అంతర్జాతీయం

రియల్టర్‌నుంచి.. శే్వతసౌధం దాకా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 9: డొనాల్డ్ ట్రంప్.. కఠినమైన సవాళ్లను, బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొని చిత్తుచేసి అగ్రరాజ్యమైన అమెరికాకు 45వ అధ్యక్షుడిగా ఎన్నికయిన ఓ బిజినెస్ మ్యాన్‌గా మాత్రమే మనందరికీ నిన్నటివరకు తెలుసు. అయితే మంగళవారం అర్ధరాత్రినుంచి వెలువడుతున్న ఫలితాల తీరును చూసి ఇన్నాళ్లూ కంపు వ్యాఖ్యలు చేసిన ఈయనేనా విజయం సాధిస్తున్నదని ప్రపంచమంతా విస్తుపోయినా నిదానంగా వాస్తవాన్ని జీర్ణించుకుంటోంది. 2008నాటి ఒబామా ప్రభంజనంతో సమానంగా ట్రంప్ సాధించిన అనూహ్య విజయాన్ని చూసి అమెరికానే కాదు, యావత్తు ప్రపంచం విస్తుపోతోంది. అయితే అమెరికా అధ్యక్షుడు కావాలన్న ట్రంప్ కల ఈనాటిది కాదు.. 2000 సంవత్సరంలోనే అమెరికా అధ్యక్ష బరిలో నిలిచి అనూహ్యంగా తప్పుకొన్నారు. 16 ఏళ్ల తర్వాత మరోసారి సొంత పార్టీనుంచే కాకుండా అన్ని వైపులనుంచి విమర్శలు, వ్యతిరేకతలను సైతం ఎదుర్కొని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఎన్నిక కావడం మొదలుకొని అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకొనే దాకా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నా చివరికి తన పంతాన్ని నెగ్గించుకున్న ట్రంప్ జీవితం చిన్నప్పటినుంచి కూడా వివాదాల మయమే.
‘బంగారు చెంచాతో పుట్టాడ’ని పెద్దలు అంటుంటారు కదా అలాగే ట్రంప్ సైతం సంపన్న కుటుంబంలో పుట్టారు. ఫ్రెడ్ ట్రంప్, మేరీల నాలుగో సంతానంగా 1946 మే 14న న్యూయార్క్ శివార్లలోని క్వీన్స్‌లో జన్మించారు. ట్రంప్ తండ్రివి జర్మనీ మూలాలు కాగా, తల్లి పూర్వీకులది స్కాట్లాండ్. ఏడెనిమిది తరాల క్రిందటే ట్రంప్ పూర్వీకులు అమెరికాకు వలస వచ్చి స్థిరపడ్డారు. ఫ్రెడ్ ట్రంప్ న్యూయార్క్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి బాగానే ఆర్జించారు. న్యూయార్క్‌లోనే పుట్టి పెరిగిన ట్రంప్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అనుబంధ వార్టన్ స్కూల్‌నుంచి ఎకనామిక్స్‌లో పట్టా పుచ్చుకున్నారు. ఉరకలేసే ఉత్సాహవంతుడిగా 1971లో తండ్రి స్థాపించిన సంస్థ బాధ్యతలు చేపట్టిన ట్రంప్ వచ్చీ రాగానే సంస్థ పేరును ‘ట్రంప్ ఆర్గనైజేషన్’గా మార్చేసారు. ప్రారంభంలో పేద, మధ్య తరగతి వారికోసం అనేక ప్లాట్లను నిర్మించిన ఆయన ఆ తర్వాత తన వ్యాపార కార్యాలయాన్ని మన్‌హట్టన్‌కు మార్చేశారు. అనతికాలంలోనే భారీ టవర్లు, హోటళ్లు, క్యాసినోలు, గోల్ఫ్ కోర్సులు నిర్మించి ట్రంప్‌ను పెద్ద బ్రాండ్‌గా మార్చేశారు. ఈ క్రమంలో భారీ మొత్తంలో సంపదనూ పోగేసి అమెరికాలోని ప్రముఖ బిలియనీర్లలో ఒకరిగా ఎదిగారు. రియల్టీ రంగంలో విజయం సాధించిన తర్వాత ఆయన చూపు ఎంటర్‌టైన్‌మెంట్ రంగం వైపు మళ్లింది. అక్కడ కూడా తనకు ఎదురులేదని నిరూపించుకున్న తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకున్నారు. 2000 సంవత్సరంలో రిఫార్మ్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకున్నారు. అయితే అభ్యర్థిత్వం ఖరారు కాకముందే బరిలోంచి తప్పుకొన్నారు. ఆదినుంచి కూడా ట్రంప్‌ది నోటి దురుసుతనమే. తాను అనుకున్నది సాధించాలన్న మొండి మనస్తత్వం కారణంగా ఆయన ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నారు. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు ప్రకటించినప్పుడు సొంత పార్టీవారే ఆయన నోటిదురుసుతనాన్ని, రాజకీయ అనుభవ లేమిని ప్రశ్నించారు. అయితే ఆయన మాత్రం వెనుకంజవేయలేదు.
‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అన్న నినాదంతో అటు ప్రజలకు, ఇటు పార్టీ వారికి చేరువయ్యారు. బలమైన, అనుభవజ్ఞురాలయిన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌ను తెలివిగా ఎదుర్కొన్నారు. ప్రచారం సందర్భంగా, ఎగ్జిట్ పోల్స్ రూపంలోను ఎన్ని ప్రతికూల పవనాలు ఎదురయినా అమెరికాకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తానన్న ఏకైక నినాదం ద్వారాను, విదేశీయుల చేతుల్లోకి పోతున్న అమెరికా ఉద్యోగాలను అమెరికన్లకే దక్కేలా చేస్తానన్న హామీతోను నిరుద్యోగులను, అమెరికన్ల మనసులను గెలుచుకుని అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
వ్యక్తిగత జీవితం
1977లో ఇవాంకాను పెళ్లాడిన ట్రంప్.. 1991లో ఆమెకు విడాకులిచ్చారు. ఆ తర్వాత రెండేళ్లు ఒంటరిగా గడిపాక మార్దా జెల్నెకోవాను పెళ్లాడి 1999లో ఆమెకూ విడాకులిచ్చారు. ఆ తర్వాత ఆరేళ్ల పాటు ఒంటరి జీవితం గడిపాక 2005లో మెలావియాను పెళ్లాడారు. వచ్చే ఏడాది జనవరిలో అమెరికా ప్రథమ పౌరురాలిగా అడుగుపెట్టబోయేది ఈమే. ముగ్గురు భార్యల ద్వారా ట్రంప్‌కు కలిగిన సంతానం అయిదుగురు.
తన పెద్దన్నయ్య ఫ్రెడ్ జూనియర్ ట్రంప్ తాగుడుకు బానిసై చనిపోవడం తనను ఎంతగానో కలచి వేసిందని, అప్పటినుంచి సిగరెట్లు, మద్యానికి దూరంగా ఉంటున్నానని ట్రంప్ అనేక సందర్భాల్లో ప్రకటించుకున్నారు. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్‌పై మహిళలంటే గౌరవం లేదని, మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశారని, వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఎన్నో ఆరోపణలువచ్చినప్పటికీ ట్రంప్ భార్య చివరివరకూ ఆయనకు అండగా నిలవడం విశేషం. అదే ఈ ఆరోపణలను ఓటర్లు పెద్దగా పట్టించుకోకపోవడానికి కారణమైందని కూడా అంటారు.

చిత్రం... ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన మైక్ పెన్స్‌తో డొనాల్డ్ ట్రంప్