అంతర్జాతీయం

ఏమిటీ ఉన్మాదం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 15: పాకిస్తాన్‌లో ఎన్నికల నేపథ్యంలో గత పక్షం రోజుల్లో ఉగ్రవాదుల దాడిలో 150 మంది పౌరులు మరణించడంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలో ప్రభుత్వం ఉందా? సైన్యం ఏమి చేస్తోంది? ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు సైన్యం వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటి? అనే అంశంపై చర్చ మొదలైంది. ఈ నెల 25న ఎన్నికలు జరగనున్న సందర్భంగా బలూచిస్తాన్, పెషావర్ ప్రాంతంలో తాలిబాన్ల దాడుల్లో 150మందికిపైగా మరణించారు. దీంతో పాక్ ఆర్మీ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తున్‌కావాలో ఈ దాడులు జరిగాయి. ఈ దాడులను చూస్తుంటే 25న ఎన్నికలు సజావుగా జరుగుతాయా అనే అనుమానం కలుగుతోందని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. తెహ్రిక్ తాలిబాన్ పాకిస్తాన్ అనే సంస్థను నిషేధించినా పెట్రేగి హత్యాకాండకు పాల్పడుతోందని పత్రికలు ఘాటుగా సంపాదకీయాలు రాశాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ ప్రచారం వేడెక్కింది.
కాని ఉగ్రవాదులు ఎన్నికల ర్యాలీపై దాడులు చేసి దారుణంగా పౌరులను చంపేయడం వల్ల పాకిస్తాన్‌కు అంతర్జాతీయంగా చెడ్డపేరు వచ్చిందని పౌర సంఘాలు నిలదీస్తున్నాయి. రాజకీయ పార్టీల అభ్యర్థులకే భద్రత లేకుండా పోయింది. సైన్యం ప్రేక్షకపాత్ర పోషిస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయని మీడియా ప్రభుత్వంపై ధ్వజమెత్తింది. నిఘా వ్యవస్థ కూడా విఫలమైందని, ప్రజలను రక్షించలేని ప్రభుత్వం , సైన్యం వౌనంగా ఎందుకున్నట్లు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద దేశమని ప్రపంచ వ్యాప్తంగా చెడ్డపేరు ఉంది. ఈ ఎన్నికల ద్వారా మంచి సందేశమివ్వాలని ప్రజలుకోరుకుంటున్నారు. కాని రాజకీయ పార్టీలు, అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడులకు దిగుతున్న ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నాయని డాన్ పత్రిక పేర్కొంది. ఎన్నికలకు ముందు హింసను ఎందుకు నివారించలేకపోతున్నారు ? ఈ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వస్తున్నారు ? నిఘా విభాగం, సైన్యం ఏమి చేస్తోందని న్యూస్ అనే పత్రిక సంపాదకీయంలో పదునైన వ్యాఖ్యలతో ప్రభుత్వంపై దాడి చేసింది. ఉగ్రవాదుల దాడులను నిరోధించడంలో విఫలమైన సైన్యంపై తీసుకుంటున్న చర్యలేమిటో ప్రభుత్వం వివరించాలని, జవాబుదారీతనంతో వ్యవహరించాలని న్యూస్ మీడియా కోరింది. ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే చర్యలను ఉపేక్షించరాదని మీడియా, మేధావివర్గాలు ప్రభుత్వాన్ని కోరాయి.