తూర్పుగోదావరి

మరో పుష్కర సంరంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 31: మరొక్కసారి నది పట్ల భక్త్భివం వెల్లి విరిసింది.. అంత్య పుష్కరాలకు గోదావరి నదిలో పుణ్య స్నానం ఆచరించి పునీతమయ్యేందుకు అశేష భక్తజనం అఖండ గోదావరి వైపు పరుగులు తీస్తున్నారు. మొదటి రోజు రద్దీపై దృష్టి పెట్టుకుని అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టేందుకు సమాయత్తమయ్యారు. అంత్య పుష్కరాలకు ఎంతమంది వస్తారనేది ఇదమిద్ధంగా అధికారులు అంచనాలకు రాలేకపోయారు. అందుకే మొదటి రోజు రద్దీని బట్టి చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు మార్చుకుంటున్నారు. అఖండ గోదావరి ఎగువ, దిగువ ప్రాంతాల్లో వున్న అన్ని స్నాన ఘట్టాల్లోనూ పుష్కర స్నానాలతో భక్తుల రద్దీ కొనసాగింది. మొదటి రోజు అంచనాలకు తగినట్టుగానే దాదాపు లక్షమంది వరకు పుణ్య స్నానాలు ఆచరించినట్టు అధికారులు అంచనా వేశారు. అంత్య పుష్కర బందోబస్తు ఏర్పాట్లలో యధావిధిగా పోలీసులు అతిగా ప్రవర్తించారు. కోటిలింగాల ఘాట్ వద్ద భక్తుల పట్ల ఎస్‌కె మహబూబ్ అనే పోలీసు ఎఎస్సై దురుసుగా ప్రవర్తించినట్టు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి యాత్రికుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసినా కోటిలింగాల ఘాట్‌లో ఈ పోలీసు అధికారి అందుకు విరుద్ధంగా యాత్రికుల పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆందోళన వ్యక్తమైంది. పుష్కర ఘాట్, గౌతమ ఘాట్, విఐపి ఘాట్‌లలో వేకువ జాము నుంచి భక్తుల రద్దీ అధికంగా కన్పించింది. పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్‌లలో ఉదయం ఏడు గంటల నుంచి రద్దీ పెరుగుతూ వచ్చింది. వివిధ జిల్లాలకు చెందిన యాత్రికులు పుష్కర స్నానాలకు అత్యధికంగా రావడం కన్పించింది. కోటిలింగాల ఘాట్, పుష్కర ఘాట్‌లలో ఏర్పాటు చేసిన జల్లు స్నాన ఘట్టాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. జల్లు స్నానాలు చేసేందుకు భక్తులు అత్యధిక ఉత్సాహం కనబర్చారు. ఒళ్లంతా తుళ్లింత మాదిరిగా కేరింతలు కొడుతూ స్నానాలు ఆచరించారు. జంగం దేవర శంఖారావాలు, ఓంకార నాదాలతో స్నాన ఘట్టాలు మార్మోగాయి. నదిపై వున్న మమకారాన్ని మరోసారి చాటుకున్నట్టు భక్తజనం అంత్య పుష్కరాలకు అశేషంగా తరలిరావడంతో గోదావరి తీరం ఆధ్యాత్మిక శోభితమైంది. పితృకర్మల పిండ ప్రదానాలతో స్నాన ఘట్టాల్లోని నిర్దేశిత ప్రాంతాల్లో పితృకర్మల క్రతువులు విస్తారంగా జరిగాయి. నదికి సంకల్పం, ఆచమనం, తర్పణంతో సరిగంగ స్నానాలు ఆచరించి పునీతమయ్యారు. కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తజనం వేకువ జాము నుంచి పుణ్య స్నానాలు ఆచరించి తీరం ఒడ్డున వున్న ప్రసిద్ధ క్షేత్రాలైన కోటిలింగేశ్వర, మార్కండేయేశ్వర స్వామి ఆలయాల్లో బారులు తీరి దర్శనం చేసుకుని తరించారు. నగరమంతా పుష్కర యాత్రికులకు ఓంకార నాదంతో స్వాగతం పలికింది. మొదటి రోజు ఆర్టీసీ బస్సులపై, ప్రైవేటు వాహనాల్లోను అత్యధికంగా యాత్రికులు తరలివచ్చారు. ఒక్కో ఘాట్‌కు జిల్లాస్థాయి అధికారి పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పటికపుడు సీసీ కెమెరాల్లో పరిశీలిస్తూ యాత్రికులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ అంత్య పుష్కర ఏర్పాట్లను పరిశీలించారు. అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి, అంత్య పుష్కరాల నోడల్ అధికారి విజయ రామరాజు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రమేష్‌బాబు, వివిధ శాఖల అధికారులు ఘాట్లను పర్యవేక్షించారు. ఏదేమైనప్పటికీ నదికి నమస్కరించుకోవడం మన సంస్కారం అన్నట్టుగా మనిషికి, నదికి వున్న అవినాభావ సంబంధానికి మరోసారి పునరంకితమైనట్టుగా అంత్య పుష్కర స్నానాలతో భక్తజనం గోదావరి నదివైపు తరలివస్తున్నారు.