అంతర్జాతీయం

ఆ స్వర్గం.. కాదొక దుర్గం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్/ న్యూఢిల్లీ, నవంబర్ 6: నిన్న పనామా పత్రాలు... నేడు ప్యారడైజ్ పత్రాలు.. దేశ విదేశాల్లో అవినీతిని ఎండగట్టి నేతల గుట్టును రట్టు చేసి నల్ల ధన బాగోతాన్ని బట్టబయలు చేసిన పాత్రికేయ కలం పదునుకు నిదర్శనాలు. దేశీయ నిధులు విదేశాలకు ఎలా మళ్లాయి.. డొల్ల కంపెనీల పేరుతో పన్నులను బడా బాబులు ఎలా ఎగ్గొట్టారో కళ్లకు కట్టిన ప్యారడైజ్ పత్రాలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ సుదీర్ఘ జాబితాలో పేర్లున్న నేతలు గగ్గోలు పెడుతున్నారు. కొందరు వీటిని ఖండిస్తున్నారు. విదేశాల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఈ పత్రాలపై నిపుణులతో కూడిన బహుళ ఏజెన్సీ బృందం త్వరితగతిన దర్యాప్తు జరుపుతుందని భారత ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం పనామా పత్రాల వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్న ఈ బృందమే ప్యారడైజ్ పత్రాల్లోని వాస్తవాలనూ నిగ్గుదేల్చి త్వరితగతిన చర్యలు చేపడుతుందని తెలిపింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఆదాయం పన్ను విభాగాలను అప్రమత్తం చేశామని, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) తెలిపింది. ఇప్పటికే ఈ విదేశీ పెట్టుబడులకు సంబంధించి జరుగుతున్న దర్యాప్తు వేగంగా సాగుతోందని తెలిపింది. ముఖ్యంగా ఈ జాబితాలో పేర్లున్న 714 మంది భారతీయులపైనా, అలాగే సంస్థల లావాదేవీలపైనా దర్యాప్తు జరుపుతామని తెలిపింది. అయితే ఇందుకు సంబంధించి తమకు ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉందని, అవి అందిన తర్వాత దర్యాప్తును మరింత వేగవంతం చేస్తామని స్పష్టం చేసింది. కాగా, బోఫోర్స్, పనామా పత్రాల్లో తన పేరు వచ్చినప్పుడు జరిగిన దర్యాప్తుకు పూర్తిగా సహకరించానని, ఇప్పుడు ప్యారడైజ్ పత్రాల్లో తన పేరు వచ్చినందున తదుపరి జరిగే దర్యాప్తుకూ సహకరిస్తానని ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ తెలిపారు. ‘ఈ వయస్సులో నేను శాంతిని, మనశ్శాంతిని కోరుకుంటున్నారు. మిగిలిన జీవితాన్ని నాకోసం నేను కేటాయించుకోవాలనుకుంటున్నాను’ అని అమితాబ్ అన్నారు. ఇప్పటి వరకూ తనకు ఎలాంటి నోటీసు రాలేదని, మీడియాలో కథనాల నేపథ్యంలో తన లాయర్ ఇప్పటికే ఓ ప్రకటన చేశాడన్నారు. ప్యారడైజ్ పత్రాల్లో తన పేరు రావడంపై కేంద్ర మంత్రి జయంత్ సిన్హా స్పందించారు. తన వ్యక్తిగత ప్రయోజనం కోసం ఎలాంటి లావాదేవీలు జరుపలేదని తెలిపారు. తాను జరిపిన లావాదేవీలన్నీ
చట్టబద్ధం, న్యాయబద్ధమైనవేనని ఉద్ఘాటించారు. ఓమిడ్‌యార్ నెట్‌వర్క్‌లో తాను ఎం.డి.గా పనిచేశానని తెలిపారు. ఈ సంస్థ తరపునే తాను లావాదేవీలు జరిపానే తప్ప వ్యక్తిగత అవసరాల కోసం కాదన్నారు. ప్యారడైజ్ పత్రాల్లో తమ పేరు రావడాన్ని రష్యా రాజకీయ నాయకులు, కంపెనీలు తిరస్కరించాయి. ఇతర దేశాల్లోని కంపెనీలతో తాము జరిపిన లావాదేవీలన్నీ చట్టబద్ధం, న్యాయబద్ధమని వెల్లడించాయి. విదేశీ కంపెనీల్లో బ్రిటన్ రాణి పెట్టుబడులు పెట్టడం తప్పేమిటని ఆ దేశ నాయకత్వం ప్రకటించింది.
ప్యారడైజ్ పత్రాల వ్యవహారం భారత్ సహా అనేక దేశాల్లో కలకలం రేపుతోంది. ఈ నల్ల జాబితాలో పేర్లున్న ప్రముఖులు, కంపెనీలు కలవర పడుతున్నాయి. ఇతర దేశాల్లోని కంపెనీల్లో బ్రిటన్ రాణి పెట్టుబడులు పెట్టడాన్ని ఆమె ఎస్టేట్ మేనేజర్లు గట్టిగా సమర్థించుకున్నారు. తమకు ఎక్కడి నుంచి ఎలాంటి ఆదాయం వచ్చినా ఎలిజబెత్ రాణి స్వయంగానే పన్నులు చెల్లిస్తారని తెలిపారు.
ఎవరి పాత్ర ఎంత?
సంచలనాత్మక ప్యారడైజ్ పత్రాల్లో మొత్తం 714మంది భారతీయుల పేర్లు ఉన్నాయి. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, నటుడు సంజయ్‌దత్ భార్య మాన్యత, కార్పొరేట్ దళారి నీరా రాడియా, కాంగ్రెస్ ఎంపీ సచిన్ పైలట్, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ, కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా, బిజెపి ఎంపీ రవీంద్ర కిశోర్, కేంద్ర మాజీ మంత్రి వాయిలార్ రవి కుమారుడు రవికృష్ణ తదితరుల పేర్లు ‘ప్యారడైజ్ పత్రాల’లో ఉన్నాయి. వీరంతా ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టారని ఈ పత్రాల్లో పేర్కొన్నారు. ‘ప్యారడైజ్ పత్రాల’ పేరిట సుమారు 13 లక్షల పత్రాలు తాజాగా వెలుగు చూశాయి. మన దేశానికి చెందిన సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పారిశ్రామిక వేత్తలు, ఇతర ప్రముఖుల పేర్లు ఈ పత్రాల్లో ఉన్నాయని వెల్లడి కావడంతో ఈ వ్యవహారం ఇపుడు చర్చనీయాంశమైంది. వీరిపై ఎలాంటి చర్యలుంటాయనేది ఆసక్తికరంగా మారింది.
‘ప్యారడైజ్ పత్రాల’ పేరిట ప్రముఖుల పేర్లు బయటకు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల కోసం దర్యాప్తు సంస్థలు ఎదురుచూస్తున్నాయని ఓ అధికారి తెలిపారు. అయితే, విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం, బ్యాంకు ఖాతాలు తెరిచినంత మాత్రాన అదేమీ అక్రమం కాదని మరో అధికారి వ్యాఖ్యానించారు.
పారిశ్రామిక ప్రముఖులు ఎందరో..
భారత్‌కు చెందిన కొందరు బడా పారిశ్రామికవేత్తలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టారని, నిధులు మళ్లించారని ‘ప్యారడైజ్ పత్రాల’లో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. లిక్కర్ కింగ్, ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా నేతృత్వంలో ‘యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ఇండియా’ ఉండగా 1.5 బిలియన్ అమెరికన్ డాలర్ల మేరకు నిధులను దారి మళ్లించారని, ఫోర్టిస్- ఎస్కార్ట్స్ చైర్మన్ డాక్టర్ అశోక్ సేథ్ సింగపూర్ కంపెనీతో జరిపిన షేర్ల అమ్మకంలో భారీగా లబ్ది పొందారని ఆ పత్రాల్లో పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ కుమారుడు హర్ష మొయిలీ యూపీఏ ప్రభుత్వ హయాంలో మారిషస్ కంపెనీ నుంచి నిధులు పొంది ఓ సంస్థలో పెట్టుబడులు పెట్టారన్నది మరో కథనం. జిందాల్ స్టీల్, అపోలో టైర్స్, జిఎంఆర్ గ్రూప్, హవెల్స్, హిందూజా, ఎమ్మార్ ఎంజిఎఫ్, వీడియోకాన్, హీరనందాని గ్రూప్, డిఎస్ కన్‌స్ట్రక్షన్స్ వంటి పారిశ్రామిక సంస్థల అధిపతుల పేర్లు సైతం ‘ప్యారడైజ్ పత్రాల’లో ఉన్నాయి.
అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి విల్బర్ రాస్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌కు చెందిన సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆ పత్రాల్లో వెల్లడైంది. అలాగే, బ్రిటన్ రాణి ఎలిజబెత్ కూడా విదేశాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు ఇప్పుడు విస్తృత ప్రచారం జరుగుతోంది.
*
పన్ను ఎగవేతదారులు
టన్నులు దాచేసుకున్న నిన్నటి స్వర్గం
‘పెన్నుల’కన్నులు పడగా
వెన్నును వణికించ భయము మిన్నంటెనురా