తూర్పుగోదావరి

అభివృద్ధిని ప్రజలకు వివరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఏప్రిల్ 21: ప్రభుత్వం చేపట్టే ప్రతీ అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేసే బాధ్యత అధికారులపైనే ఉందని జిల్లా కలెక్టర్ కార్తీకేయ మిశ్రా స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శుక్రవారం తొలిసారిగా అమలాపురం విచ్చేసి స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నీరు-చెట్టు, ఉపాధిహామీ పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు-చెట్టు పథకం కింద చేపట్టే పనులపై గ్రామస్థాయిలో ప్రజలందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాస్థాయిలో 30 కోట్ల రూపాయలతో నీరు-చెట్టు పనులకు మంజూరు కాగా, అమలాపురం డివిజన్‌కు 18కోట్లరూపాయలు మంజూరు అయ్యాయన్నారు. ఇందులో 14కోట్లతో 168 పనులు చేపట్టవలసి ఉండగా 4కోట్లతో హెడ్‌వర్క్స్ పనులు నిర్వహించాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. 168 పనులకు సంబంధించి గ్రామసభలు ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. నీరు- చెట్టు పథకంలో అమలాపురం క్లష్టర్‌లో 159 ఫారం పాండ్స్ మంజూరుకాగా వాటిలో 73 ప్రగతి దశలో ఉన్నాయని, 2 పూర్తయ్యాయని డ్వామా పిడి నాగేశ్వరావుకు కలెక్టర్‌కు తెలియజేసారు. అమలాపురం క్టస్టర్‌లో అయినవిల్లి, అమలాపురం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, ఐ పోలవరం మండలాలు ఉన్నాయన్నారు. వచ్చే వారం నుండి గ్రామాల్లో నీరు- చెట్టు పథకంలో నిర్వహించే పనులపై ప్రజలతో తాను ముఖాముఖి నిర్వహిస్తానన్నారు. ఈ పనులపై ప్రజలకు పూర్తి అవగాహన కల్గి ఉండేలా వారిని చైతన్యపరచాల్సిన బాధ్యత సంబందిత అధికారులదేనని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతీ పనికి సంబంధించిన ఫొటోలు ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నీరు- చెట్టు పథకంలో 31చెరువులు, 706 ఫీల్డు ఛానల్స్ ప్రగతి దశలో ఉన్నాయని డ్వామా పిడి తెలిపారు. వీటన్నింటినీ సత్వరమే పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా డివిజన్ మంజూరైన సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంటు వివరాలను డ్వామా పిడిని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు అమలాపురం చేరుకున్న కలెక్టర్ మిశ్రాకు ఆర్డీవో జి గణేష్‌కుమార్, కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్‌ఇడి రాంబాబు, డ్రెయిన్ ఇఇ నాగేశ్వరావు, ఇరిగేషన్ ఇఇ కృష్ణారావు, వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపిడిఒలు, ఉపాధిహామీ ఎపిఒలు తదితరులు పాల్గొన్నారు.
ఉదయం ఉక్కపోత - సాయంత్రం ఉరుములు
జిల్లాలో విచిత్ర వాతావరణం

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 21: జిల్లాలో వాతావరణం చాలా చిత్రంగా మారింది..రోజంతా భానుడు భగ భగ మంటుంటే..సాయంత్రానికి పెళ పెళ ఉరుములతో వాతావరణం ఒక్క సారిగా చల్లబడుతోంది..శుక్రవారం తూర్పు గోదావరి జిల్లాలో ఇదే పరిస్థితి చోటు చేసుకుంది..జిల్లాలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన చినుకులు పడ్డాయి..ఈదురు గాలుల కారణంగా కొద్ది సేపు విద్యుత్ సరఫరా నిలుపుదల చేసిన సందర్భాలు చోటు చేసుకున్నాయి. భారీ శబ్ధాలతో కూడిన వాతావరణం మెరుపులతో ఒక్క సారిగా వర్షం కురిసింది.
ఇదిలా వుండగా వేసవి ప్రతాపం పెరిగిపోయింది. భానుడు భగభగలతో గాలిలో తేమను హరించడంతో వేడిగాలుల వాతావరణం జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చెమటలు పట్టే వాతావరణం అలుముకోవడంతో జనంలో ఎండ వేడిమి వల్ల నిస్సత్తువ ఆవరిస్తోంది. ఇటువంటి వాతావరణంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎండ సమయంలో బయట వాహనాల్లో తిరిగే సమయంలో బార్లీ గానీ, మంచినీరు, పల్చని మజ్జిగ గానీ బాటిళ్ళు దగ్గర వుంచుకోవాలని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి ప్రధాన వైద్యులు రమేష్ కిషోర్ తెలియజేశారు. గాలిలో తేమ శాతం 12 శాతానికి పడిపోయిన క్రమంలో పెదాలు ఆరిపోయి నోరు పిడచకట్టుకుపోయే పరిస్థితి ఎదురవుతుందని, ఈ నేపధ్యంలో తరచు మంచినీళ్లు సేవించాల్సివుందని వైద్యులు తెలియజేస్తున్నారు. రాజమహేంద్రవరంలో శుక్రవారం 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 27 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం పదకొండు గంటల నుంచే ఎండ తీవ్రత అధికమై సాయంత్రం నాలుగు గంటల వరకు అధిక ఉష్ణోగ్రత కొనసాగుతోంది. ఆపై ఉష్ణోగ్రత క్రమేణా తగ్గినప్పటికీ వాతావరణంలో ఉక్కపోత అధికంగా వుండటంతో జనం ఆపసోపాలు పడుతున్న పరిస్థితి. ఎండ వేడిమి తాళలేక జనం మధ్యాహ్నం సమయంలో రోడ్లపైకి వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. మరో పది రోజుల పాటు ఉష్ణోగ్రతలు అధికంగా వుంటాయని వాతావరణ శాఖ తెలియజేసింది.

పెళ్లి బృందం లారీ, ఆయల్ ట్యాంకర్ ఢీ
20 మందికి తీవ్ర గాయాలు
రావులపాలెం, ఏప్రిల్ 21: నిబంధనలకు విరుద్ధంగా అధిక సంఖ్యలో ప్రయాణికులతో వెళ్తున్న పెళ్లి బృందం లారీని ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టిన ప్రమాదంలో సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఒకవైపు వర్షం, ఈదురుగాలులు, చీకటి సమయం కావడంతో క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వివరాల్లోకెళ్తే... ప్రత్తిపాడుకు చెందిన మర్రి సత్యనారాయణ రెండో కుమారుడు సత్తిబాబు వివాహం శనివారం తెల్లవారు ఝామున పాలకొల్లులోని పెండ్లి కుమార్తె ఇంటి వద్ద జరగాల్సి ఉంది. ఈనేపధ్యంలో పెళ్లి కుమారుడు సత్తిబాబు తరఫున సుమారు 80 మంది శుక్రవారం సాయంత్రం లారీలో పాలకొల్లు బయలుదేరారు. పెండ్లి కుమారుడు సత్తిబాబు, తల్లిదండ్రులు లారీ ముందు భాగంలో కూర్చుని ఉండగా మిగిలిన వారంతా లారీ వెనుక తొట్టెలో కూర్చున్నారు. అయితే లారీలో ప్రయాణించడం నిబంధనలకు విరుద్ధం కాగా అందులోను కిక్కిరిసి మహిళలు, పిల్లలతో వారు పెళ్లికి బయలుదేరారు. మండలంలోని 16వ నంబరు జాతీయ రహదారిపై ఈతకోట టోల్‌గేటు సమీపానికి వచ్చేసరికి స్పీడుబ్రేకర్ రావడంతోడ్రైవర్ లారీని స్లోచేశాడు. అయితే వెనుక వస్తున్న ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ స్పీడ్‌బ్రేకర్ విషయాన్ని గమనించకపోవడంతో వేగంగా వచ్చి పెళ్లి బృందం లారీని ఢీకొట్టాడు. దీంతో అదుపుతప్పిన పెళ్లిబృందం లారీ ఎడమవైపు రోడ్డు నుండి డివైడర్ మీదుగా కుడివైపు రోడ్డులోకి దూసుకుపోయి ఆగింది. ఈ ప్రమాదంలో లారీ వెనుకభాగంలో కూర్చున్న వారంతా ఒకరిపై ఒకరు పడటంతో సుమారు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ట్యాంకర్ ముందు భాగంగా దెబ్బతినడంతో డ్రైవరు అందులో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న రావులపాలెం సిఐ బి పెద్దిరాజు, ఎస్‌ఐ పివి త్రినాథ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని 108 ఎన్‌హెచ్ అంబులెన్సులో కొత్తపేట, రాజమహేంద్రవరం ఆసుపత్రులకు తరలించారు. ఉత్సాహంగా పెళ్లికి వెళ్తున్న సమయంలో హఠాత్తుగా సంభవించిన ప్రమాదంతో లారీలో ప్రయాణిస్తున్న వారంతా భీతావహులయ్యారు. మహిళలు, పిల్లల రోదనలతో సంఘటనా ప్రాంతం మిన్నంటింది. పెండ్లి కుమారుడు తృటిలో ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డాడు. టోల్‌గేటుకు సమీపంలో వేసిన స్పీడ్‌బ్రేకర్లపై ఎటువంటి రేడియం స్టిక్కర్లుగాని, పెయింగ్ గాని వేయకపోవడంతో గమనించకపోవడంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. 2015 డిసెంబర్‌లో కూడా ఇదే టోల్‌గేటు వద్ద స్పీడుబ్రేకర్ ఉన్న విషయాన్ని పొగమంచులో గమనించకపోవడంతో హైటెక్ బస్సును ట్యాంకరు ఢీకొని పెద్ద ప్రమాదం సంభవించింది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా టోల్‌గేటు వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు గాని, చర్యలు గాని చేపట్టడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తృటిలో తప్పిన పెనుప్రమాదం
ప్రమాద సమయంలో ప్రమాదానికి కారణమైన లారీలో నిండుగా ఆయిల్ ఉండటంతో అది ఏమాత్రం నిప్పు రవ్వలు రేగినా పెను ప్రమాదం సంభవించి ఉండేదని స్థానికులు అంటున్నారు. అలాగే అదుపుతప్పిన పెళ్లి బృందం లారీ బోల్తాపడి ఉండి ఉంటే పెద్దయెత్తున ప్రాణనష్టం జరిగి ఉండేదని అభిప్రాయపడ్డారు.
దళారులను నమ్మవద్దు
పోలవరం ముంపు బాధితులతో భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ భానుప్రకాష్
దేవీపట్నం, ఏప్రిల్ 21: పోలవరం ప్రాజెక్టు కారణంగా సర్వం కోల్పోతున్న రైతులకు అండగా ఉంటానని, దళారులను నమ్మి మోసపోవద్దని భూ సేకరణ ప్రత్యేక కలెక్టర్ సిహెచ్ భానుప్రకాష్ రైతులకు భరోసా ఇచ్చారు. శుక్రవారం దేవీపట్నం మండలం ఇందుకూరిపేట తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో సమావేశమయ్యారు. దేవీపట్నం మండలంలో బిట్-1, బిట్-2లలో గత రెండు సంవత్సరాల నుంచి భూసేకరణ కార్యక్రమం పెండింగ్‌లో ఉందని, అందువల్ల తానే స్వయంగా రైతులతో మాట్లాడి రైతుల భూములకు రికార్డులు పరిశీలించి నష్టపరిహారం వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తామని స్పెషల్ కలెక్టర్ చెప్పారు. శుక్రవారం పోలిశెట్టి నాగేశ్వరరావు, నండూరి గంగాధరరావు, ఉండమట్ల వెంకటరత్నం, కర్రి మంగామణి, ఎం వెంకట సుబ్బారావు, ఉండమట్ల సుబ్బారావు, ఎం అచ్చారావు, ఉండమట్ల సీతారామయ్య, ఉండమట్ల సత్యనారాయణ తదితర 60మంది రైతుల రికార్డులను అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా స్పెషల్ కలెక్టర్ స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ దేవీపట్నం మండలంలో గతంలో భూసేకరణ కోసం రైతులు దళారులను నమ్మి దళారులే రికార్డులను అధికారులకు ఇచ్చేలా ఉండేదని, దళారులకు చెక్ పెట్టి స్వయంగా రైతులే తమకు రికార్డులు అందజేయాలని ఉద్దేశ్యంతో రైతుల వద్దకే తమ అధికారులను పంపిస్తున్నట్టు చెప్పారు. రైతులు తమ రికార్డులను నేరుగా తనకు గానీ, డిప్యూటీ కలెక్టర్‌కు గానీ, తమ శాఖ అధికారులకు గానీ అందజేయాలని సూచించారు. రికార్డులు పరిశీలించిన అనంతరం రైతుల వద్దనుండి ఏమైనా కొన్ని ఇబ్బందులు వచ్చినా స్వయంగా పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. మండలంలోని దేవీపట్నంలో 338 ఎకరాలను 200మంది రైతుల వద్దనుండి సేకరించాల్సి ఉందని చెప్పారు. మండలంలో మార్కెట్ ధర రూ.2.5 లక్షలుగా జిల్లా కలెక్టర్ నిర్ణయించారని, ఇక భూమి రేటు పెరిగే అవకాశం లేదని చెప్పారు. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు దళారులతో కుమ్మక్కై మంటూరు ప్రాంతంలో ఎల్‌టిఆర్ కేసులు పెండింగ్‌లో ఉన్న భూములకు చెల్లింపులు చేశారని, వాటిపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భూసేకరణ అవార్డు పాసైన నాటి నుంచి మార్కెట్ ధరకు 12శాతం చొప్పున వడ్డీతో రైతులకు చెల్లిస్తామని అన్నారు. ముంపు బాధితుల ఇళ్లకు కూడా ఇంజినీర్లు నిర్ణయించిన ధరకు నూరు శాతం సొల్యూషన్ కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 25న తహసీల్దార్ కార్యాలయంలో మిగిలిన రైతుల భూముల రికార్డులు మళ్లీ పరిశీలిస్తామని, ఆ రోజు కూడా ఇవ్వని రైతులకు సంబంధించిన సొమ్ములు ఇరిగేషన్ శాఖకు జమ చేస్తామన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, పోలవరం ప్రాజెక్టులో ఎవరూ నష్టపోకుండా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ సత్యవాణి, డిప్యూటీ తహసీల్దార్ కిశోర్‌బాబు, సర్వేయర్ నాగేశ్వరరావు, సీనియర్ సహాయకులు ఎంవిఆర్ ప్రసాదరావు, ఎంవి పరిమళ, దేవీపట్నం విఆర్వో గణేష్ తదితరులు పాల్గొన్నారు.
గ్రూప్-3 పరీక్షలు పటిష్టంగా నిర్వహించాలి
జెసి-2 రాధాకృష్ణమూర్తి
కాకినాడ, ఏప్రిల్ 21: ఈ నెల 23వ తేదీన జిల్లాలోని 5 కేంద్రాల్లో గ్రూప్-3, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-4 పోస్టుల నియామక పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలని జెసి-2 జె రాధాకృష్ణమూర్తి అన్నారు. జిల్లాలో 143 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని విధాన గౌతమీ హాలులో ఎపిపిఎస్‌పి ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన జిల్లాలో గ్రూప్-3 నియామక పరీక్ష నిర్వహణపై లైజాన్ అధికారులు, సహాయ లైజాన్ అధికారులు, పరీక్షా కేంద్రాల ఛీప్ సూపరింటెండ్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పరీక్షలకు సమన్వయాధికారి జెసి-2 రాధాకృష్ణమూర్తి హాజరై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జెసి-2 మాట్లాడుతూ సర్వీస్ కమీషన్ గ్రూప్-3 విభాగం కింద పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-4 పోస్టుల భర్తీ కొరకు నిర్వహిస్తున్న పరీక్షకు జిల్లాలో 62671 మంది అభ్యర్ధులు హాజరుకానున్నారని వీరి కోసం కాకినాడలో 51, పెద్దాపురంలో 31, అమలాపురంలో 13, రాజమహేంద్రవరంలో 29, రామచంద్రపురంలో 19 కేంద్రాలతో కలిపి మొత్తం 143 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాలను 39 రూట్లుగా విభజించి తహశీల్దార్లను లైజాన్ అధికారులుగాను, డిటి/ సీనియర్ అసిస్టెంట్లను సహాయ లైజాన్ అధికారులుగా నియమించామని అలాగే సంబంధిత పరీక్ష కేంద్రాలకు ఛీప్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్ల నియామకం పూర్తయినట్లు చెప్పారు. పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతుందని, హాజరయ్యే అభ్యర్ధులు 9గంటల నుండి 9.45వరకు మాత్రమే అనుమతిస్తామని 9.45కు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేస్తామన్నారు. హాల్‌టిక్కెట్లు వెంట తెచ్చుకోవాలని చెప్పారు. పాస్‌పోర్టు, ఆధార్, పాన్ కార్డుల, ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి వెంట తెచ్చుకుని చూపాలని చెప్పారు. నలుపు/ నీలం బాల్ పాయింట్ పెన్‌లను తెచ్చుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిఎస్పీ సహాయ కార్యదర్శి టి అలివేలు మంగ, సెక్షన్ అధికార్లు జికె ప్రసూన, టి శ్రీనివాసరావు, పి శంకరరావు, కలెక్టరేట్ పర్యవేక్షాణాధికారి రామ్మోహన్‌రావు, తహశీల్దార్లు, డిటిలు, ఛీప్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.
అధికారులను పరుగులు పెట్టించిన కలెక్టర్ మిశ్రా
డి గన్నవరం, ఏప్రిల్ 21: జిల్లా కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి 24 గంటలు గడవక ముందే కార్తీకేయ మిశ్రా పి గన్నవరం మండలాధికారులను పరుగులు పెట్టించారు. శుక్రవారం ఆయన ముందస్తు సమాచారం స్థానిక అధికారులకు లేకుండానే జిల్లా కలెక్టర్ పి గన్నవరం మండల పరిధిలోని కుందాలపల్లి, నరేంద్రపురం గ్రామాలను ఆకస్మికంగా సందర్శించారు. మార్గమధ్యలో ఉండగా అమలాపురం ఆర్డీవో జి గణేష్ కుమార్ పి గన్నవరం తహాసీల్దార్ డి సునీల్‌బాబుకు సమాచారం ఇవ్వడంతో మండల అధికారులు కుందాలపల్లి గ్రామానికి ఉరుకులు, పరుగులుమీద వెళ్ళారు. కుందాలపల్లి గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈకేంద్రం వల్ల వచ్చిన ఆదాయం ఎంత, ఆ ఆదాయాన్ని దేనికి వెచ్చిస్తున్నారని ఎంపిడిఒ ఎం ప్రభాకరరావు, ఎపివో రెడ్డిబాబులను కలెక్టర్ ప్రశ్నించారు. గత సంవత్సర కాలంగా 60వేల రూపాయలు వచ్చిందని, ఆ సొమ్మును పంచాయతీ జనరల్ ఫండ్‌గా వినియోగిస్తోందన్నారు. చెత్తనుండి సంపద తయారీ కేంద్రానికి వెళ్ళే రహాదారి పాడయ్యిందని రోడ్డు వేయడానికి గ్రాంటు పెట్టారా అని కలెక్టర్ అడిగారు. రోడ్డుకు ప్రతిపాదనలు పంపామని మంజూరు కాలేదని తెలపడంతో వెంటనే ప్రతిపాదనలు పంపమని మంజూరుకు కృషిచేస్తానని కలెక్టర్ తెలిపారు. అనంతరం నరేంద్రపురం గ్రామంలో 32 లక్షల రూపాయలతో చేపట్టిన చెరువుపూడికతీత పనులు కలెక్టర్ పరిశీలించారు. చెరువుకు నీరు ఎక్కడ నుండి వస్తుందని ఆ నీటిని దేనికి ఉపయోగిస్తారని, పూడికతీత వలన ట్యాంకు కెపాసిటీ ఎంత పెరుగుతుందని ఎపిఒ రెడ్డిబాబును కలెక్టర్ ప్రశ్నించారు. చెరువుతవ్వకాలు చేసే ఉపాధిహామీ కూలీలకు రక్షిత మంచినీరు ఇస్తున్నారా అని అడుగగా మంచినీళ్లను వారినే తెచ్చుకోమంటున్నామని రోజుకు ఐదు రుపాయలు వంతున కూలీలకు చెల్లిస్తున్నామని కలెక్టర్‌కు రెడ్డిబాబు తెలిపారు. పనులు మంచిగా చేయించడంటూ కలెక్టర్ కార్తీకేయమిశ్ర అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డ్వామా పిడి నాగేశ్వరరావు, ఎపిడి ప్రసాద్‌లు ఉన్నారు.
ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై పోరాటం
బిజెపి జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య
కొత్తపేట, ఏప్రిల్ 21: కేంద్రం ద్వారా మంజూరై జిల్లాలో అమలవుతున్న పథకాల్లో అవినీతిపై పోరాటం చేయాలని నిర్ణయించినట్లు జిల్లా బిజెపి అధ్యక్షుడు యెలిమిరెడ్డి మాలకొండయ్య పేర్కొన్నారు. కొత్తపేటలో శుక్రవారం రాష్ట్ర బిజెపి కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం ద్వారా వచ్చే పథకాలతోపాటు రాష్ట్రం ద్వారా వచ్చే పథకాల్లో పలు అవినీతి జరుగుతోందని దీనిని పట్టించుకోవాల్సిన అధికార్లు పట్టించుకోవడం లేదన్నారు. అవినీతిపై పోరాడాలని పార్టీ ద్వారా నిర్ణయించినట్లు తెలిపారు. పథకాలన్నీ సక్రమంగా అమలు కావాలన్నదే తమ ధ్యేయమన్నారు. దీనికి మిత్రపక్షంపైనా పోరాటం చేసేందుకు సిద్ధమని హెచ్చరించారు. ఎన్నికల వరకే పార్టీలని పార్టీ వారని అనంతరం గెలిచాక ఎవరికైనా పనులు చేయాల్సిందేనని ఇందులో పార్టీ వారు, కాని వారని తేడాలు ఉండకూడదన్నారు. తాము జిల్లాలో బూత్ స్థాయి పర్యటన చేస్తున్నట్లు దీని ద్వారా పలు సమస్యలు దృష్టికి వస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బిజెపి నాయుకులు పాలూరి సత్యానందం, నల్లా శ్రీరామ్‌ప్రసాద్, దొడ్డిపట్ల శ్రీనివాస్, నల్లా శ్రీరామ్‌ప్రసాద్, పాలూరి జయప్రకాష్, కె గంగరాజు, బండారు సూరిబాబు, జనిపిరెడ్డి తాతారావు తదితరులు పాల్గొన్నారు.

బ్రాహ్మణుల సంక్షేమానికి నిధులు కేటాయించాలి
ఎపి బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య అధ్యక్షుడు శ్రీకాంత్

అమలాపురం, ఏప్రిల్ 21: బ్రాహ్మణుల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన 500 కోట్లను తక్షణమే విడుల చేసి పేదబ్రాహ్మాణులను ఆదుకోవాలని ఎపి బ్రాహ్మాణ సేవాసంఘం సమాఖ్య అధ్యక్షులు జ్వాలాపురం శ్రీకాంత్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక శివాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమానికి 500 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించి కేవలం 185 కోట్లు మాత్రమే మంజూరుచేసారన్నారు. మిగిలిన 315కోట్లరూపాయలు తక్షణమే విడుదల చేయాలన్నారు. బ్రహ్మణ కార్పొరేషన్ నియమించిన జిల్లా కో ఆర్డినేటర్లు పనితీరు బాగాలేదని వారిని తొలగించి, నియోజకవర్గ కో ఆర్డినేటర్లకు ఇచ్చే పారితోషకం పెంచాలని ఆయన సూచించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బ్రాహ్మణుల సంక్షేమానికి 1500 కోట్లు కేటాయించాలన్నారు. అలాగే ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు ప్రతి జిల్లాకు కేటాయించాలని శ్రీకాంత్ కోరారు. బ్రహ్మాణులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 23న ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి వినతిపత్రం అందిస్తామని ఆయన తెలిపారు. అదేవిధంగా రాజమండ్రిలో త్వరలో భారీస్థాయిలో బ్రాహ్మణ మహాసభ నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్‌శర్మ,రాష్ట్ర బ్రాహ్మణ యువజన విభాగం అధ్యక్షుడు ఎంఎల్‌ఎం సురేష్‌బాబు ఆర్గనేజింగ్ సెక్రటరీ మాచిరాజు శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు వైవి జగన్నాధరావు,స్థానిక నాయకులు మాచిరాజు రవికుమార్,మంగళంపల్లి అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.
‘వేసవి’ తరగతులపై ఆర్‌ఐఒ నిఘా!

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 21: తూర్పు గోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్ ముందస్తు సిలబస్ వేసవి ప్రత్యేక తరగతులపై ఇంటర్మీడియట్ బోర్డు దృష్టి సారించింది.. ఈ మేరకు ఎక్కడైనా ప్రైవేటు కాలేజీల్లో ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు సిలబస్ గానీ నిర్వహిస్తున్నారేమోననే నేపధ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి వెంకటేష్ నిఘా వేశారు. వేసవి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారని తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు రావడంతో శుక్రవారం జిల్లాలోని కొన్ని ప్రైవేటు కాలేజీలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
వేసవి కాలంలో ఎంసెట్ పేరుతో కొన్ని ప్రైవేటు కాలేజీలు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్టు ఫిర్యాదులు అందడంతో తనిఖీలు నిర్వహించి హెచ్చరికలు జారీచేసినట్టు సమాచారం. నిబంధనలు అతిక్రమించినట్టు తేలితే గుర్తింపు కూడా రద్దు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డుకు సిఫార్సు చేసే అధికారం ఉంది. వేసవి కాలంలో ప్రత్యేక తరగతులు నిర్వహించడం బోర్డు నిబంధనలకు విరుద్ధం. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో కూడా విద్యా శాఖ ప్రత్యేకించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వేసవి తరగతులు నిర్వహించకూడదని హెచ్చరించింది. ఇది కాకుండానే ఇంటర్మీడియట్ బోర్డు నియమనిబంధనల ప్రకారం వేసవి కాలంలో ఎటువంటి ప్రత్యేక తరగతులు నిర్వహించకూడదు. కానీ ఇందుకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో ఇంటర్మీడియట్ బోర్డు ఆర్‌ఐఒ ప్రత్యేక నిఘా వేసి పటిష్టవంతంగా నిబంధనలను అమలయ్యేలా చర్యలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 292 ఇంటర్మీడియట్ కాలేజీలు ఉండగా అందులో 195 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. 23 రెసిడెన్షియల్ కాలేజీలు, 45 ప్రభుత్వ కాలేజీలు, 18 ఎయిడెడ్ కాలేజీలు, 81 ఒకేషనల్ కాలేజీలు ఉన్నాయి. ప్రైవేటు కాలేజీలు వేసవి ముందస్తు సిలబస్ తరగతులు నిర్వహించడానికి వీల్లేదు. ఎంసెట్ పేరుతో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.
బాలుడి మృతిపై విచారణ
మారేడుమిల్లి, ఏప్రిల్ 21: మారేడుమిల్లి మండలం జిఎం వలస గ్రామానికి చెందిన కలుగుల చిరంజీవిదొర, రాములమ్మ దంపతుల మూడు నెలల బాలుడు మృతిచెందిన ఘటనపై వైద్యాధికారులు శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ నెల 20న (గురువారం) ఈ చిన్నారి మృతిచెందిన విషయం విధితమే. ఈ ఘటనపై ఏజన్సీ డిఎంహెచ్‌ఒ పవన్‌కుమార్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిణి డాక్టర్ అనిత శుక్రవారం జిఎం వలస గ్రామానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాలుడు తల్లిదండ్రులను చిన్నారి మృతికి గల కారణాలు, అతని ఆరోగ్య స్థితిగతులను గూర్చి అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక విలేకర్లతో వారు మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అయితే బాలుడి మృతికి సంబంధించి కారణాన్ని మాత్రం వైద్యాధికారులు తెలియజేయలేదు.
ప్రగతి పథంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్, బిలాస్‌పూర్ యూనివర్సిటీ ఉప కులపతి శర్మ
రాజానగరం, ఏప్రిల్ 21: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ప్రగతి పథంలో నడుస్తోందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్, బిలాస్‌పూర్ యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య జిడి శర్మ అన్నారు. శుక్రవారం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో యుజిసి బృందం రెండో రోజు పర్యటించింది. ఈ బృందంలో ఛైర్మన్ శర్మతోపాటు సభ్యులు ఆచార్య చౌదరి, ఆచార్య శ్యామలాదేవి, డాక్టర్ శ్రీనివాసులు ఉన్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న ఇంగ్లీష్ మేనేజ్‌మెంట్, గణిత, రసాయన శాస్త్ర, కంప్యూటర్ సైన్స్ భవన సముదాయాలను కూడా వారు పరిశీలించి, ఆయా విభాగాలకు సంబంధించి విద్యార్థుల నుండి, అధ్యాపకుల నుండి తీసుకున్న సమాచారం పరిశీలించిన అంశాల ఆధారంగా నివేదిక తయారు చేశారు. విశ్వవిద్యాలయ పరిధిలో హెల్త్ సెంటర్, ఎన్‌ఎస్‌ఎస్ సేవలు, గ్రేటర్ లైబ్రరీ, యూనివర్సిటీకి వచ్చిన అవార్డులు, రివార్డులు పరిశీలించారు. అనంతరం యుజిసి ఛైర్మన్ శర్మ స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలోని ఏడు విభాగాలను పరిశీలించామని చెప్పారు. వారు అనుసరిస్తున్న బోధనా పద్ధతులు, విద్యార్థుల నైపుణ్యాన్ని చూశామని తెలిపారు. పరిశోధనా అంశాలు, విద్యార్థుల సంక్షేమం తదితర అంశాలను కూడా పరిశీలించినట్టు చెప్పారు. సెంట్రల్ లైబ్రరీలో విభాగాల వారీగా నిక్షిప్తమై ఉన్న పుస్తకాలను కూడా పరిశీలించినట్టు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడాలేని అతిపెద్ద లైబ్రరీ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఉండడం నిజంగా గోదావరి వాసుల అదృష్టమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జాతీయ సేవా సమితి సేవల్లో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని 284 యూనిట్ల ద్వారా గ్రామాలను దత్తత తీసుకుని, ఆయా గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం, పర్యవేక్షించడం అభినందించదగ్గ విషయమన్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఉన్న వసతులను అంచనా వేస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదగడానికి కావల్సిన అన్ని వనరులు పుష్కలంగా ఉన్నట్టు తెలిపారు. అనతికాలంలోని యూనివర్సిటీ పురోభివృద్ధి సాధించడానికి ఉప కులపతి ముత్యాలు నాయుడు కృషి కనిపిస్తోందన్నారు. దీనిపై విసి ముత్యాలు నాయుడు మాట్లాడుతూ సమిష్టి కృషితో అభివృద్ధి సాధ్యమైందని, దీనికి ప్రభుత్వ పెద్దలు, జిల్లా నాయకులు ఎంతగానో తోడ్పాటునందించారని తెలిపారు. అనంతరం యుజిసి సభ్యులు తమ అభిప్రాయాలను తెలిపారు. వీరి వెంట రిజిస్ట్రార్ ఆచార్య నరసింహారావు, ప్రిన్సిపాళ్లు, డీన్లు ఆచార్య సురేష్‌వర్మ, ఆచార్య టేకి, ఆచార్య శ్రీరమేష్, మట్టారెడ్డి తదితరులు ఉన్నారు.