తూర్పుగోదావరి

దళారుల దరికే అన్నదాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 17: ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ నిబంధనల ఆంక్షలు తట్టుకోలేక ఖరీఫ్ రైతు తన ఉత్పత్తులతో దళారుల దరికే చేర్చుతున్నాడు. మద్ధతు ధర కంటే కాస్తంత తక్కువగా ఇచ్చినప్పటికీ అప్పటికప్పుడు తేలిపోతుందని చెప్పి రైతులు అత్యధికంగా దళారులపై ఆధారపడుతున్న పరిస్థితి కన్పిస్తోంది. ప్రధానంగా ఏటిపట్టు గ్రామాల్లో దళారులు రోడ్డుపక్కనే ఉన్న కళ్లాల వద్దకే వచ్చి కొనుగోలు చేసుకుని వెళ్తున్న పరిస్థితి కన్పిస్తోంది. రైతుకు ట్రాన్స్‌పోర్టు ఖర్చు గానీ, గోనె సంచుల ఖర్చుగానీ లేకుండా నేరుగా మాసూళ్లు జరిగే ధాన్యం కళ్లాల వద్దకు వచ్చి కొనుగోలు చేసుకుని వెళుతున్నారు.
ప్రస్తుతం జిల్లాలో ముందస్తు ధాన్యం కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. జిల్లాలో ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినా ఆంక్షలను తట్టుకోలేక దళారులనే ఆశ్రయిస్తున్నపరిస్థితి కనిపిస్తోంది. దీనికితోడు కూలీల ఖర్చు భరించలేక అత్యధికంగా రైతులు వరికోత యంత్రాలపైనే ఆధారపడ్డారు. ఈ ధాన్యం ఆరకపోవడం వల్ల తేమ శాతం అధికంగా ఉండటంతో నిబంధనల ప్రకారం ధర పూర్తిగారాని పరిస్థితి ఎదురైంది. దీంతో కాస్తంత తక్కువ ధర లభించినా ఆంక్షల తలనొప్పి లేదని రైతులు దళారుల దరికే ధాన్యాన్ని అప్పగిస్తారు.
రైతులకు కచ్చితంగా మద్దతు ధర చెల్లించేలా ధాన్యం సేకరణ విధానాన్ని రాష్ట్రం అమలు చేపట్టింది. 2017-18 ఖరీఫ్‌కు సంబంధించి ‘ఎ’ గ్రేడు ధాన్యం వంద కేజీలు రూ.1590, కామన్ వెరైటీ వంద కేజీలు అంటే క్వింటాల్ రూ.1550కు కొనుగోలు చేయాల్సివుంది. ఈ ధర రైతులకు దక్కే విధంగా అధికారులు చూడాల్సి ఉంది. ధాన్యం అమ్మిన సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాల్లో పడేలా పౌర సరఫరాల శాఖ చూడాల్సిన బాధ్యత ఉంది. తేమ శాతం 17 వరకు అనుమతించారు. ధాన్యం రంగు మారినా, విరిగిపోయినా, మగ్గినా, మొలకలు వచ్చినా ఒక క్వింటాల్ ధాన్యంలో 5 శాతం, కుచించుకుపోయిన గింజలు ఉంటే 3 శాతం, నాసిరకం మిశ్రమం అయితే 6 శాతం వరకు అనుమతి ఇచ్చి ఆయా నిర్దేశిత శాతాలు దాటితే ధరను తగ్గిస్తారు. ఇదీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో నిబంధన. ఒకవేళ మిల్లర్లే నేరుగా కొంటే రైతుకు మద్దతు ధర దక్కేలా అధికారులు పర్యవేక్షించాల్సివుంది. ధాన్యం కొనుగోలు సమాచారాన్ని ఎప్పటికప్పుడు కంప్యూటర్‌లో నిక్షిప్తం చేయాల్సి ఉంది. గత ఏడాదికంటే మద్దతు ధర రూ.40 పెరిగింది. జిల్లాలో 2.25 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఖరీఫ్ సాగు చేయగా సుమారు 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడివస్తుందని అంచనా వేశారు. ప్రస్తుతం జిల్లాలో ముందస్తు ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయి. ఇప్పటికే 50శాతం మాసూళ్లు పూర్తయినట్టు వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. జిల్లాలో 284 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. గత ఏడాది 11.56 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చింది. ఈ ఏడాది 2 లక్షల టన్నుల అదనపు దిగుబడి వస్తుందని అంచనా వేశారు.

వర్షాలతో రైతుల్లో గుబులు

రాజమహేంద్రవరం, నవంబర్ 17: గత రెండు రోజులుగా జిల్లాలో ముసురు పట్టడంతోపాటు అక్కడక్కడా వర్షాలు పడుతుండటంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. శుక్రవారం సాయంత్రం రాజమహేంద్రవరం, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ప్రస్తుతం జిల్లాలో కొన్నిచోట్ల ఖరీఫ్ వరి ముందస్తు కోతలు పనలపై ఉండగా మరికొన్ని చోట్ల మాసూళ్లు జరుగుతున్నాయి. అకాల వర్షాల వల్లతో రైతుల్లో గుబులు చోటు చేసుకుంది. ఖరీఫ్‌లో ఎటువంటి చీడపీడలు లేకుండా అధిక దిగుబడి సాధించారు. వాతావరణంలో వచ్చిన మార్పుల నేపధ్యంలో పలుచోట్ల మేఘావృతమై సాయంత్రానికల్లా గత రెండు రోజుల నుంచి వానకురుస్తోంది. దీనికితోడు వేకువజామున మంచు కూడా అధికంగా ఉంటుండటంతో రైతులు వ్యవసాయ పనులకు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు పంటను త్వరితగతిన ఒబ్బిడి చేసుకునేందుకు ఆరాటపడుతున్నారు. వర్షాల కారణంగా చేతికందే పంట ఎక్కడ తడిసిపోతుందోననే ఆందోళన రైతుల్లో చోటుచేసుకుంది. వరి కోత యంత్రాల ద్వారా నూర్పిడి చేయించుకుంటున్న రైతులు గోనెపట్టాలు, మైకా పరదాలు సిద్ధంచేసుకుని ధాన్యాన్ని రాశులు తడిసిపోకుండా కాపాడుకుటున్నారు. కాస్తంత వర్షం దెబ్బ తగిలినా ధాన్యం రంగు మారే అవకాశాలు అధికంగా ఉండటంతో ఈ వాతావరణ మార్పులకు రైతుల్లో ఆందోళన చోటుచేసుకుంది.
ఇదిలావుండగా నగరంలోనూ, జిల్లాలోని పలుచోట్ల శుక్రవారం సాయంత్రం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వాతావరణంలో చలి తీవ్రత పెరిగింది. పూర్తి శీతాకాలం ఆవరించడంతో సాయంత్రం ఐదు అయ్యేసరికే చీకటి పడిపోతుండటంతో వ్యవసాయ పనులు సత్వరం పూర్తి చేసుకునేందుకు రైతులు ఆరాటపడుతున్నారు.