తూర్పుగోదావరి

గోదావరిలో డ్రెడ్జింగ్‌కు ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 26: ఎట్టకేలకు గోదావరి నదిలో ఇసుక మేటలు, దిబ్బలు తొలగించే డ్రెడ్జింగ్ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే డ్రెడ్జర్లు గోదావరి నది వద్దకు చేర్చారు. దశాబ్దాలుగా గోదావరి నదిలో డ్రెడ్జింగ్ జరగక, పూడుకుపోయి, కాటన్ బ్యారేజీ వద్ద నీటి నిల్వ సామర్థ్యం బాగా తగ్గిపోయింది. ఇసుక మేటలు పెరిగిపోవడంతో నదీ గమన దిశలు కూడా మారిపోయాయి. ఈ క్రమంలో కొత్తగా ఏటిగట్ల వద్ద కోతకు గురయ్యే ప్రాంతాలు కూడా ఏర్పడ్డాయి. దశాబ్దాల తరువాత చేపట్టనున్న ఈడ్రెడ్జింగ్ వల్ల నది లోతు పెరగడంతోపాటు ప్రవాహ దిశలు కూడా సవ్యమైన రీతిలో సాగేందుకు సానుకూలత ఏర్పడింది. ఏళ్ల తరబడి పెరిగిపోయిన ఇసుక దిబ్బలను తొలగించి పూడిక తీసేందుకు చర్యలు చేపడితే ప్రవాహ దిశలు పెరిగి నది సామర్థ్యం కూడా పెరిగే అవకాశముందని డ్రెడ్జింగ్‌కు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం దాదాపు రూ.13కోట్ల వరకు కేటాయించినట్టు తెలిసింది. మరో వారంలో డ్రెడ్జింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. డ్రెడ్జింగ్ ద్వారా పూడిక తీసిన ఇసుకను పశ్చిమగోదావరి జిల్లా ఔరంగబాద్, వాడపల్లి, తూర్పుగోదావరి జిల్లాలో కుమారి టాకీస్, గాయత్రి ర్యాంపు, గోంగూరతిప్ప వద్ద ఇసుకను స్టాక్ పాయింట్లుగా పెట్టారు. పూడిక తీసిన ఇసుకను ఏవిధంగా వినియోగించాలనే విషయంలో ఇంకా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయానికి రాలేదని తెలిసింది. డ్రెడ్జింగ్ ద్వారా నదిలో దాదాపు కోటి క్యూబిక్ మీటర్ల వరకు ఇసుక లభించవచ్చని అంచనావేశారు.ఏదేమైనప్పటికీ మరో వారంరోజుల్లో నదిలో డ్రెడ్జింగ్ పనులు చేపట్టనున్నారు. పూడుకుపోయిన నదీ గర్భం వల్ల వరదల తాకిడి ఈసారి బొబ్బిల్లంక, ఆల్కట్‌గార్డెన్స్, వేమగిరి, సుందరపల్లి, పూళ్ల వద్ద గట్లు బలహీనపడినట్టుగా గ్రహించి, ఆయా ప్రాంతాల్లో రూ.25లక్షల నిధులతో గట్ల పటిష్టతకు చర్యలు చేపట్టనున్నారు.
ఇదిలావుండగా గోదావరి వరదలను ఎదుర్కొనేందుకు ఇరిగేషన్ శాఖ ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసింది. ఏటిగట్ల పరివాహక ప్రాంతాల్లో ఫ్లడ్ మెటీరియల్ సిద్ధం చేశారు. సముద్రంలోకి వరద నీరు సత్వరం లాగే విధంగా ఆయా ప్రాంతాల్లో ముంపు లేకుండా రామేశ్వరం మొగ వద్ద డ్రెడ్జింగ్ చేపడుతున్నారు. ఏటిగట్ల పహారాకు వందమంది అవుట్ సోర్సింగ్ లస్కర్లను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. జూలై 15 తరువాత వరదలు వచ్చే అవకాశం కనిపిస్తోందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది ఇదేరోజుల్లో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుండి 8లక్షల యాభైవేల క్యూసెక్కుల డిశ్చార్జ్ ఉంటే ఈఏడాది సీలేరుతో కలుపుకుని 850 క్యూసెక్కుల డిశ్చార్జ్ మాత్రమే ఉంది.