తూర్పుగోదావరి

అభివృద్ధి పనులను వేగవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 23: జిల్లాలో వివిధ పథకాల కింద చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి సకాలంలో నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధికారులను ఆదేశించారు. సోమవారం లాంఫాంలో జరిగిన జిల్లా సమన్వయ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని పలు పథకాల కింద జిల్లాలో చేపట్టిన పనుల పురోగతి, నిధుల వినియోగం, సంక్షేమ పథకాల అమలుపై జిల్లా అధికారులతో సమీక్షించారు. గృహనిర్మాణ శాఖపై సమీక్షిస్తూ గుంటూరు నగరంలో 11 వేల ఇళ్లు మంజూరు కాగా ఇప్పటివరకు కేవలం 1000 మంది లబ్ధిదారులను మాత్రమే గుర్తించడంపై చినరాజప్ప అసంతృప్తి వ్యక్తంచేశారు. గ్రామీణ ప్రాంతంలో 4 వేల మందిని మాత్రమే గుర్తించారని తెలిపారు. ఇళ్లు లేని అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి జాబితాను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. గృహనిర్మాణ పథకం కింద 1993 సంవత్సరానికి ముందు ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారుల రుణం తాలూకు వడ్డీ మాఫీ చేస్తే రుణాలు చెల్లించడానికి లబ్ధిదారులు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యేలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై మంత్రులు స్పందిస్తూ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు మంజూరు చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 6,900 మంది లబ్ధిదారులకు రేషన్‌కార్డులు పంపిణీ చేసినప్పటికీ సాంకేతిక కారణంగా వారికి రేషన్ అందించకలేక పోతున్నారని ఎమ్మెల్యేలు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై చినరాజప్ప స్పందిస్తూ వెంటనే సమస్యను పరిష్కరించాలని, తక్షణం రేషన్ అందేలా చూడాలని ఆదేశించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో బాపట్ల ఎంపి మాల్యాద్రి శ్రీరాం, ఎమ్మెల్సీలు ఎఎస్ రామకృష్ణ, అన్నం సతీష్ ప్రభాకర్, ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, జివి ఆంజనేయులు, తెనాలి శ్రావణ్‌కుమార్, కొమ్మాలపాటి శ్రీ్ధర్, కలెక్టర్ కాంతిలాల్ దండే, జాయింట్ కలెక్టర్ కృతికాశుక్లా, సంయుక్త కలెక్టర్-2 ముంగా వెంకటేశ్వరరావు, డిఆర్‌ఒ కె నాగబాబు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రపంచంలోనే మేటి రాజధానిగా అమరావతి
* తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి
చిలకలూరిపేట, జనవరి 23: ఆంధ్రుల రాజధాని అమరావతిని ప్రపంచంలోనే మేటి రాజధానిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దుతారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం చిలకలూరిపేట పట్టణంలో జరుగుతున్న జాతీయస్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బండలాగుడు పోటీల ముగింపు కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఒంగోలు జాతి ఎడ్లకు ప్రపంచ దేశాల్లో మంచి విలువ ఉందన్నారు. వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ను హైటెక్ సిటీగా అభివృద్ధి చేశారని, నేడు ఆంధ్రరాష్ట్రాన్ని కూడా అభివృద్ధిలో కొంతపుంతలు తొక్కించనున్నారన్నారు. అనంతపురం ఎంపి జెసి దివాకరరెడ్డి మాట్లాడుతూ ఎడ్ల పోటీలు ప్రతి నియోజకవర్గంలో జరగాలని తన నియోజకవర్గంలో కొన్ని సంవత్సరాల నుండి ఈ ఎడ్ల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ రైతుల పట్ల చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. వాటిని అమలు పర్చడంలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సఫలీకృతులయ్యారన్నారు. కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, స్వర్ణాంధ్ర ఫౌండేషన్ కార్యదర్శి పేర్ని వీరనారాయణ, టిడిపి నాయకులు మల్లెల రాజేష్‌నాయుడు, తేళ్ల సుబ్బారావు, అబ్దుల్ కుమీర్, తోట బ్రహ్మస్వాములు, ఎ విజయభాస్కరరావు, తోట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల పరీక్షాపత్రాలు ప్రైవేటు ట్యూషన్లలో ప్రత్యక్షం
* విద్యార్థుల ప్రతిభను దెబ్బతీస్తున్న పరీక్షా పత్రాలు లీకేజీలు
* ఆగ్రహం వ్యక్తంచేస్తున్న తల్లిదండ్రులు
* విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్
తెనాలి, జనవరి 23: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థులకు నిర్వహించే వివిధ పరీక్షాపత్రాలు రెండు, మూడు రోజులు ముందే ప్రైవేటు ట్యూషన్లలో దర్శనిమిస్తున్నాయి. అక్కడ చదువుకొనే విద్యార్థులకు పేపర్లలోని పశ్నలు, బిట్లుకు సమాధానాలు అందిన తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే పరీక్షలను నేరుగా హాజరౌతున్న పలుట్యూషన్లవెళ్ళే ప్రభుత్వ విద్యార్థులు నిజాయితీగా చదువుకునే విద్యార్థుల కంటే ఎక్కువ మార్కులు సాధించి వారి ప్రతిభను దెబ్బతీస్తున్నారు. ఈవిషయాలపై విద్యార్థులు తల్లిదండ్రులు అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ పరీక్షాపత్రాలు లీకు చేస్తున్న వారిని గుర్తించి చట్టరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే....తెనాలి మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న పలుప్రైవేటు, ట్యూషన్ సెంటర్ల నిర్వాహకులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ తమవద్దకు ట్యూషన్ కోసం వస్తున్న విద్యార్థులకు ఆయాపాఠశాలల్లో నిర్వహించనున్న యూనిట్స్, సమ్మెటీవ్ పరీక్షల ప్రశ్నాపత్రాలు, బిట్‌పేపర్లు ముందుగానే లీక్‌చేసి సమాధానాలు ప్రాక్టీసు చేయించిమరీ పంపుతున్నారు. దీంతో ట్యూషన్లలో చదువుకొనే విద్యార్థులకు వాస్తవంగా ఏమీరాకున్నా పరీక్షల్లో మాత్రం 80శాతానికి పైగా మార్కులు సంపాదిస్తున్నారు. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు అడిగే ప్రశ్నలకు కనీసం ఒక్క సమాధానం చెప్పలేని ప్రైవేటు, ట్యూషన్ విద్యార్థులు, పరీక్షలలో మాత్రం ఎక్కువ మార్కులు సాధించటం, అందునా బిట్స్‌లో ఎక్కువ మార్కులు రావటంతో ప్రతిభ కలిగిన విద్యార్థులు ఆవాక్కైతున్నారు. తామెంతో కష్టపడి ఉపాధ్యాయులు చెప్పినవి చదువుకొని పరీక్షలు వ్రాస్తున్నారాని మార్కులు తరగతులకు సక్రమంగా హాజరుకాని విద్యార్థులకు తమకంటే ఎక్కువ మార్కులు రావటంపట్ల అంసతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం పంపే ప్రశ్నాపత్రాలు ముందుగానే ప్రైవేటు, ట్యూషన్ సెంటర్లకు ఎలా వెళుతున్నాయి..? అక్కడ చెప్పిన ఆప్రశ్నలు, బిట్స్ యదావిధిగా మరునాడు నిర్వహించే పరీక్షాపత్రాల్లో ఎలాఉంటున్నాయి...? ఈపత్రాలను బయటకు పంపుతున్న ఉపాధ్యాయులు ఎవరు..? ఎందుకు ఇలాంటి పనులుచేసి ప్రతిభ కలిగిన విద్యార్థులను దెబ్బతీస్తున్నారు..? వాస్తవానికి పరీక్షలు నిర్వహించే గంట ముందు మాత్రమే సీల్ వేసియున్న పరీక్షాపత్రాలు బయటకు తీయాల్సియుండగా ముందుగానే వాటినితీసి ప్రైవేటు, ట్యూషన్ విద్యార్థులకు అందజేస్తున్నది ఎవరు..? వంటి ప్రశ్నలు విద్యార్థులను పలుఅనుమానాలకు గురిచేస్తున్నాయి. కాకుంటే అర్ధగంటలో వ్రాయాల్సిన 30మార్కుల బిట్‌పేపరును ట్యూషన్ విద్యార్థులు 5నిమిషాలలో పూర్తిచేసి ఎలాఇవ్వగలుగుతున్నారని ప్రతిభ కలిగిన విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలాఉండగా ప్రైవేటు, ట్యూషన్లు నిర్వహించే వారు పేపరుకు కొంత నగదు చెల్లిస్తున్నట్లు, ఈక్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు ఎవరూ ఈపన్నాగం పన్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. అలాగే విద్యార్థులు నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టిన నేపథ్యంలో విద్యార్థులకు ఉపాధ్యాయులు కొందరు పరీక్షా పత్రాలను ఒక రోజు ముందుగానే అందిస్తున్నట్లు, వారు ప్రైవేటు, ట్యూషన్ విద్యార్థులు కావటంతో తోటివిద్యార్థులకు ఆపేపర్‌ను లీక్ చేస్తున్నారనే వదంతులు వస్తున్నాయి. ఏదిఏమైనా ఉపాధ్యాయులు ట్యూషన్ నిర్వాహకులతో కుమ్మక్కై పిల్లల భవిష్యత్తును దెబ్బతీయటంపై విచారణ జరిపించాలని, ప్రతిభ కలిగిన విద్యార్థులకు మనథ్థైర్యం కల్పించాలని తల్లిదండ్రులు ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేస్తున్నారు. విచారణలో లీకేజీలు నిజయమని తేలితే సంబందిత ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
* డెప్యూటీ డిఇఓ వివరణ
ఈ విషయంలో తెనాలి డెప్యూటీ డిఇఓ బి విజయభాస్కర్‌ను వివరణ కోరగా ప్రభుత్వ గుర్తిపు పొందిన ప్రైవేటు పాఠశాలలకు, ప్రభుత్వ పాఠశాలలకు ఒకే పేపరు ఉంటుందని, ఈక్రమంలో ఎవరు పేపరు లీక్ చేస్తున్నారన్న విషయం స్పష్టం కాదన్నారు. తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలను జిల్లా విద్యాశాఖ అధికారి, కామన్ ఎంట్రెన్స్ బోర్డు అధికారులు దృష్టికి తీసుకువెళ్ళి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతిభ కలిగిన విద్యార్థులను దెబ్బతీసే పనులు ఎవరుచేసినా సహించబోమని హెచ్చరించారు.

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి
* ఆస్తుల వేలం వేగవంతం చేయాలి:ముప్పాళ్ల డిమాండ్
* కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహారదీక్ష
గుంటూరు (కొత్తపేట), జనవరి 23: అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్రప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం నాటి అగ్రిగోల్డ్ బాధితుల 5వ రోజు సామూహిక రిలే నిరాహారదీక్షలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల మాట్లాడుతూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట అగ్రిగోల్డ్ బాధితులు చేపట్టిన సామూహిక రిలే నిరాహారదీక్షలను చూసైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. రాష్ట్రంలో 20 లక్షల మందిని నిలువుదోపిడీ చేసిన అగ్రిగోల్డ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. అగ్రిగోల్డ్ బారిన పడి 100 మంది వరకు మరణించారని, వారి కుటుంబాలకు 10 లక్షల వరకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ప్రతినెలా 1000 నుంచి 2 వేల కోట్ల ఆస్థులను వేలం వేసి బాధితులకు నష్టపరిహారం అందించాలన్నారు. కస్టమర్ల జాబితాలను ఆన్‌లైన్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. 7,600 కోట్ల రూపాయలు దోచుకున్న యాజమాన్యం విలాసాలు చేస్తుంటే ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం నుంచి స్పందన రానిపక్షంలో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. జిల్లా గౌరవాధ్యక్షుడు జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ తీవ్రమైన మానసిక ఒత్తిడితో అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటే సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుందని మండిపడ్డారు. బాధితులు రోజురోజుకూ ఆందోళన ఉద్ధృతం చేస్తున్నప్పటికీ ఆ మేరకు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ తీరు ఇదేవిధంగా కొనసాగితే రానున్న రోజుల్లో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుగురి రాధాకృష్ణ, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కెవి ప్రసాద్, నాయకులు పిజి షాహిద్, ఎం నగేష్‌బాబు, అగస్టీన్, సాంబశివరావు, ఎవి రావు, వౌలాలి, నూతలపాటి చిన్న, రావుల అంజిబాబు, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా
నరసరావుపేట, జనవరి 23:్భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులోని పథకాలను చంద్రన్న భీమాలోకి మార్చరాదని కోరుతూ సోమవారం పట్టణంలోని ఏంజెల్ టాకీస్ సెంటర్‌లో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక నాయకులు మాట్లాడుతూ సంక్షేమ బోర్డు నిధులు ఇతర అవసరాలకు మళ్ళించరాదని కోరారు. పెద్దనోట్ల రద్దు వల్ల పనులు కోల్పోయిన కార్మికుల బ్యాంకు ఖాతాల్లో తక్షణమే పదివేల రూపాయలు జమచేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర చట్టం 1996లోని పథకాలు రాష్ట్రంలో కూడా వర్తింప చేయాలని కోరారు. అదే విధంగా 60సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్ నెలకు 3000రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన కార్మికుని భార్యకు వితంతు పెన్షన్, వికలాంగులైన కార్మికునికి వికలాంగ పెన్షన్ ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌లోని బిల్డింగ్ వర్కర్స్ వేల్పేర్ బోర్డును విజయవాడకు తరలించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో షేక్ శిలార్, మహాబూబ్ సుభానీ, గోవిందరావు, వెంకటేశ్వర్లు, కోటయ్య, వెంకట్రావు, కోటిరెడ్డి, మరియమ్మ, రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రాన్ని అందచేశారు.
ఇద్దరి హత్య కేసులో నలుగురికి యావజ్జీవం
నరసరావుపేట, జనవరి 23: ఇరువురు వ్యక్తులను హత్య చేసిన కేసులో నలుగురు ముద్దాయిలకు యావజ్జీవ శిక్ష విధిస్తూ సోమవారం 13వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కె జయకుమార్ తీర్పు వెలువరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. 2014వ సంవత్సరంలో బొల్లాపల్లి మండలం మేళ్ళవాగు గ్రామానికి చెందిన బీ పెద్దనాగిరెడ్డి, బీ చిననాగిరెడ్డి ఇరువురు అన్నదమ్ములు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్ళారు. అదే గ్రామానికి చెందిన కొల్లి వెంకటేశ్వర్లు, గోవింది, అంజయ్య, రాయవరపు రవి వారిరువురి అన్నదమ్ములను పాతకక్షల నేపధ్యంలో హత్య చేశారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. అనంతరం కోర్టుకు హాజరు పరచగా న్యాయమూర్తి పై విధంగా తీర్పునిచ్చారు. కాగా, మొదటి ముద్దాయి కొల్లి వెంకటేశ్వర్లు కేసు విచారణ జరుగుతుండగానే మృతి చెందాడు. మృతుడు వెంకటేశ్వర్లు మినహా మిగిలిన ముగ్గురికి యావజ్జీవం విధిస్తూ న్యాయమూర్తి కేసు వెలువరించారు.
చేనేత సమస్యల పరిష్కారానికి కృషి
మంగళగిరి, జనవరి 23: చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎపి బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీ మహేష్ అన్నారు. సోమవారం పట్టణంలో ఆయన పర్యటించి చేనేత మగ్గాలను పరిశీలించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల మంగళగిరిలో జరుగనున్న చేనేత సత్యాగ్రహంకు మద్దతిస్తున్నట్లు చెప్పారు. ప్రతి నేత కార్మిక కుటుంబానికి రెండున్నర లక్షల వరకు భీమా సౌకర్యం కల్పించాలని, నూలు సబ్సిడీ పెంచాలని మహేష్ కోరారు. చేనేత వస్త్ర విక్రయ శాలలు ఏర్పాటు చేసి వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని, పేద కార్మిక కుటుంబాలకు విద్యా వైద్యం అందించాలని, విశాఖ , తిరుపతి, హైదరాబాద్ మొదలైన ప్రాంతాల్లో మెగా షోరూమ్స్ ఏర్పాటు చేయాలని, స్టాండ్ మగ్గాలను ఉచితంగా ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
రూ. పదికోట్ల అప్పుతో వ్యాపారి పరారీ?
మాచర్ల, జనవరి 23: పట్టణానికి చెందిన ఓ వ్యాపారి కుటుంబం సుమారు పది కోట్లు అప్పులవటంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. వ్యాపారి అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం ఆ నోట ఈనోట పాకి పట్టణ పరిసర ప్రాంతాలకు దావానలంగా వ్యాపించింది. దీంతో సదరు వ్యాపారికి అప్పులు ఇచ్చిన వ్యక్తులు హుటాహుటిన పట్టణానికి చేరుకొని అజ్ఞాతంలో ఉన్న వ్యాపారి స్థిర ఆస్తులు, నివాసాలు, వ్యాపార సంస్థల వద్దకు వెళ్లారు. సగం భాగం వాటా ఉన్న కందిపప్పు మిల్లు, లాడ్జీల సెంటర్‌లోని ఓ వస్త్ర దుఖాణాలు, సోదరుల నివాసాలకు తాళాలు వేసి ఉండటంతో బాధితులు తమ గోడు ఎవరి వద్ద వెళ్ళబోసుకోవాలో అర్థంగాక పోలీసు స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఫిర్యాదు చెయ్యాలా వద్దా ఆలోచిస్తూ చక్కర్లు కొడుతున్నారు.
మున్సిపల్ ఉద్యోగి సుబ్బారావు సస్పెన్షన్
రేపల్లె, జనవరి 23: రేపల్లె మున్సిపల్ కార్యాలయంలో జనన, మరణ పత్రాలు జారీచేసే డిడిఆర్ ఉద్యోగి మల్లెల సుబ్బారావును సస్పెండ్ చేసినట్లు కమిషనర్ మారుతీదివాకర్ సోమవారం తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఉన్నతాధికారులకు గతంలో అనేక మార్లు తెలిపామని, సుబ్బారావుకు మెమోలు కూడా ఇవ్వటం జరిగిందని అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పులేనందున జీవో నెంబరు 17 కింద ఆయనను సస్పెండ్ చేసినట్లు కమిషనర్ తెలిపారు.

కార్యకర్తల సంక్షేమ నిధి
సృష్టికర్త లోకేష్
గుంటూరు (కొత్తపేట), జనవరి 23: తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సృష్టికర్త, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అని తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ వివివి చౌదరి, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు తదితరులు కొనియాడారు. సోమవారం లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని అరండల్‌పేటలోని రాష్ట్ర పార్టీ కార్యాలయం, బృందావన గార్డెన్స్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు పలు చోట్ల జన్మదిన వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఉన్న నారా లోకేష్‌ను వివివి చౌదరి, మంత్రి రావెల కిషోర్‌బాబు, ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ, మార్కెట్ యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్ తదితర నేతలు, ప్రముఖులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో వివివి చౌదరి, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు జివి ఆంజనేయులు, ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ తదితర నేతలు పాల్గొని భారీ జన్మదిన కేక్‌ను కట్ చేశారు. లోకేష్ భవిష్యత్తుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, పార్టీ అభివృద్ధి కృషిచేయాలని ఆకాంక్షించారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఎన్‌టిఆర్ మనవడు, ఆత్మవిశ్వాసమే ఆస్థిగా పరిగణించే చంద్రబాబు నాయుడి తనయుడు, కార్యకర్తల సంక్షేమమే తన ధ్యేయమని చాటిచెప్పే నారా లోకేష్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. అలాగే చిత్తూరు జిల్లా, పుత్తూరు మండలం, వేపగుంట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు కొర్రపాటి నరేంద్రబాబు కార్యకర్తల సంక్షేమ నిధికి విరాళంగా లక్ష రూపాయలను చెక్కు రూపములో నారా లోకేష్‌కు అందజేశారు. పార్టీ కార్యాలయానికి 5 లక్షల విలువ చేసే జిరాక్సు మిషనరీని అందజేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన రక్తదాన శిబిరంలో దాసరి రాజామాస్టారు, రాయపాటి శ్రీనివాస్, మనె్నం శివనాగమల్లేశ్వరరావు తదితర నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు.
సంక్షేమ కార్యక్రమాల అమలులో ఇబ్బందులను పరిష్కరిస్తాం...
గుంటూరు, జనవరి 23: వెనుకబడిన తరగతుల సంక్షేమానికి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల అమలులో ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఉన్నట్లయితే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తక్షణం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ చైర్మన్ గుండుమల తిప్పేస్వామి తెలిపారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘాలు, ప్రతినిధుల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ తిప్పేస్వామి మాట్లాడుతూ ప్రతినిధులు ఇచ్చిన అర్జీలపై జిల్లా అధికారులతో చర్చించి జిల్లాస్థాయిలో సమస్యలను పరిష్కరిస్తామని, అలాకాని సమస్యలను ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సక్రమంగా అమలు జరుగుతున్నదీ, లేనిదీ, ఇంకా ఏవైనా పథకాలు అవసరమా అనే అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నారు. అంతకుముందు పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ ఘనుల తవ్వకాల్లో వడ్డెర కులస్థులకు కల్పిస్తున్న రిజర్వేషన్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, లీజు దరఖాస్తు ఫీజులో రాయితీ కల్పించాలని బిసి సంక్షేమ సంఘం ప్రతినిధి దేవళ్ల మల్లిఖార్జున కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. మరో ప్రతినిధి వెంకటరత్నం మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన దరఖాస్తు ఫీజుల్లో రాయితీ కల్పించాలని, ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న బిసి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయాలని కోరారు. ప్రతి జిల్లాలో బిసి భవనాలు నిర్మించాలని, బిసి రిజర్వేషన్ ఎ,బి,సి,డిల వారీగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తిచేశారు. బిసి యూనిట్ల మంజూరుకు సంబంధించి గతంలో అమలు చేసిన విధంగానే సబ్సీడి విధానాన్ని కొనసాగించాలని కోరారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని, కనీసం నెలకు 3 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధానిలో బిసి భవనాన్ని నిర్మించాలని ప్రతినిధులు సూచించారు. అంతకుముందు స్థానిక ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ చైర్మన్ జి తిప్పేస్వామిని, కమిటీ సభ్యులను కలెక్టర్ కాంతిలాల్ దండే, జెసి కృతికాశుక్లా, పలువురు అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. సమావేశంలో కమిటీ సభ్యులు బి అశోక్, బి రమణమూర్తి, పి విశ్వప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
భవన నిర్మాణ కార్మికుల ధర్నా

మంగళగిరి, జనవరి 23: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మికులు సోమవారం మంగళగిరిలోని సహాయ కార్మిక అధికారి కార్యాలయం ఎదుట సుమారు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం మంగళగిరి డివిజన్ కమిటీ ఆధ్వర్యాన కార్మికులు ర్యాలీగా కార్మికశాఖ అధికారి కార్యాలయానికి సమస్యలు వివరించేందుకు వెళ్లారు. అక్కడ అధికారి లేకపోవడంతో వచ్చేంత వరకు ధర్నా నిర్వహించారు. పోలీసుల రంగప్రవేశం చేసి ధర్నా విరమించాలని కార్మికులను కోరగా కార్మికశాఖ అధికారి వచ్చేవరకు ధర్నా విరమించేంది లేదని తేల్చిచెప్పారు. కొద్దిసేపటికి సహాయ కార్మిక అధికారి పి పద్మావతి అక్కడికి చేరుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని కొన్ని నెలలుగా అనేక పర్యాయాలు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ పరిష్కరించలేదని, వెల్ఫేర్‌బోర్డు రక్షణ, సంక్షేమ పధకాలు అమలు పరచాలని డిమాండ్ చేశారు. తనపరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని, మిగతా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని పద్మావతి హామీ ఇచ్చారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వద్ద కూడా ధర్నా జరిపిన భవన నిర్మాణ కార్మికులు డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. సంఘం నేతలు టి శ్రీనివాసరావు, పూర్ణచంద్రరావు, ఎస్‌కె జానీభాషా, ఎం భాగ్యరాజు, చెంగయ్య తదితరులు నాయకత్వం వహించారు.