అదిలాబాద్

ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు: యువత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఏజెన్సీ స్పెషల్ డిప్యూటి కలెక్టర్ ప్రియాంక అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్‌సెంట్ భవనంలో ఎస్‌బిహెచ్ గ్రామీణ ఉపాధి సంస్థ అధ్వర్యంలో నెల రోజుల పాటు మహిళలకు కుట్టు మిషన్‌పై శిక్షణ ఇవ్వగా ముగింపు సంధర్భంగా వారికి శిక్షణ ధృవపత్రాలను అందజేశారు. ఈ సంధర్భంగా ప్రియాంక మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నాయని, అందులో భాగంగానే శిక్షణ కార్యక్రమాలు ఇస్తున్నామని అన్నారు. శిక్షణ పొందిన వారు ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగాలని, అదే విధంగా మిగితావారికి చేదోడువాదోడుగా ఉండాలన్నారు. ఉన్నత చదువులు చదువుకోలేని నిరుద్యోగులకు లభించే ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌సెట్ డైరెక్టర్ సత్యనారాయణ, ఆశన్న, సతీష్, తదితరులు పాల్గొన్నారు.

కౌటలో సైన్స్‌పై అవగాహన సదస్సు
ఆదిలాబాద్ టౌన్, మార్చి 4: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి అధ్వర్యంలో జైనథ్ మండలం కౌట జడ్‌పి హైస్కూల్‌లో శుక్రవారం సైన్స్‌పై అవగాహణ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం శాస్తవ్రేత్త డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ మానవ జీవితం సైన్స్‌తో ముడిపడి ఉందని, సైన్స్‌తోనే సమాజం అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు. మరో శాస్తవ్రేత్త డాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్ల వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తూ అనార్థాలకు దారి తీస్తోందని, వీటిని ముందుస్తు జాగ్రత్తలతో అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం విద్యార్థులు, గ్రామస్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సదస్సు అనంతరం క్వీజ్ కాంపిటేషన్‌లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్‌పేర్ సమన్వయ కర్త యు.ప్రమోద్‌కుమార్, పాఠశాల హెచ్ ఎం నారాయణ రెడ్డి, సర్పంచ్ విజయ్, ఎంపిటీసీ కవిత రుక్మన్న, ఎస్ ఎం ఎస్ చైర్మెన్ నాగన్న, ఉపాధ్యాయులు అనిల్‌కుమార్, రమ, మాధవి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

ఇంటెక్ వెల్ పనులను సకాలంలో పూర్తి చేయాలి
* పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి
జిల్లా కలెక్టర్ జగన్‌మోహన్
మంచిర్యాల, మార్చి 4: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేపడుతున్న మిషన్ భగీరథ పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జగన్‌మోహన్ ఆదేశించారు. శుక్రవారం మండలంలోని గుడిపేట ఎల్లంపల్లి ప్రాజెక్టు సమీపంలో నిర్మిస్తున్న మిషన్ భగీరథ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన అధికారులతో పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో పనులకు ఆటంకాలు ఏర్పడు అవకాశాలున్నాయని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా నిబంధనల ప్రకారం నాణ్యతతో పనులు చేపట్టాలన్నారు. ఇప్పటి వరకు 40శాతం మేర పనులు పూర్తయ్యాయని, భగీరథ ఇంజినీరింగ్ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ సిఈవో జగన్‌మోహన్ రెడ్డి, వ్యాప్కో కన్సల్టెంట్ శర్మ, మంచిర్యాల ఆర్డీవో ఆయిషా మస్రత్ ఖానం, ఈఈ శ్రీనివాస్, డిఈ కృష్ణ, తహశీల్దార్ సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.

అక్కిం చెరువు బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన
లక్ష్మణచాంద, మార్చి 4: లక్ష్మణచాంద మండల కేంద్రంలోని అక్కిం చెరువు అలుగుపై 35 లక్షల రూపాయలతో నిర్మించనున్న బ్రిడ్జికి శుక్రవారం రాష్ట్ర దేవాదాయ, న్యాయ, గృహనిర్మాణశాఖమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎన్నో ఏండ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బ్రిడ్జి నిర్మాణానికి కృషిచేయడం జరిగిందన్నారు. తమది చేతల ప్రభుత్వమని రాష్ట్రం సాకారం కావడంతో ముఖ్యమంత్రి కేసి ఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలుచేస్తున్నారన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందకు పోతుందన్నారు. రాబోయే మూడేళ్లలో ఇంటింటికి తాగునీరివ్వడానికి మిషన్ భగీరథ పథకాన్ని తీసుకవచ్చామన్నారు. రాబోయే రెండేళ్లలో రైతులకు సైతం 24 గంటల కరెంటును ఇవ్వడానికి ప్రయత్నాలుచేస్తున్నామన్నారు. ఏప్రిల్ నుండి వ్యవసాయానికి 9 గంటల నిరంతర విద్యుత్‌ను సరఫరాచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సుజాత పోశెట్టి, జడ్పీటిసి పద్మ రమేష్, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు లక్ష్మి, టి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు రఘునందన్‌రెడ్డి, సర్పంచ్ నారాయణ, అధికారులు, రైతులు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

కేంద్రం నిధులతోనే సంక్షేమ అభివృద్ది ఫలాలు
* నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలి
* బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, మార్చి 4: తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ అభవృద్ది పథకాలకు కేంద్రం నుండి నిధులు భారీ ఎత్తున మంజూరవుతున్నాయని, తెలంగాణ ప్రభుత్వం చేసింది తక్కువా చెప్పేది ఎక్కువగా ఉందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూగర్భజలాలను వెలికితీసి రైతులకు సాగుజలాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల 5 జిల్లాలకు 450 కోట్లు విడుదల చేసిందని, తెలంగాణలో 5 వెనకబడిన జిల్లాల్లో ఈ పథకాలు అమల్లోకి రానున్నాయని అన్నారు. అయితే టీ ఆర్ ఎస్ ప్రభుత్వం కేంద్రం నిధులను దారి మళ్ళిస్తూ కాకతీయ మిషన్, మిషన్ భగీరథ పేరిట నిధులను వినియోగించుకుంటూ తమ ఘనతగా చెప్పుకోవడం శోచనీయమని అన్నారు. కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేస్తున్న నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాణహిత పెన్‌గంగా ప్రాజెక్టులకు పర్యవరణ అనుమతులు కూడా కేంద్రమే ఇప్పించడంలో పూర్తిగా చొరవ చూపించిందని, ముఖ్యంగా ఆదిలాబాద్‌లో రైల్వే ఓవర్‌బ్రీడ్జి, ముత్కెడ్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు నిధులు మంజూరు కావడం హర్షించదగిన పరిణామని అన్నారు. కేంద్రం నిధులతో షోకు చేసుకుంటున్నా టీ ఆర్ ఎస్ ప్రభుత్వం తమ నిధులను మాత్రం అంతంత మాత్రంగానే మంజూరు చేస్తోందని అన్నారు. కేంద్ర పథకాలు, అభివృద్ది పనులపై ప్రజల్లోకి తీసుకెళ్తామని మల్లారెడ్డి అన్నారు. ఈవి లేకర్ల సమావేశంలో బిజెపి రాష్ట్ర కోషాధికారి మనోహర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మురళిదర్ రావు, జిల్లా అధ్యక్షులు పాయల శంకర్, నాయకులు అయ్యన్న గారి భూమయ్య, వేణుగోపాల్, రాము,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ గౌరి బాధ్యతల స్వీకరణ
ఆదిలాబాద్ టౌన్,మార్చి 4: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వచ్చిన ఉదయ గౌరి శుక్రవారం ఆదిలాబాద్ కోర్టులో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పెండింగ్ కేసుల పరిష్కారానికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని, ఇందుకు న్యాయవాదులు కూడా సహకరించాలన్నారు. గతంలో జిల్లాలో పనిచేసిన అనుభవం తనకు ఉందన్నారు. చిన్న చిన్న కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించేందుకు కక్షిదారుల మధ్య రాజీకుదుర్చాలని సూచించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మర్యాద పూర్వకంగా ఆహ్వానించి అభినందనలు తెలిపారు. సమావేశంలో అదనపు న్యాయమూర్తి కుంచాల సునీత, జిల్లా ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి అరుణసాదిక, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుదీర్‌కుమార్, నరేష్‌కుమార్, పిపి రమణ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు అమరేందర్ రెడ్డి, బిపిన్‌కుమార్ పాటిల్, శర్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
* డిఈవో సత్యనారాయణ రెడ్డి
మంచిర్యాల, మార్చి 4: పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని హిందీ హై స్కూల్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2015-16 విద్యా సంవత్సరంలో తూర్పు ప్రాంతంలోని 92 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వాహకులు రెండు రోజుల ముందుగానే కేంద్రాన్ని తమ ఆదీనంలోకి తీసుకొని విద్యార్థులకు తాగునీరు, బెంచీలు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, విద్యుత్ సౌకర్యం సరిచూసుకోవాలని కోరారు. సౌకర్యాల్లో తేడా ఉంటే సంబంధిత ఎం ఈవోకు సమాచారం అందించి ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని, సంబంధిత పరీక్ష సిఎస్, డిఈవోలదే బాధ్యత అన్నారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 9 వరకు జరుగనున్న ఈ పరీక్షలు మద్యాహ్నం 12.15గంటల నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం 175 రెగ్యులర్, 29 ప్రైవేటు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. తూర్పు ప్రాంతంలో 43,291 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, వీరిలో రెగ్యూలర్ బాలురు 18,396, బాలికలు 19,043, ప్రైవేటులో బాలురు 3353, బాలికలు 2499మంది హాజరు కానున్నారు. ప్రతీ కేంద్రంలో ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్టుమెంటల్ అధికారిని నియమించామన్నారు. అదేవిధంగా 20మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను పరీక్ష కేంద్రాల్లో నియమించినట్లు తెలిపారు. కేంద్రాల్లో రెవెన్యూ, పోలీసు, వైద్య సిబ్బందిని నియమించుకొనుటకు సంబంధిత శాఖలను సంప్రదించాల్సిందిగా కోరారు. పరీక్ష సమయంలో ఆయా ప్రాంతాల్లోని జిరాక్సు కేంద్రాలను మూసివేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మైనార్టీ విద్యార్థులు బురకాతో వస్తే అనుమతించాల్సింది లేదన్నారు. ప్రతీ కేంద్రంలో బాలికలను తనిఖీ చేయడానికి ఇద్దరు మహిళా ఉపాద్యాయులను నియమించుకోవాలని సూచించారు. పరీక్ష సమయంలో ప్రత్యేకంగా బస్సులు నడిపించడానికి ఆర్టీసీ ఏర్పాటు చేసిందన్నారు. మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రశ్నాపత్రాలు తీసుకువచ్చేటపుడు, జవాబు పత్రాలను పోస్ట్ఫాసు ద్వారా పంపే సమయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. ఈ సమావేశంలో మంచిర్యాల డిప్యూటీ డిఈవో పిఎవిఎన్ చారి, పరీక్ష సిబ్బంది పాల్గొన్నారు.

‘మహా’ ఒప్పందాలతో జిల్లా రైతులకు మహార్ధశ
* గోదావరి జలాలతో కోటి ఎకరాలు సస్యశామలం
* అటవీ శాఖ మంత్రి జోగురామన్న
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, మార్చి 4: నాలుగు దశాబ్దాలుగా సమైఖ్యపాలనలో దగా పడ్డ తెలంగాణ సమాజానికి అపర భగీరథుడు ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో బీడు భూములు సస్యశామలం కానున్నాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఈనెల 7,8 తేదీల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో గోదావరి జలాల వినియోగంపై కీలక ఒప్పందాలకు బీజం పడనుందని, తద్వారా తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరందే అవకాశం ఉందని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి చేపడుతున్న కార్యక్రమాలు బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నాయని అన్నారు. గోదావరి బ్యారేజీపై పెన్‌గంగా, ప్రాణహిత ఉప నదుల వెంబడి నాలుగు బ్యారేజీలకు ఈనెల 8న అంకురార్పన కానుందని అన్నారు. ఇప్పటికే పర్యావరణ అనుమతులు సాధించిన తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణ కలను సాకారం చేసుకునే దిశగా ముందుకెళ్తుందని అన్నారు. లోయర్ పెన్‌గంగా ప్రాజెక్టుపై కోర్టచెనాక, రాజంపెట్, పెన్‌పహాడ్ వద్ద మూడు బ్యారేజీల నిర్మాణాలు చేపట్టి 65వేల ఎకరాలకు సాగునీరు అందించేలా కార్యాచరణ రూపొందించడం జరిగిందని, 85 గ్రామాలకు తాగునీటి వసతి కల్పిస్తామని అన్నారు. ప్రాణహిత తుమ్మడిహెట్టి వద్ద నిర్మించే బ్యారేజీల నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలుపడం ఇరు రాష్ట్రాల సంబంధాలను మరింత ధృడం చేస్తుందన్నారు. జిల్లాలో ఈ నాలుగు బ్యారేజీల ద్వారా రెండు లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరు అందనుందని మంత్రి తెలిపారు. రైతుల ఆకాంక్షకు అనుగుణంగా ముఖ్యమంత్రి చేపట్టే పథకాలు దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపబడుతాయని, ముఖ్యమంత్రి చేసిన సేవలు జిల్లా ప్రజల గుండెల్లో చిరస్మరనీయంగా నిలిచి ఉంటాయని అన్నారు. ఈనెల 7న ముంబై వెళ్లనున్న రాష్ట్ర ప్రతినిధి బృందం అక్కడి ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌తో చర్చలు జరిపిన అనంతరం సిఎం కెసిఆర్ చారిత్రాత్మక ఒప్పందాలపై సంతకం పెట్టనున్నారని తెలిపారు.

ఆగస్టు నాటికి ఇంటెక్‌వెల్ పనుల పూర్తి
* వాటర్‌గ్రిడ్ పనులపై అధికారులతో కలెక్టర్ ఆరా
కడెం, మార్చి 4: జిల్లాలోని ఐదు మండలాలకు సాగునీరందించే కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు వద్ద దాదాపు 500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వాటరగ్రిడ్ పథకాన్ని శుక్రవారం ఆదిలాబాద్ జిల్ల కలెక్టర్ జగన్‌మోహన్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జగన్‌మోహన్, ఇంజనీరింగ్ అధికారులు కాలినడకన జలాశయం వద్దకువెళ్లి వాటర్‌గ్రిడ్ పనులను సందర్శించారు. జలాశయంలో నిర్మాణం చేపడుతున్న ఇంటెక్‌వెల్ పనులను జిల్లా కలెక్టర్ జగన్‌మోహన్ తనిఖీ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో వాటర్‌గ్రిడ్ ఫిల్టర్‌బెడ్ ట్యాంక్ నిర్మాణం పనులను జిల్లా కలెక్టర్ సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. వాటర్‌గ్రిడ్ పథకం పనులు ఎలా కొనసాగుతున్నాయని, ఏమైన ఇబ్బందులు ఉన్నాయా పై పథకం పనులు ఎన్ని రోజుల్లో పూర్తవుతాయనే విషయంపై స్థానిక ఇంజనీర్లనుకలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు మాసం వరకు పైపనులు పూర్తి అయ్యే అవకాశం ఉందని ఇంజనీరింగ్ అధికారులకు కలెక్టర్‌కు తెలిపారు. ఈ వాటర్‌గ్రిడ్ పథకం పనులు పూర్తయితే కడెం,ఖానాపూర్, జన్నారం మూడు మండలాలకు తాగునీరు సరఫరా అయ్యే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. దాదాపు 2కోట్ల 30లక్షల లీటర్ల తాగునీరు సరఫరాకు అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. పనులను నాణ్యతగా వేగవంతంగా పూర్తిచేసి సకాలంలో వాటర్‌ఫిల్టర్ నీరును అందేటట్లు చూడాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ఆయనవెంట మెగా కంపెనీ పిజిఎం నాగరాజు, సిఈ జగన్‌మోహన్‌రెడ్డి, డిఈ శ్రీనివాస్, డిఈ వెంకటపతి, ల్యాబ్‌కోస్ లిమిటెడ్ టిఎల్‌ఈ శర్మ, తహశీల్దార్ నర్సయ్య, ఎంపిడివో శ్రీలత, ఆర్ ఐలు మెస్రం బాపురావు, రవీందర్‌నాయక్, విఆర్‌వోలు నర్సయ్య, వెంకటస్వామి, మోహన్‌నాయక్, గంగాధర్, టిఆర్‌ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌గౌడ్, జిల్లా నాయకులు బుక్య బాపురావు, తదితరులు పాల్గొన్నారు.

అకాల వర్షంతో అవిరైన అన్నదాత ఆశలు
* నేల రాలిన మామిడి... దెబ్బతిన్న రబీ పంట
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, మార్చి 4: అల్పపీడన అవర్తన ద్రోణి ప్రభావంగా శుక్రవారం సాయంత్రం తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో గాలి వాన బీభత్సం సృష్టించగా అకాల వర్షం రైతుల ఆశల సౌదాన్ని కుప్పకూల్చింది. గత మూడు రోజులుగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడి సాయంత్రం వేళ ఉరుములు మెరుపులతో కురుస్తున్న వడగళ్ల వానలకు రబీ పంటలు దెబ్బతింటున్నాయి. గురువారం రాత్రి, శుక్రవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి ఆదిలాబాద్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, గుడిహత్నూర్, బోథ్, బజార్‌హత్నూర్, తలమడుగు, ఉట్నూరు, జైనూర్, కెరమెరి, కాగజ్‌నగర్, బెల్లంపల్లి మండలాల్లో చేతికివచ్చే దశలో ఉన్న పంటలు చేజారి పోయాయి. ముఖ్యంగా రబీలో సాగుచేస్తున్న గోదుమ, మొక్కజొన్న, జొన్న, కూరగాయల పంటలు గాలివాన బీభత్సానికి దెబ్బతిని రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. దండెపల్లి, లక్సెటిపేట్, బీమిని, చెన్నూర్ మండలాల్లో సుమారు 200 ఎకరాల్లో మామిడి పంట దెబ్బతిని పూత, కాత నేలరాలిపోయింది. కెరమెరి, సిర్పూర్‌యు మండలాల్లో విద్యుత్ స్తంభాలు నెలకొరిగి కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం కలగగా కూరగాయల పంటలు నష్టపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా మూడు రోజుల నుండి రైతులు అడపాదడపా కురుస్తున్న అకాల వర్షాలు తమను కోలుకోలేకుండా చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఏపుగా కాసిన మామిడి పూత, మామిడి పిందెలు గాలి వాన బీభత్సానికి, వడగళ్ల వర్షానికి నేలరాలడం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఇదిలా ఉంటే కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి, కందులు, శనగలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. నాణ్యత కోల్పోవడంతో మార్కెట్‌లో ధర రాకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వడగళ్లు, అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

నిర్మల్ నియోజకవర్గ అభివృద్దే ధ్యేయం
* మామడ మండలంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు
* రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్, మార్చి 4: నిర్మల్ నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నామని, ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ కోసం అహర్నిషలు శ్రమిస్తున్నారని రాష్ట్ర న్యాయ, దేవాదాయ, గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మామడ మండలంలోని పరిమండల్ గ్రామంలో శుక్రవారం రూ.13 లక్షల నిధులతో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ భవనానికి భూమిపూజ, పెర్క సంఘ భవనాన్ని ప్రారంభించి, పొన్కల్ గ్రామంలోమరుగుదొడ్లు నిర్మించుకున్న 620 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణి చేసి ఆయా గ్రామాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడారు. తదుపరి పొన్కల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రహారీగోడ నిర్మాణానికి భూమిపూజచేసి మాట్లాడుతూ సదర్‌మాట్ ఆయకట్టు ఎత్తు పెంచనున్న దృష్ట్యా ముంపుకు గురైన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న సదర్‌మాట్ ఆనకట్టకు 515 కోట్లు ప్రభుత్వం మంజూరుచేసిందన్నారు. ఈ ఆనకట్ట నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగడంతోపాటు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువుల్లోకి నీటి సరఫరా జరుగుతుందన్నారు. రాబోయే జూన్ నుండి వ్యవసాయానికి 9 గంటల పగటిపూట విద్యుత్‌ను సరఫరాచేయనున్నామన్నారు. పరిమండల్, పొన్కల్, గ్రామాల అభివృద్దికి సాయశక్తుల కృషిచేస్తామన్నారు. పరిమండల్ గ్రామంలో నిర్మిస్తున్న ఉప విద్యుత్ కేంద్రం పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. రాబోయే మూడేళ్లలో ఇంటింటికి తాగునీరు ఇవ్వడానికి మిషన్ భగీరథ పథకం ద్వారా అన్ని గ్రామాలకు పైప్‌లైన్‌లు వేయనున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులకు పూర్తిస్థాయిలో మరమ్మత్తు పనులను చేపడుతున్నామని, ఇప్పటికే గత సంవత్సరం పలు చెరువుల రూపు రేఖలు మార్చడం జరిగిందని, ఈ సంవత్సరం చెరువు పూడికతీత పనులతోపాటు చెరువుకట్టలను బలోపేతం చేయడానికి త్వరలో పనులు ప్రారంభించనున్నామన్నారు. పొన్కల్ గ్రామంలో 620 మంది కుటుంబాలు మరుగుదొడ్లు నిర్మించుకుని స్వచ్చపొన్కల్ కోసం కృషిచేసిన గ్రామస్తులను మంత్రి అభినందించారు. ఇలాంటి గ్రామాలను గుర్తించి తగువిధంగా ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. నిర్మల్ నియోజకవర్గానికి రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషిచేస్తామన్నారు. గ్రామపథకం కింద అభివృద్ది చేయడానికి పొన్కల్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి హిమబిందు, జడ్పిటిసి సమీనాబేగం, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు భోజవ్వ, రాజవ్వ, వినోద, అన్వరొద్దిన్, డైరెక్టర్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.