తూర్పుగోదావరి

సెల్లార్ల కూల్చివేత తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 21: రాజమహేంద్రవరంలోని దానవాయిపేట, ప్రకాష్‌నగర్, ఎవి అప్పారావురోడ్డు, జెఎన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో సెల్లార్ల కూల్చివేత తప్పదని కమిషనర్ వి విజయరామరాజు స్పష్టం చేశారు. గురువారం తన చాంబర్‌లో జరిగిన అఖిలపక్ష నాయకులతో ఈవిషయాన్ని స్పష్టం చేశారు. సెల్లార్ల కూల్చివేత, మెయిన్‌రోడ్డు విస్తరణపై అఖిలపక్ష నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసినా ఆయన పట్టించుకోలేదు. అవసరమైతే గడువు ఇస్తానని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన సెల్లార్ల కూల్చివేత మాత్రం తప్పదన్నారు. అయితే మెయిన్‌రోడ్డు విస్తరణ విషయంలో ట్రాఫిక్ సమస్యకు ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని సూచిస్తే సానుకూలంగా స్పందిస్తామన్నారు. కొంతమంది భవన యజమానులు గడువు కోరి కోర్టును ఆశ్రయించారని ఆయన చెప్పారు. అలాంటి వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కోర్టు తీర్పును కచ్చితంగా అమలు చేస్తామన్నారు. డిసెంబర్‌లోనే సెల్లార్లను తొలగించుకోవాలని నోటీసులు జారీ చేసినా యజమానులు స్పందించలేదన్నారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు, అక్రమ నిర్మాణాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇష్టానుసారం భవనాలు నిర్మిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. తాను కళ్లు మూసుకుని కూర్చోవాలని చెప్పవద్దని ఆయన వ్యాఖ్యానించారు. టౌన్‌ప్లానింగ్ అధికారుల వల్లే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ నిబంధనల ప్రకారమే ప్లాన్లు మంజూరయ్యాయని, ఆతరువాతే యజమానులు అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారని కమిషనర్ తెలిపారు. లంచం తీసుకోవడంతో పాటు ఇవ్వడం కూడా నేరమని ఆయన ఈసందర్భంగా గుర్తుచేశారు. అవినీతికి పాల్పడిన అధికారులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవడంతో పాటు విజిలెన్స్ విచారణకు కూడా సిఫార్సు చేస్తామని కమిషనర్ చెప్పారు. నగరంలో నగరపాలక సంస్థకు సంబంధించిన మార్కెట్లు, షాపింగ్ కాంప్లెక్స్‌ల వద్ద పార్కింగ్ కోసం మార్కింగ్ వేస్తున్నామన్నారు. నగరపాలక సంస్థకు సంబంధించిన లేఅవుట్లను జిపిఎస్‌కు అనుసంధానం చేశామని, ఈమేరకు ఎవరైనా వాటిని పరిశీలించుకోవచ్చన్నారు. బిపిఎస్ పథకంలో ఆమోదించిన భవనాలను ఎలా కూల్చివేస్తారన్న ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ సెల్లార్లతో ఉన్న భవనాలను క్రమబద్ధీకరించే అవకాశాలు లేవని కమిషనర్ స్పష్టం చేశారు. కొత్త మాస్టర్ ప్లాన్‌లో నివాస, వాణిజ్య ప్రాంతాలకు సంబంధించిన జోన్లను సవరిస్తామన్నారు. ఈసమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ మెయిన్‌రోడ్డు విస్తరణ చేపడితే వర్తకులు రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ సెల్లార్లు, మెయిన్‌రోడ్డు విస్తరణకు ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకుంటే యజమానులు, వర్తకులు ఇబ్బందులు పడతారని, వారికి కొంత గడువు ఇవ్వాలని కోరారు. ట్రాఫిక్, పార్కింగ్ సమస్యల పరిష్కారానికి తన హయాంలో దానవాయిపేటలో సుమారు 2400 గజాల స్థలాన్ని గుర్తించామని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అక్రమ భవన నిర్మాణాలను ప్రోత్సహించిన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. అలాగే మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లలో పార్కింగ్ సదుపాయం లేని, సెల్లార్లలో నిర్వహిస్తున్న వ్యాపారాలపై చర్యలు తీసుకోవాలన్నారు. వైఎస్సార్‌సిపి కేంద్ర కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ కూల్చివేతలు, విస్తరణ విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. సిపిఎం నాయకుడు టి అరుణ్ మాట్లాడుతూ సెల్లార్లు, మాస్టర్‌ప్లాన్, మెయిన్‌రోడ్డు విస్తరణ తదితర అంశాలపై అఖిలపక్ష నాయకులతో సమావేశాన్ని నిర్వహిస్తే బాగుండేదన్నారు. నగరంలో ప్రధానమైన మంచినీటి సమస్య, పారిశుద్ధ్య సమస్యలు ఉండగా సుందరీకరణ, ఆక్రమణల తొలగింపు వంటి అంశాలపై దృష్టిసారించడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల నిధుల వినియోగంపై శే్వతపత్రాన్ని విడుదల చేస్తామని ఇప్పటి వరకు ఆచరణలోకి తేలేదని విమర్శించారు. నారాయణ కళాశాల వంటి పెద్ద సంస్థల నిర్మాణాలపై దృష్టిసారించి, ఆతరువాతే చిన్నవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ ముందుగా బహుళ అంతస్తుల భవనాలపైనే దృష్టి సారించామన్నారు. సిపిఐ నాయకుడు మీసాల సత్యనారాయణ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన పాత నగరాన్ని వదిలి కొత్త ప్రాంతాల అభివృద్ధిపై దృష్టిసారించాలని సూచించారు. ఆయా ప్రాంతాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలన్నారు. ఫిక్కీ ఎపి కన్వీనర్ అశోక్‌కుమార్‌జైన్ మాట్లాడుతూ మెయిన్‌రోడ్డును విస్తరించి, సెల్లార్లలోని వ్యాపారాలను తొలగిస్తే ఒక కొన్ని తరాల వ్యాపారాలు రోడ్డునపడతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈసమావేశంలో వైసిపి ఫ్లోర్‌లీడర్ ఎం షర్మిలారెడ్డి, చాంబర్ అధ్యక్షుడు బూర్లగడ్డ వెంకటసుబ్బారాయుడు, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు ఎన్‌వి శ్రీనివాస్, క్రెడాయ్ గౌరవాధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్, ఫిక్కీ జిల్లా చైర్మన్ నందెపు శ్రీనివాస్, సిటీప్లానర్ పిఎస్‌ఎన్ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

కాపులను ఉద్ధరించేది చంద్రబాబు ఒక్కరే
ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప
శంఖవరం, జనవరి 21: ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్రలో నిరుపేద కాపులకు ఇచ్చిన హామీ మేరకు కాపు కార్పొరేషన్, కాపు కమిషన్ ఏర్పాటు చేసి నిరుపేద కాపుల అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కరేనని ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. శంఖవరం మండలంలోని మండపం పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో నూతన పంచాయతీ భవనం, వాటర్ టాంకుల ప్రారంభోత్సవానికి చినరాజప్ప, ఎంపి తోట నరసింహం, జడ్పీ నామన రాంబాబు, టిడిపి జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వత అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ కాపుల అభివృద్ధికి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కృషి చేస్తున్నారని, కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు కాపులకు 100 కోట్లతో కార్పొరేషన్, కమిషన్ చంద్రబాబు ఏర్పాటు చేస్తే, కొందరు రాజకీయ నిరుద్యోగులు కొన్ని రాజకీయ పార్టీలతో కుమ్మక్కై కాపుల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. అటువంటి పార్టీలకు లోబడవద్దని, ఒక పార్టీ జైలుకు వెళ్లే స్థితిలో ఉంటే, మరో పార్టీ ఇప్పటికే చుట్టేసిందన్నారు. ఈ ఏడాది జూన్ నుండి రాష్ట్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని, చంద్రబాబు ఒకపక్క రాజధాని నిర్మాణం చేపడుతూనే, మరోపక్క రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. పేదవారికే గృహాలు, రేషన్ కార్డులు, పింఛన్లు, సబ్సిడీ రుణాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, పేదల అభ్యున్నతే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. ప్రతీ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపి తోట మాట్లాడుతూ దేశంలోనే అన్నపూర్ణగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఖాళీగా అప్పగించారన్నారు. ఇటువంటి రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేందుకు రాజధాని నిర్మాణం, అభివృద్ధికి చంద్రబాబు దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. ఇతర కులాలకు ఆటంకం లేకుండా రిజర్వేషన్ కల్పించేందుకు కృషి చేస్తున్నారన్నారు. నిరుపేదలైన కాపులకు 50 శాతం సబ్సిడీపై రుణాలు మంజూరుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలోనూ క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుని, సంక్షేమ పథకాలు అందించేందుకే చంద్రబాబు జన్మభూమి కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. తొలుతగా పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు మాట్లాడుతూ మండపం గ్రామ పంచాయతీలో వౌలిక సౌకర్యాల కల్పనకు విశేష కృషి చేస్తున్నామని, గ్రామంలో డ్రైనేజి వ్యవస్థ మెరుగుకు కల్వర్టు అవసరాన్ని గుర్తించినట్టు పేర్కొన్నారు. సమావేశానికి తొలుతగా రూ.42 లక్షలతో నిర్మించిన రెండు వాటర్ టాంకులు, పంచాయతీ భవనం, ఎన్టీఆర్ సుజల ధార, పాఠశాల అదనపు భవనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బచ్చల గంగ, ఎంపిపి బద్ధి మణి రామారావు, ఎఎంసి ఛైర్మన్ కొమ్ముల కన్నబాబు, సర్పంచ్ చాగంటి బేబి, ఎంపిటిసిలు నక్కా వెంకటలక్ష్మి, పగడాల బాబ్జి, టిడిపి నాయకులు పొలం వెంకటరత్నం, పర్వత రాజబాబు, పర్వత సురేష్ తదితరులు పాల్గొన్నారు.
కాపు ఐక్యగర్జనను విజయవంతం చేయాలి
అంబాజీపేట, జనవరి 21: కాపులను బిసిల్లో చేర్చాలనే డిమాండుతో ఈ నెల 31న తునిలో జరితే కాపు ఐక్యగర్జనను విజయవంతం చేయాలని టిబికె జెఎసి నాయకులు కల్వకొలను తాతాజీ, మిండగుదిటి మోహన్, పత్తి దత్తుడు కోరారు. గురువారం ఇసుకపూడి, చిరతపూడి గ్రామాల్లో దారపురెడ్డి శ్రీను అధ్యక్షతన సమావేశం జరిగింది. కాపులందరూ ఒకే మాటపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో సూదా గణపతి, నిమ్మకాయల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
మితిమీరిన వేగమే ప్రమాదాలకు కారణం : ఎస్పీ రవిప్రకాష్
డి.గన్నవరం, జనవరి 21: మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం వల్లనే రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ రవిప్రకాష్ అన్నారు. ఆయన గురువారం పి గన్నవరం పోలీసు స్టేషన్‌ను ఆకస్మింగా సందర్శించి రికార్డులు పరిశీలించారు. అనంతరం ఎస్పీ స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ రోడ్డుప్రమాదాలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయని, వీటికి కారణం 90 శాతం అతివేగమే కారణమని రాజోలు నుండి వాహనాల వేగాన్ని నియంత్రించడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వేగంగా వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదుజేసి రెండుసార్లు చలానా విధించి, అప్పటికీ డ్రైవింగ్ తీరు మార్చుకోకుంటే లైసెన్సు రద్దుచేస్తామని ఎస్పీ తెలిపారు. రాజోలు తరువాత పి గన్నవరం మండలంలో జీవనోపాధికి గల్ఫ్ దేశాలు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉందని, వారు ఏజెంట్లు చేతులో మోసపోకుండా కౌనె్సలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. లంక భూములు వివాదాలను చిన్నగా ఉన్నప్పుడే సరిదిద్దాలని, అలా కాని పక్షంలో ప్రశాంత వాతావరణం దెబ్బతిని ప్రాణాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. సరిహద్దు తగాదాలు, వివాదాలను సామరస్యంగా పోలీసుల పరిష్కరించాలన్నారు. అదే విధంగా ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేయవలసిన బాధ్యత పోలీసుశాఖపై ఉందన్నారు. గుండాట, వ్యభిచారం, పేకాట, నాటుసారా నియంత్రించి అరికడతామని ఎస్పీ తెలిపారు. పోలీసు శాఖలో నాలుగు సంవత్సరాలు పైబడి ఒకే చోట ఉద్యోగంచేస్తే స్థానికులలో పరిచయాలు పెరిగి ముఖం చాటేస్తూ వృత్తికి ద్రోహం చేస్తారన్నారు. అందువల్లన వారిని బదిలీ చేస్తామని ఆయన తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి దొంగతనాలకు పాల్పడిన 36మంది జైలు శిక్ష అనుభవించి విడుదలైన వారిని జైలు రిలీజ్ మోనటరింగ్ సిస్టం ద్వారా వారి కదలికలను ఎప్పటికప్పుడు ఆన్‌లైను ద్వారా పోలీసు శాఖకు తెలుస్తుందని ఆ విధానం ఇప్పుడే ప్రారంభం అయిందన్నారు. పూర్తిస్థాయిలో అందుబాటులో రావడానికి ఒక సంవత్సరం కాలం పడుతుందని, ధర్నాలు, రాస్తారోకోలు రోడ్డుపై చేస్తే ప్రజాజీవనానికి ఆటంకం కలిగిస్తే సహించేదిలేదని, రంప నుండి చింతూరు వరకు 20 కమ్యూనికేషన్ టవర్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మావోయిస్టుల కదలికలను నియంత్రించినట్లు ఆయన తెలిపారు. యువ ఎస్సైలు బాగా పనిచేసి క్రైమ్ రేటును తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. అనంతరం పి గన్నవరం డొక్కా సీతమ్మ వారధిని పరిశీలించి ట్రాఫిక్ సమస్యలపై అమలాపురం డిఎస్పీ ఎల్ అంకయ్య, రావులపాలెం సిఐ పివి రమణ, ఎస్సై పి వీరబాబులకు సూచనలు ఇచ్చారు.

సిబ్బంది పనితీరు అధ్వాన్నం
జిల్లాస్థాయి సమీక్షా సమావేశంలో డిఆర్‌డిఎ పిడి మల్లిబాబు
సామర్లకోట, జనవరి 21: గతంతో పోలిస్తే తాజాగా జిల్లా వ్యాప్తంగా డిఆర్‌డిఎ వెలుగు పరిధిలో పనిచేస్తున్న పలు విభాగాల సిబ్బంది పనితీరు మరింతగా దిగజారి అధ్వాన్నంగా మారిందని, తక్షణమే సిబ్బంది పనితీరు మెరుగు పర్చుకోకుంటే రానున్న రోజుల్లో కఠిన చర్యలు తప్పవని డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్ మల్లిబాబు హెచ్చరించారు. గురువారం సామర్లకోట టిటిడిసిలోగల జిల్లా సమాఖ్య సమావేశ మందిరంలో జిల్లా పరిధిలో పనిచేస్తున్న ఏరియా కో-ఆర్డినేటర్లు, మండల అసిస్టెంట్ పోగ్రామ్ మేనేజర్లు, డిఎంజిలు తదితర సిబ్బందితో శాఖాపరమైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సిబ్బంది పనితీరు అధ్వాన్నంగా ఉందని, గతంతో పోలిస్తే పనితీరు చాలా కనిష్టస్థాయికి దిగజారిందన్నారు. జిల్లాలో ఒక ఎపిఎం ట్యాబ్ కొనుగోలులో అక్రమాలకు పాల్పడినట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు. విధి నిర్వహణలో ఎటువంటి తప్పులు చేసినా సహించేది లేదన్నారు. అన్ని అంశాల్లో సిబ్బంది పనితీరు అధ్వాన్నంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుసార్లు జిల్లాస్థాయి, ఉన్నత స్థాయి సమీక్షల్లో పనితీరు బాగోని కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసిన దుస్థితి ఏర్పడిందన్నారు. పూర్తిస్థాయిలో సిబ్బంది లేరని తాను చెప్పబోతే, ఉన్న సిబ్బందితో ఏం సాధించారని జిల్లా కలెక్టర్ సమీక్షలో తనకు అక్షింతలు వేశారన్నారు. ఇచ్చిన ట్యాబ్‌లను వినియోగించకుండా అందులో సినిమాలు చూస్తున్నారా అని ఎపిఎంలపై పిడి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు బాగా వెనుకబడిన మండలాలకు చెందిన ఎపిఎంలకు ఇంక్రిమెంట్లు నిలుపుదల చేయాలని సెర్ప్ ఉన్నతాధికారులకు లేఖ పంపుతామని పిడి హెచ్చరించారు. సమావేశంలో మధ్యలో హాజరైన పలువురు ఎపిఎంలపై ఇంత జాప్యం ఏమిటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్షిక రిటర్న్స్ దాఖలు చేయడంలో అంత నిర్లక్ష్యం ఏమిటని సిబ్బందిపై పిడి మండిపడ్డారు. పలు అంశాలపై మండలాల వారీగా సమీక్షించి ఎసిలు, ఎపిఎంలను బాధ్యులను చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్షలో అడిషనల్ పిడి కె శ్రీనివాసకుమార్, డిఆర్‌డిఎ ఎఒ బోత్స రాధాకృష్ణ, డిపిఎంలు టి బాబూరావు, వల్లి, సూర్యనారాయణ, జిల్లా పరిధిలో అందరు ఎపిఎంలు, ఏరియా కో-ఆర్డినేటర్లు, డిఎంజిలు పాల్గొన్నారు.