తూర్పుగోదావరి

జన్మభూమి కమిటీలకే ఇళ్ల బాధ్యతలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 30: ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి లబ్ధిదారుల ఎంపిక జన్మభూమి గ్రామ కమిటీల ద్వారా మాత్రమే జరిగేవిధంగా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఇటీవల విపక్ష పార్టీలు జన్మభూమి కమిటీలకు గృహ లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అయితే జన్మభూమి కమిటీల ద్వారానే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని, ఆ తర్వాత ఆయా జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రుల పర్యవేక్షణలో రాష్ట్ర స్థాయిలో గృహాల కేటాయింపు ప్రక్రియ జరుగుతుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. రానున్న మూడేళ్లలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద పేదలకు పెద్ద ఎత్తున ఇళ్లు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధంచేసింది. ఈ నేపథ్యంలో జన్మభూమి గ్రామ కమిటీలే పథకం అమలులో కీలక భూమిక పోషించే విధంగా మార్గదర్శకాలు జారీఅయ్యాయి. ముఖ్యంగా అధికార యంత్రాంగం సైతం ఈ విషయంలో ప్రేక్షక పాత్ర వహించక తప్పదని స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వం అందరికీ ఇళ్లు పేరుతో గృహ నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.2.75 లక్షలు యూనిట్ వ్యయం కాగా, ఇందులో ఎస్సీ ఎస్టీలకు రూ.1.75 లక్షలు, ఇతరులకు రూ.1.25 లక్షలు ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తోంది. మిగిలిన మొత్తం రుణంగా ఉంటుంది. దీనితో పాటు స్వచ్ఛ భారత్ పథకం కింద మరుగుదొడ్డి నిర్మాణానికి అదనంగా మరో రూ.15వేలు లబ్ధిదారులకు అందజేస్తారు. రెండు బెడ్ రూమ్‌లు, ఒక హాలు, స్నానాల గది, మరుగుదొడ్డి ఇతర అన్ని సదుపాయాలతో 275 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో ఈ గృహాలను నిర్మించాల్సి ఉంది. గృహాల నిర్మాణానికి కూడా ఫాస్ట్‌ట్రాక్ విధానంలో నిర్మాణం ప్రారంభించిన 180 రోజుల్లోగా పూర్తిచేయాల్సి ఉంది. పుర పాలక సంఘం, నగర పాలక సంస్థల పరిధిలో యూనిట్ వ్యయం రూ.4.80 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో రూ.1.50 లక్షలు కేంద్ర ప్రభుత్వం, రూ.80వేలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుండగా రూ.50వేలు లబ్ధిదారుడి వాటాగా, రూ.2 లక్షలు బ్యాంకు రుణంగా నిర్ణయించారు. నగర, పట్టణ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని వౌలిక సౌకర్యాల కోసం అదనంగా మరో రూ.70వేలు యూనిట్ ఒక్కింటికి భరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలావుండగా ప్రస్తుతం రాష్టవ్య్రాప్తంగా ఎన్టీఆర్ గృహ నిర్మాణం కోసం లే అవుట్లను ఎంపికచేసే పనిలో సంబంధిత శాఖల అధికారులున్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఒకేచోట మంజూరైన గృహాలన్నిటినీ నిర్మించడానికి అవసరమైన స్థలం అందుబాటులో లేకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ఎక్కడ స్థల లభ్యత ఉంటే అక్కడ గృహాల నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుందని, లేని పక్షంలో ఈ పథకం అమలు ముందుకుసాగదని ఆయా జిల్లాల అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అలాగే వివిధ నియోజకవర్గాల్లో గృహ నిర్మాణం కోసం సేకరించిన స్థలాలు అధిక శాతం లే అవుట్లు సక్రమంగా లేకపోవడం, పల్లపు ప్రాంతాలు కావడంతో వీటిని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సంబంధిత శాఖల అధికారులు పంపారు.

ఎసిబి వలలో తుని విఆర్వో
సాల్వెన్సీ సర్ట్ఫికెట్‌కు రూ.6000 లంచం
తుని, మార్చి 30: అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో రెవెన్యూ అధికారి ఒకరు చిక్కారు. వివరాల్లోకి వెళితే... మండలంలోని టి.తిమ్మాపురం గ్రామానికి చెందిన పోల్నాటి ప్రసాదరావు సాల్వెన్సీ సర్ట్ఫికెట్ కోసం రెండు నెలల క్రితం రెవెన్యూ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. తుని పట్టణంలో విఆర్వోగా పనిచేస్తున్న తేనె రాంబాబు తేటగుంట పంచాయతీ విఆర్వోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. సర్ట్ఫికెట్ కావాలంటే రూ.8 వేలు లంచంగా ఇవ్వాలని ప్రసాదరావును డిమాండ్ చేశాడు. పలుమార్లు తిరిగిన తరువాత రూ. 6000 ఇస్తే పని పూర్తిచేస్తానని చెప్పాడు. విసుగుచెందిన ప్రసాదరావు ఎసిబి అధికారులను ఆశ్రయించారు. దీంతో ఎసిబి డిఎస్పీ రామచంద్రరావు నేతృత్వంలో నలుగురు బృందం రాంబాబు కోసం బుధవారం వల వేశారు. పురపాలక సంఘ కార్యాలయం వద్ద గల తన కార్యాలయంలో ప్రసాదరావు వద్ద నుండి రూ. 6 వేలు లంచం తీసుకున్న వెంటనే దాడిచేశారు. రాంబాబు కార్యాలయంలో సోదా చేశారు. కార్యాలయంలో రూ. 6 వేలు నగదు దొరకడంతో అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేసినట్టు ఎసిబి డిఎస్పీ రామచంద్రరావు విలేకరులకు తెలిపారు.

మద్దతు ధరకే కొనాలి
రబీ ధాన్యం సేకరణపై రైస్ మిల్లర్ల సమావేశంలో జెసి సత్యనారాయణ
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, మార్చి 30: రబీ సీజన్‌లో పండించే ధాన్యాన్ని సేకరించేందుకు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేస్తున్నట్టు జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ సత్యనారాయణ చెప్పారు. రబీ ధాన్యాన్ని నిర్ణయించిన మద్దతు ధరకే కొనుగోలు చేయాలని మిల్లర్లకు ఆయన సూచించారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లోని విధాన గౌతమీ సమావేశ హాలులో రబీ సీజన్ ధాన్యం సేకరణకు సంబంధించి రైస్ మిల్లర్లతో చర్చించేందుకు నిర్వహించిన సమావేశంలో జెసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మిల్లర్లతో మాట్లాడుతూ ఈ సంవత్సరం 1 లక్షా 51వేల హెక్టార్లలో రబీ సాగు జరుగుతున్నట్టు చెప్పారు. 9 లక్షల 36వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రబీలో ఉత్పత్తి జరుగనున్నట్టు అంచనా వేశామన్నారు. డ్వాక్రా సంఘాలు, సొసైటీల ద్వారా ధాన్యాన్ని సేకరించనున్నట్టు తెలిపారు. క్షేత్రస్థాయిలో మిల్లర్లు ఆయా గ్రామాలలో తిరుగుతూ ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరపై ప్రచారం చేయాలని కోరారు. కనీస మద్దతు ధరను 1057.50రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రతి ఒక్క రైతు నుండి ఇదే ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. ఈ వేసవిలో 50 చలివేంద్రాలను ఏర్పాటుచేసేందుకు రైస్ మిల్లర్లు ముందుకు రావడం హర్షణీయమని జెసి అన్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ఖరీఫ్‌లో నూరు శాతం బియ్యాన్ని సకాలంలో ప్రభుత్వానికి అందించామన్నారు. రవాణాకు సంబంధించి ఇంకా బకాయిలున్నాయని, వీటిని త్వరితగతిన చెల్లించాలని కోరారు. సమావేశంలో సివిల్ సప్లయిస్ డిఎం కృష్ణారావు, డిఎస్‌ఒ ఉమామహేశ్వరరావు, కాకినాడ ఆర్‌డిఒ డేవిడ్‌రాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పార్టీ కోసం సర్దుకుపోవాలి
సమస్యలు రాకుండా సమన్వయ కమిటీ: ప్రత్తిపాడు నియోజకవర్గ టిడిపి నేతలకు లోకేష్ హామీ
శంఖవరం, మార్చి 30: పార్టీ భవిష్యత్తు దృష్ట్యా సర్దుకుపోవాలని ప్రత్తిపాడు నియోజకవర్గ టిడిపి నేతలకు పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సూచించారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు పర్వత శ్రీసత్యనారాయణమూర్తి(చిట్టిబాబు) అకాల మృతితో పార్టీ కేడర్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి విదితమే. ఈ నేపధ్యంలో ప్రత్తిపాడు ఇన్‌ఛార్జిగా చిట్టిబాబు సోదరుడు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త పర్వత రాజబాబును నియమిస్తారని టిడిపి కేడర్ అంతా ఎదురుచూస్తుండగా, నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు టిడిపిలో చేరతారనే ప్రకటనలు కేడర్‌లో గందరగోళం సృష్టిస్తున్నాయి. ఈ నేపధ్యంలో గత సోమవారం రాత్రి ప్రత్తిపాడు నియోజకవర్గం టిడిపి సమన్వయకర్త పర్వత రాజబాబు ముఖ్యులతో కలసి రావాలని అధినేత నుండి పిలుపు అందింది. దీనితో మంగళవారం ఉదయం రాజబాబు తన అనుచరులతో కలసి బయలుదేరి వెళ్లారు. బుధవారం ఉదయం తొలుత అసెంబ్లీలోని సిఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలసి రాజబాబు లోకేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వరుపుల రాకపై ప్రస్తుత టిడిపి కేడర్‌లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితిని లోకేష్‌కు వివరించారు. అలాగే ఆవిర్భావం నుండి గత 33 ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని కష్టకాలంలో సైతం పార్టీ ఉన్నతికి సైనికుల్లా పనిచేశామని వారు తెలిపారు. దీనిపై లోకేష్ మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గంలో వరుపుల రాకతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమన్వయంతో పనిచేసేందుకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, జిల్లాకు చెందిన మంత్రులతోపాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన నాయకులతో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని హామీయిచ్చారని నేతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి, పార్టీ కేడర్‌కు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు సమాచారం. సమావేశంలో టిడిపి అధికార ప్రతినిధి పర్వత సురేష్, ఎఎంసి ఛైర్మన్ కొమ్ముల కన్నబాబు, ఎంపిపి ఇటంశెట్టి భాస్కరబాబు, టిడిపి నాయకులు బద్ధి రామారావు, వైస్ ఎంపిపి బొమ్మిడి సత్తిబాబు, వెన్నా శివ, పైల సుభాష్‌చంద్రబోస్, సూతి బూరయ్య తదితరులు పాల్గొన్నారు.

వర్శిటీలో వసతుల కల్పనకు ప్రాధాన్యత
-జెఎన్‌టియుకె వైస్-్ఛన్సలర్ కుమార్
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, మార్చి 30: వర్సిటీలోని వివిధ విభాగాలకు అవసరమైన వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు జెఎన్‌టియుకె వైస్ ఛాన్సలర్ ఆచార్య విఎస్‌ఎస్ కుమార్ వెల్లడించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫార్మశీ విభాగాల కోసం నూతనంగా వర్సిటీలో నిర్మించిన భవన సముదాయాలను విసి ఆచార్య కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అన్ని విభాగాలకు ఆధునిక వసతులతో కూడిన భవనాలను నిర్మించేందుకు కృషిచేస్తున్నట్టు చెప్పారు. విశ్వవిద్యాలయంలో అందుబాటులో ఉన్న స్థలాలను అభివృద్ధి చేయడంతో పాటు ఆయా విభాగాలకు విశాలమైన భవనాలను నిర్మిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో సాంకేతిక సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఐఎస్‌టి, ఫార్మశీ విభాగాలలో కోర్సుల నిర్వహణకు అవసరమైన వసతుల కల్పన, ఆధునిక భవన నిర్మాణాలను పూర్తిచేసి ప్రారంభించినట్టు కుమార్ వివరించారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య బి ప్రభాకరరావు, రిజిష్ట్రార్ ఆచార్య జివిఆర్ ప్రసాదరాజు, ప్రొఫెసర్ జి రంగజనార్థన, డాక్టర్ ఎస్‌వియుఎం ప్రసాద్, డాక్టర్ వి రవీంద్ర, వివిధ విభాగాల డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.

కోనసీమ ఉత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు

ముమ్మిడివరం, మార్చి 30: ముమ్మిడివరం, ఐ పోలవరం మండలాల సరిహద్దుల్లో మురమళ్ల గౌతమీ గోదావరి నది ఒడ్డున ఏప్రిల్ 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహించే కోనసీమ ఉత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల నిర్వాహణకు ప్రభుత్వం కోటి రూపాయలను కేటాయించింది. బుధవారం అఖండ గోదావరి ఉత్సవాల ప్రత్యేకాధికారి జి భీమశంకరం మురమళ్లలోని ఉత్సవాలు జరిగే ప్రదేశాలను పరిశీలించారు. గౌతమీ గోదావరి నదీ తీర ప్రాంతంలో 31 ఎకరాల విస్తీర్ణంలోగల కొబ్బరి తోటల నడుమ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భీమశంకరం స్థానిక విలేఖరులకు ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి కోనసీమ అందాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వం తొమ్మిది ఉత్సవాలను రాష్ట్ర ఉత్సవాలుగా గుర్తించగా వాటిలో మూడు తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించడం ఈ ప్రాంతవాసుల అదృష్టన్నారు. కాకినాడలో బీచ్ ఫెస్టివల్, గిరిజన ప్రాంతంలో మన్యం ఫెస్టివల్, కోనసీమ ప్రాంతంలో కోనసీమ ఉత్సవాలకు రాష్టస్థ్రాయి గుర్తింపు కల్పించిందన్నారు. ఉత్సవాల్లో భాగంగా జల క్రీడలు, పడవ పందాలు, ఫ్లోటింగ్ క్రీడలు, ఫల పుష్ప ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఉత్సాహవంతులు ఈ పోటీల్లో పాల్గొనాలని కోరారు. సినీ ప్రముఖులు చిత్ర, కల్పన, ఉషా ఊతప్ వంటి వారితో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్టు భీమశంకరం తెలిపారు. గరగ నృత్యాలు, గారడీ, బ్యాండు మేళాలు, బాణాసంచా కాల్పులు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. ఉత్సవాలకు హాజరయ్యేవారికి కోనసీమ వంటకాలతో కూడిన పుడ్ కోర్టును ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. మజ్జిగ, మంచినీరు ఉచితంగా అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని భీమశంకరం చెప్పారు. ఏప్రిల్ 8న ఉగాది పర్వదినాన్ని మురమళ్లలో అధికారికంగా నిర్వహించనున్నామని, ఆ రోజు వక్కంతం చంద్రవౌళి పంచాంగ శ్రవణం ఉంటుందని భీమశంకరం తెలిపారు. ఉత్సవాలు జరిగే ప్రాంతంలో ఐదు ప్రముఖ నమూనా దేవాలయాలను నిర్మించనున్నట్టు ఆయన చెప్పారు. ఆయన వెంట ఎఎంసి ఛైర్మన్ గొలకోటి దొరబాబు, ఐ పోలవరం, ముమ్మిడివరం తహసీల్దార్లు సిహెచ్ రామకృష్ణ, ఎం వీర్రాజు, పి విజయభాస్కరవర్మ, గాడిలంక సర్పంచ్ ధనంకోట వేణుగోపాలస్వామి ఉన్నారు.

పారిశ్రామికాభివృద్ధితోనే దేశాభివృద్ధి
ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో రాజమహేంద్రవరం మేయర్ రజనీ శేషసాయి
రాజమహేంద్రవరం, మార్చి 30: పారిశ్రామిక అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని మేయర్ పంతం రజనీశేషసాయి పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు యువత ముందుకు రావాలన్నారు. బుధవారం స్థానిక సర్వారాయ కళామందిరంలో జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సు జరిగింది. సదస్సును ప్రారంభించిన అనంతరం మేయర్ మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు స్పష్టమైన ప్రతిపాదనలతో బ్యాంకులను సంప్రదించాలన్నారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్భ్రావృద్ధికి, పరిశ్రమల స్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో కృషిచేస్తున్నారన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ కెపి సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని, ఈ క్రమంలో పరిశ్రమల స్థాపన ద్వారా రాష్ట్భ్రావృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు తమ కేంద్రం ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. ఏకగవాక్ష విధానంలో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తామన్నారు. టౌన్, కంట్రీ ప్లానింగ్ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు ఎస్ రంగనాయకులు మాట్లాడుతూ పరిశ్రమలు స్థాపించే ప్రదేశంలో విధిగా 40 అడుగుల రోడ్డు ఉండాలన్నారు. పారిశ్రామిక సంబంధిత సర్వేయర్లతోనే తమ పరిశ్రమలకు ప్లాన్లు వేయించాలన్నారు. విధిగా సంబంధిత పంచాయతీ కార్యదర్శి అనుమతులు తీసుకోవాలన్నారు. ఫ్యాక్టరీస్ ఇనస్పెక్టర్ నారాయణ మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తమ శాఖ ద్వారా వారం లోగా అనుమతులు జారీ చేస్తామన్నారు. ఆంధ్రాబ్యాంకు చీఫ్ మేనేజర్ బిఆర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ సబ్సిడీల కోసం బ్యాంకు రుణాలను దుర్వినియోగం చేయవద్దని హితవు పలికారు.
అలాంటి వారికి భవిష్యత్‌లో ఎప్పుడూ బ్యాంకులు రుణాలు మంజూరు చేయవన్నారు. ఎస్‌బిఐ చీఫ్ మేనేజర్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ స్పష్టమైన, ఆచరణాత్మకమైన ప్రతిపాదనలతో వస్తే బ్యాంకులు రుణాలు మంజూరుచేసే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల స్థాపన, ప్రభుత్వ ప్రోత్సాహకాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

పేలుడులో మహిళకు గాయాలు
డి.గన్నవరం, మార్చి 30: మండలంలోని లంకలగన్నవరం గ్రామంలో బుధవారం సంభవించిన పేలుడులో ఒక మహిళ గాయపడింది. అనుమానాస్పదంగా ఉన్న తెలుపురంగు రాళ్లపై కాలువేసినపుడు ఈ పేలుడు సంభవించింది. వివరాలిలావున్నాయి... లంకల గన్నవరం గ్రామం నడిమిలంకలో లంకే భార్గవి (5) తోటి పిల్లలతో ఆడుకొంటున్న సమయంలో తెలుపురంగు రాళ్లతో కూడిన ఒక ప్లాస్టిక్ కవరు దొరికింది. దాన్ని ఇంటికి తీసుకువచ్చింది. ఇంతలో ఇంట్లో నుండి బయటకు వచ్చిన భార్గవి నాయనమ్మ ఆదిలక్ష్మి వాకిట్లో పడివున్న రాళ్ల కవరును గమనించకుండా కాలు వేసింది. దీనితో ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆదిలక్ష్మి కాలుకు తీవ్రగాయమైంది. ఆమెను వెంటనే 108 వాహనంలో అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన తెలుసుకున్న గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గ్రామ సర్పంచ్ కొపనాతి సీతారామస్వామి పోలీసులకు సమాచారం అందించారు. దీనితో ఎఎస్సై సత్యనారాయణ సంఘటనాస్థలానికి చేరుకుని చెల్లాచెదురుగా పడివున్న రాళ్లను సేకరించారు. పేలుడుకు కారణమైన రాళ్ళను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఎఎస్‌ఐ సత్యనారాయణ వివరించారు.

తాగునీటి ఎద్దడి రానివ్వద్దు
విలీన మండలాలకు ప్రత్యేక గ్రాంటు:పర్యటించిన కలెక్టర్ అరుణ్‌కుమార్
చింతూరు, మార్చి 30: విలీన మండలాలైన చింతూరు, విఆర్ పురం, ఎటపాక మండలాల్లో వేసవి కాలం నేపథ్యంలో ప్రజలకు మంచినీటి ఎద్దడి లేకుండా చూడాలని కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ విలీన మండలాల్లో పర్యటించి, మంచినీటి పథకాల పునరుద్ధరణకు చేపడుతున్న పనులను పరిశీలించారు. ఈ మండలాల్లో మంచినీటి సమస్య పరిష్కరించేందుకు కలెక్టర్ అరుణ్‌కుమార్ రూ. కోటి 50 లక్షల ప్రత్యేక గ్రాంటును విడుదల చేశారు. చింతూరు మండలానికి రూ. 38 లక్షలు, కూనవరం రూ. 25 లక్షలు, విఆర్ పురం రూ. 20 లక్షలు, ఎటపాక రూ.4 లక్షలు, అలాగే సిపిడబ్ల్యు స్కీమ్ కింద ఎటపాకకు రూ.37 లక్షలు, కూనవరానికి రూ.36 లక్షలు కేటాయించారు. మంచినీటి పథకాల పునరుద్ధరణకు అధికారులు చేపడుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పిఒ చక్రధరబాబు, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు పాల్గొన్నారు.

అన్నవరం నిత్యాన్నదానంలో స్టీమ్ బాయిలర్
శంఖవరం, మార్చి 30: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి వారి సన్నిధి రత్నగిరిపై దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదాన విభాగంలో బుధవారం స్టీమ్ బాయిలెర్‌ను ఇఒ కాకర్ల నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. అన్నదాన విభాగంలో ఇప్పటివరకు పుల్లలు, గ్యాస్ వినియోగిస్తూ ఆహార పదార్థాలను తయారు చేస్తుండగా ప్రయోగాత్మకంగా స్టీమ్ బాయిలెర్‌ను ఏర్పాటుచేశారు. ఇది విజయవంతమైతే దేవస్థానానికి నెలకు లక్ష రూపాయుల మేర గ్యాస్ ఆదా అవుతుందని అన్నదానం అధికారులు తెలిపారు. అలాగే ఒకేసారి వంద కేజీల బియ్యం ఉడుకుతుందని, దీనికి వేస్ట్ మెటీరియల్‌తో చేసిన పిల్లేట్స్‌ను వినియోగించాల్సి ఉంటుందన్నారు. బాయిలర్‌ను ఒక తయారీ సంస్థ దేవస్థానానికి లక్ష రూపాయలకు అందించిందని, ఇది విజయవంతంగా పనిచేస్తే, మరిన్ని బాయిలర్లు వినియోగించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నదాన విభాగం అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో దేవస్థానం సహాయ కమిషనర్ ఇవి జగన్నాధరావు, పర్యవేక్షణాధికారి భాస్కర్, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

ఫారం పాండ్లుతో భూగర్భ జలాలు పెంచాలి
కూనవరం, మార్చి 30: ఉపాధి హామీ పనులతో ఫారం పాండ్లు నిర్మించి భూగర్భ జలాలు పెంచేలా చూడాలని కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ అన్నారు. బుధవారం కూనవరం మండలంలోని బొజ్జరాయిగూడెం, రేగులపాడు గ్రామాల్లోని ఉపాధి పనులతో నిర్మించిన ఫారం పాండ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరు ఉపాధి కూలీలతో మాట్లాడుతూ భూగర్భ జలాలు పెంచేందుకు అందరూ సహకరించాలని, ఉపాధికి కూలి డబ్బులు ఎలా వస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. విభజన అనంతరం మండలానికి సుమారు రూ.5 కోట్ల మేర ఉపాధి బకాయిలు పేరుకుపోయాయని అధికారులు కలెక్టరుకు వివరించారు. అనంతరం నూతనంగా చేపట్టనున్న ఫారం పాండ్ పనులను ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. మట్టి పదును తెలుసుకునేందుకు గడ్డపారతో మట్టిని స్వయంగా తవ్వి పరిశీలించారు. అనంతరం ఎంపిపి కొమరం పెంటయ్య మండలంలోని పలు సమస్యలను వినతిపత్రాల ద్వారా కలెక్టరుకు తెలియపరిచారు. జడ్పీటీసీ కన్యకా పరమేశ్వరి మండలంలోని అభివృద్ధి పనులు సక్రమంగా జరగడం లేదని, నిలిచిపోయిన పనులు వెంటనే జరిగేలా చూడాలని కోరారు. కలెక్టరు వెంట ఐటిడిఎ పిఒ చక్రధర్‌బాబు, సబ్‌కలెక్టరు రవి, ఆర్‌డబ్ల్యుఎస్ ఇఇ లక్ష్మీపతి, తహసీల్దారు నరసింహులు, ఎంపిడిఒ సత్యనారాయణమూర్తి, పలువురు అధికారులు పాల్గొన్నారు.