తూర్పుగోదావరి

కురిసింది వాన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 29: అధిక ఉష్ణోగ్రత, మండుటెండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జిల్లా ప్రజలు ఒక్కసారిగా కురిసిన వర్షానికి ఆనందపరవశులయ్యారు. జిల్లా కేంద్రం కాకినాడ సహా పలు మండలాల్లో శనివారం సాయంత్రం ఒక మాదిరి నుండి భారీగా వర్షం కురిసింది. కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురం, యు కొత్తపల్లి, సామర్లకోట తదితర ప్రాంతాల్లో భారీ గాలుల వీచాయి. పలుచోట్ల గంట నుండి రెండు గంటల పాటు వర్షం కురిసింది. ఈదురు గాలులకు చెట్లు చాలాచోట్ల నేలకొరిగాయి. విద్యుత్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. కాకినాడ విద్యుత్ డివిజన్ ప్రాంతంలో భారీ ఈదురుగాలుల నేపథ్యంలో అచ్చంపేట వద్ద గల ప్రథాన విద్యుత్ సరఫరా కేంద్రంలో సరఫరాను నిలిపివేశారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సరఫరా నిలిపివేశామని, సాధారణ స్థితి నెలకొనగానే ఆయా ప్రాంతాలకు యధావిధిగా విద్యుత్‌ను పునరుద్ధరించామని కాకినాడ ఎలక్ట్రికల్ డివిజనల్ ఇంజనీరు ప్రసాద్ ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు. కాకినాడ రూరల్ మండలం, పిఠాపురం, సామర్లకోట, కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయన్నారు. అయితే ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగలేదని స్పష్టం చేశారు. కాకినాడ సహా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవగా, చాలాచోట్ల పిడుగులు పడ్డాయి. జగన్నాథపురంలో పిడుగు పాటుకు కొబ్బరి చెట్టు ధ్వంసమయ్యింది. జిల్లాలోని సముద్ర తీరం వెంబడి ఈదురుగాలుల ప్రభావం అధికంగా కనిపించింది. ఓవైపు వర్షం, మరోవైపు భారీగా వీచిన గాలులతో వాతావరణం పూర్తిగా చల్లబడటంతో ప్రజలు సేద తీరారారు. ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనడంతో చిన్నా, పెద్దా అంతా ఆరుబయట గడిపారు. కాకినాడ బీచ్‌కు శనివారం సాయంత్రం సందర్శకుల తాకిడి అధికమయ్యింది. నగరంలోని పార్క్‌లన్నీ సందర్శకులతో కళకళలాడాయి.

వైద్య, ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయాలి
కలెక్టర్ కార్తికేయ మిశ్రా
రంపచోడవరం, ఏప్రిల్ 29: ఏజన్సీలో మరణాలు సంభవించకుండా వైద్య ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక ఐటిడిఎ సమావేశపు హాలులో నిర్వహించిన జిల్లా స్థాయి అధికారుల సమావేశంలో ఆయన గిరిజన ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల అమలు, పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏజన్సీలో పోషకాహార లోపం వల్ల వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందకపోవడం వల్ల మరణాలు సంభవిస్తున్నట్టు నివేదికల ద్వారా వెల్లడైందన్నారు. ఇకపై ఇటువంటి మరణాలు సంభవించకుండా వైద్య ఆరోగ్య, స్ర్తి సంక్షేమ శాఖల పనితీరును మెరుగుపరచాలని ఆదేశించారు. నూరుశాతం ఆసుపత్రి ప్రసవాలు నిర్వహించాలన్నారు. మలేరియా స్రేయింగ్ సకాలంలో చేపడుతూ గిరిజనులు మలేరియా బారిన పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి పిహెచ్‌సికి అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో పోషకాహార లోపాలు సరిదిద్దేందుకు ప్రత్యేకించి అమలు చేస్తున్న అన్న అమృతహస్తం, గిరి గోరుముద్దలు పథకాలను పక్కాగా అమలు చేయాలని ఐసిడిఎస్ పిడిని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఏజన్సీలో పలు సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఐటిడిఎ పిఒలకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న సామాజిక భద్రతా పింఛన్లను సత్వరం మంజూరు చేయడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మారేడుమిల్లి పోలీసుస్టేషనులో రోడ్డు క్లియరెన్స్ కోసం జెసిబిని, పవర్ రంపాలను అందుబాటులో ఉంచాలని ఆర్‌అండ్‌బి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పిఒలు దినేష్‌కుమార్, చినబాబు, జెసి రాథాకృష్ణమూర్తి, ఎఎస్పీ అస్మి, డిఎఫ్‌ఒ అంజని, డిఎంహెచ్‌ఒ చంద్రయ్య, జడ్పీ సిఇఒ పద్మ, ట్రాన్స్‌కో ఎస్‌ఇ ప్రసాద్, జెడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.