తూర్పుగోదావరి

అతీగతీ లేని డ్రెడ్జింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 22: గోదావరి నదిలో డ్రెడ్జింగ్ పనులకు అతీ గతీ లేకుండా పోయింది. టెండర్లు పూర్తయ్యి ఏజెన్సీకి పనులు అప్పగించినప్పటికీ ఇంకా డ్రెడ్జింగ్ పనులు ఆరంభం కాలేదు. డ్రెడ్జింగ్ కార్యకలాపాలు ఇసుక సిండికేట్ ఉచ్చులో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వరదలకు నదిలో ఇసుక దిబ్బలు మరింతగా పెరిగిపోయాయి. దీంతో నదీ గమన దిశలు మారిపోయే పరిస్థితి దాపురించింది. ఇటీవల వరద ఉద్ధృతికి రాజమహేంద్రవరం సమీపంలో గట్టు కోతకు గురై గండిపడే పరిస్థితి ఉత్పన్నమైంది. అఖండ గోదావరి గర్భంలో రాజమహేంద్రవరం వైపు మరో పాయగా విడిపోవడం కూడా తటస్థించినట్టు జల వనరుల శాఖ అధికారులు గుర్తించారు. సమీపంలోని ఇసుక దిబ్బ ఏటికేడాది పెరిగిపోవడం వల్లే నదీ స్వరూపం మారిపోతోందని, దీనికితోడు నది గమన దిశ మారిపోయి ఈ ప్రాంతంలో నది గట్టు కూడా కోతకు గురైనట్టు జల వనరుల శాఖ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్టు తెలిసింది.
ఇదిలా వుండగా దాదాపు నెల రోజులుగా డ్రెడ్జర్ మిషన్ పని లేకుండా మూలనపడింది. రాజమహేంద్రవరం సమీపంలో నదీ పాయలో ఈ డ్రెడ్జింగ్ మిషన్‌ను నిలుపుచేశారు. వాస్తవానికి గత వరదలకు ముందే నదిలో డ్రెడ్జింగ్ పని మొదలు కావాల్సి వుంది. సుమారు రూ.15 కోట్ల అంచనా నిధులతో నదిలో డ్రెడ్జింగ్ పనులకు ఆమోదం లభించింది. ఇసుక దిబ్బలు, ఇసుక మేటలను గతంలో ఫ్లవింగ్ పక్రియ ద్వారా గత రెండు దశాబ్ధాల క్రితం వరకు నిరంతరం నిర్వహించేవారు. ఈ విధానం వల్ల నదీ గర్భం ఎప్పటికపుడు పెరిగి బ్యారేజి వద్ద నదీ గర్భంలోతు పెరిగేది. దీని వల్ల రబీ సీజన్‌లో నదిలో నీటి లభ్యత తగ్గుముఖం పట్టినా నదీ గర్భంలో నీటి నిల్వలు ఎక్కువగా వుండేవి కాబట్టి పెద్దగా ఇబ్బంది తలెత్తేది కాదు. అయితే ఈ ఫ్లవింగ్ ప్రక్రియ ఎపుడైతే విరమించారో అప్పటి నుంచే రబీ నీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నదిలో ఇసుక మేటలు, దిబ్బలు దీవుల్లా పెరిగిపోవడంతో నదీ గమన దిశలు మారిపోతున్నాయి. ఇసుక దిబ్బ ఒక పెద్ద దీవిగా మారిపోవడంతో గోగుల్లంక వద్ద అఖండ గోదావరి భాగంలోనే ఒక పాయలా రూపాంతరం చెందుతోందంటే పరిస్థితి నదికి ఎంత ప్రమాదం పొంచి వుందో అర్ధం చేసుకోవచ్చు. పరీవాహ ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి. ఇసుక దిబ్బలు, మేటలు పెరిగిపోవడం వల్ల, తీరం ఆక్రమణలకు గురి కావడం వల్ల కూడా నదీ గమన దిశలు మారిపోయి కొత్త ప్రాంతాల్లో కోతలకు గురయ్యే పరిస్థితి దాపురించింది. ఇసుక దిబ్బలు వల్ల రాజమహేంద్రవరం సమీపంలోని గాయత్రి ర్యాంపు వద్ద గట్టు ఇటీవల వరద ఉద్ధృతికి కోతకు గురయ్యే పరిస్థితి దాపురించింది. సకాలంలో కోతను గుర్తించి గట్టుకు రక్షణగా ఇసుక బస్తాలు వేయడంతో పెనుప్రమాదం తప్పింది. ఇసుక మేటలు, దిబ్బలను తొలగించడం వల్ల సుమారు కోటి క్యూబిక్ మీటర్ల ఇసుక లభ్యమవుతుందని అంచనా వేశారు. ఈ ఇసుకను రాజధాని నిర్మాణ అవసరాలకు వినియోగించే విధంగా నిర్ణయించినట్టు తెలిసింది. డ్రెడ్జింగ్ ద్వారా లభించే ఇసుకను ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని కుడి, ఎడమ గట్టు ప్రాంతాల్లోని ఆరు చోట్ల స్టోర్ చేయాలని గుర్తించారు. సకాలంలో డ్రెడ్జర్ ద్వారా ఇసుక మేటలు తొలగించే ప్రయత్నం చేస్తే ఇబ్బడి ముబ్బడిగా వచ్చే ఇసుక వల్ల తమ డిమాండ్‌కు తగ్గిపోయి ఇసుక వ్యాపారం పడిపోతుందని ఇసుక సిండికేట్లు నదిలో ఈ డ్రెడ్జింగ్ కార్యకలాపాలకు బ్రేక్ వేసినట్టు ప్రచారం జరుగుతోంది. టెండర్లు పూర్తయి పనులు అప్పగించిన సంస్థ తమ మిషనరీని తెచ్చి నదిలో ప్రదర్శనకు పెట్టింది తప్ప ఇప్పటికొచ్చి డ్రెడ్జింగ్ పనులు చేపట్టకపోవడంలో ఆంతర్యం మాత్రం అర్ధం కావడం లేదు. దీనికి తోడు వరదకు ముందే డ్రెడ్జింగ్ చేస్తే మరింతగా ఉపయుక్తంగా వుంటుందని, ఇసుక మేటలు, దిబ్బలు నదీ ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకు పోయి నదిలో నీటి నిల్వ సామర్ధం పెరిగేందుకు దోహదపడుతుందని ఆశించారు. కానీ ఇప్పటి వరకు అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించి ఇసుక సిండికేట్లకు వత్తాసు పలుకుతుండటంతోనే డ్రెడ్జింగ్ పనులు మొదలు కాలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ వరదల కాలంలోనే డ్రెడ్జింగ్ పనులు కూడా చేపడితే నదిలో ఇసుక మేటలు తొలగిపోవడంతోపాటు నదిలో నీటి గర్భం లోతు కూడా పెరిగేందుకు అవకాశం వుంది.