అంతర్జాతీయం

‘హెచ్1బీ’ గుబులు మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 1: ఎన్నడూ లేని విధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సర్కారు విధించిన కఠిన నిబంధనల నడుమ హెచ్1బీ వీసా దరఖాస్తుల ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. అమెరికా విధానం ప్రకారం 2019 ఆర్థిక సంవత్సరానికిగాను అక్టోబర్ 1నుంచి జారీ చేసే ఈ వీసా కోసం సోమవారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీ రంగానికి చెందిన నిపుణులు అమెరికాలో పనిచేసేందుకు తహతహలాడుతుంటారు. అలాంటివారికి హెచ్1బీ వీసా తప్పనిసరి. కాగా దరఖాస్తు చేసినవారిలోను, పొందినవారిలోని ఇన్నాళ్లూ భారతీయులే ఎక్కువగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు నిబంధనలు అత్యంత కఠినతరం చేయడంతో భారతీయ ఐటీ నిపుణులు కలవరం చెందుతున్నారు.ఒక వ్యక్తి ఒకే దరఖాస్తు చేయవలసి ఉండడం, పాస్‌పోర్టు నకలు జతచేయవలసి రావడం, గడచిన ఐదేళ్లుగా ఉపయోగించిన ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడీ, సామాజిక మాధ్యమాల అకౌంట్ల వివరాలు సమర్పించాల్సి రావడం, చిన్నచిన్న పొరపాట్లను పరిగణనలోకి తీసుకుని దరఖాస్తులను తిరస్కరించే అవకాశాలు కొత్త నిబంధనలు వల్ల ఏర్పడ్డాయి.
హెచ్1బీ వీసాల జారీలో కీలకపాత్ర వహించే అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌ఐ) ఈ మేరకు హెచ్చరిస్తూ గట్టి సంకేతాన్ని పంపింది. వీసాకోసం చేసే దరఖాస్తుల్లో చిన్నచిన్న పొరపాట్లను కూడా సహించే అవకాశం లేదని, ఏ చిన్న పొరపాటు ఉన్నా దరఖాస్తు తిరస్కరణకు గురవుతుందని వారు స్పష్టం చేశారు. ఆ విభాగం తేల్చి చెప్పింది. తాజా నిబంధనల ప్రకారం, వివిధ ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలలో వస్తున్న కథనాల ప్రకారం ఈ సారి హెచ్1బీ వీసాల దరఖాస్తుల్లో ఎన్నడూ లేనివిధంగా పెద్దసంఖ్యలో తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.
హెచ్-1బీ వీసా కేవలం అమెరికాలో పనిచేసేందుకు అవకాసం ఇస్తుంది. ముఖ్యంగా అమెరికాలో లభించని వృత్తి నిపుణులకు ఎక్కువగా వీటిని కేటాయిస్తూంటారు. అమెరికా సంస్థలు విదేశాల్లోని నిపుణులను ఈ వీసాలపై తీసుకువచ్చి పనిచేయించుకోవడం మామూలే. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో వృత్తి నిపుణులకు అమెరికాలో డిమాండ్ ఎక్కువ. ఇండియా, చైనా వంటి దేశాల్లోని ఐటీ నిపుణులను వేల సంఖ్యలో అమెరికా కంపెనీలు తీసుకువస్తూంటాయి. ఇలా అమెరికా ఇచ్చే హెచ్1బీ వీసాల సంఖ్య పరిమితి ఇప్పటివరకు ఏటా 65,000గా ఉంటోంది. మొదటి 20వేల దరఖాస్తులను యూఎస్ మాస్టర్స్ డిగ్రీ అంతకంటే ఎక్కువ చదువుకున్నవారికి కేటాయిస్తారు. పై పరిమితి నుంచి వీరిని మినహాయిస్తారు. అక్టోబర్ 1, 2019తో మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి జారీ చేసే హెచ్1బీ వీసాల కోసం ఇప్పుడు దరఖాస్తుల ప్రక్రియ మొదలుపెడుతున్నారు.
గతంలో హెచ్1బీ వీసాను లాటరీ పద్ధతిలో కేటాయించేవారు. ఈ నిబంధనను ఆసరా చేసుకుని ఒకే వ్యక్తి తన పేరును వివిధ రకాలుగా పెట్టి దరఖాస్తులు చేసేవారు. ఏదో ఒకపేరుతోనైనా అవకాశం దక్కుతుందన్నది వారి ఆశ. అయితే ఈసారి అలా చేయడం కుదరదు. ఈ మేరకు నిబంధనలు కఠినం చేశారు. ఒక దరఖాస్తుదారు ఒకే దరఖాస్తు చేయాల్సి ఉంటుందని. అంతకంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే తిరస్కరణకు గురవుతుందని యూఎస్‌సీఐఎస్ అధికారులు స్పష్టం చేశారు. ‘యాస్ సూన్ యాస్ పాసిబిల్’ లేదా ‘ఏఎస్‌ఏపీ’ విధానంలో దరఖాస్తులను పరిష్కరించే అవకాశాలు లేవని, అలాంటి దరఖాస్తులను తిరస్కరిస్తామని వారు హెచ్చరించారు. ప్రీమియ్ ప్రాసెసింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశామని, తిరిగి ఎప్పుడు ప్రారంభించేదీ త్వరలో వెల్లడిస్తామని వారు చెప్పారు. అయితే ‘డ్రా’ను కంప్యూటరైజ్డ్ పద్ధతిలో నిర్వహించేదీ లేనిదీ అధికారులు స్పష్టం చేయలేదు. హెచ్1బీ వీసా కోసం చేసే దరఖాస్తుతోపాటు పాస్‌పోర్టు నకలును జతచేయడం ఈసారి తప్పనిసరి. వీసా కాలపరిమితిని పొడిగించాలని కోరే దరఖాస్తుదారులు తాము పనిచేసే సంస్థ నుంచి అందుకు సంబంధించిన అన్ని పత్రాలను దరఖాస్తుతో జత చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
సాధారణంగా హెచ్1బీ వీసాల కోసం భారతీయ ఐటీ నిపుణుల నుంచి గట్టిపోటీ ఏర్పడుతోంది. వివిధ ఐటీ సంస్థలు తమ ఉద్యోగుల కోసం పెద్దఎత్తున దరఖాస్తులు చేస్తూంటాయి. అయితే ఈసారి భారతీయ నిపుణులకు, భారతీయ సంస్థలకు అమెరికా ప్రభుత్వం పెద్దపరీక్షనే పెట్టింది. ఇతర దేశాల కంటే భారతీయ కంపెనీలు దరఖాస్తు రుసుమును ఎక్కువగా చెల్లించాల్సి రావడం మరో కష్టం. సగటున ప్రతి భారతీయ దరఖాస్తుదారు 6వేల అమెరికన్ డాలర్లు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించిన తరువాత అమెరికా దౌత్య కార్యాలయాలు, ఎంబసీ, కాన్సులేట్ కార్యాలయాలకు ఇంటర్వ్యూ, పాస్‌పోర్టులపై స్టాంపింగ్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది. వీరంతా గడచిన ఐదేళ్లుగా వాడిన ఫోన్ నెంబర్లు, ఈమెయిల్స్, సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను దరఖాస్తుతోపాటు సమర్పించాల్సి ఉంటుంది.
హెచ్1బీ వర్క్ పర్మిట్ వీసాల నిబంధనలు కఠినతరం చేయడం వల్ల అమెరికా కంపెనీలకు అత్యంత సమర్థులు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు మాత్రమే అందుబాటులోకి వస్తారని యూఎస్‌సీఐఎస్ అధికారులు చెబుతున్నారు. ఇన్నాళ్లూ అమెరికాలో నిపుణులు, సమర్థులు ఉన్నప్పటికీ హెచ్1బీ వీసా సులభతరంగా ఉండటం వల్ల వారికి అవకాశాలు దక్కలేదని ట్రంప్ సర్కారు భావిస్తోంది. అందువల్లే అమెరికాలో నిపుణులకు న్యాయం జరిగేలా హెచ్1బీ వీసా నిబంధనలను, మంజూరు ప్రక్రియను కఠినతరం చేసినట్లు అధికారులు చెబుతున్నారు.