం చెప్పినా, రూ.4,500లకు మాత్రమే రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేస్తే కేజీ రూ.75లకు మార్కెట్లో విక్రయించవచ్చునని, కానీ వంద రూపాయలకు పైబడి అమ్మతున్నారని పేర్కొన్నారు. మిల్లర్లు అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యాన్ని రాష్ట్రానికి విజిలెన్స్ కళ్లుకప్పి తీసుకు వస్తున్నారని, అసలు రాష్ట్రంలో ఎంత పంట పండుతోంది.. ఎంత విదేశాలకు ఎగుమతి అవుతోంది అనే విషయాలపై మానిటరింగ్ లేకపోవడం వల్ల మిల్లర్లు దళారులు బాగుపడుతున్నారన్నారు. దీంతో వారు భూములు, బంగారాన్ని కొనుగోలు చేయటం వల్ల వీటి ధరలు పెరిగిపోతున్నాయని సోము ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభత్వం కూడా ప్రస్తుతం మెట్ట ప్రాంతాల్లో కొనుగోలును ఆపేసిందని, దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం కలుగుతోందన్నారు. పంటలకు సంబంధించి ఉత్పత్తులు ఎంతకు కొనుగోలు చేస్తున్నారు.. ఎంతకు అమ్మకాలు చేస్తున్నారు అనే విషయాలపై ఎటువంటి అధ్యయనాలు రాష్ట్ర ప్రభుత్వం చేయటం లేదన్నారు. జిల్లాలో మార్కెట్ యార్డులు ఉన్నా అవి రైతులకు ఏ మేర ఉపయోగమో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. అధికారుల మొద్దు నిద్ర కారణంగా దళారీ వ్యవస్థ పెరిగిపోయి రేట్లు పెరిగిపోతున్నాయన్నారు. దీనిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనా, అధికార్ల పైనా ఉందన్నారు. ఐసిడిఎస్ ద్వారా గర్భిణులకు ఇచ్చే కోడిగుడ్లలో కూడా అవినీతి జరుగుతోందని, దీని వల్ల గర్భిణులు సుఖప్రసవాలకు నోచుకోని పరిస్థితి ఉందని సోము ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నిటి వల్లా రాష్ట్రంలో ఏటా పదివేల కోట్ల మేర అవినీతి జరుగుతోందని సోము తెలిపారు. మిల్లర్లపై చర్యల విషయంలో కొందరు అధికార్లను నిలదీస్తే ఎమ్మెల్యేలే మిల్లర్లు కావడం వల్ల వారిపై ఏం చర్యలు తీసుకుంటామని ప్రశ్నిస్తున్నారని సోము తెలిపారు.
సెంటిమెంట్ కోసం నేతల ప్రయత్నాలు
రాష్ట్రంలో ఏమి జరుగుతోంది అనే దానికంటే ఏం చేస్తే ప్రజలు సెంటిమెంట్‌కు గురవుతారు అనే ప్రయత్నాలతో రాజకీయ పార్టీలు ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని సోము వీర్రాజు విమర్శించారు. దేశ ప్రజలంతా ఒక్కటేనని, ఇందులో ఉత్తర, దక్షిణ అనే తేడాలు ఏమీలేవని పరోక్షంగా పవన్ చేస్తున్న విమర్శలపై ఆయన కౌంటర్ ఇచ్చారు. వౌలికమైన విషయాలపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో రాయలసీమ నేతలే ఎక్కువగా ముఖ్యమంత్రి అవుతున్నారని, దీనిపై మిగిలిన ప్రాంతాల వారు ఆందోళన చేయాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో వారికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. తమిళనాడు విషయంలో గవర్నర్ సరైన నిర్ణయం తీసుకుంటారని సోము తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా బిజెపి అధ్యక్షుడు ఎలిమినేటి మాలకొండయ్య, మాజీ జిల్లా అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు, పాలూరి సత్యానందం, పాలాటి మాధవస్వామి, నేమాని రామకృష్ణ, నల్లా శ్రీరామ్‌ప్రసాద్, కోటిపల్లి దామోదర్, పాలూరి జయప్రకాష్‌తదితరులు పాల్గొన్నారు.