తూర్పుగోదావరి

రబీకి శివారుల్లో సాగునీటి ఎద్దడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, మార్చి 20: కోనసీమ రైతన్నకు రబీ సాగుకు నీటి కష్టాలు వచ్చి పడ్డాయి. వరినాట్లు పూర్తయి రెండు నెలలు గడుస్తున్నా నేటికీ రైతులు తమ పంట పొలాలను కాపాడుకునేందుకు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం పొట్ట దశలో ఉన్న వరిచేలకు సక్రమంగా సాగునీరు అందక వరిచేలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మురుగు కాల్వలకు కరకట్టలు నిర్మించి మోటారు ఇంజన్‌ల ద్వారా నీటిని పంటకాల్వలకు మళ్లించి వరిచేలకు సరఫరా చేసేందుకు నీటి సంఘాల ఆధ్వర్యంలో అధికారులు చేపట్టిన ముందస్తు చర్యలు సమీప ప్రాంతాల్లోని వరిచేలకు కొంతమేరకు మేలు చేకూరుస్తున్నా శివారు ప్రాంతాల్లోని పొలాలకు సాగునీరు అందడంలేదు. దీంతో శివారు ప్రాంత రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రాత్రనక పగలనక వరిచేల గట్లు, పంటకాల్వలు వెంబడే రైతులు తిరుగుతూ రబీ పంటను కాపాడుకునేందుకు నానా యాతన పడుతున్నారు. సెంట్రల్ డెల్టాలో లక్షా 72 వేల ఎకరాల ఆయకట్టలో రబీ వేయగా అమలాపురం డివిజన్‌లోని పది మండలాల్లో లక్షా 18 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. అయితే గోదావరిలో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి చేరడంతో ప్రధాన పంటకాల్వల్లో నీటి సామర్ధ్యం పూర్తిగా తగ్గిపోయి శివారు ప్రాంతాలకు చేరడంలేదు. దీంతో పొట్టదశలో ఉన్న వరిచేలను కాపాడుకునేందుకు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. అయితే రైతులు వంతుల వారీ విధానాన్ని పాటించి శివారు ప్రాంతాలకు సాగునీటిని వదలాలని అధికారులు సూచిస్తున్నా ఎగువ ప్రాంతాల్లోని రైతులు రాత్రివేళల్లో పంటకాల్వలకు అడ్డుకట్టలు వేసి నీటి చౌర్యానికి పాల్పడుతున్నట్టు శివారు ప్రాంత రైతుల నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఎగువ ప్రాంత రైతులకు, శివారు ప్రాంత రైతులకు మధ్య ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. రైతుల మధ్య ఏర్పడుతున్న నీటి వివాదాలను పరిష్కరించడంలో ఇరిగేషన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అమలాపురం డివిజన్‌లోని ఐ పోలవరం మండలం గుత్తెనదీవి, ఎదుర్లంక, ముమ్మిడివరం మండలం అయినాపురం, సోమిదేవరపాలెం, కాట్రేనికోన మండలం పల్లంకుర్రు, అంబాజీపేట మండలం బండారులంక, అమలాపురం మండలం భట్నవిల్లి, రెడ్డిపల్లి, చిందాడగరువు, అయినవిల్లి మండలం నేదునూరు, ముక్తేశ్వరం, అల్లవరం మండలం డి రావులపాలెం, దేవగుప్తం, సామంతకుర్రు, ఎంట్రికోన, కొమరగిరిపట్నం వంటి ప్రాంతాల్లోని శివారు ప్రాంతాలకు సాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికమైన నీటి చౌర్యం
ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉండటంతో భూగర్భ జలాలు అడుగంటడంతో కోనసీమలోని ఉద్యాన పంటలైన కొబ్బరి, అరటి, కూర పాదులకు సాగునీరే శరణ్యంగా మారింది. దీంతో కొబ్బరి రైతులు రాత్రి వేళల్లో ఆయిల్ ఇంజన్‌లు పెట్టి పంటకాల్వల నుండి నీటిని తోడేస్తున్నారు. దీంతో రబీ పంటకు సక్రమంగా నీరందడం లేదనేది రైతుల ఆరోపణ. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇరిగేషన్ అధికారులు చేపట్టిన చర్యలు ఫలించడంలేదు. స్థానికంగా ఉండే లస్కర్లు నీటి చౌర్యాన్ని అరికట్టే సందర్భంలో రైతులకు, లస్కర్లకు మధ్య వివాదాలు చోటుచేసుకుని ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. దీంతో లస్కర్లు నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు అమలాపురం డివిజన్ నీటిపారుదల శాఖ డీఈఈ కె రాంబాబు క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు రైతులు, నీటి సంఘాల నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఐ పోలవరం మండలం ఎదుర్లంక, గుత్తెనదీవి ప్రాంతాల్లో డీఈఈ రాంబాబు, ఏఈ సునీతాదేవి పర్యటించి సాగునీటి ఎద్దడిపై రైతులతో చర్చించారు. శివారు ప్రాంతాల రైతుల ఇబ్బందులను గుర్తించి ఎగువ ప్రాంతాల రైతులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా డీఈఈ రాంబాబు ఆంధ్రభూమితో మాట్లాడుతూ ప్రస్తుతం ఉష్టోగ్రతలు పెరిగిపోవడం, పంటకాల్వలో నీటి నిల్వలు తగ్గడం వంటి కారణాలతో శివారు ప్రాంతాల్లోని పంట చేలకు సాగునీటి ఇబ్బందులు ఉన్నాయన్నారు. శివారు ప్రాంతాల్లోని వరిచేలకు సాగునీటి సరఫరాకు ఎప్పటికపుడు చర్యలు తీసుకుంటున్నామని డీఈఈ రాంబాబు తెలిపారు.