తూర్పుగోదావరి

వెదురుపాకలో సమరసత ఫౌండేషన్ శాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయవరం, జనవరి 19: మండలంలోని వెదురుపాకలో హిందూ ధర్మ పరిరక్షణ వ్యాప్తికి సమరసత ఫౌండేషన్ ఏర్పాటుచేసినట్టు హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఛైర్మన్ పివిఆర్‌కె ప్రసాద్ తెలిపారు. మంగళవారం మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠానికి వచ్చిన సందర్భంగా ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులలో హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవడంతోపాటు మత వ్యాప్తి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హిందూ ధర్మంపై పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు, ద్వైత స్వామిజీలు హిందూ మతంపై ఒకే అభిప్రాయం లేకపోవడం తాము గమనించామన్నారు. ఈ పరిస్థితులలో గతేడాది డిసెంబరు 2న తిరుపతిలో ఆధ్యాత్మిక పరిషత్ సమావేశం ఏర్పాటుచేశామని, ఈ సమావేశంలో 44మంది స్వామిజీలు, 14మంది జియ్యర్లు, 10మంది ఎ గ్రేడ్ స్వామిజీలు, తొమ్మండుగురు ద్వైత స్వామిజీలు, ఇస్కాన్ తదితర హిందూ తమ ఆర్గనైజేషన్స్ అధిపతులు పాల్గొన్నారన్నారు. ఈ సమావేశంలో హిందూ ధర్మ పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలపై చర్చించామని, సమరసత ఫౌండేషన్ శాఖను జిల్లాస్థాయి నుండి గ్రామ స్థాయి వరకూ ఏర్పాటుచేశామన్నారు. ప్రతి గ్రామంలో హిందూ మతంపై ఆసక్తి ఉన్న వంద మంది కార్యకర్తలతో భక్తిమండలి ఏర్పాటుచేశామన్నారు. ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఒక నిధిని ఏర్పాటుచేసి వీటి కోసం ఆ నిధిని ఖర్చుచేయనున్నామని, ప్రతి హిందువు ఈ ట్రస్టులో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌కు చేదు అనుభవం
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, జనవరి 19: కాపులను బిసిల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాపు సామాజికవర్గానికి చెందిన కార్యకర్తలు, నాయకులు మంగళవారం ఆర్‌అండ్‌బి అతిథిగృహం వద్ద కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ ముందు నిరసన ప్రదర్శన చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విధంగా ఏడాదికి వెయ్యి కోట్లు చొప్పున నిధులు మంజూరుచేయాలని, కానీ వంద కోట్లు మాత్రమే కాపు కార్పొరేషన్‌కు విడుదలచేసారని కాపు సామాజికవర్గం కార్యకర్తలు చైర్మన్ చలమలశెట్టి ముందు నిరసన ప్రదర్శనచేశారు. కాపులను బిసి జాబితాలో చేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని, ఈ ప్రయత్నంలో భాగంగానే మంజునాథ కమిషన్‌ను నియమించారన్నారు. కమిషన్ లేకుండానే బిసి జాబితాలో చేర్చాలని కొంతమంది చేస్తున్న వాదన సరికాదన్నారు. ప్రస్తుతం కాపు కార్పొరేషన్‌కు తొలి విడతగా మాత్రమే రూ.100 కోట్లు విడుదలచేసారని, దశలవారీగా ఈ నిధులు విడుదలవుతాయన్నారు. కాపులను బిసి జాబితాలో చేర్చేందుకు ఎలాంటి సాంకేతికపరమైన సమస్యలు రాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారని, కాపులను బిసిల్లో చేర్చే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమేనని కాపు కార్పొరేషన్ డైరక్టర్ యర్రా వేణుగోపాలరాయుడు కాపు సంఘాల కార్యకర్తలకు వివరించారు.
విలీన మండలాల్లో రైతులకు ‘సహకారం’ పెరగాలి
రంపచోడవరం, జనవరి 19: విలీన మండలాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను ఏర్పాటుచేసి, రైతాంగానికి రుణాల కల్పన, సబ్సిడీలపై ఎరువులు అందించే వ్యవస్థను బలోపేతం చేసే ప్రక్రియ చేపట్టాలని జిల్లా కలెక్టరు, జిల్లా బ్యాంకర్ల సమన్వయ కమిటీ అధ్యక్షుడు హెచ్ అరుణ్‌కుమార్ అధికార్లను ఆదేశించారు. మంగళవారం స్థానిక ఐటిడిఎ సమావేశపు హాల్లో ఐటిడిఎ పరిధిలోని 11 మండలాలకు చెందిన బ్యాంకర్లు, అధికార్లతో ప్రత్యేక సమన్వయ సమావేశాన్ని జిల్లా కలెక్టరు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ విలీన మండలాల్లో బ్యాంకింగ్ సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు లేని కారణంగా వ్యవసాయ పంట రుణాల్లో విలీన మండలాలు వెనుకబడి ఉన్నాయన్నారు. అక్కడి ప్రజానీకం చేసిన ఫిర్యాదు మేరకు పిఎసిఎస్‌లు ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రతి సంఘంలో కనీసం 500 మంది సభ్యులు ఉండే విధంగా ఎంపిడిఒలు చర్యలు చేపట్టాలన్నారు. రుణాల కల్పనకు జాతీయ బ్యాంకులకు చెందిన బ్రాంచిలను రైతాంగానికి అందుబాటులోకి తేవడానికి బ్యాంకర్ల సమన్వయంతో కృషి చేస్తున్నామన్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా ఒక్కో రైతుకు రూ.50 వేల మేర పంట రుణాలు కల్పించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. ఎంపిడిఒలు వెలుగు సిబ్బందితో సమీక్ష నిర్వహించి, అన్ని అంశాల్లో పురోగతి ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఐటిడిఎ పిఒ చక్రధరబాబు మాట్లాడుతూ ట్రైకార్ ద్వారా బ్రాంచీల వారీగా యూనిట్ల గ్రౌండింగ్‌పై ఆరాతీసి, యూనిట్ల గ్రౌండింగ్‌లో వస్తున్న సమస్యలపై బ్యాంకర్లకు పలు సూచనలు చేశారు. ట్రైకార్ యూనిట్ల ఖరీదు రూ.2 లక్షల వరకు పెరిగిందని, దీనిలో రూ.లక్ష వరకు వ్యక్తిగతంగా సబ్సిడీ పొందవచ్చన్నారు. ఆర్‌బిఐ ఎజిఎం కె అనూరాధ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించేందుకు దేవరపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకున్నట్టు చెప్పారు. నాబార్డు ఎజిఎం ప్రసాద్ మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యతతోపాటు ఆర్థిక సాయం అందించడానికి 18 గ్రామాలను ఎంపిక చేశామని, బ్యాంకు మేనేజర్లు ఇందుకు సహకరించాలని కోరారు. సమావేశంలో సబ్‌కలెక్టర్ రవి, ఆంధ్రాబ్యాంకు డిజిఎం శేషగిరిరావు, ఎల్‌డిఎం జగన్నాథస్వామి, జిల్లా కో-ఆపరేటివ్ ఆఫీసర్ ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.
కాపు ఐక్య గర్జన
విజయవంతమవుతుంది
-ముద్రగడను కలిసిన టిటిడి మాజీ ఛైర్మన్ భూమన
ప్రత్తిపాడు, జనవరి 19: పదిమందికి మేలు కోసం జరుగుతున్న కాపు ఐక్య గర్జన జయప్రదం అవుతుందని టిటిడి మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. తుని సమీపంలో జరిగే కాపు ఐక్యగర్జన సభాస్థలికి ఏర్పాట్ల వద్ద ఉన్న కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంను భూమన మంగళవారం కలిశారు. సభ ఏర్పాట్లు, జన సమీకరణకు సంబంధించిన అంశాలను ఆయన ముద్రగడను అడిగి తెలుసుకున్నారు. బలిజ, ఒంటరి, తెలగ, కాపులలో నిరుపేద వర్గాలను బిసిల్లో చేర్చాలనే డిమాండ్‌ను నెరవేర్చడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని కరుణాకరరెడ్డి అన్నారు. న్యాయమైన, అమలు చేయాల్సిన అవసరం ఉన్న డిమాండ్‌నే కాపు సోదరులు కోరుతున్నారన్నారు. నిబద్ధత, నిస్వార్ధంతో పనిచేసే ముద్రగడ ప్రయత్నం విజయవంతం అవుతుందన్నారు. ఈ నెల 31న జరిగే కాపు ఐక్యగర్జన విజయవంతం అనంతరం అభినందించేందుకు మరోసారి వస్తానని కరుణాకరరెడ్డి అన్నారు. ముద్రగడ సహృదయం వల్లే రాష్ట్రం అంతటా తనలాంటి శ్రేయోభిలాషులు ఆయనకు ఉన్నారన్నారు. ఒక జాతి ఉత్తర్వులకు కృషిచేస్తున్న ముద్రగడను అభినందించేందుకు వచ్చానన్నారు. రాజా, చినబాబు గ్రౌండ్స్‌కు వచ్చిన కరుణాకరరెడ్డికి కాపు నాయకులు ఆయనను ఘనంగా స్వాగతించారు. మాకినీడి గాంధీ, గౌతు స్వామి, జల్లిగంపల ప్రభాకరరావు, మాజీ ఎంపిపి గోపు అచ్యుతరామయ్య, బొల్లు కొండబాబు, కృష్ణబాబు, దూలం మాణిక్యం, బాలిశెట్టి గోవిందు తదితరులు భూమనకు స్వాగతం పలికారు.
రైసుమిల్లుకు రేషన్ బియ్యం

రావులపాలెం, జనవరి 19: పేద ప్రజలకు అందవలసిన రేషన్ బియ్యాన్ని పక్కదోవ పట్టించి తిరిగి వాటిని ప్రభుత్వానికే సరఫరా చేస్తున్న రైసు మిల్లర్ మోసం విజిలెన్స్ దాడుల్లో బట్టబయలైంది. రావులపాలెం మండలం గోపాలపురం భవానీ రైసుమిల్లుపై సోమవారం అర్థరాత్రి నుండి మంగళవారం మధ్యాహ్నం వరకూ రాజమండ్రి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ ఎస్పీ పి రామప్రసాద్ ఆధ్వర్యంలో అధికారుల బృందం జరిపిన తనిఖీల్లో మూడు ఆటోలతో సహా 38 బస్తాల్లో ఉన్న 19.3 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించి సీజ్‌చేశారు. అంతేకాకుండా రికార్డులకు, నిల్వలకు వ్యత్యాసం రావడంతో మిల్లు గొడౌన్లలో ఉన్న రూ. 1.73 కోట్ల విలువైన ధాన్యం, బియ్యం, నూకలను సీజ్‌చేసి 6ఎ కేసు నమోదుచేశారు.
విజిలెన్స్ ఎస్పీ రామప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల కాలంలో గోపాలపురం భవానీ రైసుమిల్లులో అక్రమంగా పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నట్టు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి మూడు ఆటోల్లో రేషన్ బియ్యం రైసు మిల్లుకు చేరినట్టు సమాచారం అందడంలో విజిలెన్స్ ఎస్పీ రామప్రసాద్ ఆదేశాల మేరకు డిఎస్పీ టి రాజేంద్రకుమార్, సిఐలు గౌస్‌బేగ్, టి రామ్మోహన్‌రెడ్డి తదితర అధికారుల బృందం నిఘాపెట్టి ఆకస్మిక దాడులు నిర్వహించారు. అప్పటికే రైసుమిల్లు ప్రాంగణంలో మూడు ఆటోల్లో ఉన్న బియ్యాన్ని తనిఖీ చేయగా అవి రేషన్ బియ్యంగా నిర్థారణ అయింది. దీంతో ఆటోలతో పాటు ఆటోలో ఉన్న 38 బస్తాల (19.3 క్వింటాళ్ల) బియ్యాన్ని సీజ్‌చేశారు. తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలుచేసి ప్రస్తుత సీజన్లో ప్రభుత్వానికి సరఫరా చేయవలసిన బియ్యంలో కలిపి అక్రమాలకు పాల్పడుతున్నట్టు విజిలెన్స్ అధికారుల బృందం అంచనాకు వచ్చింది. ఈ మిల్లు ద్వారా ప్రస్తుత సీజన్లో ప్రభుత్వానికి 50 ఎసికెల (13.5 టన్నుల) బియ్యాన్ని సరఫరా చేయవలసి ఉంది. కోతలు పూర్తయి నెల రోజులు కాకుండానే ఇప్పటికే ఈ మిల్లు నుండి 43 ఎసికె (సుమారు 11.5 టన్నులు) బియ్యం సరఫరా జరగడం అధికారుల అంచనాలకు బలం చేకూర్చింది. అసలు బియ్యాన్ని పక్కదోవ పట్టించి వాటి స్థానంలో రేషన్ బియ్యాన్ని ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నారని అధికారులు నిర్థారణకు వచ్చారు. ఈ రైసుమిల్లులో ధాన్యం, బియ్యం, నూకలు భారీగా ఉండడంతో వాటిలో రేషన్ బియ్యం కలిపారా లేదా అన్న విషయంతోపాటు రికార్డులకు, నిల్వలకు సరిపోతున్నాయా లేదా అన్నదానిపై తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రికార్డులకు, నిల్వలకు భారీ వ్యత్యాసం కనిపించాయి. మంగళవారం మధ్యాహ్నం వరకూ నిల్వల లెక్కింపు చేపట్టారు. ఈ మిల్లు నుండి ప్రభుత్వానికి 7 ఎసికెల బియ్యం సరఫరా చేయవలసి ఉండడంతో అందుకు సంబంధించిన ధాన్యంతోపాటు 230 క్వింటాళ్ల బియ్యాన్ని మినహాయించి మిగిలిన రూ.1.73 కోట్లు విలువజేసే ధాన్యం, బియ్యం, నూకలను సీజ్ చేసినట్టు ఎస్పీ రామ్‌ప్రసాద్ తెలిపారు. ఆటోలలో సీజ్ చేసిన రేషన్ బియ్యం రావులపాలెం మండలం దేవరపల్లి, గోపాలపురం తదితర గ్రామాల నుండి వచ్చినట్టు ఆయన తెలిపారు. రైసుమిల్లు యజమానిపై 6ఎ కేసు నమోదుచేసి, జిల్లా కలెక్టర్ కోర్టుకు నివేదిస్తామని ఆయన తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ తహసీల్దార్ జి గోపాలరావు, ఎస్సై జివివి సత్యనారాయణ, ఎమ్మెస్వో టి సుభాష్, ఎజిపిఒ భాస్కర్, రావులపాలెం ఎస్సై పివి త్రినాధ్, సిబ్బంది రామారావు, కుమార్, కోటి తదితరులు పాల్గొన్నారు.
గాడ్ బోధనలతో హిందూమత పరిరక్షణ
రాయవరం, జనవరి 19: మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి గాడ్ చేస్తున్న ఆధ్యాత్మిక బోధనలు హిందూమత పరిరక్షణకు ఎంతో దోహదపడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. మంగళవారం గాడ్ 80వ జన్మదిన వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గాడ్ చూపిన భక్తిమార్గంలో పయనించడం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుందన్నారు. ఈతి బాధలు తొలగిపోతాయన్నారు. గాడ్ సతీమణి సీతామహాలక్ష్మి జ్యోతి ప్రజ్వలనతో జన్మదిన వేడుకలు ప్రారంభమయ్యాయి. తుమ్మిడి రామ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణా మండలి ఛైర్మన్ జస్టిస్ గ్రంధి భవానీప్రసాద్, ఎపి ఆధ్యాత్మిక పరిషత్ ఛైర్మన్ పివిఆర్‌కె ప్రసాద్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, డాక్టర్ గరికిపాటి నరసింహారావు, డాక్టర్ మేడసాని మోహన్, ఎర్రాప్రగడ రామకృష్ణ, చిలకపాటి విజయరాఘవాచార్యులు, మృదంగ విద్వాంసలు డాక్టర్ యల్లా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పీఠం విశిష్ఠతను, గాడ్ మహత్యాన్ని కొనియాడారు. విశ్రాంత ఐపిఎస్ అధికారి ఆర్ ప్రభాకరరావు, వేదవతి దంపతులకు పీఠం ఆదర్శదంపతుల పురస్కారాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేశారు. ప్రముఖ విద్యావేత్త అయ్యగారి ప్రసన్నకుమార్‌కు విజయదుర్గా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు.
అనంతరం పీఠాధిపతి గాడ్ ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ మానవత్వంతో అమ్మ సాక్షాత్కారం పొందవచ్చునని, భక్తులందరూ తోటి వారితో ప్రేమాభిమానాలు కలిగి ఉండడం, మానవత్వంతో మెలిగినప్పుడే అమ్మ ఆశీస్సులు పొందుతారన్నారు. అనంతరం భక్తులు గాడ్‌ను పుష్పమాలికలతో సత్కరించారు. కార్యక్రమంలో రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లికార్జునరావు, ప్రముఖ సంఘ సేవకులు సత్తి బులిస్వామిరెడ్డి, రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. పీఠం అడ్మినిస్ట్రేటర్ వివి బాపిరాజు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఏర్పాట్లు చేయగా, పిఆర్వో బాబి ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు.
ఏజన్సీ రైతులను ముంచేసిన వైట్‌బర్లీ
రాజవొమ్మంగి, జనవరి 19: విదేశాల్లో అత్యధిక డిమాండ్ ఉన్న వైట్ బర్లీ పొగాకు సేద్యం ఏజెన్సీ రైతుకి నష్టాన్ని మిగిల్చింది. కొనుగోలు ధర నిర్ణయంలో అధికారులు పట్టించుకోకపోడం, ప్రైవేటు కంపెనీలపై అజమాయిషీ లేకపోవడంతో కారుచౌకగా రైతుల నుండి పొగాకు కొనుగోలు చేసి నష్టాల ఊబిలోకి దింపింది. దీనికి తోడు వాతావరణ పరిస్థితులు కలసి రాకపోడం, చీడపీడలు అధికమవ్వడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. ఏజెన్సీలో బేంకెట్ ఎ వన్ అనే రకం పొగాకును ఈ ఏడాది సాగుచేశారు. క్వింటాల్ పొగాకు విదేశాల్లో రూ.30 వేలు పలుకుతుండగా ఇక్కడ రైతుల నుండి రూ.8 వేలకే కొనుగోలు చేస్తున్నారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో ఎకరాకు 600 కిలోల దిగుబడి రావలసి ఉండగా, సగానికి పడిపోయి, కేవలం 300 కిలోలు మాత్రమే లభించింది. ఎకరానికి రూ.30 వేలు పెట్టుబడి పెట్టగా కనీసం పెట్టుబడి కూడారాని పరిస్థితి నెలకొంది. క్వింటాల్ పొగాకును రూ.10 వేలు చేసి కొనుగోలు చేయమని రైతులు ఎంత ప్రాధేయపడినా ప్రైవేటు కంపెనీలు పట్టించుకోలేదు. మండలంలో సూరంపాలెం, రాజవొమ్మంగి, అప్పలరాజుపేట, దూసరపాము, ఎబి కాలనీ, లబ్బర్తి తదితర గ్రామాల్లో అత్యధికంగా ఈ పంటను సాగుచేసి రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. అధికారులు రంగంలోకి దిగి పంటపై దృష్టి సారించి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.
చెట్టును ఢీకొని కారు దగ్ధం
మారేడుమిల్లి, జనవరి 19: మారేడుమిల్లి గ్రామానికి సమీపంలో గాలిగోపురం ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి ఒక కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో వాహనం దగ్ధమైంది. అన్నవరం గ్రామానికి చెందిన కొందరు భద్రాచలం నుండి అన్నవరం వెడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు కారులో నుండి బయటకు పరుగులు తీయడంతో స్వల్పంగా గాయపడ్డారు. అదే సమయంలో వారికి చెందిన మరో వాహనం వెనుకగా వస్తుండడంతో వారికి సమాచారం అందించారు. మారేడుమిల్లి ఎస్సై శేషుకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

విలీన మండలాలపై శీతకన్ను
విఆర్ పురం, జనవరి 19: రాష్ట్ర విభజన జరిగి ఏడాదిన్నరయినా, విలీన మండలాల ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల ఖాళీల భర్తీ పూర్తిస్థాయిలో జరగకపోవటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వివిధ పనులకోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన ప్రజలకు ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరగక నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా మండల ప్రజలకు ఉపయోగపడే కార్యాలయాలు రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయాలు. ఈ కార్యాలయాల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది లేక పోవటంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రెవెన్యూ కార్యాలయంలో ఎఎస్‌ఒ 1, సీనియర్ అసిస్టెంట్స్ 2, విఆర్వోలు 9, విఆర్‌ఎలు 2, కంప్యూటర్ ఆపరేటర్ 1, అటెండర్లు 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనితో ముఖ్యంగా విద్యార్థులు నివాస, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాల కోసం వచ్చేవారికి పనులు నత్తనడక సాగుతుండటంతో అవస్థలు పడుతున్నారు. మండలంలో 11 పంచాయతీలకు 11 మంది విఆర్వోలు ఉండాల్సి ఉండగా, ఇద్దరు విఆర్వోలు మాత్రమే ఉన్నారు. దీంతో పని భారం వీరిమీద పడుతోంది. అలాగే కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్, సీనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు కూడా లేకపోవడంతో వారి పనులను కూడా అధికారులే నిర్వహిస్తున్నారు.
ఇక మండల పరిషత్ కార్యాలయంలో కార్యదర్శులు 3, సూపరింటెండెంట్ 1, అటెండర్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధికారుల కొరత కొంత వరకే ఉన్నా, అసలు అధికారి ఎంపిడిఒ ప్రజలకు ఎప్పుడు సరిగా కనిపించక పోవటంతో, ఈ కార్యాలయం రాజులేని రాజ్యంలా తయారైంది. ఉన్న సిబ్బంది అయినా సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారా అంటే అదీ లేదు. ఉన్న ఉద్యోగుల్లో కొందరు సమయ పాలన పాటించకుండా ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో మండల ప్రజలు ఎంపిడిఒ కార్యాలయం వైపు రావటమే మానేశారు. మంగళవారం ఎంపిడిఒ ఛాంబర్ గదికి తాళం వేసి ఉంది. ఇక స్ట్ఫారూమ్‌ని పరిశీలించగా, అక్కడా ఏ ఒక్క అధికారి కూడా కనిపించలేదు. విలీన మండలాల ప్రజలను ప్రభుత్వం పట్టించుకోవటంలేదని, అందుకే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయటంలో అలసత్వం వహిస్తోందని పలువురు గిరిజన నాయకులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి విలీన మండలాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీచేసి, ఉన్న ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వర్తించేలా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

ఆర్‌ఎంపి, పిఎంపిల హక్కుల సాధనకు కృషి
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, జనవరి 19: రాష్ట్రంలో సుమారు 80 వేల పైబడి ఉన్న ఆర్‌ఎంపిలు, పిఎంపిల సంక్షేమంతో పాటు వారి హక్కుల సాధనకోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కృషిచేస్తానని ఎమ్మెల్సీ కె రవికిరణ్‌వర్మ స్పష్టం చేశారు. మంగళవారం కిమ్స్ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర అనుభవం వైద్యుల హక్కుల జోనల్ సమావేశానికి జోనల్ కార్యదర్శి కంబాల బాబూరావు అధ్యక్షత వహించగా, ఎమ్మెల్సీ రవికిరణ్‌వర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ తమ వృత్తి కొనసాగిస్తున్నారని, వారి సంక్షేమానికి ప్రభుత్వపరంగా రావాల్సిన హక్కుల కోసం తాను శక్తివంచన లేకుండా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడు రాజా సిద్దార్ధ మాట్లాడుతూ అనుభవం వైద్యుల 20వ వార్షికోత్సవం ఫిబ్రవరి నెలలో విజయవాడలో జరుగుతుందన్నారు. సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని, తేదీ ఖరారు కాగానే అందరికీ తెలియజేస్తామని, రాష్ట్రంలో ఏర్పాటుచేసిన ఆరుజోన్‌ల నుండి సుమారు 30 వేల మంది ఈ సదస్సుకి హాజరవుతున్నారన్నారు గ్రామీణ వైద్యులు ఉభయ రాష్ట్రాల్లో 80 వేల మంది ఉన్నారని, వారిలో గతంలో 30 వేల మందికి శిక్షణ ఇచ్చామని, మిగిలిన వారికి కూడా శిక్షణ ఇచ్చేలా వెంటనే రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఎపిలో శిక్షణ పొందాల్సిన వారు ఎక్కువగా ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి శిక్షణ పొందని వారికి శిక్షణ ఇప్పించాలని రాజా సిద్దార్ధ కోరారు. గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించాలని, శిక్షణ పొందిన వారికి వెంటనే సర్ట్ఫికెట్లు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రధాన కార్యదర్శి కరెళ్ల గణపతిరావు మాట్లాడుతూ గ్రామీణ వైద్యం చేస్తున్న వేలాదిమంది కష్టాల్లో ఉన్నారన్నారు. 20వ వార్షికోత్సవం సందర్భంగా తమ సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తెచ్చి పరిష్కారం కోరతామన్నారు. లేకుంటే గ్రామీణ వైద్యాన్ని నిలిపివేస్తామని, తద్వారా ప్రభుత్వంపై వత్తిడి తెస్తామన్నారు. సమావేశంలో సంఘం నాయకులు ట్రెజరర్ విబిటి రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎల్ అచ్చిరెడ్డి, ఉపాధ్యక్షుడు వివి కృష్ణారావు, జోనల్ ఉపాధ్యక్షుడు పళ్ల శ్రీనివాసరావు, పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి ఎస్ కోటేశ్వరరావు, కోటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి రఫీ, ఎస్‌కె వలీ, గౌరవాధ్యక్షుడు నిమ్మకాయల లక్ష్మణరావు, ఉత్తరాంధ్ర జిల్లాల కార్యదర్శి జోషి, జిల్లా ప్రతినిధులు కాశి కృష్ణమూర్తి, శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యఅతిథులు ఎమ్మెల్సీ కె రవికిరణ్‌వర్మ, మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజులను సమావేశం ఘనంగా సన్మానించింది.