తూర్పుగోదావరి

నవ నిర్మాణ దీక్షలో బాహాబాహీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తపేట, జూన్ 2: కొత్తపేటలో నిర్వహించిన నవ నిర్మాణ దీక్షా కార్యక్రమం గురువారం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రభుత్వంపై, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావుపై సభలో విమర్శలు చేయటంతో సమావేశం ఉద్రిక్తంగా మారింది. తొలుత నవ నిర్మాణ దీక్షా సభ ప్రత్యేకాధికారి శ్రీరామమూర్తి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిధులుగా ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి బండారు సత్యానందరావులు పాల్గొన్నారు. నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి బండారు సత్యానందరావు తొలి ఉపన్యాసం ద్వారా రాష్ట్ర విభజన జరిగిన నేపధ్యం, రాష్ట్ర విభజనతో ఆంధ్రకు ఏర్పడిన నష్టాలను వివరించారు. సరిగ్గా 11 గంటల సమయంలో నవ నిర్మాణ దీక్షపై ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం అందరిచేత ప్రమాణం చేయించారు. తదుపరి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రసంగిస్తూ రాష్ట్ర విభజనలో ఇటు పార్టీలు, అటు నాయకులు ద్వంద్వ తీరే రాష్ట్రాన్ని విడదీసిందని విమర్శించారు. రాష్ట్రం విడిపోవడంతో ఆర్థికంగా ఎంత నష్టంలో ఉందో తమకు కూడా తెలుసునని, అయితే ఆర్థిక లోటును పూడ్చుకోవాలంటే ఖర్చును తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసానికి వాస్తు రూపంగా ఏకంగా రూ.90 కోట్లకు పైగా ఖర్చుచేశారని, అలాగే అనేక ఖర్చులు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం ద్వారా ఎంపిలకు నిధులు వస్తుంటే భారత రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ సాక్షిగా రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచిన వారికి నిధులు ఇవ్వకుండా ఓడిన వారికి నిధులు ఇస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా అభివృద్ధి నిధులను ఇక్కడ పక్కదారి పట్టిస్తున్నారన్నారు. దాత అభివృద్ధి కోసం ఇచ్చిన భూమితో సైతం రియల్ వ్యాపారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ తరుణంలో సభలో ఉన్న టిడిపి నేతలు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. దీంతో అక్కడే ఉన్న వైసిపి నేతలు సైతం సభావేదిక వద్దకు చేరుకుని ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలకు దిగటంతో సభావేదిక అరుపులు కేకలతో దద్దరిల్లింది. ఒకదశలో ఒకరిపై ఒకరు దాడికి సైతం దిగటంతో అక్కడే ఉన్న రావులపాలెం సిఐ రమణతోపాటు ఎస్‌ఐ డి విజయ్‌కుమార్‌లు సిబ్బందితో సభావేదికకు చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. కొద్దిసేపు గలాటా అనంతరం ఎమ్మెల్యే చిర్ల సభాస్థలి నుంచి తమ నాయకులతో వెళ్లిపోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.
అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో అక్కడ వైసిపి అధినేత జగన్ అడ్డుపడుతుంటే నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే చిర్ల అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో టిడిపి, వైసిపి నేతలతో పాటు నియోజవర్గ అధికారులు పాల్గొన్నారు.

వేరుశనగ గోదాములపై విజిలెన్స్ దాడి
రూ.77 లక్షల సరుకు సీజ్
గొల్లప్రోలు, జూన్ 2: గొల్లప్రోలులోని పలు వేరుశెనగ గోదాములపై గురువారం విజిలెన్స్ అధికారులు దాడిచేసి రికార్డులకు, నిల్వలకు వ్యత్యాసం ఉండటంతో సుమారు రూ.77 లక్షల విలువైన వేరుశెనగకాయలు, గుళ్లు సీజ్ చేశారు. విజిలెన్స్ డిఎస్పీ విబి రాజేంద్రకుమార్ ఆధ్వర్యంలో అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో మూడు గోదాములపై దాడులు నిర్వహించారు. మణిహాస్ ట్రేడర్స్‌లో రికార్డులకు, నిల్వలకు వ్యత్యాసం ఉండటంతో 46 క్వింటాళ్ల వేరుశెనగ కాయలు, 150క్వింటాళ్ల వేరుశెనగ గుళ్లు సీజ్ చేశారు. అలాగే వెంకటదుర్గ ట్రేడర్స్‌కు లైసెన్స్ లేకపోవడంతో 96.55 క్వింటాళ్ల వేరుశెనగ కాయలు, సద్గురు ట్రేడర్స్‌లో రికార్డులకు, నిల్వలకు వ్యత్యాసం ఉండటంతో 540 క్వింటాళ్లు వేరుశెనగ కాయలు, 10 క్వింటాళ్ల గుళ్లు సీజ్ చేశారు. సీజ్ చేసిన సరుకు విలువ సుమారు రూ.77లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అనంతరం డిఎస్పీ విబి రాజేంద్రకుమార్ మాట్లాడుతూ అపరాలు, వేరుశెనగ ధరలు పెరిగిపోవడంతో అక్రమ నిల్వలు అరికట్టేందుకు జిల్లావ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రావులపాలెం, ఈతకోట, తునిలలో కూడా తనిఖీలు నిర్వహించి రికాక్డులకు, నిల్వలకు వ్యత్యాసం ఉన్న సరుకు సీజ్ చేసినట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు కోటి రూపాయల విలువైన సరుకు సీజ్ చేసినట్టు వివరించారు. గొల్లప్రోలులోని మరో గోదాములో తనిఖీలు కొనసాగుతున్నట్టు ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో సిఐ గౌస్‌బేగ్, తహసీల్దార్ గోపాలరావు, ఎఒ శ్రీనివాస్ పాల్గొన్నారు.

జిల్లాలో మొదలైన శ్రీకాళహస్తీశ్వరుని రథయాత్ర
రావులపాలెం, జూన్ 2: రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయం నుండి బయల్దేరిన స్వామివారి ప్రచార రథయాత్ర గురువారం జిల్లాలో ప్రారంభమైంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం నుండి వశిష్ఠగోదావరి బ్రిడ్జి మీదుగా రావులపాలెం మండలంలోకి ఈ రథయాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా గోపాలపురం, రావులపాలెం ప్రధాన సెంటర్లలో వందలాది మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అర్చకులు రామకృష్ణశర్మ, చంద్రవౌళిశర్మ, సుబ్రహ్మణ్యశర్మలు భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. రధంలో ఒక వైపు స్వామివారి, మరోవైపు అమ్మవారి ఉత్సవ మూర్తులను ఏర్పాటుచేయగా, వెనుక వైపు నాగేంద్ర స్వామివారి రూపాన్ని ఏర్పాటుచేశారు. ముందు వైపు శివలింగానికి తన కన్నుతీసి అతికిస్తున్న భక్త కన్నప్ప చిత్రాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ జిల్లాలో గురువారం ప్రారంభమైన రథయాత్ర ఈ నెల 15వ తేదీ వరకూ కొనసాగుతుందన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖాధికారులు సూచించిన మార్గంలో ప్రముఖ దేవాలయాల మీదుగా రథయాత్ర సాగుతుందన్నారు. ఆయా ఆలయాల వద్ద భక్తుల సందర్శనార్థం రథాన్ని నిలుపుతామన్నారు. హైందవ ధర్మప్రచారం, స్వామివారిని భక్తుల ముంగిటకు తీసుకురావడం ప్రధాన లక్ష్యాలుగా ఈ రథయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం రథయాత్ర ఆత్రేయపురం మండలం ర్యాలి జగన్మోహినీ కేశవ స్వామివారి ఆలయానికి బయల్దేరింది.

శివకోడులో ఘనంగా నవ నిర్మాణ దీక్ష
రాజోలు, జూన్ 2: రాష్ట్ర నవ నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని జిల్లా టిడిపి ఇన్‌ఛార్జి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. గురువారం రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన నవ నిర్మాణ దీక్ష కార్యక్రమం శివకోడు కాపు కల్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి రామానాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు రాష్ట్ర నవ నిర్మాణ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ ఎవి సూర్యనారాయణరాజు, డ్వామా పిడి నాగేశ్వరరావు, తహసీల్దారు జి లక్ష్మీపతి, ఎంపిడిఒ చంద్రశేఖరరావు, భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ, ఎంపిపి అనసూరి సునీత, గేదెల వరలక్ష్మి, బోనం నాగేశ్వరరావు, బిక్కిన రామం, చాగంటి శిరీష, మంగిన భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.