తూర్పుగోదావరి

అంత్య పుష్కరాలకు అంతా రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 30: గోదావరి తీరంలో అంత్య పుష్కరాలను పురస్కరించుకుని ఆధ్యాత్మిక సోయగం వెల్లివిరుస్తోంది. అంత్య పుష్కర స్నానాలు ఆచరించి ప్రాచీన క్షేత్రాల్లో దైవదర్శనం చేసుకునేందుకు భక్తజనం మరొకసారి రాజమహేంద్రవరం తరలివచ్చేందుకు రంగం సిద్ధమైంది. భక్తుల కోసం స్నానఘట్టాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ అంత్య పుష్కరాల నోడల్ అధికారి విజయరామరాజు ఘనంగా ఏర్పాట్లు చేశారు. రాజమహేంద్రవరం పోలీసు అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి నేతృత్వంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. పుష్కర విధుల్లో కీలకమైన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ముందస్తుగానే విస్తృత ఏర్పాట్లు చేసింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రమేష్‌బాబు ఇటు క్షేత్రాల్లోనూ, అటు ఘాట్లకు అనుసంధానంగా ఉన్న ఆలయాల్లోనూ విశేష ఏర్పాట్లుచేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, నోడల్ అధికారి విజయరామరాజు, అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రమేష్‌బాబు, వివిధ శాఖల అధికారులు శనివారం పుష్కర విధులకు ట్రయల్న్ వేశారు. పోలీసులు ముందస్తుగా విధుల్లోకి చేరారు. పిండ ప్రదాన క్రతువులు నిర్వహించుకునేందుకు అవసరమైన ఫ్లాట్ ఫారాలను నిర్మించారు. కోటిలింగాల ఘాట్, పుష్కర ఘాట్, మార్కండేయ ఘాట్, సరస్వతి ఘాట్‌లలో పిండ ప్రదాన క్రతువులకు నిర్దేశిత స్థలాలను ఏర్పాటు చేశారు. స్నానఘట్టాల్లో పేరుకుపోయిన బురదను షక్కింగ్ విధానం ద్వారా తొలగించి ఇసుకను వేయడం మొదలుపెట్టారు. స్నానఘట్టాల్లో రక్షణగా ఫెన్సింగ్, నాటు పడవలను ఏర్పాటుచేశారు. కోటిలింగాల ఘాట్, పుష్కర ఘాట్‌లలో జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేశారు. పుష్కర ఘాట్‌లో గోదావరి మాత, పుష్కరుడు, గోడాడ గోషాయి మఠం, నంది విగ్రహం, గోదావరి గట్టున ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం, మార్కండేయ స్వామి ఆలయం, కన్నమ్మ పేరంటాలు తల్లి ఆలయం, ధవళేశ్వరంలోని జనార్దనస్వామి, అగస్తేశ్వర స్వామి ఆలయాలు, మునికూడలి ఆలయం తదితర ఆలయాల్లో దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసినట్టు అసిస్టెంట్ కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. ఈ ఆలయాల్లో ఉచిత ప్రసాద వితరణ, శీఘ్ర దర్శనం, మంచినీటి సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 65 మంది సిబ్బంది రెండు షిప్టులుగా విధులకు ఏర్పాట్లుచేశారు.
పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన వేదికపై పనె్నండు రోజులపాటు బుర్రకథ, హరికథ, భక్తి సంగీత విభావరిని దేవాదాయ శాఖ ఏర్పాటు చేసింది. రాత్రి 8 గంటల వరకే పుణ్యస్నానాలు, దైవ దర్శనాలకు అనుమతిస్తున్నారు. జిల్లాలోని అన్ని
ప్రసిద్ధ క్షేత్రాల్లో విశేష దర్శనాలకు ఏర్పాటుచేస్తున్నారు. అన్ని ఆలయాలను పచ్చిపూలతో అలంకరించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్ తదితరులు సరస్వతి ఘాట్‌లో ఉదయం 6 గంటలకు అంత్య పుష్కర స్నానాలు ఆచరించనున్నారు. ప్రతీ స్నానఘట్టానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి వివిధ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఘాట్‌లో పర్యవేక్షణ చేయడం జరుగుతుందని, ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ అవసరమైన ఏర్పాట్లతో సర్వసన్నద్ధమయ్యామని అంత్య పుష్కర నోడల్ అధికారి, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ విజయ రామరాజు తెలిపారు.

అమానుషం
ఫాస్టర్ మారయ్య హత్యపై ఎస్పీరవిప్రకాష్
చింతూరు, జూలై 30: ప్రజాయుద్ధమంటే మావోయిస్టుల భాషలో అమాయక ప్రజలను చంపడమా అని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మావోయిస్టులను ప్రశ్నించారు. మండలంలోని లచ్చిగూడెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి మావోయిస్టుల చేతిలో హతమైన చర్చి ఫాస్టర్ మారయ్య మృతదేహాన్ని ఎస్పీ రవిప్రకాష్ శనివారం మధ్యాహ్నం చింతూరులో పరిశీలించారు. అనంతరం స్థానిక పోలీసు స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడారు. అమాయక గిరిజనులను పోలీసు ఇన్ఫార్మర్ అనే నెపంతో హత్యచేయడం అమానుషమని, ఇది మావోయిస్టుల దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ప్రజల అభివృద్ధికి పాటుపడుతున్నామని చెప్పుకునే మావోయిస్టులు ప్రజలకు చేసిన ఒక అభివృద్ధి పనైనా చెప్పాలని సవాల్ విసిరారు. విధ్వంసాలకు, అసాంఘిక కార్యకలాపాలకు, హత్యలకు మావోయిస్టులకు సహకరిస్తే మంచివారని, సహకరించకపోతే పోలీసు ఇన్‌ఫార్మర్ అని హతమార్చడం హేయమైన చర్య అని విమర్శించారు. మారయ్య పోలీసు ఇన్‌ఫార్మర్ కాదని తెలిపారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి మావోయిస్టుల సమాచారాన్ని తెలుసుకుంటున్నామని, పోలీసు ఇన్‌ఫార్మరు తమకు అవసరం లేదన్నారు. మావోయిస్టులలో తమకు సమాచారం ఇచ్చేవారు ఉన్నారని తెలిపారు. ప్రజలలో మావోయిస్టులపై ఇప్పటి వరకూ ఉన్న సానుభూతి చర్చి ఫాస్టర్ మారయ్య హత్యతో సన్నగిల్లిందన్నారు. భవిష్యత్తులో ప్రజలే మావోయిస్టులకు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. అడవి బాట పట్టిన అన్నలు జన జీవన స్రవంతిలో కలిస్తే ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. మావోయిస్టుల చేతిలో హతమైన మారయ్య కుటుంబాన్ని అన్ని విధాలుగా సహాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. సమావేశంలో ఎఎస్పీ శే్వత ఉన్నారు.

జెఎన్‌టియుకె రిజిస్ట్రార్‌గా సాయిబాబు
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, జూలై 30: కాకినాడ జెఎన్‌టియు రిజిస్ట్రార్‌గా ఆచార్య సిహెచ్ సాయిబాబు నియమితులయ్యారు. వర్సిటీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఎస్‌సిడి)గా విధులు నిర్వహిస్తున్న సాయిబాబుకు రిజిస్ట్రార్‌గా నియమిస్తూ వైస్ ఛాన్సలర్ ఆచార్య విఎస్‌ఎస్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించిన ఆచార్య జివిఆర్ ప్రసాదరాజును ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఒఎస్‌డి)గా నియమించారు. గతంలో వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్‌గా పనిచేసిన సాయిబాబు గత రెండేళ్లుగా ఎపి ఎంసెట్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆచార్య సాయిబాబు మాట్లాడుతూ తనపై విశ్వాసం, నమ్మకంతో కీలకమైన రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగించిన వైస్ ఛాన్సలర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. వర్సిటీలో ఏ విధమైన సమస్య వచ్చినా దాని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ వర్గాల సహాయ సహకారాలతో వర్సిటీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు. రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన సాయిబాబాను వర్సిటీకి చెందిన అధికారులు, ఉద్యోగులు అభినందించారు.

కేంద్రంపై తిరగబడండి
-ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు ఉండవల్లి పిలుపు
రాజమహేంద్రవరం, జూలై 30: విభజన హామీలో భాగంగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాల్సిన హక్కు కేంద్రంపై ఉందని, ఎంతో అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర తీరుపై ఎందుకు మెత్తగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికైనా చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై తిరగబడి ప్రత్యేకహోదా హక్కుపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా విషయంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలతో పాటు, బిజెపి కూడా బాబుకు అండగా నిలుస్తాయన్నారు. శనివారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆగస్టు 5న కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్రరావు ప్రత్యేకహోదాపై ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు డిల్లీకి వెళ్లి హోదాపై ఒత్తిడి తేవాలన్నారు. గత ఎన్నికల్లో ఓటు వేసిన 46శాతం మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. లేనిపక్షంలో చరిత్రలో నిలిచిపోవాలనుకున్న చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. కాంగ్రెస్‌కు పట్టిన గతే ఆయనకూ పడుతుందన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిందని పదేపదే కాంగ్రెస్‌ను విమర్శించడం వల్ల ఫలితం ఉండదన్నారు. కాంగ్రెస్ అన్యాయం చేసిందనే తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కట్టారని గుర్తుచేశారు. కాంగ్రెస్ చేసిన తప్పును సరిదిద్దకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని ఉండవల్లి ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర విద్యాసంస్థలు స్థాపించినా పరిశ్రమలు రాకపోతే చదువుకున్న విద్యార్థులు ఏం చేస్తారని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా లభిస్తే పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందన్నారు. విభజన హామీల అమలులో బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. యుపిఏ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా తదితర అంశాలను ఆమోదిస్తూ కేంద్రకేబినెట్ తీర్మానం చేసి, ఆర్డినెన్స్ ఆమోదం కోసం రాష్టప్రతికి పంపారన్నారు. ఎన్నికల కమిషన్ అభ్యంతరం వల్ల ఆర్డినెన్స్ ఆమోదానికి నోచుకోలేదని ఉండవల్లి వివరించారు. ఆతరువాత అధికారంలోకి వచ్చిన బిజెపి ఐదేళ్ల ప్రత్యేకహోదా అంశాన్ని పక్కన పెట్టి మిగిలిన కొన్ని అంశాలతో ఆర్డినెన్స్‌ను ఆమోదించుకుందని విమర్శించారు. నాటి కేబినెట్ తీర్మానాన్ని యధావిధిగా ఆమోదిస్తే రాష్ట్రానికి కొంతవరకు న్యాయం జరిగేదన్నారు. అయితే బిజెపి నాయకులు కేబినెట్ తీర్మానాలను అమలు చేయకుండా రహస్యమైన కేబినెట్ నోటును బయటపెట్టడంపై రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈనోటును తానే బహిర్గతం చేశానని ఉండవల్లి స్పష్టం చేశారు. ఎపిపై బిజెపి కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందన్నారు. ప్రత్యేకహోదా సాధ్యం కాని పక్షంలో పదేళ్లు హోదా కల్పిస్తామని బిజెపి ఎన్నికల హామీలో ఎలా చేర్చారని ఉండవల్లి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడ్ని నిలదీశారు. రాష్ట్రాన్ని విభజనకు సహకరించి బిజెపి 2014లో రాష్ట్రంపై అత్యాచారయత్నం చేస్తే, హోదా రాదని చెప్పడం ద్వారా నేడు అత్యాచారంతో పాటు హత్యాయత్నం చేసిందని అభివర్ణించారు. బిజెపి ప్రభుత్వం ఎపికి విభజన హామీలు ఏమీ నెరవేర్చలేదని, అన్ని రాష్ట్రాలతో సమానంగానే నిధులు కేటాయిస్తోందన్నారు. రూ. 18వేల కోట్లకు పైగా రెవెన్యూ లోటు ఉంటే కేవలం 2800కోట్లు మాత్రమే కేటాయించిందని, ఇతర పద్దుల కింద ఇప్పటి వరకు కేంద్రం 6403కోట్లు మాత్రమే కేటాయించిందని వివరించారు. ఉమ్మడి రాష్ట్రానికి హైదరాబాద్ లాంటి పోలవరం ప్రాజెక్టును కూడా అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని ఉండవల్లి ఆరోపించారు. శుక్రవారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఒరిస్సా ఎంపిలు కేంద్రాన్ని నిలదీసిన సమయంలో ఆర్థిక మంత్రి జైట్లీ సమాధానం ఇస్తూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంశం సుప్రీంకోర్టు విచారణలో ఉందని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని చెప్పడం ఈవిషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు.

అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి
రావులపాలెం, జూలై 30: రావులపాలెం గౌతమి, గోదావరి పుష్కర ఘాట్‌కు ఎట్టకేలకు అనుమతులు రావడంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం నుండి 12 రోజులపాటు జరిగే గోదావరి అంత్య పుష్కరాలకు సంబంధించి రావులపాలెం ఘాట్‌లో రెండు బ్రిడ్జిల మధ్య నదీప్రవాహం వెళ్లే విధంగా బాట సిద్ధం చేశారు. నదిలో నావలు, వలలతో రక్షణ ఏర్పాట్లు చేశారు. అలాగే స్నానాలకు వచ్చే భక్తులకు పులిహోర, మంచినీరు, బాదంపాలు పంపిణీ చేసేందుకు షామియానాలు వేశారు. ఏర్పాట్లను తహసీల్దారు ఉదయభాస్కర్, సర్పంచ్ పోతుమూడి విజయలక్ష్మి, ఉప సర్పంచ్ కొవ్వూరి జగన్నాథరెడ్డి, సిఐ పివి రమణ, ఎస్‌ఐ త్రినాథ్ తదితరులు పర్యవేక్షించారు.
సిద్ధమైన జొన్నాడ ఘాట్
ఆలమూరు మండల పరిధిలోని జొన్నాడలో అంత్య పుష్కరాలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఈ పుష్కరాలకు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టెంట్లు, తాగునీరు, మరుగుదొడ్లను ఏర్పాటుచేశారు. అలాగే స్నానాలు ఆచరించే విధంగా ఘాట్‌ను సుందరంగా తీర్చిదిద్దారు. శనివారం ఎంపిడిఒ నాతి బుజ్జి, ఇఒపిఆర్డీ బొజ్జిరాజు, ఎస్సై శేఖర్‌బాబు, తహసీల్దార్ రాజేశ్వరావులు ఏర్పాట్లను పరిశీలించారు.

పొత్తుపై పునరాలోచన
ప్రత్యేకహోదా వివాదంపై ఎమ్మెల్యే గోరంట్ల
రాజమహేంద్రవరం, జూలై 30: రాష్ట్భ్రావృద్ధి విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సహకరించకపోతే పొత్తుపై పునరాలోచిస్తామని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి స్పష్టం చేశారు. శనివారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో మంత్రి పదవులు తమకు వెంట్రుకతో సమానమని వ్యాఖ్యానించారు. ప్రత్యేకహోదా రాదని చెప్పడం ద్వారా కేంద్రం ఎపిని అంధకారంలోకి నెట్టిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి బాధ్యత విభజనకు సహకరించిన బిజెపిపైనే ఉందన్నారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. సీమాంధ్ర ప్రజలు ఎపిని అవమానించిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ కొమ్ములు విరిచారని గుర్తుచేశారు. సీమాంధ్ర ప్రజలు తల్చుకుంటే గద్దెనెక్కించగలరని, లేదంటే గద్దె దింపగలరని హెచ్చరించారు. ప్రత్యేకహోదా రాదని తెలిసి ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందన్నారు. ఇప్పటి వరకు బిజెపి ప్రభుత్వం 3బడ్జెట్లు ప్రవేశపెట్టిందని, 36సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని, కేంద్రమంత్రులను కలిసినా రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పటి వరకు సంయమనం పాటించామని, ఇకపై కార్యాచరణకు దిగుతామని గోరంట్ల హెచ్చరించారు.
కాంగ్రెస్ గతే బిజెపికి
కొత్తపేట: రాష్ట్ర విభజన విషయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే రాష్ట్రంలో బిజెపికి పడుతుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి హెచ్చరించారు. కొత్తపేటలో శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ సీమాంధ్ర వారు తెలివైనవారని రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం విషయంలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు చేశారని, ఇప్పుడు బిజెపికి అదే గతిపట్టిస్తారన్నారు. నాడు ఉభయ పక్షాలను ఒప్పించి సమన్యాయం చేయాలని కోరుతూ టిడిపి విభజనకు లేఖ ఇచ్చిందన్నారు. విభజనను ఏకపక్షంగా చేశారన్నారు. రాజ్యసభలో విభజన బిల్లును అడ్డుకొనే అవకాశమున్నా వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా ఇవ్వాలని మద్దతు ఇచ్చారన్నారు. అయితే విభజన చేసి ఇచ్చిన హామీలను అమలుచేయకుండా సీమాంధ్రకు కేంద్రం అన్యాయం చేస్తుందని ఆరోపించారు. కేంద్రంలో ఉన్న మంత్రి పదవులు అలంకార ప్రాయమైనవని, దాన్ని సైతం వదులుకొనేందుకు సిద్ధమని ఆయన పేర్కొన్నారు.

విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
-జెఎన్‌టియుకె విసి కుమార్
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, జూలై 30: విద్యా వ్యవస్థలో నిరంతరం చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులపై విద్యార్థులకు తగిన అవగాహన కలిగించాలని జెఎన్‌టియుకె వైస్ ఛాన్సలర్ ఆచార్య విఎస్‌ఎస్ కుమార్ పిలుపునిచ్చారు. జెఎన్‌టియుకె స్కూల్ ఆఫ్ మేనేజిమెంట్ స్టడీస్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో వర్సిటీలోని అలూమినీ ఆడిటోరియంలో శనివారం జరిగిన సదస్సుకు వీసీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పాఠ్యపుస్తకాల నుండే కాకుండా అనుభవాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులకు బోధన అందించాలని కోరారు. విద్యార్థులకు అధునాతన పద్ధతిలో పాఠ్యాంశాలను బోధించేందుకు విశ్వ విద్యాలయం ఎప్పటికపుడు కృషి చేస్తోందన్నారు. సిబిఐటి ఎస్‌ఎంఎస్ (హైదరాబాద్) డైరెక్టర్ ఆర్యశ్రీ మాట్లాడుతూ విలువలతో కూడిన విద్య అవసరమన్నారు. ప్రపంచీకరణ విధానాలను పరిగణలోకి తీసుకుని విద్యార్థులకు విద్యను బోధించాలన్నారు. కాలానుగుణంగా వస్తున్న మార్పులను అధ్యాపకులు గమనిస్తూ, జ్ఞాన సముపార్జన సాధించాలని సూచించారు. కాకతీయ విశ్వ విద్యాలయం పూర్వ ప్రొఫెసర్ డాక్టర్ నరసింహమూర్తి మాట్లాడుతూ ఎదిగేకొద్దీ ఒదిగే స్వభావాన్ని విద్యార్థుల్లో పెంపొందించేందుకు కృషిచేయాలన్నారు.

ఎన్టీఆర్ కృష్ణుని విగ్రహం పరిశీలన
కొత్తపేట, జూలై 30: రాజమండ్రి పుష్కరఘాట్‌లో ఏర్పాటుచేయనున్న ఎన్టీఆర్ కృష్ణుని వేషంలో ఉన్న విగ్రహాన్ని కొత్తపేటకు చెందిన శిల్పి రాజ్‌కుమార్ వడయార్ తయారుచేయగా, దానిని పరిశీలించేందుకు గోరంట్ల వచ్చారు. ప్రస్తుతం అక్కడ ఉన్న విగ్రహం చిన్నదిగా ఉండటంతో దాని స్థానంలో సుమారు 16 అడుగుల కొత్త విగ్రహాన్ని తయారుచేశారు. విగ్రహాన్ని ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి బండారు సత్యానందరావు, కంఠంశెట్టి శ్రీనివాస్, గుబ్బల మూర్తి, చోడపనీడి బాబు, అద్దంకి చంటిబాబు, నిమ్మకాయల చిన్నయ్యనాయుడు పాల్గొన్నారు.

అంత్య పుష్కరాలకు 300 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
రాజమహేంద్రవరం, జూలై 30: గోదావరి అంత్య పుష్కరాలను పురస్కరించుకుని యాత్రికుల సౌకర్యార్థం 300 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చింతా రవికుమార్ వెల్లడించారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి 100, విశాఖపట్నం నుంచి 100, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మరో 100 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామన్నారు. ప్రతీ 15 నిమిషాలకు ఒక బస్సు యాత్రికులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వయా గోకవరం బస్టాండ్ కోటిలింగాలరేవునకు 50 సిటీ బస్సులను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. సిటీ బస్సుల్లో రూ. 10 చార్జీని వసూలు చేస్తామన్నారు. ప్రయాణీకుల సౌకర్యార్థం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ప్రత్యేక షెల్టర్‌ను ఏర్పాటు చేసి, మంచినీరు, మరుగుదొడ్లు, వైద్యసేవల వంటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. యాత్రికులకు ఆర్టీసీ బస్సుల సమాచారాన్ని తెలియజేసేందుకు ప్రత్యేక ఫోన్ నెంబర్లు కేటాయించామన్నారు. 0883-2463400, 7382925501, 7382925505 నెంబర్లకు ఫోన్ చేసి యాత్రికులు బస్సుల సమాచారాన్ని తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

విద్యుత్తు వలలో చిక్కి చుక్కల జింక మృతి
రాజవొమ్మంగి, జూలై 30: వేటగాళ్లు అమర్చిన విద్యుత్తు వలలో పడి ఓ వన్యప్రాణి మరణించిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. రాజవొమ్మంగి గ్రామ శివారున జామాయిల్ తోట సమీపంలో శుక్రవారం రాత్రి విద్యుత్తు వైర్లతో ఏర్పాటుచేసిన వలలోపడి చుక్కల జింక మృతిచెందింది. ఈ సంఘటనతో సంబంధం ఉందనే అనుమానంతో రాజవొమ్మంగికి చెందిన ఎం వీరభద్రరావు, ఎం రాంబాబు, ఎం దుర్గాప్రసాద్‌లను అదుపులోనికి తీసుకున్నామని రేంజ్ అధికారి శివకుమార్ తెలిపారు. నిందితులను సోమవారం అడ్డతీగల మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుస్తామని, జింక మృతదేహాన్ని ఐస్‌లో భద్రపరిచామని, మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఖననం చేస్తామని రేంజ్ అధికారి శివకుమార్ తెలిపారు.

గంజాయ స్మగ్లర్ అరెస్టు
సినీ ఫక్కీలో ఛేజింగ్ : టైరు పంక్చరై దొరికిపోయన నిందితుడు: భారీగా గంజాయ స్వాధీనం
గోకవరం, జూలై 30: గంజాయ తరలిస్తున్న కేరళకు చెందిన ఒక వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికార్లు సినీఫక్కీలో వెంటాడి, స్థానికుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన గోకవరం మండలంలో శనివారం సంచలనం సృష్టించింది. వివరాలిలా ఉన్నాయి. గంజాయి స్మగ్లింగ్ జరుగుతోందని ముందుగా సమాచారం అందడంతో కాకినాడ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికార్లు జాతీయ రహదారిపై బూరుగుపూడి (కృష్ణవరం) చెక్‌పోస్టు వద్ద నిఘా వేశారు. ఒక వాహనం చెక్‌పోస్టు వద్ద ఆగకుండా ముందుకు దూసుకుపోవడంతో దానిని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికార్లు గండేపల్లి వరకు వెంబడించినా ఫలితం లేకపోయింది. ఇదే సమయంలో మరో వాహనంలో కూడా గంజాయి రవాణా అవుతోందని తెలియడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికార్లు దానిపై దృష్టిపెట్టారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికార్లు వెంబడిస్తున్నారని తెలియడంతో రెండో వాహనంలోని స్మగ్లర్ తన కారును జాతీయ రహదారి నుంచి అడ్డదార్లలోకి మళ్లించాడు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికార్లు గంజాయి కారును వెంబడించారు. మట్టిరోడ్డు పైపైకి ఎగిసిన ధూళి తప్ప వాహనాలు కనిపించనంత వేగంతో రెండు వాహనాలు ఒకదాని వెనుక మరొకటిగా దూసుకుపోయాయ. ఆ సమయంలో రోడ్డుపై ఉన్న ఓ కుక్కను గంజాయి వాహనం ఢీకొట్టింది. అలాగే అదే రోడ్డు పక్కన మూడు చక్రాల సైకిల్‌పై ఉన్న వ్యక్తిని సైతం కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. చివరకు గోకవరం మండలం కామరాజుపేట గ్రామంలోని దళితపేట శివారు పుంతరోడ్డు వద్ద టైర్ పంక్చర్ కావడంతో గంజాయి స్మగ్లర్ వాహనం గోతిలో దిగబడింది. దీంతో వాహనం వదలి స్మగ్లర్ సుభాష్ పరారవుతుండగా ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది వెంబడించారు. ఈ దశలో స్మగ్లర్‌కు కానిస్టేబుల్‌కు మధ్య ఘర్షణ జరుగుతుండడంతో అక్కడే ఉన్న కొంత మంది స్థానికులు స్మగ్లర్‌కు దేహశుద్ధిచేసి అధికార్లకు అప్పగించారు. కేరళ రాష్ట్రం కిడిక్స్‌కు చెందిన ఎన్ సుభాష్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికార్లు అదుపులోనికి తీసుకున్నారు. వాహనంలో సుమారు రూ.5 లక్షలు విలువజేసే 118 ప్యాకెట్లలో 236 కేజీల గంజాయిని తహసీల్దార్ పివివి గోపాలకృష్ణ సమక్షంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ సిఐ వేణుమాధవ్‌రావు స్వాధీనం చేసుకున్నారు. గంజాయితోపాటు రెండు సెల్ ఫోన్లు, 4 సిమ్‌కార్డులు, బట్టలు, రూ.10వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికార్లు తెలిపారు. కార్యక్రమంలో విఆర్వో డి ధర్మరాజు, ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.

సినీ ఫక్కీలో మహిళ హత్య
రాజమహేంద్రవరం, జూలై 30: రాజమహేంద్రవరంలోని దానవాయిపేటలో శనివారం తెల్లవారుజామున సినీ ఫక్కీలో ఒక మహిళ హత్యకు గురైంది. ఆమెను గుర్తుతెలియని ఆగంతకులు ఇంజక్షన్ సూదితో పొడిచి హత్య చేయడం గమనార్హం. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం స్థానిక దానవాయిపేటలోని నగరపాలక సంస్థ కమిషనర్ బంగ్లా ఎదురుగా నివసించే చుక్కా అమ్మాజీ(55) తెల్లవారుజామున హత్యకు గురైంది. తెల్లవారుజామున 4గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తలుపులు కొట్టడంతో ఆమె తలుపులు తెరిచారు. వెంటనే వారు ఆమె మెడపై సూదితో పొడిచారు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సంఘటనా స్థలంలో ఆధారాలు దొరకకుండా కారం చల్లారు. కాగా, అమ్మాజీకి సుమారు 5-6కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. భర్త రాంబాబురెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్దికాలంగా దానవాయిపేటలోనే ఉన్న వీరికి చెందిన ఒక హోటల్ వివాదంలో చిక్కుకుంది. ఈవిషయమై పోలీసు కేసు నమోదైంది. ఆస్తి వివాదమే హత్యకు కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో ఆధారాలు మాయం చేసే ప్రయత్నం చేయడం, కుమారులు పొంతనలేని కథనాలు చెప్పడంతో ఆమె కుమారులు శ్రీనివాసరెడ్డి, లక్ష్మణరెడ్డి, రామిరెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అమ్మాజీకి ఏం ఇంజెక్షన్ చేసి హత్య చేశారన్నది చర్చనీయాంశంగా మారింది. మెడపై చిన్న గాయం మినహా ఆమె శరీరంపై గాయాలు కనిపించడం లేదని, పోస్టుమార్టం తరువాతే ఆమె మృతికి గల కారణాలు వెల్లడవుతాయని పోలీసులు చెబుతున్నారు. సంఘటనా స్థలాన్ని డిఎస్పీ జె కులశేఖర్, వన్‌టౌన్ సిఐ రవీంద్ర సందర్శించారు. వన్‌టౌన్ పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.