తూర్పుగోదావరి

నర్సరీ రైతులకు స్వల్ప ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్మెల్యే గోరంట్ల వినతిపై యూనిట్ రూ.1.50 వసూలుకు నిర్ణయం
కడియం, నవంబర్ 22: నర్సరీలకు విద్యుత్ బిల్లుల సమస్యపై కొంత ఊరట లభించింది. బుధవారం అసెంబ్లీలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కడియం నర్సరీ రైతుల సమస్యను సభ దృష్టికి తీసుకువెళ్లారు. మండలంలో సుమారు 3వేల ఎకరాల్లో నర్సరీలు విస్తరించాయని, పరిసర మండలాల్లో మరో రెండు వేల ఎకరాలు విస్తరించాయని, ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది ఉపాధి పొందుతున్న కడియం నర్సరీ వ్యవస్థకు ప్రభుత్వం చేయూతనందించాల్సిన అవసరముందని తన వాదనను వినిపించారు. ప్రధానంగా నర్సరీలకు ఉచిత విద్యుత్ అమలుచేయాలని, వీలుకాని పక్షంలో నామమాత్రపు రుసుము ద్వారా నర్సరీలకు సబ్సిడీ కల్పించాలని కోరారు. దీనిపై స్పందించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళావెంకట్రావు నర్సరీ విద్యుత్ బిల్లుల సమస్యపై స్పష్టమైన ప్రకటన చేశారు. రాష్ట్ర పర్యావరణ అభివృద్ధికి దోహదపడే నర్సరీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అయితే విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అభ్యంతరాల వల్ల ఉచిత విద్యుత్‌ను అందించలేకపోతున్నామని, బదులుగా రాయితీపై విద్యుత్ సరఫరా అందిస్తామని పేర్కొన్నారు. ఒక యూనిట్‌కు రూపాయిన్నర ధర వసూలు చేసేలా నిర్ణయించి విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు సిఫార్సు చేస్తున్నామని పేర్కొన్నారు. దీనితో ఉచిత విద్యుత్‌ను ఆశించిన నర్సరీ రైతులకు కొంత నిరుత్సాహం ఏర్పడినా అతి స్వల్ప ధరకు రాయితీపై విద్యుత్ సరఫరా చేయడం ఒకింత సంతోషాన్నిచ్చింది.

పోలవరం కాలువకు గండి
ఏలేరు పరిధిలో నీట మునిగిన పొలాలు
పిఠాపురం, నవంబర్ 22: పోలవరం ఎడమ ప్రధాన కాలువకు పడిన గండితో గోదావరి నీరు పెద్ద ఎత్తున ఏలేరు కాలువకు చేరడంతో పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు ఆధారిత పొలాలు నీటమునిగాయి. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు ఏలేరుకు మళ్లించే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఈ పనుల్లో భాగంగా పురుషోత్తపట్నం పంపులు ఫేజ్-2 ట్రయల్ రన్ నిర్వహించారు. ఈనీరు పోలవరం కాలువకు చేరింది. ఒక్కసారిగా వచ్చిన నీటితో జగ్గంపేట సమీపంలోని రామవరం వద్ద పోలవరం కాలువకు గండి పడింది. ఈ నీరు నేరుగా ఏలేరు కాలువకు మళ్లడంతో పిఠాపురం మండలంలోని నరసింగపురం, జములపల్లి, గోకివాడ శివారు ప్రాంతాల్లో కొంత మేరకు పొలాలు నీటమునిగాయి. ఆందోళనకు గురైన రైతులు పిఠాపురం ఎమ్మెల్యే వర్మ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. వెంటనే ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేయడంతో అధికారులు పంపులు నిలిపివేయడంతో నీరు నిలిచిపోయింది. బుధవారం సాయంత్రానికి నీటి ప్రవాహ వేగం తగ్గడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా చేతికందిన పంట నీటిపాలైందని నరసింగపురం గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

నన్నయ వర్సిటీలో
రేపు మెగా ఉద్యోగ మేళా
-వైస్-్ఛన్సలర్ ముత్యాలనాయుడు
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, నవంబర్ 22: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో 24వ తేదీన మెగా ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్టు యూనివర్సిటీ వీసీ ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు తెలియజేశారు. కౌశల్ గోదావరి, వికాస ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగంగా ఈ మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ జాబ్ మేళాలో 30 ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఐటిఐ, డిప్లొమో, పీజీ చదివిన 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల్లోపు అభ్యర్థులంతా ఈ జాబ్ మేళాకు అర్హులని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు అదే రోజు నియామక పత్రాలు అందజేస్తారని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని ఆసక్తి గల నిరుద్యోగ యువతీ, యువకులందరూ శుక్రవారం యూనివర్సిటీ వద్ద ఉదయం 8 గంటలకు తమ బయోడేటా, సర్ట్ఫికెట్ల జిరాక్స్, ఆధార్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని ముత్యాలనాయుడు తెలిపారు.

జెట్టీ పూర్తయ్యేదెప్పటికో...!
ఓడలరేవులో నత్తలతో పోటీపడుతున్న పనులు - మత్స్యకారుల్లో ఆగ్రహం
అల్లవరం, నవంబర్ 22: అల్లవరం మండలం ఓడలరేవు సముద్రంలో బోట్లపై వేటాడే చేపలను ఒడ్డుకు చేర్చుకుని వేలం ద్వారా మత్స్యకారులు విక్రయించుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన జెట్టీ, ఆక్షన్ హాలు నిర్మాణ పనులు నత్తనడకగా సాగుతున్నాయి. దశాబ్దాల కాలం నుండి ఇక్కడ జెట్టీ నిర్మించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చినా స్థల సేకరణ జరగకపోవడంతో జాప్యం జరుగుతూనే వచ్చింది. అయితే అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు జెట్టీ నిర్మాణానికి కృషిచేసి స్థల సేకరణ చేయించారు. గతేడాది ఈ జెట్టీ నిర్మాణానికి రూ.6.5 కోట్లు నిధులు మంజూరవ్వడంతో పనులను ప్రారంభించారు. అయితే అంతర్వేది వద్ద జెట్టీ నిర్మాణం, ఓడలరేవు జెట్టీ నిర్మాణ పనులను ఒకే కాంట్రాక్టర్ కైవసం చేసుకోవడంతో ఓడలరేవు జెట్టీ పనులపై కాంట్రాక్టర్ అంతగా శ్రద్ధ చూపించడంలేదు. దీంతో ఇక్కడ జెట్టీ నిర్మాణ పనుల్లో జాప్యం ఏర్పడుతోంది. జెట్టీ నిర్మాణం పిల్లర్ల దశకు చేరుకోగా ఆ పనులను నిలిపివేసి, ఆక్షన్ హాలు నిర్మాణ పనులను కాంట్రాక్టర్ చేపట్టారు. ఇక్కడ జెట్టీ నిర్మాణానికి సంబంధించి అధికారుల పర్యవేక్షణ కూడా సక్రమంగా లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. 2018 ఫిబ్రవరికి పూర్తికావాల్సిన జెట్టీ నిర్మాణం మరో ఏడాదికి కూడా పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జెట్టీ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.

గిరిజన ప్రాంతాల్లో
వౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత
జడ్పీ ఛైర్మన్ జ్యోతుల:గుడా ఛైర్మన్ గన్ని దత్తత గ్రామం ఫజుల్లాబాద్‌లో పాఠశాల భవనానికి భూమిపూజ
దేవీపట్నం, నవంబర్ 22: గిరిజన ప్రాంతాల్లో తాగునీరు, విద్య, వైద్యం వంటి సదుపాయాల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని జిల్లా పరిషత్ ఛైర్మన్ జ్యోతుల నవీన్ అన్నారు. దేవీపట్నం మండలంలో గుడా ఛైర్మన్ గన్ని కృష్ణ దత్తత తీసుకున్న ఫజుల్లాబాద్ గ్రామంలో పాఠశాల భవన నిర్మాణానికి బుధవారం నవీన్, గుడా ఛైర్మన్ గన్ని కృష్ణలు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో జ్యోతుల నవీన్ మాట్లాడుతూ ఫజుల్లాబాద్ గ్రామాన్ని గుడా ఛైర్మన్ గన్ని కృష్ణ దత్తత తీసుకుని ఆ గ్రామానికి కమ్యూనిటీహాలు నిర్మాణం కోసం రూ.5లక్షలు ఇవ్వడం అభినందనీయమని కొనియాడారు. గతంలో ఈ పాఠశాల ఎయిడెడ్ మేనేజ్‌మెంట్‌లో ఉండేదని, దీనిని ఎంపీపీ పాఠశాలలో విలీనం చేశారని, పాఠశాల నిర్వహణ కోసం సర్వశిక్షాభియాన్ నిధుల నుంచి 7.90లక్షల రూపాయలు మంజూరయ్యాయని అన్నారు. ఈ గ్రామంలో సిసి రోడ్లు, వాటర్ పైప్‌లైన్ నిర్మాణం కోసం రూ.16లక్షలు మంజూరు చేస్తున్నట్టు నవీన్ వెల్లడించారు. కార్యక్రమంలో రంపచోడవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి శీతంశెట్టి వెంకటేశ్వరరావు, ఏపీ టూరిజం బోర్డు డైరెక్టర్ చిన్నం బాబూరమేష్, జడ్పీటీసీ మట్టా రాణి, ఎంపీపీ పండా జయలక్ష్మి, ఇందుకూరు సర్పంచ్ కందికొండ గౌరీశ్వరి, ఇందుకూరుపేట సర్పంచ్ కారం సీతారాముడు, ఎంపీటీసీ పి సీతారత్నం, మండల పార్టీ అధ్యక్షుడు మాగాపు బాబూరావు, పార్టీ నేతలు సిద్దా మురళి, టి గంగాధరరావు, ఎం మధుసూదనరావు, నగేష్, ఎంవివి సత్యనారాయణ, ఎం నాగేశ్వరరావు పాల్గొన్నారు.

రాజ్యాంగాన్ని పరిహసిస్తున్న టిడిపి ప్రభుత్వం
వైసిపి ఎస్సీసెల్ ఛైర్మన్ నాగార్జున
రాజమహేంద్రవరం, నవంబర్ 22: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పరిహాసానికి గురవుతోందని వైఎస్సార్‌సిపి ఎస్సీసెల్ చైర్మన్ మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. బుధవారం నగర వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడిపి హయాంలో ఇతర దేశాలకు కూడా ఆదర్శమైన భారత రాజ్యాంగాన్ని కాలరాసే విధంగా అన్ని వర్గాలను అణిచివేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను దారిమళ్లిస్తున్నారని, అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కుని తన వర్గం వారికి కట్టబెడుతున్నారన్నారు. ఈనేపథ్యంలో రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఈనెల 26న రాజమహేంద్రవరంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా 26న మధ్యాహ్నం 3గంటలకు దళితులు, ఇతర వర్గాలతో కలిసి స్థానిక కంబాలచెరువు వద్దగల మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహం నుంచి గోకవరం బస్టాండ్ వద్దగల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతరం ఆనంకళాకేంద్రంలో సదస్సును నిర్వహిస్తామని నాగార్జున చెప్పారు. ఈకార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా అన్ని వర్గాల అభ్యున్నతికి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంటరీ
ఇన్‌చార్జి కె మోషేన్‌రాజు మాట్లాడుతూ టిడిపి రాజ్యాంగానికి తూట్టు పొడిచే విధంగా వైసిపికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపిలను కొనుగోలు చేస్తోందన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతునొక్కుతోందన్నారు. దళితులు, ఇతర వర్గాలను మోసం చేస్తోందన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు తలపెట్టిన రాజ్యాంగ ఆమోద దినోత్సవంలో దళితులు, అంబేద్కర్ అభిమానులు, ఇతర వర్గాలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈసమావేశంలో పార్టీ నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి, రౌతు సూర్యప్రకాశరావు, తానేటి వనిత, ఆకుల వీర్రాజు, ఎం షర్మిలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాల్య వివాహాలకు చరమగీతం పాడాలి
అడిషినల్ ఎస్పీ దామోదర్
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, నవంబర్ 22: బాల్య వివాహాలకు చరమగీతం పాడాలని జిల్లా అదనపు పోలీస్ సూపరింటెండెంట్ ఎఆర్ దామోదర్ ప్రజలకు పిలుపునిచ్చారు. వన బాలికల రక్షణకు తల్లిదండ్రల సహా ప్రతివొక్కరు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని కోరారు. జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని జెఎన్‌టియుకె ఆడిటోరియంలో బుధవారం మహిళాశిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కిషోర్ వికాసం పీర్ గ్రూప్ ట్రైనీస్‌కు నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమానికి దామోదర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన బాలికల్లో శారీరక పెరగుదలతో పాటు మానసిక ఎదుగుదల ఉంటేనే మంచి మార్గంలో నడవగలరన్నారు. చిన్నతనం నుండి తమ పిల్లలకు తల్లిదండ్రులు రక్షణ కల్పిస్తూ, సంరక్షణలో తగుజాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మంచి చెడుల పట్ల తగిన అవగాహన కల్పిస్తూ, మంచి నిర్ణయాలు తీసుకోవడం, తెలివిగా ఆలోచించడం వంటి అంశాల్లో తర్ఫీదు ఇవ్వాలన్నారు. ఏది చేయాలో, ఏది చేయకూడదో పిల్లలకు చిన్నతనం నుండి తెలిసేలా చూడాలని కోరారు. ఆడ పిల్లలను ఈవ్‌టీజింగ్ చేసే కుర్రాళ్లు, పోకిరీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కళాశాలల్లో ర్యాగింగ్ వంటి చర్యలకు పాల్పడే యువతకు తగిన గుణపాఠం తప్పదని, ఇటువంటి చర్యలతో జీవితాన్ని నాశనం చేసుకోవద్దని దామోదర్ హితవు పలికారు. మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎ సీతామహాలక్ష్మి మాట్లాడుతూ ఆడ పిల్లలను అత్యంత జాగ్రత్తగా సంరక్షించుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. పీర్ గ్రూప్ ట్రైనర్లకు రెండు రోజులు కిషోర్ వికాసంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. వీరు ఐదుగురు సభ్యుల వంతున ఒక్కొక్క హాస్టల్‌కు వెళ్ళి మూడు రోజుల పాటు ఉంటారన్నారు. బాలికలకు బాల్య వివాహాలను నివారించడం, రుతుక్రమం వచ్చినపుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య సంరక్షణ, చదువుకునే వయస్సులో వచ్చే సమస్యలపై అవగాహన కల్పిస్తారన్నారు. ఆడ పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను సేకరించి, ఫీడ్‌బ్యాక్, వారి కామెంట్స్ ప్రభుత్వానికి నివేదిస్తారని వివరించారు. వసతి గృహాల్లో 3 నుండి 10వ తరగతి వరకు చదివే బాలికలుంటారని, వారికి పరిశుభ్రత, వ్యక్తిగత సమస్యలపై తగిన అవగాహన కలిగిస్తారని సీతామహాలక్ష్మి తెలిపారు. స్ర్తిశిశు సంక్షేమ శాఖ డిసిటిఒ వెంకటరావు, డాక్టర్ సుశీల, కాకినాడ అర్బన్ డిసిటిఒ సావిత్రి, ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.

ఆదర్శమూర్తి మహారాణి బుచ్చి సీతయ్యమ్మ
వర్ధంతి సభలో కాకినాడ ఎంపీ నరసింహం
పెద్దాపురం, నవంబర్ 22: సమాజ సేవకు సర్వస్వం ధారపోసిన మహారాణి శ్రీ వత్సవాయి బుచ్చి సీతయ్యమ్మ ఆదర్శమూర్తి అని కాకినాడ పార్లమెంటు సభ్యుడు తోట నరసింహం అన్నారు. బుధవారం స్థానిక మహారాణి సత్రంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు అధ్యక్షతన మహారాణి 182వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ నరసింహం మహారాణి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో బాటసారుల ఆకలి తీర్చేందుకు మహారాణి హయాంలో స్థాపించిన మహారాణి సత్రం నేటికీ నిరంతరాయంగా నిత్యాన్నదానం నిర్వహించడం హర్షణీయమన్నారు. సభాధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు మాట్లాడుతూ మహారాణి వారు సత్రం నిర్వహణకు కత్తిపూడి, పెద్దాపురంలో 11 వందల ఎకరాల పొలాలను దానంగా ఇచ్చారన్నారు. నిత్యం పట్టణంలో వివిధ పాఠశాలలు, కళాశాలలో చదువుతున్న వందలాది మంది విద్యార్థులకు అన్నదానం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తాను మొదటి సారి మున్సిపల్ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు వాలు తిమ్మాపురం రోడ్డులోని సత్రం భూమి 30 ఎకరాలు పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని, ప్రస్తుతం అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా 4500 మందికి జి ప్లస్ త్రి పద్ధతిలో అపార్టుమెంట్లు అదే స్థలంలో నిర్మిస్తున్నామన్నారు. అనంతరం 500 మంది పేదలకు దుప్పట్లు పంపిణీచేసి, అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిషనర్ ఆర్ పుష్పనాధం, సత్రం మాజీ చైర్మన్లు కనకాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, కొత్తా వీరన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ కురుపూరి రాజు, ఆత్మ చైర్మన్ కలకపల్లి రాంబాబు, టిడిపి నేతలు రంధి సత్యనారాయణ, తూతిక రాజు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, కౌన్సిలర్లు కుంది ఉమామహేశ్వరి, ఉల్లి మంగ, విజ్జపు రాజశేఖర్, బేదంపూడి సత్తిబాబు, సత్రం సిబ్బంది పాల్గొన్నారు.

మద్యం షాపు తొలగించాలని ధర్నా
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, నవంబర్ 22: అమలాపురం రూరల్ మండలం కామనగరువు పంచాయతీ పాఠశాల సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేసిన మద్యం షాపును తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం మద్యం షాపు ఎదుట ధర్నా నిర్వహించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న తాలూకా ఎస్సై ఎం గజేంద్రకుమార్, ఎక్సైజ్ సీఐ గిరిధర్‌లు అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఇక్కడ మద్యం షాపును ఏర్పాటుచేశామని, ఎక్కడా షాపులు పెట్టనివ్వకపోతే ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుందని సీఐ అనడంతో ఆందోళనకారులు సీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్ కంటే ప్రభుత్వానికి ఆదాయం ముఖ్యమా అని సీఐని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐకి, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నెల రోజుల్లోగా షాపును తరలించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు, ఐద్వా పట్టణ కార్యదర్శి టి నాగవరలక్ష్మి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వి దొరబాబు, కె రాంప్రసాద్, సాయిరామ్, సంజయ్‌రామస్వామి, కె సత్తిబాబు, బి వెంకటరావు, కౌలు రైతు సంఘం నాయకులు పి వసంతకుమార్ తదితరులు నాయకత్వం వహించారు.

జాంథానీ మాస్టర్ వెంకట్రావు కన్నుమూత
యు.కొత్తపల్లి, నవంబర్ 22: ఉప్పాడ జాంథానీ చీరల దేశం నలుమూలలకు ప్రాచుర్యం కల్పించిన మాస్టర్ వీవర్ లొల్లా వెంకట్రావు (94) వాకతిప్ప గ్రామంలోని ఆయన స్వగృహంలో మంగళవారం కన్నుమూశారు. ఆయనకు నలుగురు కుమారులున్నారు. విఆర్‌ఎల్ ఫ్యాబ్రిక్స్ అధినేతగా వెంకట్రావు పేరుపొందారు. ఆర్థికంగా వెనుకబడిన వృద్ధ చేనేత కార్మికులకు ఆయన సొంత సొమ్ముతో పింఛన్లు అందించేవారు. ఆయన మృతి వార్త తెలుసుకున్న రాష్ట్ర చేనేత కార్మిక సంఘ నాయకులు కార్మికులు అధిక సంఖ్యలో ఉప్పాడ చేరుకున్నారు. ఆయన మృతికి సంతాపసూచకంగా మంగళవారం మధ్యాహ్నం నుంచి ఉప్పాడలోని చేనేత షాపులు మూసివేశారు. ఆయన భౌతికకాయాన్ని వాకతిప్ప, కొత్తపల్లి, కుదుగుడుమిల్లి గ్రామాల మీదుగా ఊరేగించి, ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో జడ్పీటీసీ మాజీ సభ్యుడు వెంగళి సుబ్బారావు, యునైటెడ్ వీవర్స్ ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ నాగేశ్వరరావు, సురేష్ ఉప్పాడ శారీ, భువనశ్రీ ఎంటర్‌ప్రైజెస్ అధినేతలు చోడిశెట్టి సురేష్, చోడిశెట్టి చినబాబు, కొత్తపల్లి మండల మాస్టర్ వీవర్స్ కొప్పుల వెంకటేశ్వరరావు, మధు, ఆర్ బోసు, నటరాజు, డి గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు.

తాండవ చక్కెర కర్మాగారం క్రషింగ్ ప్రారంభం
తుని, నవంబర్ 22: తాండవ చక్కెర కర్మాగారం 2016-17 సీజన్ క్రషింగ్ పనలు బుధవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఛైర్మన్ ఎస్‌ఎల్ రాజు, మేనేజింగ్ డైరెక్టరు ఎస్వీ నాయుడు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి క్రషింగ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మార్కెట్ యార్టు ఛైర్మన్ యనమల కృష్ణుడు, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు చెరకు గెడలను గానుగలో వేశారు. ఈ సందర్భంగా ఎండీ నాయుడు మాట్లాడుతూ ఈ సీజన్‌లో సుమారు 1.5 లక్షల టన్నులు క్రషింగ్ చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ పోల్నాటి శేషగిరిరావు, మున్సిపల్ ఛైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, పాయకరావుపేట సర్పంచ్ ధనిశెట్టి నాగమణి, తోట నగేష్, పెదిరెడ్డి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

కబేళాకు తరలిస్తున్న పశువులు స్వాధీనం
రాజవొమ్మంగి, నవంబర్ 22: అక్రమంగా కబేళాకు తరలిస్తున్న పశువులను పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకుని జీవకారుణ్య సంఘానికి అప్పగించారు. విజయనగరం నుండి హైదరాబాద్‌కు వ్యానులో తరలిస్తున్న 17 పశువులను జడ్డంగిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను, అదుపులోకి తీసుకున్నామరు. వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పశువులను కాకినాడ జీవకారుణ్య సంఘానికి అప్పగించామని జడ్డంగి ఎస్సై వెంకట నాగార్జున తెలిపారు.

హత్య కేసులో హిజ్రా అరెస్టు
రామచంద్రపురం, నవంబర్ 22: రామచంద్రపురం పట్టణంలో గతనెల 29వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి మృతికి సంబంధించి కాకినాడ బర్మాకాలనీకి చెందిన వరసాల సోనీ (బురుతి వీరవెంకట రమణ) అనే హిజ్రాను రామచంద్రపురం సీఐ కొమ్ముల శ్రీ్ధర్‌కుమార్ అరెస్టు చేశారు. బుధవారం స్థానిక అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ ఎన్ ఉషాలక్ష్మీకుమారి జ్యుడీషియల్ రిమాండుకు ఆదేశించడంతో హిజ్రాను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ శ్రీ్ధర్‌కుమార్ బుధవారం విలేఖర్ల సమావేశంలో వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వన్నాల లక్ష్మణ కామెర్ల వ్యాధి చికిత్స కోసం వెల్ల మందుకు వచ్చాడు. అయితే సమయం మించిపోవడంతో రామచంద్రపురం బస్టాండ్‌లోనే ఉండిపోయాడు. రాత్రి సమయంలో వరసాల సోనీతో అక్రమ సంబంధానికి బేరం కుదుర్చుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని టైర్ల కంపెనీ వద్దకు చేరారు. ఆ సమయంలో లక్ష్మణ సోనీని కొట్టాడు. దీనితో సోనీ ఆగ్రహంతో అతడిని హత్యచేసి, కాకినాడకు వెళ్లిపోయింది. స్థానిక డీఎస్పీ జయంతి వాసవీ సంతోష్ నేతృత్వంలో సీఐ దర్యాప్తు ప్రారంభించి పట్టణంలోని పలు వాణిజ్య సంస్థల వద్ద నెలకొని ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించగా, ఈ హిజ్రా రామచంద్రపురంలో సంచరించినట్టు గుర్తించారు. విషయం తెలుసుకున్న సోనీ రామచంద్రపురం వీఆర్వో పెంకే సత్యనారాయణను కలిసి తానే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు వివరించడంతో సీఐ వద్దకు ఆమెను తీసుకురావడంతో సీఐ శ్రీ్ధర్‌కుమార్ ఆమెను అరెస్టు చేశారు.