అంతర్జాతీయం

‘వాతావరణ మార్పుల’పై పోరాటం ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లిన్, నవంబర్ 4: వాతావరణంలో మార్పుల ఫలితంగా నెలకొంటున్న విపరిణామాలను ఎదుర్కొనేందుకు ఐక్య కార్యాచరణ ఫలిస్తుందా? జర్మనీలోని బాన్‌లో వచ్చే వారం వివిధ దేశాల ప్రతినిధులు, శాస్తవ్రేత్తలు, పారిశ్రామిక బృందాలు, పర్యావరణ ప్రచారకర్తలు సమావేశమై వాతావరణంలో మార్పులపై చర్చించేందుకు సమాయత్తమవుతున్న వేళ అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికా అండదండలు లేకుండా వాతావరణంలో మార్పులను ఎదుర్కొనేందుకు చేసే పోరాటం ఎలా ఉండబోతోందన్న అనిశ్చితి నెలకొంది. ‘2015 పారిస్ ఒప్పందం’ నుంచి తాము వైదొలగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ఆరంభంలో ప్రకటించడంతో ఈ అనిశ్చితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ నెల 6 నుంచి 17వ తేదీ వరకూ బాన్‌లో 23వ ‘కాప్’ (కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్) సదస్సుకు రంగం సిద్ధమైంది. తీవ్ర స్థాయిలో పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఫిజీ దేశం ఈ సదస్సుకు నాయకత్వం వహిస్తోంది.
వాతావరణంలో అనూహ్య మార్పుల ఫలితంగా కరిబియన్ ప్రాంతంలో హరికేన్లు, యూరప్‌లో వేడిగాలులు, ఆసియాలో వరదలు సంభవిస్తూ జన జీవనం అల్లకల్లోలం అవుతున్నట్లు పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. ఈ విపరిణామాలకు అడ్డుకట్ట వేయాలంటే అన్ని దేశాలూ పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని వారు సూచిస్తున్నారు. అనేక దేశాల్లో సముద్ర మట్టం పెరిగిపోవడం ప్రమాదకర పరిణామాలకు సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాన్‌లో జరిగే ‘కాప్’ సదస్సు ఎంతో కీలకమైనదని, వాతావరణంలో మార్పులను అరికట్టేలా కఠిన నిర్ణయాలు తీసుకోవల్సిన సమయం ఆసన్నమైందని వాషింగ్టన్‌కు చెందిన పర్యావరణ నిపుణుడు ఆండ్రూ స్టీర్ తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రభుత్వాలు, పారిశ్రామిక సంస్థలు, నగరాలు పర్యావరణ పరిరక్షణ దిశగా కొన్ని చర్యలు తీసుకోవడం హర్షణీయమే అయినప్పటికీ, ఈ చైతన్యం ప్రపంచ వ్యాప్తంగా వెల్లివిరియాలని ఆయన చెబుతున్నారు. వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించేలా ప్రత్యామ్నాయ ఇంధనాలను వాడేందుకు దృష్టి సారించాలన్నారు. సుమారు 195 దేశాలు బాన్‌లో జరిగే ‘కాప్’ సదస్సులో పాల్గొంటున్నాయి. ‘2015 పారిస్ ఒప్పందం’ అమలు జరగాల్సిన అవసరం ఉందని జర్మనీ పర్యావరణ మంత్రి బార్బరా హెండ్రిక్స్ అంటున్నారు. నిధుల కేటాయింపులు ఆశించిన స్థాయిలో జరగనపుడు వెనుకబడిన దేశాలు లక్ష్యాలను సాధించలేని పరిస్థితి ఉందని హెండ్రిక్స్ గుర్తు చేస్తున్నారు. పారిస్ ఒప్పందం నుంచి అమెరికా నిష్క్రమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించాక పర్యావరణ పరిరక్షణకు నిధుల సమస్య తప్పదంటున్నారు. తమ దేశం భాగస్వామ్యం కానపుడు ఎలాంటి ఒప్పందాలైనా సమర్థవంతంగా అమలు జరగడం అనుమానమేనని అమెరికాకు చెందిన నిగెల్ పుర్విస్ అంటున్నారు. బారక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నపుడు పారిస్ ఒప్పందం జరిగిందని, అది భవిష్యత్‌లో కొనసాగాలంటే ఒబామా లాంటి నాయకులు ‘శే్వతసౌధం’లో ఉండాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, పర్యావరణ పరిరక్షణలో ఇక అమెరికా పాత్ర ఏ మాత్రం కీలకం కాదని హాన్స్ జోచిమ్ అనే పర్యావరణ నిపుణుడు అంటున్నారు.