తూర్పుగోదావరి

అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదపూడి, ఏప్రిల్ 15: రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన పెదపూడి మండలం గొల్లల మామిడాడ శ్రీకోదండ రాముని కల్యాణం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖుల రాకతో ఆలయ ఆవరణ అంతా సందడిగా మారింది. కల్యాణ ఘట్టాన్ని వీక్షించడానికి రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది. తెల్లవారు ఝాము నుండి స్వామిని దర్శించుకోడానికి భక్తులు బారులు తీరారు. ఏఉదయం 11 గంటలకు ప్రధానార్చకులు రేజెట్టి వెంకటకూర్మ రంగాచార్యులు స్వామి వారిని కల్యాణ వేదిక పైకి తీసుకువచ్చారు. ప్రభుత్వం తరుఫున జిల్లా కలెక్టర్ హెచ్ ఆరుణ్‌కుమార్, శ్రీదేవి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అలాగే డిప్యూటీ సిఎం నిమ్మకాయల రాజప్ప, అనురాధ దంపతులు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు, రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, సూర్యకుమారి దంపతులు, కెపిఆర్ సంస్థల ఎండి కర్రి వెంకటముకుందరెడ్డి, విజయలక్ష్మీ దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వైఎస్సార్సీపీ నాయకులు ద్వారంపూడి వెంకటరెడ్డి స్వామి వారికి మంచి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అలాగే ఆలయ ధర్మకర్త ద్వారంపూడి శ్రీదేవిమహాలక్ష్మి ఇంటి వద్ద నుండి ముత్యాల తలంబ్రాలు, 9రకాల పూలు, పళ్లు, పట్టు వస్త్రాలు పల్లకీలో ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామి వారికి సమర్పించారు.
కల్యాణ సంకల్పం ప్రారంభం
మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణ సంకల్పం జరిగింది. మంత్ర స్నానం అనంతరం సీతారాముల కల్యాణ మూర్తుల తలపై జీలకర్ర, బెల్లం పెట్టారు. మధ్యాహ్నం 2.01 గంటలకు మాంగల్యధారణ, తలంబ్రాల తంతు పూర్తి చేశారు. అలాగే భక్తులకు తలంబ్రాల బియ్యాన్ని పంపిణీ చేశారు. భారీగా హాజరైన భక్తులకు ఎటువంటి ఆసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది.
ప్రత్యేకాకర్షణగా నిలిచిన తలంబ్రాల తంతు
పందలపాక పాఠశాలలో పిఇటిగా పని చేస్తున్న ద్వారంపూడి యువరాజారెడ్డి బియ్యం గింజలపై రాసిన శ్రీరామ నామాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే భక్తుడు కరి సూరారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పండించి గోటితో ఒలిచిన బియ్యపు తలంబ్రాలు, మంచి ముత్యాలు తలంబ్రాలుగా వాడడం ఇక్కడి ప్రత్యేకతగా భక్తులు చెప్పుకుంటారు. కల్యాణం ఆనంతరం స్వామి వారి ఆలయ ప్రవేశం జరిగింది.
విఆర్ పురం: శబరి, గోదావరి జీవనదుల సంగమ తీరాన శ్రీరామగిరి గ్రామం వద్ద కొండపై వెలసియున్న శ్రీసుందర సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో శనివారం స్వామివారి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు సౌమిత్రి పురుషోత్తమాచార్యుల బృందం వేద మంత్రాలతో, మంగళవాయిద్యాలతో, భక్తుల రామనామ స్మరణలతో అంగరంగ వైభవంగా, అభిజిత్ లగ్నమందు శ్రీసుందర సీతారామచంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ముందుగా సీతారాముల ఉత్సవమూర్తులను కొండపై నుండి దేవరాజు వాహనంపై శాస్త్రోంగా మేళతాళాలు, గిరిజన సాంప్రదాయ కొమ్ము నృత్యాలతో కల్యాణ మండపం వరకూ ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు చుట్టు పక్కల మండలాలైన కూనవరం, వేలేరుపాడు, చింతూరు మండలాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీరామగిరి గ్రామం, దేవాలయం భక్తులతో కిటకిట లాడింది. ఉత్సవ కమిటీ ఛైర్మన్ ఆచంట శ్రీనివాసరావు, ఎఎస్‌పి అద్నాల్‌నయింహస్మి, ఎటపాక సిఐ వీరయ్యగౌడ్, తహసీల్దార్ జివిఏస్ ప్రసాద్, ఎస్‌డిఎస్ డైరెక్టర్ వి గాంధీబాబు, ఎంపిపి కారం సిరమయ్య, జడ్పీటీసీ ముత్యాల కుసుమాంబ తదితరులు కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. సీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకుని ఎండోమెంట్ సిబ్బంది ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయంలో ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఎస్‌ఐ రామారావు తమ పోలీసు సిబ్బందితో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తునిర్వహించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ముత్యాల రామారావు, ఇఒలు సత్యనారాయణమూర్తి, ప్రసాద్‌రెడ్డి, పేరాబత్తుల దుర్గారావు, ముత్యాల రాజారావు, పూనెం సత్యనారాయణ, నాలుగు మండలాల భక్తజనం స్వామివారి కల్యాణాన్ని కన్నుల పండువగా తిలకించారు.
రామచంద్రపురం: జిల్లాకే తలమానికంగా ఏటేటా కె గంగవరం మండలం సత్యవాడ గ్రామంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవాలు ఈ సంవత్సరం గ్రామస్థులు ద్విగుణీకృత ఉత్సాహంతో వీధి వీధినా నిర్వహించి, తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. గతంలో సత్యవాడ గ్రామంలో కొత్తపేట వీధి, రామయ్య వీధి, చెరువుగట్టు వీధి, పెద్ద వీధిలలో శ్రీసీతారామ కల్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించేవారు. ఈ సంవత్సరం సామాజిక వర్గాలకు అతీతంగా చిన్నా పెద్దా భేదం లేకుండా కల్యాణోత్సవాలు జరిపించారు. బ్యాండ్, సన్నాయి మేళాలు, గారడీలు, కనకతప్పెట్లు, జానపద నృత్యాలతోపాటు వేదోక్తమైన రీతిలో మంత్రోచ్ఛారణల నడుమ శ్రీసీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు, భక్తులు సత్యవాడలో నిర్వహించే శ్రీసీతారాముల కల్యాణోత్సవాలకు తరలివచ్చారు. భద్రాచలంలో నిర్వహించే సమయాలలోనే ఆ గ్రామంలో కల్యాణోత్సవాలను జరిపించడం విశేషం. గ్రామ ప్రముఖులు తరతమ భేదాలను విడిచి, కలసికట్టుగా ఈ కల్యాణోత్సవాలలో పాల్గొన్నారు. రామచంద్రపురం ఆర్డీవో కె సుబ్బారావు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు వర్ధినీడి వెంకటేశ్వరరావు (నాని), చింతా వెంకట రమణతో పాటు మండల స్థాయి అధికారులు ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు. ఏ వీధి చూసినా కళ్యాణ శోభను కళ్ళకు కట్టినట్లు అగుపించేలా గ్రామస్థులు 60 రోజులపాటు నిర్వహించిన నిర్విరామ కృషి ఫలించింది. రామచంద్రపురం సర్కిల్ ఇనస్పెక్టర్ పచ్చా కాశీ విశ్వనాథ్ నేతృత్వంలో విస్తృత పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. బుల్లితెర, చలన చిత్ర నటుడు పృధ్వీరాజ్ గ్రామంలోని అన్ని పందిళ్లను సందర్శిస్తూ శ్రీసీతారాములను కొలుస్తూ పందిళ్లకు చేసిన అలంకరణలకు మంత్రముగ్ధులయ్యారు.