తూర్పుగోదావరి

టేకు దోపిడీదారులకు గుణపాఠం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, ఏప్రిల్ 22: టేకు దోపిడీకి పాల్పడుతున్న స్మగ్లర్లకు గుణపాఠం తప్పదని సిపిఐ మావోయిస్టు ఖమ్మం జిల్లా కమిటీ పోస్టర్లలో హెచ్చరించింది. చింతూరు మండలం తుమ్మల, రింగల గ్రామాల మధ్య మావోయిస్టులు శుక్రవారం జాతీయ రహదారి 30పై పోస్టర్లు వదిలారు. ఈ పోస్టర్లు సిపిఐ మావోయిస్టు ఖమ్మం జిల్లా కమిటీ పేరుతో వెలిశాయి. ఈ పోస్టర్లలో పలువురు అటవీ అధికారులు టేకు స్మగ్లర్లకు సహకరిస్తూ అడవిని నాశనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అడవి ఆదివాసీల సంపద అని, దానిని కాపాడుకోవడం గిరిజనుల బాధ్యత అని అన్నారు. టేకు స్మగ్లర్లు అడవిని నాశనం చేస్తూ ప్రకృతి, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారని తెలిపారు. ఏడుగుర్రాలపల్లి, మారుమూల గ్రామాల్లోని అడవిలోని టేకును అక్రమంగా స్మగ్లర్లు తరలిస్తున్నారని, వారికి గుణపాఠం తప్పదని మావోయిస్టులు హెచ్చరించారు.
ఇది మావోయిస్టుల పనికాదు:సిఐ
మండలంలోని మావోయిస్టుల పేరుతో వెలిసిన పోస్టర్లపై సిఐ దుర్గారావును వివరణ కోరగా, అవి మావోయిస్టుల పనికాదని, ఎవరో ఆకతాయిలు ఈ పనికి పాల్పడి ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.
పంపా సరోవరంలో సీతారాముల చక్రస్నానం
శంఖవరం, ఏప్రిల్ 22:ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి వారి దేవస్థానం క్షేత్ర పాలకులైన శ్రీ సీతారాముల కల్యాణమహోత్సవ వేడుకల్లో భాగంగా కొండ దిగువున గల పంపా సరోవరంలో చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు. దేవస్థానంపై నుండి సీతారాముల ఉత్సవమూర్తులను దేవస్థానం వేద పండితులు, అర్చకస్వాములు ఉదయం 8 గంటలకు వేదమంత్రోచ్ఛారణలతో పంపా సరోవరానికి తోడ్కొని వచ్చి, ప్రత్యేకంగా అలంకరించి వేదికపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంపా సరోవరంలో చక్రస్నానమహోత్సవాన్ని నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు రత్నగిరిపై గల రామాలయంలో నూతన వధూవరులైన శ్రీ సీతారాములను ఆశీనులు గావించి నాకబలి, దండియాడింపు, ధ్వజావరోహణం, నీలాలోహిత పూజ, కంకణ విమోచన కార్యక్రమాలను అర్చకస్వాములు నిర్వహించారు.