తూర్పుగోదావరి

ఎఫ్‌ఎఫ్‌సి బృందాలచే ఇంజనీరింగ్ కళాశాలల తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 15: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ (ఎఫ్‌ఎఫ్‌సి)లచే అన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో వివిధ అంశాలపై విస్తృత రీతిలో తనిఖీలు చేపట్టనున్నట్టు జెఎన్‌టియుకె విసి ఆచార్య విఎస్‌ఎస్ కుమార్ చెప్పారు. జిల్లా కేంద్రం కాకినాడలోని జెఎన్‌టియుకె అల్యూమినీ ఆడిటోరియంలో ఎఫ్‌ఎఫ్‌సి తనిఖీలపై ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలతో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో విసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్‌ఎఫ్‌సి కమిటీల నివేదికల ఆధారంగానే ఆయా కళాశాలల్లో ఇంజనీరింగ్ ప్రవేశాలను నిర్ణయిస్తామన్నారు. యుజిసి నిబంధనల ప్రకారం 60 మంది విద్యార్థులు కలిగిన ఒక సెక్షన్‌కు ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఒక పిహెచ్‌డి అధ్యాపకులు ఫ్యాకల్టీలుగా ఉండాలన్నారు. ఈ విధానాన్ని అన్ని కళాశాలల యాజమాన్యాలు విధిగా పాటించాలని, లేని పక్షంలో విశ్వ విద్యాలయం తగు చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు సరిపడే అధ్యాపకులు ఉండాలని స్పష్టం చేశారు. కళాశాలల్లో విద్యార్థులకు నిర్వహించే ఇంటర్నల్ పరీక్షల్లో ఏ విధమైన అవకతవకలకు ఆస్కారం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గత మూడు సంవత్సరాల ఫారం-16ను గడువులోగా విశ్వ విద్యాలయానికి సమర్పించాలని సూచించారు. విద్యార్థులు, సిబ్బంది హాజరును ఎప్పటికపుడు విధిగా నమోదు చేయాలన్నారు. విశ్వ విద్యాలయానికి ఫీజులను ఆన్‌లైన్‌లోనే చెల్లించాలని వీసీ స్పష్టం చేశారు. ఇంకా వివిధ అంశాలపై కళాశాలల యాజమాన్య ప్రతినిధులు, ప్రిన్సిపాల్స్ అడిగిన సందేహాలను వీసీ నివృత్తి చేశారు. సమావేశంలో వర్సిటీ డైరెక్టర్ అకడమిక్ ప్లానింగ్ ప్రొఫెసర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి బయోమెట్రిక్ విధానాన్ని కళాశాలలు కచ్చితంగా పాటించాలన్నారు. అన్ని కళాశాలల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయా క్యాంపస్‌లలో ర్యాగింగ్‌కు ఏ విధమైన ఆస్కారం లేకుండా చూడాలని, ఎక్కడైనా ర్యాగింగ్‌కు పాల్పడి విద్యార్థులుంటే వారిని కఠినంగా శిక్షించాలని సూచించారు. ఇందుకు ప్రతివొక్కరు బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. సమావేశంలో విశ్వ విద్యాలయం డైరెక్టర్లు, అధికారులు, వివిధ జిల్లాలకు చెందిన కళాశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.

రవాణాశాఖ సమన్వయంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నిరోధం
ఎక్సైజ్ సూపరింటెండెంట్ సూర్జిత్‌సింగ్
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 15: రవాణాశాఖ సమన్వయంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నిరోధానికి కృషిచేస్తామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్ సూర్జిత్‌సింగ్ తెలియజేశారు. శనివారం సూపరింటెండెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మద్యవ్యసనపరుల కౌన్సిలింగ్ సెంటర్‌ను రవాణాశాఖ ఇన్‌చార్జి డిప్యుటీ కమిషనర్ సిరి ఆనంద్ సందర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రంకన్‌డ్రైవ్ కేసుల నిరోధానికి రవాణాశాఖ ప్రత్యేకశ్రద్ధవహిస్తుందన్నారు. ఇకపై మద్యం సేవించి వాహనాలను నడిపేవారికి జరిమానా విధించడం కాక ప్రాషిక్యూషన్ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. గత ఏడాది మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై 85కేసులు నమోదు చేశామన్నారు. సైకాలజిస్టు, కౌన్సిలర్ డాక్టర్ కె కార్తీక్ మాట్లాడుతూ ఎక్సైజ్ కౌన్సిలింగ్ సెంటర్‌ను సందర్శించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని, ఇప్పటి వరకు 43 మంది మద్యవ్యసనపరులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు చెప్పారు. మద్యం తాగేవారిలో మానాలన్న చిత్తశుద్ధి ఉంటే వారిని మద్యం మహమ్మారిని నుంచి కాపాడవచ్చన్నారు. రోజుకూలీలు, హోటల్ కార్మికులు, టైలర్లు, ఎలక్ట్రీషియన్లు, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో పనిచేసే వారే ఎక్కువగా మద్యానికి బానిసవుతున్నారని వివరించారు. సూర్జిత్‌సింగ్ మాట్లాడుతూ మద్యానికి బానిసైన వారికి వైద్యుల సిఫార్సు మేరకు మందులు అందజేస్తామన్నారు.
పెండింగ్‌లో 10లక్షల కేసులు
సత్వర పరిష్కారానికి కృషిచేయాలి: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేష్‌రంగనాథన్
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 15: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 10లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని హైకోర్టు ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్‌రంగనాథన్ వెల్లడించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు సమన్వయంతో పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషిచేయాలని కోరారు. శనివారం రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్‌లో జరిగిన న్యాయవాదుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రఖ్యాతి చెందిన రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ నుంచి వచ్చిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, కోకా సుబ్బారావు వంటి ఎంతో మంది ప్రముఖ న్యాయవాదులు, న్యాయమూర్తులు సేవలందించారని కొనియాడారు. ఈసందర్భంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు అందజేసిన వినతిపత్రాన్ని పరిశీలించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయస్థానాలకు సంబంధించిన సమస్యలను తన దృష్టికి తీసుకుని వస్తే వాటి పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు రూపొందించిన బార్ అసోసియేషన్ చరిత్రను తెలియజేసే సావనీర్‌ను ప్రధాన న్యాయమూర్తికి అందజేశారు. ఈసందర్భంగా న్యాయమూర్తి బార్ అసోసియేషన్‌ను, లైబ్రరీని పరిశీలించారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి తుకారామ్‌జీ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి రాంబాబు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు పిఆర్‌ఎస్ మిత్రా, సీనియర్ న్యాయవాదులు మామిడన్న శేషగిరిరావు, నండూరి సూర్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
వన్యప్రాణుల సంరక్షణకు నీటి గుంటలు ఏర్పాటు
ఫారెస్టు చీఫ్ కన్సర్వేటర్ రవికుమారఇ
రాజవొమ్మంగి, ఏప్రిల్ 15: ఈ ఏడాది అధిక ఉష్టోగ్రత, ఎండల దృష్ట్యా అడవుల్లో వన్యప్రాణుల సంరక్షణకై నీటి కుంటలు ఏర్పాటు చేస్తున్నామని ప్రధాన అటవీ సంరక్షణాధికారి (చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టు) కె రవికుమార్ అన్నారు. రాజవొమ్మంగి మండలం సింగంపల్లి అటవీ ప్రాంతంలో పెంచుతున్న టేకుప్లాంటేషన్‌ను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తన పరిధిలో ఉన్న కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా అటవీ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. వన్యప్రాణులు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఒకొక్క రేంజి పరిధిలో 50 గుంటలను ఏర్పాటు చేస్తున్నామని, అగ్ని కీలలనుండి అడవులను కాపాడేందుకు సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోడంతో తాత్కాలికంగా 400 మంది సిబ్బందిని నియమించి అటవీ రక్షణ, సంరక్షణ పనులు చేపడుతున్నామన్నారు. వచ్చే వర్షాకాలంలో 1100 హెక్టార్లలో రూ. 11కోట్లతో టేకు, వేప, నేరేడు, కుంకుడు చెట్లను పెంచేందుకు ప్రణాక రూపొందించామని, ఇందు నిమిత్తం వివిధ ప్రాంతాల్లో నర్సరీల్లో 3కోట్ల మొక్కల్ని పెంచుతున్నామన్నారు. 600 పాఠశాలలతోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలను సరఫరా చేస్తామన్నారు. గత ఏడాది మూడు కోట్ల మొక్కలను పంపిణీ చేయగా వీటిలో కోటి 25లక్షల మొక్కల్ని జియోట్యాగింగ్ ద్వారా గుర్తించడం జరిగిందన్నారు. మూడు జిల్లాలో 10కోట్ల రూపాయల కాంపా నిధులతో అటవీ సంరక్షణ పనులు చేపడుతున్నామన్నారు. స్థానిక రేంజీ కార్యాలయంలో రికార్డులను, కోనలోవ, ఉర్లాకులపాడు గ్రామాల్లో అటవీ శాఖ నర్సరీలను ఆయన పరిశీలించారు. రేంజి అధికారి శివకుమార్, సిబ్బంది రవికుమార్ వెంట ఉన్నారు.
రామచంద్రపురం మున్సిపల్ ఛైర్మన్‌గా గోపాల్‌బాబు
రామచంద్రపురం, ఏప్రిల్ 15: రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ధేశించిన మేరకు శనివారం ఉదయం స్థానిక శ్రీరాజా కాకర్లపూడి రాజగోపాల నరసరాజు మున్సిపల్ భవనంలోని డాక్టర్ చెలికాని రామారావు మున్సిపల్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ నేతృత్వంలో నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్షర క్రమంలో నిర్వహించిన కౌన్సిలర్ల పదవీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో తొలుత యువ కౌన్సిలర్ కొండపల్లి విశ్వతేజ (21వ వార్డు), దంగేటి గౌరీశంకర్ (25వ వార్డు), అనంతరం శ్రీరాజా కాకర్లపూడి రాజగోపాల నరసరాజు (గోపాల్ బాబు) (22వ వార్డు)లు ప్రమాణ స్వీకారం చేశారు. తదనంతరం ఛైర్‌పర్సన్ ఎన్నికకు నామినేషన్లను జెసి సత్యనారాయణ ఆహ్వానించారు. పార్టీ తరపున జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి జారీచేసిన ఎబి ఫారాలను జెసికి కౌన్సిలర్లు అందించారు. తమ అభ్యర్థిగా శ్రీరాజా కాకర్లపూడి రాజగోపాల నరసరాజు (గోపాల్ బాబు)ను ప్రతిపాదిస్తున్నట్లు 7వ వార్డు కౌన్సిలర్ గంపల మల్లికార్జునరావు ప్రతిపాదించగా, 12వ వార్డు కౌన్సిలర్ పత్తిగుళ్ల లక్ష్మీశైలజ బలపరిచారు. మరేదైనా ప్రతిపాదనలు ఉన్నాయా?.. అని ఎన్నికల అధికారి, జెసి సత్యనారాయణ ప్రశ్నించిన సమయంలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఎక్స్ అఫిషియో సభ్యుని హోదాలో మాట్లాడుతూ అత్యధిక మెజార్టీ కలిగిన మున్సిపల్ కౌన్సిల్‌లో తమ అభ్యర్థి గోపాల్ బాబేనని స్పష్టం చేశారు. ఈ దశలో మరో అభ్యర్థికి సంబంధించి ఎటువంటి నామినేషన్ రానందున గోపాల్ బాబును ఛైర్‌పర్సన్‌గా ఎంపికజేసినట్లు ఆయన ప్రకటించారు. ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సమక్షంలో ఎన్నిక పత్రాన్ని గోపాల్‌బాబుకు జెసి సత్యనారాయణ అందించారు. ఈ సందర్భంగా కౌన్సిల్ హాలులో ఇటీవల నూతనంగా ఎన్నికైన ముగ్గురు కౌన్సిలర్లను ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పూలమాలలువేసి అభినందించారు. టిడిపి కౌన్సిలర్లు, కో-ఆప్టెడ్ కౌన్సిలర్లతోపాటు అభివృద్ధికి ఆకర్షితులై టిడిపిలో చేరిన వైసిపి కౌన్సిలర్లు సూరంపూడి మంగ, ఆకుమర్తి చినవెంకాయమ్మ ఈ ఎన్నిక సమావేశానికి హాజరయ్యారు.
వైసిపి కౌన్సిలర్లు డుమ్మా..
పురపాలక ఉప ఎన్నికలలో ఆయా వార్డుల ప్రజానీకం వైసిపి అభ్యర్థులకు మద్దతు నిరాకరించి, టిడిపి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించిన నేపథ్యంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నిక సమావేశానికి వైసిపి కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. వారి సీట్లు ఖాళీగా ఉండటంతో కార్యకర్తలతో పాటు పలువురు టిడిపి కౌన్సిలర్లు ముఖం చెల్లక సమావేశానికి రాకుండా పలాయనం చిత్తగించారని వ్యాఖ్యానించడం కొసమెరుపు.